అరవై ఏళ్లు.. 239 రకాలు.. | Acharya Ng ranga Agricultural University in Vijayapatham | Sakshi
Sakshi News home page

అరవై ఏళ్లు.. 239 రకాలు..

Published Sun, Jun 11 2023 5:02 AM | Last Updated on Sun, Jun 11 2023 5:02 AM

Acharya Ng ranga Agricultural University in Vijayapatham - Sakshi

సాక్షి, అమరావతి:  దేశంలో ప్రతీ ముగ్గురిలో ఒకరు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ పది మందిలో తొమ్మిది మందికి ఈ విశ్వవిద్యాలయం అన్నం పెడుతోంది. అంటే.. ఆ వర్సిటీ అభివృద్ధి చేసిన రకాలనే దేశంలో మూడోవంతు ప్రజలు ఆహారంగా తీసుకుంటున్నారు. అదే మన ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) ప్రత్యేకత.  దేశంలోనే పురాతనమైన వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఈ వర్సిటీకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి.

అరవై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఈ వర్సిటీ సాధించిన విజయాలెన్నో.. ఎన్నెన్నో. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి.. రెట్టింపు ఆదాయం లక్ష్యంగా ఏటా పదుల సంఖ్యలో కొత్త వరి రకాలను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. తెగుళ్లు, కీటకాలు, చీడపీడలు, వాతావరణ స్థితిగతులను తట్టుకునే వంగడాలను అభివృద్ధి చేయడమే కాదు.. సన్నరకాల సృష్టికర్తగా ఖ్యాతి గడించింది. ఫలితంగా దశాబ్దాలుగా వరి వినియోగంలో వర్సిటీ సృష్టించిన రకాలే ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. 

దేశంలో సాగయ్యే వరిలో మూడోవంతు.. 
దేశంలో వరి సాగవుతున్న 46 మిలియన్‌ హెక్టార్ల విస్తీర్ణంలో 14 మిలియన్‌ హెక్టార్లలో ‘ఆంగ్రూ’ రకాలే సాగవుతున్నాయంటే ఏ స్థాయిలో ఈ వర్సిటీ రైతుల మన్ననలు చూరగొందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. జాతీయ స్థాయి వరి ఉత్పత్తి (131 మిలియన్‌ టన్నులు)లో 33.15 శాతం (37.76 మిలియన్‌ టన్నులు) ఈ వర్సిటీ రకాలే కావడం గమనార్హం. సగటు దిగుబడి జాతీయ స్థాయిలో హెక్టార్‌కు 2,832 కిలోలు.. ఏపీలో హెక్టార్‌కు 5,048 కిలోలు ఉంటే, ఈ వర్సిటీ రూపొందించిన రకాలు ఏకంగా హెక్టార్‌కు 5,669 కిలోల దిగుబడినివ్వడమే కాదు జాతీయ స్థాయిలో రూ.62,317 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్నాయి. 

60 ఏళ్లలో 239 రకాల సృష్టి.. 
1964 జూన్‌ 12న ఏర్పాటైన ఈ వర్సిటీ.. వ్యవసాయ, అనుబంధ రంగాలలో ఉత్పత్తి, ఉత్పాదకత, లాభదాయకతను పెంచడంలో నిరంతరం కృషిచేస్తోంది. 60 ఏళ్లలో 123 అధిక దిగుబడినిచ్చే వరి రకాలతో పాటు 47 రకాల పప్పు ధాన్యాలు, 29 రకాల నూనె గింజలు, 21 రకాల వాణిజ్య పంటలు, 19 రకాల చిరుధాన్యాలను ‘ఆంగ్రూ’ అభివృద్ధి చేసింది. ఈ స్థాయిలో నూతన వంగడాలను అభివృద్ధి చేసిన వర్సిటీ దేశంలో మరొకటి లేదనే చెప్పాలి.

వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా, తెగుళ్లు, చీడపీడలు, కీటకాలను ఎదుర్కొనే రకాలను అభివృద్ధి చేయడంలో వర్సిటీ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ఈ కోవలో అభివృద్ధి చేసిన ఎంటీయూ 7029 (స్వర్ణ), బీపీటీ 5204 (సాంబా మసూరి) వరి రకాలు జాతీయ స్థాయిలో ప్రజాదరణ పొందాయి. దేశంలోనే మొట్టమొదటి బూజు తెగులు నిరోధక మినుము రకం ఎల్‌బీజీ 17 (కృష్ణయ్య)తో పాటు ప్రసిద్ధి చెందిన కే6, నారాయణి, లేపాక్షి వంటి వేరుశనగ రకాలు సైతం వర్సిటీ  అభివృద్ధి చేసినవే. 

ఆంగ్రూ రకాలతో రూ.25వేల కోట్ల ఆదాయం.. 
ఆంధ్రలో 90.29 శాతం అంటే అక్షరాల 21.78 లక్షల హెక్టార్లలో వర్సిటీ సృష్టించిన వరి రకాలే సాగవుతున్నాయి.  
సాగు విస్తీర్ణంలో 72.63 శాతం, ఉత్పత్తిలో 87.27 శాతం వర్సిటీ రకాలే.  
పప్పు ధాన్యాల సాగులో 35.63 శాతం, ఉత్పత్తిలో 32.16 శాతం వర్సిటీ రూపొందించినవే.. 
వేరుశనగ ఉత్పత్తిలో 94.03 శాతం వర్సిటీ రకాలే. ఒక్క కే6 రకమే 82 శాతం అందిస్తోంది.  
నువ్వుల సాగులో కూడా 87.50 శాతం ఆంగ్రూ రకాలదే కావడం విశేషం.  
వరి రకాల ద్వారా రూ.20,243 కోట్లు, అపరాల ద్వారా రూ.2,113 కోట్లు, నూనెగింజల ద్వారా రూ.2,862 కోట్లు కలిపి.. మొత్తం రూ.25వేల కోట్ల­కుపైగా ఆదాయాన్ని రాష్ట్ర రైతులు ఆర్జిస్తున్నారు. 

ఏటా రూ.8వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం.. 
ఇక ఎగుమతుల్లో బాస్మతేతర బియ్యం రకాలదే సింహభాగం. వీటిలో మూడోవంతు ‘ఆంగ్రూ’ అభివృద్ధి చేసినవే. ఉదా.. దేశం నుంచి 2021–22లో బియ్యం ఎగుమతుల ద్వారా రూ.46,914.28 కోట్ల విదేశీ మారక ద్రవ్యం దేశానికి వచ్చింది. ఈ బియ్యం ఎగుమతుల్లో 33 శాతం (రూ.15,481.71కోట్లు) ఆంగ్రూ అభివృద్ధి చేసిన రకాలకు చెందిన బియ్యమే. అలాగే, మిగతా కాలంలో ఏటా ఆంగ్రూ రకాల బియ్యం ఎగుమతి ద్వారా సగటున రూ.8,073 కోట్ల ఆదాయం సమకూరుతోందంటే ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందో స్పష్టమవుతోంది. 

12న మెగా సీడ్‌ మేళా.. 
వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 12న గుంటూరు లాంలోని వర్సిటీ ప్రాంగణంలో ‘మన రైతు కోసం మన నాణ్యమైన విత్తనం’ అనే నినాదంతో విత్తన మహోత్సవం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సాగయ్యే, వర్సిటీ అభివృద్ధి చేసిన వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించిన విత్తనాలను ప్రదర్శన, అమ్మకానికి ఉంచుతూ రైతు మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.  

పెట్టుబడికి ఢోకాలేదు 
ఆంగ్రూ అభివృద్ధి చేసిన వివిధ రకాల సాగుతో పెట్టుబడికి ఢోకాలేదని నిరూపితమైంది. ఇటీవలే ఆంగ్రూ రకాల రాబడి–ఖర్చులను విశ్లేíÙంచాం. ఖరీఫ్‌ కంటే రబీలో నికర రాబడులు ఎక్కువగా ఉన్నాయి. సాగుకోసం రైతులు ఖర్చుచేసే ప్రతీ రూ.100కు, వరికి  రూ.103, మినుముకి రూ.132, కందికి రూ.133, మిరపకి రూ.160, శనగకి రూ.102, వేరుశనగకి రూ. 124ల చొప్పున ఆదాయం వస్తోందని గుర్తించాం.  – డాక్టర్‌ జి. రఘునాథరెడ్డి,  ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ  పరిశోధనా స్థానం, లాం 

సీజన్‌ ఏదైనా మన రకాలదే ఆధిపత్యం.. 
ప్రధాన పంటలలో అధిక దిగుబడినిచ్చే రకాలను అభివృద్ధి చేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో విడుదల చేయడంలో ‘ఆంగ్రూ’ ముఖ్యపాత్ర పోషిస్తోంది. ‘ఆంగ్రూ’ వరి రకాలు హెక్టారుకు 5,669 కిలోల దిగుబడిని సాధిస్తుండగా, ఇది రాష్ట్ర సగటు దిగుబడి (హెక్టారుకు 5,048 కిలోలు) కంటే ఎక్కువ. వరిలోనే కాదు అపరాలు, నూనె గింజల సాగులో కూడా ఆంగ్రూ రకాలదే సింహభాగం. దాదాపు రెండు సీజన్‌లలోనూ వర్సిటీ రకాలకున్న డిమాండ్‌ ఇతర రకాలకు లేదనే చెప్పాలి. 
– డాక్టర్‌ ఎల్‌. ప్రశాంతి, పరిశోధనా సంచాలకులు 

ఏటా రూ.2,967 కోట్ల లాభాలు.. 
జాతీయ స్థాయి వరి ఉత్పత్తిలో మూడో వంతు ఆంగ్రూ రకాలదే. అలాగే, జాతీయ స్థాయిలో 40 శాతం మంది రైతులు ఈ రకాలనే సాగు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతీ రైతు ఈ వర్సిటీ రకా­లపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తు­న్నారు. ఏటా వరితో పాటు ఇతర పంటల్లో కూడా పెద్ద సంఖ్యలో కొత్త వంగడాలను మార్కెట్‌లోకి తీసు­కొస్తున్నాం. సంప్రదాయ వరి రకాల కంటే ఆంగ్రూ రకాల సాగువలన ఏటా రూ.2,967 కోట్ల లాభాలను రైతులు ఆర్జిస్తున్నారు.  – డాక్టర్‌ ఆదాల విష్ణువర్థన్‌రెడ్డి, వైస్‌ చాన్సలర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement