ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: జిల్లా చిరకాల స్వప్నం నెరవేరనుంది. జిల్లాకు త్వరలో విశ్వవిద్యాలయం మంజూరు కానున్నట్లు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ కె.వియన్నారావు తెలిపారు. జిల్లాకు విశ్వవిద్యాలయం మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన చెప్పారు. స్థానిక శ్రీహర్షిణి డిగ్రీ, పీజీ కళాశాల నూతన భవనాలను ప్రారంభించేందుకు ఒంగోలు వచ్చిన వీసీ ఈ విషయాలను వెల్లడించారు.
కేంద్ర ఉన్నత విద్యాశాఖకు అనుబంధంగా రాష్ట్రీయ ఉచితార్ శిక్షణ అభియాన్ (రూసా) పథకం అమలులో ఉంది. ఈ పథకం కింద డిగ్రీ సెంటర్లను యూనివర్సిటీలుగా స్థాయి పెంచేందుకు కూడా నిధులు కేటాయిస్తారు. అందులో భాగంగా ఒంగోలు పీజీ సెంటర్లను యూనివర్సిటీ స్థాయికి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. కేంద్రం కోరిక మేరకు ఒంగోలు ఏఎన్‌యూ పీజీ సెంటర్‌ను యూనివర్సిటీగా స్థాయి పెంచేందుకు ప్రతిపాదనలు పంపించామని వియన్నారావు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈమేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. పీజీ సెంటర్‌ను యూనివర్సిటీగా స్థాయి పెంచితే కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు రూ.55 కోట్లు విడుదల చేస్తుందన్నారు. యూనివర్సిటీ వస్తే దానికి ఉప కులపతి, ఇతర పోస్టులు కూడా వస్తాయన్నారు. పీజీ సెంటర్‌ను యూనివర్సిటీగా స్థాయి పెంచితే జిల్లాలోని డిగ్రీ, పీజీ కళాశాలలన్నీ యూనివర్సిటీకి అనుబంధంగా వస్తాయన్నారు. విద్యార్థులకు అవసరమైన కొత్త కోర్సులు కూడా ప్రవేశపెట్టవచ్చని చెప్పారు.
యూనివర్సిటీ పరిధిలోని కొన్ని డిగ్రీ కళాశాలల పరిస్థితి దారుణంగా ఉందని వియన్నారావు అన్నారు. యూనివర్సిటీకి అనుబంధంగా ప్రస్తుతం 350 డిగ్రీ కళాశాలలున్నాయి. 20 నుంచి 30 శాతం వాటిలో వంద లోపు మాత్రమే విద్యార్థులున్నారు. కొన్ని కళాశాలల నిర్వహణకు నిధుల్లేక మూసివేత బాటలో ఉన్నాయన్నారు. యూజీసీ నిధులు పొందుతున్న కొన్ని కళాశాలల పరిస్థితి కూడా దారుణంగా ఉందన్నారు. డిగ్రీ కోర్సుల గురించి విద్యార్థుల్లో విస్తృతంగా ప్రచారం చేసి డిగ్రీతో ఉద్యోగావకాశాల గురించి వారికి వివరించి పిల్లలను కళాశాలలకు ఆకర్షించాలని వియన్నారావు కోరారు.
జిల్లాకు త్వరలో విశ్వవిద్యాలయం
Published Mon, Feb 17 2014 1:34 AM | Last Updated on Fri, Aug 17 2018 2:08 PM
Advertisement
Advertisement