చక్కని పురుగులమందు ‘చేపల కునపజలం’!
మిగిలిపోయిన చేపలు/రొయ్యలు.. వీటి వ్యర్థాలూ వాడొచ్చు
ఏ పంటలపైనైనా పిచికారీ చేయొచ్చు
సేంద్రియ సాగు ద్వారా ఆరోగ్యదాయకమైన, రుచికరమైన, సకల పోషకాలతో కూడిన సహజాహారాన్ని పండించే క్రమంలో సేంద్రియ ద్రవరూప ఎరువుల పాత్ర చాలా కీలకమైనది. పంటల దిగుబడిని పెంచేందుకు ‘కునపజలం’ అనే ద్రావణ ఎరువును మన పూర్వీకులు పంటలకు వాడేవారని వెయ్యేళ్ల నాటి సురాపాలుడి రచన ‘వృక్షాయుర్వేదం’ చెబుతోంది. స్థానికంగా రైతుకు అందుబాటులో ఉండే వనరులతో తయారు చేసుకోవడంతో పాటు.. ఏ దశలో ఉన్న పంటకైనా వాడటానికి అనువైనదై ఉండటం కునపజలం (వివరాలకు.. 2014-10-09 నాటి ‘సాగుబడి’ పేజీ) ప్రత్యేకత. ఆసియన్ అగ్రికల్చర్ హిస్టరీ ఫౌండేషన్(ఏఏహెచ్‌ఎఫ్) ‘వృక్షాయుర్వేదా’న్ని వెలుగులోకి తెచ్చిన తర్వాత కొందరు రైతులు సేంద్రియ ద్రావణ ఎరువుగా కునపజలాన్ని వాడుతున్నారు. అయితే, సాధారణ ‘కునపజలం’ దిగుబడి పెంచుకోవడానికి ఉపయోగపడితే, ‘చేపల కునపజలం’ ప్రభావశీలమైన పురుగుల మందుగా ఉపయోగపడుతుందని డా. వీ ఎల్ నెనె (ఏఏహెచ్‌ఎఫ్ గౌరవాధ్యక్షులు, ‘ఇక్రిశాట్’ మాజీ డిప్యూటీ డెరైక్టర్ జనరల్) ‘సాక్షి’తో చెప్పారు.
‘చేపల కునపజలం’ తయారీకి కావలసినవి:
2:10 నిష్పత్తిలో చేపలు, ఆవు మూత్రం. అంటే.. 2 కిలోల చేపలు లేదా చేపల వ్యర్థాలకు 10 లీటర్ల ఆవు మూత్రం కలిపి పులియబెట్టాలి. చేపల మార్కెట్‌లో లభ్యమయ్యే వ్యర్థాలు లేదా స్వల్ప ధరకు లభించే అమ్ముడుపోని లేదా మెత్తబడిపోయిన చిన్న/పెద్ద చేపలను, రొయ్యల వ్యర్థాలను కూడా వాడొచ్చు. ఆవు మూత్రానికి బదులు మనుషుల మూత్రం కూడా వాడొచ్చు. నత్రజని, అమినో ఆమ్లాలు అధికంగా ఉంటాయి కాబట్టి మాంసాహారి మూత్రం మరింత ప్రభావశీలంగా ఉంటుంది. నీడన ఏర్పాటు చేసిన డ్రమ్ములో లేదా తొట్టిలో చేపలు/చేపల వ్యర్థాలను మూత్రంతో కలిపి(ఉడకబెట్టాల్సిన పని లేదు) పులియబెట్టాలి. రోజూ ఉదయం, సాయంత్రం ఒక నిమిషం పాటు కలియదిప్పాలి. వారం రోజుల తర్వాత ద్రావణాన్ని వడకట్టి నిల్వచేసుకోవాలి.
ఇలా సిద్ధమైన చేపల కునపజలంతో సిద్ధం చేసుకున్న 5% ద్రావణాన్ని పంటలపై పిచికారీ చేయాలి. అంటే.. 5 లీటర్ల చేపల కునపజలాన్ని 95 లీటర్ల నీటిలో కలిపి.. పిచికారీ చేయాలి. ఏ పంటలపైనైనా పిచికారీ చేయొచ్చు. ఇలా పిచికారీ చేస్తే పెద్ద పురుగులను సైతం సమర్థవంతంగా అరికట్టవచ్చనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని డా. నెనె తెలిపారు. చేపల కునప జలాన్ని 3 నెలల వరకు నిల్వ ఉంచుకొని వాడుకోవచ్చు. డా. నెనెను
040 27755774 నంబరులో సంప్రదించవచ్చు.