విపత్తేనా..! | The trend towards own seeds | Sakshi
Sakshi News home page

విపత్తేనా..!

Published Wed, May 3 2017 12:44 AM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM

విపత్తేనా..!

జిల్లాలో 70 శాతం మేరకు కే–6 వేరుశనగ విత్తనాల కేటాయింపు
ఆగస్టు బెట్టను తట్టుకోలేకపోతున్న  కదిరిరకం
ఈ కారణంగానే ఏటా నష్టాలంటున్న రైతులు
సొంత విత్తనాల వైపు మొగ్గు


ఏటా కే–6 రకం విత్తనాలతో వేరుశనగ రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం మాత్రం తన మొండివైఖరి మార్చుకోవడం లేదు. శాస్త్రవేత్తల సూచనలను సైతం పెడచెవిన పెడుతూ ఈ ఏడాది కూడా ఇదే రకం విత్తనాలను దాదాపు 70 శాతం మేరకు విక్రయించేం దుకు సిద్ధమైంది. ఫలితంగా ఈసారీ దిగుబడి అంతంతమాత్రమేనని రైతులు ఆందోళన  చెందుతున్నారు. చేసేది లేక సొంత విత్తనాలతోనే సాగుకు సన్నద్ధమవుతున్నారు.

పలమనేరు: ప్రభుత్వం గతేడాది రైతులకు పంపిణీ చేసిన సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలు రైతులను నట్టేట ముంచేశాయి. అధికారుల నిర్లక్ష్యంతో కరువుకు తట్టుకోలేని, పెద్దగా నాణ్యత లేని కే–6(కదిరి–6) విత్తనాలను సర్కారు అందజేసింది. వర్షాభావ పరిస్థితులను తట్టుకోలేక ఈరకం చెట్లు భారీగా చనిపోయాయి. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేరుశనగ రైతులు నష్టాలపాలయ్యారు. ఈదఫా కూడా కే–6 రకం విత్తనకాయలనే రైతులకు అందజేస్తున్నట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. గత ఏడాది కే–6 విత్తనాలను వేసి చేతులు కాల్చుకున్న రైతులు ఈదఫా సొంతవిత్తనాలవైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. జిల్లాకు సంబంధించి ఈదఫా ఖరీఫ్‌లో వేరుశనగ సాగు 1.20 లక్షల హెక్టార్లుగా ఉంది. ఇందుకోసం వ్యవసాయశాఖ 90 వేల క్వింటాళ్ల విత్తనకాయలను పంపిణీ చేసేందుకు అధికారులు అలాట్‌మెంట్‌ సిద్ధం చేశారు. ఈనెల 15 నుంచి జిల్లాలోని పంపిణీ కేంద్రాలకు స్టాకు చేరనుంది. ఆపై కలెక్టర్, వ్యవసాయ శాఖ జేడీ సమావేశమై విత్తనాల పంపిణీ తేదీని ఖరారు చేయనున్నారు.

ఏటా నాణ్యత ప్రమాణాలు గాలికే..
ఏపీ ఆయిల్‌ ఫెడ్‌ నుంచి కదిరి–6 అనే రకం విత్తనాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. మా మూలుగా 100 గ్రాముల విత్తన కాయలను వొలి స్తే దాదాపు 70 గ్రాముల గింజలు బరువు వస్తేనే అవి నాణ్యంగా ఉన్నట్టు లెక్క. దీంతోపాటు సీడ్‌ జర్మినేషన్‌ 70 శాతంగా ఉండాలని నిబంధనలున్నాయి. లోడ్ల వారీగా ఇక్కడికందే విత్తన కాయలను చిత్తూరులోని సీడ్‌ టెస్టింగ్‌ ల్యాబరేటరీ లో మొలక శాతం, విత్తనాల నాణ్యతను పరీక్షిం చాల్సి ఉంది. కానీ ఇదంతా పేరుకుమాత్రమే. గతేడాది కూడా విత్తన పరీక్షలు తూతూమంత్రంగానే జరిగాయి. కనీసం ఈ సారైనా జరుగుతుందో లేదో కూడా అర్థం కావడం లేదు. గతేడాది రైతులకు దాదాపు 300 కోట్ల మేర నష్టం వాటిల్లింది.

ఆగస్టు బెట్టను కే–6 తట్టుకోదు..
వర్షాభావానికి తట్టుకోని కే–6 ఈ ప్రాంతానికి సరిపోదని ఇప్పటికే వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు తెలిపింది. గతంలో కూడా వ్యవసాయశాఖ ఈ సమస్య కారణంగానే ఈ ప్రాంతంలో కే–6ను పంపిణీ చేయలేదు. కానీ తక్కువ ధరకే ఇవి దొరుకుతుండడంతో ప్రభుత్వం కొన్నేళ్లుగా వీటిని రైతులకు అంటగడుతోంది. గతేడాది సైతం ఈ రకం విత్తనాలు వేసిన రైతులకు పంట చేతికందలేదు. ముఖ్యంగా ఆగస్టులో వచ్చేబెట్ట ( డ్రై స్పెల్స్‌)ను ఈ రకం తట్టుకోదు. అప్పట్లోనే పలువురు రైతులు ఈ విషయమై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇదంతా పైస్థాయిలో జరిగే ప్రక్రియ అంటూ చేతులు దులుపుకున్నారు. దీంతో రైతులు సొంత విత్తనాలవైపు మొగ్గు చూపుతున్నారు.

శాస్త్రవేత్తలు సూచించినా పట్టించుకోలేదు..
రెండేళ్ల క్రితం వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు కుప్పం మండలంలోని పీబీ నత్తం, వి.కోట మండలంలోని కొమ్మరమడుగు, శాంతిపురం మండలం లోని అబకలదొడ్డిలలో కే–6 పంట నష్టంపై పంటకోత ప్రయోగాలను చేపట్టింది. ఇందులో 250 గ్రాముల నుంచి 400  గ్రాముల వరకు దిగుబడి వచ్చినట్టు తేల్చారు. అంటే ఎకరాకు 40 కిలోల మాత్రమే వచ్చినట్టు. దీని ఆధారంగా 90 శాతం పంట నష్టపోయినట్టు వ్యవసాయశాఖ నిర్ధారించింది. ఇదే ప్రాంతంలో ప్రయోగాత్మకంగా సాగుచేసిన ధరణి, నారాయణి రకాలు బెట్టను తట్టుకుని మంచి దిగుబడిని ఇవ్వడాన్ని గుర్తిం చారు. దీంతో ధరణి తదితర రకాలను ఈదఫా రైతులు పంపిణీ చేయాలని సూచించారు. కానీ అధికారులు ఈ దఫా 70శాతం కే–6 మిగిలిన 30శాతం మాత్రమే ధరణి, ఐసీజీఎస్‌–91114ను అందజేయనున్నట్టు తెలిసింది.
 

Advertisement
Advertisement