‘క్యాబేజా’ర్
ధరలేక నిండా మునిగిన క్యాబేజీ రైతు
కొనేవారు లేక తోటల్లోనే పంట
పెద్దనోట్ల రద్దుతో పడిపోయిన వ్యాపారం
ఈ ఒక్క సీజన్‌లోనే రూ.2 కోట్లదాకా నష్టం
పంట ఏపుగా పెరిగిందని మురిసిపోయారు. దిగుబడి ఆశించిన స్థాయిలో వచ్చిందని సంబరపడ్డారు. ఇక కష్టాలు తీరినట్టేనని కాలరెగరేశారు. కానీ పెద్దనోట్ల రద్దు ప్రభావం వారి జీవితాలను సర్వనాశనం చేసింది. క్యాబేజీ వ్యాపారాన్ని కోలుకోనీయకుండా చేసింది. పంట కోతకొచ్చినా కొనేవాళ్లు కరువవ్వడంతో పొలాల్లోనే వదిలేశారు. పెట్టుబడి రాక.. అప్పులు తీరక రైతులు పుట్టెడు కష్టాల్లో కూరుకుపోయారు.
పలమనేరు : జిల్లాలోని పడమటి మండలాల్లో గత ఏడాది క్యాబేజీ సాగుచేసిన రైతులు లక్షాధికారులయ్యారు. ఈ దఫా పంట సాగు విస్తీర్ణం పెరిగినా.. ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చినా కోలుకోలేకపోతున్నారు. గత నవంబర్‌లో పెద్దనోట్ల రద్దుతో మొదలైన కష్టాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. భారీగా పంట సాగువిస్తీర్ణం జిల్లాలో క్యాబేజీసాగు మదనపల్లె డివిజన్‌లో ఎక్కువ. ఇక్కడి శీతలవాతావరణం పంటసాగుకు అనుకూలం.
పంట కొనేదిక్కు లేదు
గత ఏడాది ధరలు చూసి ఈదఫా రెండున్నరెకరాల్లో క్యాబేజీ వేశా. మొత్తం రూ.1.20 లక్షలదాకా ఖర్చుపెట్టా. పంట దిగుబడి పెరిగింది. ధరతోపాటు కొనేవారు లేరు. పంట మొత్తం పొలంలోనే వదిలేశా. – ఉమాశంకర్‌రెడ్డి, రైతు, నక్కపల్లె,
పలమనేరు మండలంపుంగనూరు, రామసముద్రం, పలమనేరు, గంగవరం, వీకోట, బైరెడ్డిపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పంట ఎక్కువగా సాగవుతోంది. పలమనేరు డివిజన్ పరిధిలో ఏటా సాధారణ పంట సాగు విస్తీర్ణం వెయ్యి ఎకరాలు కాగా ఈదఫా 1,625 ఎకరాల్లో సాగైంది. వాతావరణం అనుకూలించడంతో ఎకరాకు 30 టన్నులదాకా దిగుబడి వచ్చింది.
రూ.రెండు కోట్లదాకా నష్టం
ఎకరా విస్తీర్ణంలో పంట సాగుచేయాలంటే రూ.60 వేలదాకా ఖర్చవతుంది. ఎకరాకు 30 టన్నుల దిగుబడి వస్తే ప్రస్తుత ధర ప్రకారం (టన్ను రూ.1,600) రూ.48 వేలు దక్కుతుంది. ఆ లెక్కన ఎకరాకు రూ.12వేలు నష్టం. డివిజన్ పరిధిలోని 1,625 ఎకరాలకు రూ.2కోట్ల దాకా నష్టం వాటిల్లింది.
కొనుగోలుకు ముందుకురాని వ్యాపారులు
స్థానికంగా పండే క్యాబేజీకి కోల్‌కత్తా, భువనేశ్వర్, ఢిల్లీ, కటక్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. అక్కడి నుంచి ఏటా వ్యాపారులు వచ్చి పొలాలవద్దే పంటను కొనుగోలు చేసేవారు. ఈ ఏడాది నోట్ల ఎఫెక్ట్‌తో బ్యాంకుల నుంచి నగదుపై ఆంక్షలుండడంతో వ్యాపారులు రావడం మానేశారు. రైతులకు చెక్కులిచ్చి పంట కొన్నా ఇక్కడి నుంచి సరుకును రవాణా చేయడానికి వీలు కావడం లేదు. కోల్‌కత్తాకు లారీ లోడ్డు వెళ్లాలంటే డీజల్‌కు రూ.40 వేలు, డ్రైవర్ బత్తా, టోల్‌గేట్లు ఇతరత్రాలకు రూ.60 వేలు ఖర్చవుతోంది. నోట్ల రద్దు కారణంగా వ్యాపారులు ఈ మొత్తాన్ని సమకూర్చలేకపోతున్నారు. ఫలితంగా రవాణా పూర్తిగా ఆగిపోయింది.
చేలల్లోనే పంట
క్యాబేజీని కొనేవారులేరు. పంట చేలల్లోనే వదిలేశారు. ఒబ్బిడి గడువుమీరి చాలా తోటల్లో పంట ఎందుకూ పనికిరాకుండా పోయింది. స్థానికంగా కొంతవరకు అమ్ముడైనా సరుకు మొత్తం కొనేవారు లేరు.