ఉత్తరాంధ్రలోని అల్లూరి సీతారామ జిల్లాలో సామ పంట విస్తృతంగా సాగవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇతర చిరుధాన్యాలతో పాటు సామలకు మంచి గిరాకీ ఏర్పడటంతో గిరిజన రైతుల్లో ఈ పంట సాగుపై ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఈ పంట విస్తీర్ణం కూడా విస్తరిస్తోంది. సేంద్రియ పద్ధతిలో పండించడానికి శ్రమ, పెట్టుబడి పెద్దగా అవసరం లేనిది సామ. అందువల్ల గిరిజనులందరూ ఎంతోకొంత విస్తీర్ణంలో ఈ పంటను పండించి, తాము తింటూ, మిగతా సామలు అమ్ముకుంటూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.
పూర్వం సామ ధాన్యాన్ని తిరగలిలో మరపట్టి బియ్యంలా మార్చుకొని సామ అన్నం, ఉప్మా, జావ వంటి సాంప్రదాయ వంటలు వండుకునే వారు. ఈ మధ్య మైదాన ప్రాంతాల ప్రజల్లో కూడా చిరుధాన్యాల వినియోగం పెరగడం, వీటితో బిస్కట్లు, కేక్ వంటి వివిధ రకాల చిరు తిండి ఉత్పత్తులను తయారుచేసి అమ్మడం వల్ల చిరుధాన్యాల ధరలు పెరిగి రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి.
అప్పుడు చోడి, ఇప్పుడు సామ
ఈ క్రమంలో వికాస స్వచ్చంద సంస్థ 2016లో చోడి /రాగి పంటలో గుళి సాగు పద్ధతిని ప్రవేశపెట్టింది. సాధారణంగా రైతులు చిరుధాన్యాల విత్తనాలను వెదజల్లే పద్ధతిలో పండిస్తుంటారు. నారు పెంచి, పొడి దుక్కిలో వరుసల్లో గుంతలు తీసి నాట్లు వేసుకునే పద్ధతిలో పండించడాన్నే ‘గుళి’ (గుళి అంటే గిరిజన భాషలో గుంట అని అర్థం) పద్ధతిగా పిలుస్తున్నారు. గుళి చోడిని పద్ధతిలో పండిస్తూ గిరిజన రైతులు దిగుబడిని ఎకరాకు 400 కేజీల నుంచి దాదాపు 1000 కేజీల వరకు పెంచుకోగలిగారు. ఈ క్రమం లోనే వికాస సంస్థ 2024 ఖరీఫ్ పంట కాలంలో గుళి పద్ధతిలో సామ పంటను సాగు చేయటానికి 54 మంది గిరిజన రైతులకు తోడ్పాటునందించింది.
30–35 రోజుల మొక్క నాటాలి
ప్రధాన పొలం చివరి దుక్కిలో 200 కేజీల ఘన జీవామృతాన్ని చల్లడం వల్ల భూమికి బలం చేకూరి, రైతులు మంచి దిగుబడి సాధించారు. సామ పంట ముఖ్యంగా పెద్ద సామ రకం బాగా ఎత్తు పెరుగుతుంది. అందువల్ల మొక్కలు నాటిన తర్వాత 30 నుండి 35 రోజుల మధ్య వెన్ను రాక ముందే తలలు తుంచాలి. దీని వల్ల పంట మరీ ఎత్తు పెరగకుండా, దుబ్బులు బలంగా పెరుగుతాయి. గాలులకు పడిపోకుండా ఉంటుంది.
దుంబ్రీగూడ మండలం లోగిలి గ్రామంలో కొర్రా జగబంధు అనే గిరిజన రైతు పొలంలో గుళి పద్ధతిలో పండించిన పెద్ద సామ పంటలో క్రాప్ కటింగ్ ప్రయోగాన్ని నిర్వహించారు. రైతులు, వికాస సిబ్బంది, నాబార్డ్ జిల్లా అధికారి చక్రధర్ సమక్షంలో సామలను తూకం వేసి చూస్తే.. ఎకరాకు దాదాపు 1,110 కేజీల (11.1 క్వింటాళ్ల) దిగుబడి నమోదైంది. ఈ పొలానికి పక్కనే రైత్వారీ పద్ధతిలో వెదజల్లిన సామ పొలంలో దిగుబడి ఎకరాకు 150 కేజీల నుంచి 200 కేజీలు మాత్రమే!
గుళి సాగు ప్రత్యేకత ఏమిటి?
రైత్వారీ పద్ధతిలో ఎక్కువ విత్తనం వెదజల్లటం, నేలను తయారు చేసే సమయంలో ఎటువంటి ఎరువు వేయక΄ోవడం, ఒక ఎకరాకు ఉండాల్సిన మొక్కల కన్నా మూడు నాలుగు రెట్లు ఎక్కువ సాంద్రతలో మొక్కలు ఉండటంతో పంట బలంగా పెరగలేకపోతోంది.
గుళి పద్ధతిలో లేత నారును పొలంలో వరుసల మధ్య అడుగున్నర దూరం, మొక్కల మధ్య అడుగు ఉండేలా నాటుతారు. రైత్వారీ వెద పద్ధతిలో ఎకరానికి 3 నుంచి 4 కేజీల విత్తనం అవసరం. దీనికి బదులు మొక్కలు నాటడం వల్ల ఎకరానికి 300 నుంచి 400 గ్రాముల విత్తనం (దాదాపు పది శాతం మాత్రమే) సరిపోతుంది. నారు పెంచుకొని 15 నుంచి 20 రోజుల వయసు మొక్కల్ని పొలంలో నాటుకోవడం వల్ల విత్తన ఖర్చు దాదాపుగా 90 శాతం తగ్గుతోంది.
మొక్కల సాంద్రత తగినంత ఉండి, మొక్కలు పెరిగే సమయంలో ప్రతి మొక్కకూ చక్కగా ఎండ తగలుతుంది. ఘన జీవామృతం వల్ల నేల సారవంతమై సామ మొక్కలు బలంగా పెరిగి, మంచి దిగుబడి వస్తున్నట్టు గమనించామని వికాస సిబ్బంది వెంకట్, నాగేశ్వర రావు, తవుడన్న చెబుతున్నారు.
దూరంగా నాటడం వల్ల దుక్కి పశువులతో కానీ, సైకిల్ వీడర్‌తో కానీ కలుపు తొందరగా, సులభంగా తియ్యవచ్చు. మొక్కలు బలంగా , ఏపుగా పెరగటం వల్ల కోత సమయంలో వంగి మొదలు నుంచి కోసే బదులు, నిలబడి వెన్నులు కొయ్యడం వల్ల సమయం ఆదా అవడమే కాక సులభంగా పంట కోత జరుగుతుండటం మరో విశేషం.
మున్ముందు వరిగ, ఊద కూడా..
అల్లూరి సీతారామ జిల్లాలో సామ పంటను ఈ సంవత్సరం ప్రయోగాత్మకంగా గుళి పద్ధతిలో పండించిన గిరిజన రైతులకు ఎకరానికి 11 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రైత్వారీ వెద పద్ధతిలో 2 క్వింటాళ్లకు మించలేదు. కనువిందు చేస్తున్న ఈ పొలాలను చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులను, మహిళలకు చూపిస్తున్నాం. వారు కూడా వచ్చే సంవత్సరం నుంచి మొక్కలు నాటే పద్ధతిని అనుసరించేలా ్ర΄ోత్సహిస్తున్నాం. ఇప్పటికే గిరిజన రైతులు చోడి సాగులో గుళి పద్ధతిని ΄ాటిస్తున్నారు. దీని వల్ల తక్కువ సమయంలోనే సామ రైతులు గుళి పద్ధతికి మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో వరిగ, ఊద పంటల్ని కూడా గుళి పద్ధతిలో సాగు చేయిస్తాం.
– డా. కిరణ్ (98661 18877), వికాస స్వచ్ఛంద సంస్థ,
అల్లూరి సీతారామరాజు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment