మహిళా రైతులతో షర్మిల జైన్
‘ఇక వ్యవసాయం చేయవద్దు అనుకుంటాను. కాని చేయక తప్పేది కాదు. దీనివల్ల తలపై అప్పులు తప్ప నాకు జరిగిన మేలు లేదు. అయినా సరే భూమి నాకు అమ్మతో సమానం’ అన్నాడు మహారాష్ట్రలోని ఒక రైతు.
‘లాభనష్టాల సంగతి పక్కన పెడితే, ఒక్కరోజు పొలం వైపు వెళ్లక పోయినా నాకు ఏదో కోల్పోయినట్లుగా ఉంటుంది’ అంటాడు రాజస్థాన్‌లోని ఒక రైతు. మన దేశంలో రైతుకు, భూమికి మధ్య ఆత్మీయ బంధం ఉంది. ఆ బంధాన్ని బలోపేతం చేయడానికి కెనడా నుంచి వచ్చిన షర్మిల జైన్ తన లక్ష్యసాధనలో విజయం సాధించింది...
రైతుల ఆత్మహత్యలతో వ్యవసాయరంగం కల్లోలంగా ఉన్న కాలం అది. ఆ సమయంలో షర్మిలజైన్ కెనడాలో నివాసం ఉంది. స్వదేశంలో రైతుల ఆత్మహత్యల గురించి చదివిన తరువాత ఆమె మనసు మనసులో లేదు. ఎన్నో ఆలోచనలు తనను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేశాయి.
‘ఈ సమస్యకు పరిష్కారం లేదా?’ అని ఆమె ఆలోచించింది.
ఆ సమయానికి కదిలిపోయి మరోరోజుకు మామూలై పోయే వ్యక్తి కాదు షర్మిల. కనిపించే సమస్య వెనకాల కనిపించని సమస్యలను అధ్యయనం చేయడానికి రంగంలోకి దిగింది. అంతేకాదు, రైతుల కోసం కెనడాను వదిలి స్వదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకుంది. ‘నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నావో తెలుసా? భావోద్వేగాలపై తీసుకునే నిర్ణయాలు బెడిసికొడతాయి. తీరిగ్గా ఆలోచించు. వెళ్లడం సులభమేకాని ఇక్కడికి మళ్లీ రావడం అంత సులభమేమీ కాదు’ అన్నారు సన్నిహితులు.బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నానని చెప్పింది షర్మిల.
మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన షర్మిలకు రైతుజీవితం కొత్తేమీ కాదు. వారికి సంబంధించి తాను చిన్నప్పుడు విన్న సమస్యలే ఇప్పుడు కూడా వినాల్సి వస్తుంది.
మరాఠీ మీడియం స్కూల్లో చదువుకున్న షర్మిల స్నేహితులలో చాలామంది రైతు బిడ్డలే. ఆ కుటుంబాల ఆర్థి«క కష్టాలతోపాటు గృహహింసకు సంబంధించిన విషయాలను తరచుగా వినేది. ఆ సమయంలోనే లాయర్ కావాలని అనుకుంది.
కెనడా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన షర్మిల క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను అర్థం చేసుకోవడానికి మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌లలోని ఎన్నో పల్లెలు తిరిగింది. ఇంటింటికి వెళ్లి రైతులతో మాట్లాడింది. వారితోపాటు పొలానికి వెళ్లింది.
‘ఇలా ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి రాసుకోవడం, తరువాత కనిపించకపోవడం మామూలే. అయితే షర్మిలజీ కళ్లలో నిజాయితీ కనిపించింది. ఆమె మా కోసం ఏదో చేయగలదు అనే ఆశ కలిగింది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటాడు చౌహాన్ అనే రైతు.
వ్యవసాయ సంబంధిత అంశాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి... ఇంగ్లాండ్‌లో ఎన్విరాన్‌మెంటల్ లా, అగ్రికల్చరల్ లా లో మాస్టర్స్ చేసింది షర్మిల. రెండు సంవత్సరాల కాలంలో ఎంతోమంది రైతులతో, వ్యవసాయరంగ నిపుణులతో మాట్లాడిన తరువాత ‘గ్రీన్ ఎనర్జీ ఫౌండేషన్’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. చెరువులను పునరుద్ధరించడం, నవీన వ్యవసాయ పద్ధతులను రైతులకు పరిచయం చేయడం, చిరుధాన్యాలు పండించడంపై అవగాహన కలిగించడం... మొదలైనవి ఈ ఫౌండేషన్ లక్ష్యాలు.
తొలిసారిగా మహారాష్ట్రలోని బుచ్‌కెవాడి గ్రామంలో నాబార్డ్ గ్రాంట్‌తో వాటర్ మేనేజ్‌మెంట్ ప్రోగాం చేపట్టారు. నిరంతరం నీటిఎద్దడితో సతమతం అవుతున్న ఆ గ్రామం వాటర్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ద్వారా బాగు పడింది. వేసవి సమయంలోనూ నీటి కష్టాలు రాని పరిస్థితి వచ్చింది.
రాజస్థాన్‌లోని దుంగర్‌పుర్ గ్రామంలోని రైతులకు నీటి అవసరం ఎక్కువగా లేని పంటల గురించి అవగాహన కలిగించారు. ‘గ్రీన్ ఎనర్జీ మా ఊరిలో అడుగు పెట్టకపోతే వ్యవసాయానికి శాశ్వతంగా దూరం అయ్యేవాళ్లం. గ్రీన్‌ఎనర్జీ కార్యక్రమాల ద్వారా అనేక రకాలుగా లబ్ధిపొందాం. ఇప్పుడు కూరగాయలు కూడా పండిస్తున్నాం. గతంలో పంటలు పండనప్పుడు నా భర్త కూలిపనుల కోసం పట్నం వెళ్లేవాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు’ అంటుంది దీప్తి అనే మహిళా రైతు.
షర్మిల తన తండ్రి నుంచి రెండు విలువైన మాటలు విన్నది. ఒకటి... చిరుధాన్యాల ప్రాముఖ్యత. రెండు... కార్పోరేట్ కంపెనీల సామాజిక బాధ్యత. ఇప్పుడు బాగా వినిపిస్తున్న సీఎస్‌ఆర్ (కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ఆరోజుల్లోనే విన్నది షర్మిల.
ఆరోగ్యకరమైన ఆహార అలవాట్ల కోసం, చిరుధాన్యాలను పండించే రైతులకు సహాయపడడానికి ‘గుడ్ మామ్’ అనే స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది షర్మిల జైన్. ‘గుడ్ మామ్’ ద్వారా మిల్లెట్ నూడుల్స్ నుంచి హెర్బ్ స్టిక్స్ వరకు ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. చిరుధాన్యాలపై ఆసక్తి వేలం వెర్రిగా మారకుండా, దాన్ని ఇతరులు సొమ్ము చేసుకోకుండా ఉండడానికి ‘గుడ్ మామ్’ ద్వారా ‘ఏది అబద్ధం?’ ‘ఏది నిజం’ అంటూ అవగాహన కలిగిస్తున్నారు.
ఎన్నో సంవత్సరాలుగా అయిదు రాష్ట్రాలలో వేలాదిమంది రైతులకు వాటర్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్స్, కెపాసిటీ–బిల్డింగ్ ప్రోగామ్స్ ద్వారా సహాయపడుతున్నాం. చిరుధాన్యాలు, కూరగాయలు పండించడంపై అవగాహన కలిగిస్తున్నాం. చిరుధాన్యాలు అనే పేరు పెద్దగా వినిపించని కాలంలోనే వాటి ప్రాముఖ్యత గురించి ప్రచారం చేశాం.
– షర్మిల జైన్
Comments
Please login to add a commentAdd a comment