బంజరు భూములలో కూడా బంగారాన్ని పండించవచ్చని నిరూపిస్తున్నారు ఐఐటీ–బాంబే గ్రాడ్యుయేట్స్ అభయ్ సింగ్, అమిత్ కుమార్‌లు. వివిధ రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే క్లైమెట్ ప్రూఫ్ చాంబర్స్ ద్వారా రసాయన రహిత కూరగాయలను పచ్చగా పండిస్తున్నారు. ‘ఇకీ ఫుడ్స్’ స్టార్టప్‌తో ఈ మిత్రద్వయం అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది...
అభయ్ సింగ్, అమిత్ కుమార్‌లు ఐఐటీ–బాంబేలో బెస్ట్ ఫ్రెండ్స్. చాలామంది స్నేహితులలాగా సినిమాలు, క్రికెట్ గురించి కంటే పర్యావరణం, వ్యవసాయానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా మాట్లాడుకునేవారు.
‘కాలేజి రోజుల నుంచి సంప్రదాయానికి భిన్నంగా ఆలోచించడం మా అలవాటు. రకరకాల ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుకునే వాళ్లం. క్లాస్ పూర్తయిన తరువాత ఎన్నో విషయాలపై మేధోమథనం చేసేవాళ్లం చదువుకున్నామా? ఉద్యోగాలు చేశామా? అని కాకుండా సమాజం కోసం మా వంతుగా ఏదైనా చేయాలనుకునే వాళ్లం. మన దేశంలో ఎంతో మంది వ్యవసాయరంగంలో పనిచేçస్తున్నారు. వారి కోసం ఏదైనా చేయాలనుకునేవాళ్లం. ఏదైనా సాధించాలనే తపన పుట్టినప్పుడు ఆత్మవిశ్వాసం మొదలవుతుంది. అది అనేక రకాలుగా శక్తిని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. మా విషయంలోనూ ఇదే జరిగింది’ అంటాడు అమిత్.
వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అమిత్, అభయ్‌లు ఆ రంగానికి సంబంధించిన రకరకాల ప్రయోగాలు చేస్తూ స్థిరమైన, అనుకూలమైన, అందుబాటులో ఉండే సాంకేతికతను రైతులకు దగ్గర చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.
‘జనాభా పెరుగుదల దృష్ట్యా మన దేశంలో ఆహార కొరత ఏర్పడనుంది. ఆహారంలో పోషక విలువలు కోల్పోనున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆహారం అందరికీ అందుబాటులో ఉండేలా, ఆరోగ్యానికి మేలు చేసేలా, వేగంగా ఉత్పత్తి చేసేలా కొత్త ఆవిష్కరణలు చేయాలనుకున్నాం’ అంటాడు అభయ్.
తాము చర్చించుకున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని ‘ఇకీ ఫుడ్స్’ అనే అంకురాన్ని ప్రారంభించారు. ‘ఇకీ ఫుడ్స్’ మొదలు పెట్టినప్పుడు మొదటి మూడు సంవత్సరాలు పరిశోధన, అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టారు.
వీరు సృష్టించిన సాంకేతికత ఎనభై శాతం నీటి వృథాను ఆరికడుతుంది. సంప్రదాయ పద్ధతుల్లో కంటే 75 శాతం వేగవంతమైన వృద్ధిరేటు ఉంటుంది. వివిధ రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే క్లైమెట్ ప్రూఫ్ చాంబర్స్ ద్వారా రసాయనరహిత కూరగాయలను పండిస్తున్నారు.
గత సంవత్సరం తమ టెక్నాలజీకి సంబంధించిన పేటెంట్ రైట్స్ పొందారు.
‘ఎన్నో రకాల వ్యవసాయ పద్ధతులు ఉన్నా అవసరాలకు తగిన పద్ధతులు కనిపించడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వేగవంతమైన ఉత్పత్తి విధానాలకు ప్రాధాన్యత ఇచ్చాం. మట్టి నుంచి మొక్క మొలకెత్తడానికి నీరు. ఆక్సిజన్, పోషకాలు, సపోర్ట్ అవసరం అవుతాయి. ఈ నాలుగు ఆధారాలతో మట్టితో పని లేకుండా మొక్కలను సృష్టించాలనుకున్నాం. డెబ్బైశాతం తేమ ఉన్న గదిలో అవసరమైన పోషక మూలాలను స్ప్రే చేసి ప్రయోగాలు మొదలు పెట్టాం’ అంటాడు అమిత్.
సంపన్న దేశాల వ్యవసాయ క్షేత్రాల హైడ్రోపోనిక్స్ సిస్టమ్‌లో ఉపయోగించే కూలర్‌లు, చిల్లర్‌లు, బ్లోయర్‌లు, ప్లాస్టిక్ ఎన్‌క్లోజర్‌లకు ఈ మిత్రద్వయం దూరంగా ఉండాలనుకుంటోంది. సౌరశక్తిలోని అద్భుతాన్ని ఉపయోగించుకొని సంప్రదాయ పద్ధతుల్లో కంటే ఎక్కువ దిగుబడి సాధించాలనుకుంటోంది.
రాజస్థాన్‌లోని కోట కేంద్రంగా పని చేస్తున్న ‘ఇకీ ఫుడ్స్’ స్టార్టప్ ‘కంట్రోల్డ్ ఎన్విరాన్‌మెంట్ అగ్రికల్చర్’ను తన నినాదంగా, విధానంగా ఎంచుకుంది. రాబోయే రోజుల్లో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలలో ‘ఇకీ ఫుడ్స్’ క్షేత్రాలకు శ్రీకారం చుట్టడానికి రెడీ అవుతున్నారు అమిత్, అభయ్‌లు.
ఇకిగై అంటే... ఇకిగై అనేది జపనీస్ కాన్సెప్ట్. ఆరోగ్యవంతమైన. శక్తివంతమైన జీవన విధానాన్ని ప్రతిఫలించే మాట. జపనీస్ పదాలు ఇకీ (జీవితం), కై (ఫలితం, ఫలం) నుంచి పుట్టింది. స్ఫూర్తిదాయకమైన ‘ఇకిగై’ కాన్సెప్ట్ నుంచి తమ స్టార్టప్‌కు ‘ఇకీ ఫుడ్స్’ అని నామకరణం చేశారు అమిత్, అభయ్‌లు.
కొత్త ఆలోచనలు వృథా పోవు. కాస్త ఆలస్యమైనా మంచి ఫలితం దక్కుతుంది.
– అమిత్ కుమార్, ఇకీ–ఫుడ్స్, కో–ఫౌండర్
Comments
Please login to add a commentAdd a comment