IIT-Bombay students
-
ఐఐటీ విద్యార్థులు.. పచ్చని కూరగాయలు పండిస్తున్నారు
బంజరు భూములలో కూడా బంగారాన్ని పండించవచ్చని నిరూపిస్తున్నారు ఐఐటీ–బాంబే గ్రాడ్యుయేట్స్ అభయ్ సింగ్, అమిత్ కుమార్‌లు. వివిధ రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే క్లైమెట్ ప్రూఫ్ చాంబర్స్ ద్వారా రసాయన రహిత కూరగాయలను పచ్చగా పండిస్తున్నారు. ‘ఇకీ ఫుడ్స్’ స్టార్టప్‌తో ఈ మిత్రద్వయం అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది... అభయ్ సింగ్, అమిత్ కుమార్‌లు ఐఐటీ–బాంబేలో బెస్ట్ ఫ్రెండ్స్. చాలామంది స్నేహితులలాగా సినిమాలు, క్రికెట్ గురించి కంటే పర్యావరణం, వ్యవసాయానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా మాట్లాడుకునేవారు. ‘కాలేజి రోజుల నుంచి సంప్రదాయానికి భిన్నంగా ఆలోచించడం మా అలవాటు. రకరకాల ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుకునే వాళ్లం. క్లాస్ పూర్తయిన తరువాత ఎన్నో విషయాలపై మేధోమథనం చేసేవాళ్లం చదువుకున్నామా? ఉద్యోగాలు చేశామా? అని కాకుండా సమాజం కోసం మా వంతుగా ఏదైనా చేయాలనుకునే వాళ్లం. మన దేశంలో ఎంతో మంది వ్యవసాయరంగంలో పనిచేçస్తున్నారు. వారి కోసం ఏదైనా చేయాలనుకునేవాళ్లం. ఏదైనా సాధించాలనే తపన పుట్టినప్పుడు ఆత్మవిశ్వాసం మొదలవుతుంది. అది అనేక రకాలుగా శక్తిని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. మా విషయంలోనూ ఇదే జరిగింది’ అంటాడు అమిత్. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అమిత్, అభయ్‌లు ఆ రంగానికి సంబంధించిన రకరకాల ప్రయోగాలు చేస్తూ స్థిరమైన, అనుకూలమైన, అందుబాటులో ఉండే సాంకేతికతను రైతులకు దగ్గర చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ‘జనాభా పెరుగుదల దృష్ట్యా మన దేశంలో ఆహార కొరత ఏర్పడనుంది. ఆహారంలో పోషక విలువలు కోల్పోనున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆహారం అందరికీ అందుబాటులో ఉండేలా, ఆరోగ్యానికి మేలు చేసేలా, వేగంగా ఉత్పత్తి చేసేలా కొత్త ఆవిష్కరణలు చేయాలనుకున్నాం’ అంటాడు అభయ్. తాము చర్చించుకున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని ‘ఇకీ ఫుడ్స్’ అనే అంకురాన్ని ప్రారంభించారు. ‘ఇకీ ఫుడ్స్’ మొదలు పెట్టినప్పుడు మొదటి మూడు సంవత్సరాలు పరిశోధన, అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టారు. వీరు సృష్టించిన సాంకేతికత ఎనభై శాతం నీటి వృథాను ఆరికడుతుంది. సంప్రదాయ పద్ధతుల్లో కంటే 75 శాతం వేగవంతమైన వృద్ధిరేటు ఉంటుంది. వివిధ రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే క్లైమెట్ ప్రూఫ్ చాంబర్స్ ద్వారా రసాయనరహిత కూరగాయలను పండిస్తున్నారు. గత సంవత్సరం తమ టెక్నాలజీకి సంబంధించిన పేటెంట్ రైట్స్ పొందారు. ‘ఎన్నో రకాల వ్యవసాయ పద్ధతులు ఉన్నా అవసరాలకు తగిన పద్ధతులు కనిపించడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వేగవంతమైన ఉత్పత్తి విధానాలకు ప్రాధాన్యత ఇచ్చాం. మట్టి నుంచి మొక్క మొలకెత్తడానికి నీరు. ఆక్సిజన్, పోషకాలు, సపోర్ట్ అవసరం అవుతాయి. ఈ నాలుగు ఆధారాలతో మట్టితో పని లేకుండా మొక్కలను సృష్టించాలనుకున్నాం. డెబ్బైశాతం తేమ ఉన్న గదిలో అవసరమైన పోషక మూలాలను స్ప్రే చేసి ప్రయోగాలు మొదలు పెట్టాం’ అంటాడు అమిత్. సంపన్న దేశాల వ్యవసాయ క్షేత్రాల హైడ్రోపోనిక్స్ సిస్టమ్‌లో ఉపయోగించే కూలర్లు, చిల్లర్లు, బ్లోయర్లు, ప్లాస్టిక్ ఎన్క్లోజర్లకు ఈ మిత్రద్వయం దూరంగా ఉండాలనుకుంటోంది. సౌరశక్తిలోని అద్భుతాన్ని ఉపయోగించుకొని సంప్రదాయ పద్ధతుల్లో కంటే ఎక్కువ దిగుబడి సాధించాలనుకుంటోంది. రాజస్థాన్‌లోని కోట కేంద్రంగా పని చేస్తున్న ‘ఇకీ ఫుడ్స్’ స్టార్టప్ ‘కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అగ్రికల్చర్’ను తన నినాదంగా, విధానంగా ఎంచుకుంది. రాబోయే రోజుల్లో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలలో ‘ఇకీ ఫుడ్స్’ క్షేత్రాలకు శ్రీకారం చుట్టడానికి రెడీ అవుతున్నారు అమిత్, అభయ్‌లు. ఇకిగై అంటే... ఇకిగై అనేది జపనీస్ కాన్సెప్ట్. ఆరోగ్యవంతమైన. శక్తివంతమైన జీవన విధానాన్ని ప్రతిఫలించే మాట. జపనీస్ పదాలు ఇకీ (జీవితం), కై (ఫలితం, ఫలం) నుంచి పుట్టింది. స్ఫూర్తిదాయకమైన ‘ఇకిగై’ కాన్సెప్ట్ నుంచి తమ స్టార్టప్‌కు ‘ఇకీ ఫుడ్స్’ అని నామకరణం చేశారు అమిత్, అభయ్‌లు. కొత్త ఆలోచనలు వృథా పోవు. కాస్త ఆలస్యమైనా మంచి ఫలితం దక్కుతుంది. – అమిత్ కుమార్, ఇకీ–ఫుడ్స్, కో–ఫౌండర్ -
ఐఐటీ-బాంబే కాన్వోకేషన్ : మోదీ ఎందుకొస్తున్నారంటూ..
న్యూఢిల్లీ : దేశ ప్రధాన మంత్రిగా యూనివర్సిటీల్లో జరిగే కాన్వోకేషన్ వేడుకల్లో పాల్గొనడం సాధారణం. ఎలాగైనా ప్రధాని తమ యూనివర్సిటీకి ముఖ్య అతిథిగా రావాలని అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు ఎంతో ఆశపడుతూ ఉంటారు. కానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే విద్యార్థులు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించారు. యూనివర్సిటీలో జరిగే కాన్వోకేషన్ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీని ఎందుకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారంటూ ఓ గ్రూప్ విద్యార్థులు ప్రశ్నించారు. నేడు(శనివారం) ఈ వేడుక జరుగుతుండగా... విద్యార్థులు ఇలా ప్రశ్నించడంతో మేనేజ్మెంట్ షాకైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘విద్యార్థి వ్యతిరేక రాజకీయాలు’ చేస్తుందని ఆరోపిస్తూ.. తమ స్టేట్మెంట్ను సోషల్ మీడియాలో షేర్చేశారు. ఈ స్టేట్మెంట్లో ఉన్నత విద్యకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు తగ్గించడం, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సస్ లాంటి ఇన్స్టిట్యూట్లలో రిజర్వడ్ కేటగిరీ విద్యార్థులకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా-పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ను రద్దు చేయడం, కొత్త ఉన్నత విద్య కమిటీలోని లోపాలు వంటి పలు అంశాలపై విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. తాము లేవనెత్తిన ఈ అంశాలన్నీ కేవలం తమ ఇన్స్టిట్యూట్కు వేసే ప్రశ్నలు కావని, డైరెక్ట్‌గా ప్రధానినే ప్రశ్నిస్తున్నట్టు విద్యార్థులు పేర్కొన్నారు. ఉన్నత విద్యా సంస్థలకు కేటాయించే నిధుల్లో ఈ ప్రభుత్వం చాలా చెత్త రికార్డును కలిగి ఉందని విమర్శిస్తున్నారు. నిజంగా ప్రధానమంత్రికి అందరికి విద్య అందించాలని ఉందా? లేదా విద్యలో బ్రహ్మణ ఆలోచన విధానాన్ని ప్రోత్సహిస్తుందా?(కొంతమంది విద్యార్థులు అంటే ఉన్నత తరగతికి చెందిన విద్యార్థులకు మాత్రమే విద్య) అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉన్నత విద్యపై వెచ్చించే ఖర్చులను తగ్గించడంతో, దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు ఫీజులను పెంచాయని పేర్కొన్నారు. ఉన్నత విద్య సంస్థల్లో పెరుగుతున్న రుణాలు, దీంతో విద్యార్థులకు యూనివర్సిటీలు పెంచుతున్న ఫీజులు వంటి పలు సమస్యలను విద్యార్థులు లేవనెత్తారు. ఆయన పార్టీ నేతలు సపోర్టు చేస్తున్న ద్వేషపూరిత నేరాలను ఖండించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ స్టేట్మెంట్ను కో-ఆర్డినేషన్ ఆఫ్ సైన్సస్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్స్ స్టూడెంట్ అసోసియేషన్ ఫేస్బుక్ పేజీపై కూడా షేర్ చేశారు. మరోవైపు ఐఐటీ-బాంబేలో కాన్వోకేషన్ వేడుకలో పాల్గొనడానికి ముంబై వెళ్తున్నట్టు నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. ఐఐటీ-బాంబే యవతతో తాను సమావేశం కాబోతున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ సైన్సస్ అండ్ ఇంజనీరింగ్, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కొత్త భవంతిని ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. ప్రధాని మోదీ హాజరయ్యే ఈ వేడుకలో కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి ప్రకాశ్ జవదేకర్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పాల్గొనబోతున్నారు. -
గంటకు 145 కిమీ వేగంతో ఓర్కా..రెడీ
ఐఐటీ బాంబే విద్యార్థులు ఇటు చదువులోనే కాదు.. అటు ప్రయోగాల్లోనూ దూసుకెళ్తున్నారు. దేశంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ రేసింగ్ కారును రూపొందించారు. ఈ కారును జూలై 14న లండన్ లో జరగబోయే యూరప్ అతిపెద్ద ఎడ్యుకేషనల్ మోడల్ స్పోర్ట్ ఈవెంట్ ఫార్ములా స్టూడెంట్ లో ఉపయోగించబోతున్నారు. ఎనిమిది ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన 70 మంది విద్యార్థులు ఈ కారును రూపొందించడంలో పాల్గొన్నారు. దీనికి ఓర్కా అనే పేరు పెట్టారు. ఇది గంటకు 145 కిమీల వేగంతో దూసుకెళ్తుంది. ఈ ఈవెంట్ లో బెస్ట్ నాన్-యూరోపియన్ టీమ్ గా వరుసగా నాలుగోసారి తమ కారే అవార్డు దక్కించుకోవాలని పోటీపడుతున్నారు. గత ఐదేళ్లగా ఐఐటీ బాంబే విద్యార్థులు ఎలక్ట్రిక్ రేసింగ్ కార్లను డిజైన్ చేస్తూ వస్తున్నారు. ప్రతేడాది ఏదో ఒక నూతనావిష్కరణలతో మెరుగుదలతో, మార్పులతో ఆటోమార్కెట్ ముందుకు తీసుకొస్తున్నారు. దీంతో డిజైన్ లో బెస్ట్ ఇంప్రూవ్ మెంట్లతో గత మూడేళ్లుగా బెస్ట్ నాన్ యూరోపియన్ టీమ్ గా వీరినే అవార్డు వరిస్తూ వచ్చింది. ఈ ఏడాది కూడా తమ కారుకే ఈ అవార్డు లభించేలా ఐఐటీ బాంబే విద్యార్థులు ఓర్కాను డిజైన్ చేశారు. గ్లోబల్ గా జరగబోయే ఈ ఈవెంట్ లో 100 కు పైగా స్టూడెంట్ టీమ్ లు పాల్గొననున్నాయి. ఐసీ ఇంజన్, ఎలక్ట్రిక్ కార్లను ప్రదర్శించనున్నాయి. ఇప్పటివరకూ ఐఐటీ బాంబే రేసింగ్ టీమ్ అన్ని ఎలక్ట్రిక్ కార్లనే ఈ ఈవెంట్ లో ప్రదర్శించింది. ఇంజనీరింగ్, డిజైన్, వ్యయం ఆధారంగా అలాగే కార్ల డైనమిక్ పనితీరుపై టీమ్ లను బెస్ట్ టీమ్ లుగా ఈ ఈవెంట్ లో అవార్డులు గెలుచుకుంటుంటారు. పోర్స్చే, టెస్లా, లంబోర్ఘిని వంటి ప్రముఖ కార్లకంటే కూడా ఓర్కా చాలా వేగవంతమైనది. జీరో నుంచి 100 కేఎమ్‌పీహెచ్ ను 3.47 సెకండ్లలో చేధించగలదు. తామందరికీ కార్లను రూపొందించడంలో చాలా ఆసక్తి ఉందని ఐఐటీ బాంబే రేసింగ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆర్చిత్ సానాద్య తెలిపాడు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కార్ల డిజైన్ పైనే చర్చిస్తుంటామని, నూతనావిష్కరణ, స్థిరమైన టెక్నాలజీపై ఎక్కువగా శ్రద్ధ వహించి విప్లవత్మకమైన ఎలక్ట్రిక్ మొబిలిటీ వెహికిల్ ను రూపొందించడమే తమ విజన్ అని పేర్కొన్నాడు. ఫార్ములా స్టూడెంట్ ఈవెంట్ లో పాల్గొన్నబోయే ఈ తమ ఓర్కా రేసింగ్ కారు ఐదోదని, కార్లను వినూత్నంగా డిజైన్ చేయడం కోసం నిరంతరం కృషి చేస్తుంటామని పేర్కొన్నాడు. రూ.45 లక్షలు ఖర్చు అయిన ఈ ప్రాజెక్టు కోసం ఫండ్ లను వివిధ రూపాల్లో సేకరించామని, 25 శాతం ఫండింగ్ ఎన్ఆర్బీ బేరింగ్ నుంచి సేకరించామని తెలిపాడు. సీఈఏటీ టైర్లు, టాటా మోటార్లు తమ బడ్జెట్ అవసరాల్లో ఐదవ వంతు, ఎనిమిద వంతు సహకరించినట్టు టీమ్ పేర్కొంది. ఐఐటీ బాంబే తనకు తాను మూడోవంతు ఈ ప్రాజెక్టుకు సహకరించింది. ఇతర ఫండ్స్ ను టెకనెక్టివిటీ, హార్నెస్ టెక్నాలజీస్, వెక్టార్, స్మాఆష్, ఇమాజినేరియం, ఏషియన్ పెయింట్స్ వంటి కంపెనీల ద్వారా సేకరించారు. ప్రధాని నరేంద్రమోదీ చొరవ తీసుకున్న ఎఫ్ఏఎమ్ఈ(ఫాస్టర్ అడాప్షన్ అండ్ మానుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్)కు ఇది సమాంతరంగా ఉంటుందని టీమ్ వెల్లడించింది.