ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : దేశ ప్రధాన మంత్రిగా యూనివర్సిటీల్లో జరిగే కాన్వోకేషన్ వేడుకల్లో పాల్గొనడం సాధారణం. ఎలాగైనా ప్రధాని తమ యూనివర్సిటీకి ముఖ్య అతిథిగా రావాలని అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు ఎంతో ఆశపడుతూ ఉంటారు. కానీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే విద్యార్థులు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించారు. యూనివర్సిటీలో జరిగే కాన్వోకేషన్ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీని ఎందుకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారంటూ ఓ గ్రూప్ విద్యార్థులు ప్రశ్నించారు. నేడు(శనివారం) ఈ వేడుక జరుగుతుండగా... విద్యార్థులు ఇలా ప్రశ్నించడంతో మేనేజ్‌మెంట్ షాకైంది.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘విద్యార్థి వ్యతిరేక రాజకీయాలు’ చేస్తుందని ఆరోపిస్తూ.. తమ స్టేట్‌మెంట్‌ను సోషల్ మీడియాలో షేర్‌చేశారు. ఈ స్టేట్‌మెంట్‌లో ఉన్నత విద్యకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు తగ్గించడం, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సస్ లాంటి ఇన్‌స్టిట్యూట్లలో రిజర్వడ్ కేటగిరీ విద్యార్థులకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా-పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ను రద్దు చేయడం, కొత్త ఉన్నత విద్య కమిటీలోని లోపాలు వంటి పలు అంశాలపై విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. తాము లేవనెత్తిన ఈ అంశాలన్నీ కేవలం తమ ఇన్‌స్టిట్యూట్‌కు వేసే ప్రశ్నలు కావని, డైరెక్ట్‌గా ప్రధానినే ప్రశ్నిస్తున్నట్టు విద్యార్థులు పేర్కొన్నారు. ఉన్నత విద్యా సంస్థలకు కేటాయించే నిధుల్లో ఈ ప్రభుత్వం చాలా చెత్త రికార్డును కలిగి ఉందని విమర్శిస్తున్నారు.
నిజంగా ప్రధానమంత్రికి అందరికి విద్య అందించాలని ఉందా? లేదా విద్యలో బ్రహ్మణ ఆలోచన విధానాన్ని ప్రోత్సహిస్తుందా?(కొంతమంది విద్యార్థులు అంటే ఉన్నత తరగతికి చెందిన విద్యార్థులకు మాత్రమే విద్య) అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉన్నత విద్యపై వెచ్చించే ఖర్చులను తగ్గించడంతో, దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు ఫీజులను పెంచాయని పేర్కొన్నారు. ఉన్నత విద్య సంస్థల్లో పెరుగుతున్న రుణాలు, దీంతో విద్యార్థులకు యూనివర్సిటీలు పెంచుతున్న ఫీజులు వంటి పలు సమస్యలను విద్యార్థులు లేవనెత్తారు. ఆయన పార్టీ నేతలు సపోర్టు చేస్తున్న ద్వేషపూరిత నేరాలను ఖండించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ స్టేట్‌మెంట్‌ను కో-ఆర్డినేషన్ ఆఫ్ సైన్సస్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్స్ స్టూడెంట్ అసోసియేషన్ ఫేస్‌బుక్ పేజీపై కూడా షేర్ చేశారు.
మరోవైపు ఐఐటీ-బాంబేలో కాన్వోకేషన్ వేడుకలో పాల్గొనడానికి ముంబై వెళ్తున్నట్టు నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. ఐఐటీ-బాంబే యవతతో తాను సమావేశం కాబోతున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ సైన్సస్ అండ్ ఇంజనీరింగ్, సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కొత్త భవంతిని ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. ప్రధాని మోదీ హాజరయ్యే ఈ వేడుకలో కేంద్ర హెచ్‌ఆర్‌డీ మంత్రి ప్రకాశ్ జవదేకర్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పాల్గొనబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment