గంటకు 145 కిమీ వేగంతో ఓర్కా..రెడీ
ఐఐటీ బాంబే విద్యార్థులు ఇటు చదువులోనే కాదు.. అటు ప్రయోగాల్లోనూ దూసుకెళ్తున్నారు. దేశంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ రేసింగ్ కారును రూపొందించారు. ఈ కారును జూలై 14న లండన్ లో జరగబోయే యూరప్ అతిపెద్ద ఎడ్యుకేషనల్ మోడల్ స్పోర్ట్ ఈవెంట్ ఫార్ములా స్టూడెంట్ లో ఉపయోగించబోతున్నారు. ఎనిమిది ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన 70 మంది విద్యార్థులు ఈ కారును రూపొందించడంలో పాల్గొన్నారు. దీనికి ఓర్కా అనే పేరు పెట్టారు. ఇది గంటకు 145 కిమీల వేగంతో దూసుకెళ్తుంది. ఈ ఈవెంట్ లో బెస్ట్ నాన్-యూరోపియన్ టీమ్ గా వరుసగా నాలుగోసారి తమ కారే అవార్డు దక్కించుకోవాలని పోటీపడుతున్నారు.
గత ఐదేళ్లగా ఐఐటీ బాంబే విద్యార్థులు ఎలక్ట్రిక్ రేసింగ్ కార్లను డిజైన్ చేస్తూ వస్తున్నారు. ప్రతేడాది ఏదో ఒక నూతనావిష్కరణలతో మెరుగుదలతో, మార్పులతో ఆటోమార్కెట్ ముందుకు తీసుకొస్తున్నారు. దీంతో డిజైన్ లో బెస్ట్ ఇంప్రూవ్ మెంట్లతో గత మూడేళ్లుగా బెస్ట్ నాన్ యూరోపియన్ టీమ్ గా వీరినే అవార్డు వరిస్తూ వచ్చింది. ఈ ఏడాది కూడా తమ కారుకే ఈ అవార్డు లభించేలా ఐఐటీ బాంబే విద్యార్థులు ఓర్కాను డిజైన్ చేశారు. గ్లోబల్ గా జరగబోయే ఈ ఈవెంట్ లో 100 కు పైగా స్టూడెంట్ టీమ్ లు పాల్గొననున్నాయి. ఐసీ ఇంజన్, ఎలక్ట్రిక్ కార్లను ప్రదర్శించనున్నాయి. ఇప్పటివరకూ ఐఐటీ బాంబే రేసింగ్ టీమ్ అన్ని ఎలక్ట్రిక్ కార్లనే ఈ ఈవెంట్ లో ప్రదర్శించింది. ఇంజనీరింగ్, డిజైన్, వ్యయం ఆధారంగా అలాగే కార్ల డైనమిక్ పనితీరుపై టీమ్ లను బెస్ట్ టీమ్ లుగా ఈ ఈవెంట్ లో అవార్డులు గెలుచుకుంటుంటారు.
పోర్స్చే, టెస్లా, లంబోర్ఘిని వంటి ప్రముఖ కార్లకంటే కూడా ఓర్కా చాలా వేగవంతమైనది. జీరో నుంచి 100 కేఎమ్పీహెచ్ ను 3.47 సెకండ్లలో చేధించగలదు. తామందరికీ కార్లను రూపొందించడంలో చాలా ఆసక్తి ఉందని ఐఐటీ బాంబే రేసింగ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆర్చిత్ సానాద్య తెలిపాడు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కార్ల డిజైన్ పైనే చర్చిస్తుంటామని, నూతనావిష్కరణ, స్థిరమైన టెక్నాలజీపై ఎక్కువగా శ్రద్ధ వహించి విప్లవత్మకమైన ఎలక్ట్రిక్ మొబిలిటీ వెహికిల్ ను రూపొందించడమే తమ విజన్ అని పేర్కొన్నాడు. ఫార్ములా స్టూడెంట్ ఈవెంట్ లో పాల్గొన్నబోయే ఈ తమ ఓర్కా రేసింగ్ కారు ఐదోదని, కార్లను వినూత్నంగా డిజైన్ చేయడం కోసం నిరంతరం కృషి చేస్తుంటామని పేర్కొన్నాడు.
రూ.45 లక్షలు ఖర్చు అయిన ఈ ప్రాజెక్టు కోసం ఫండ్ లను వివిధ రూపాల్లో సేకరించామని, 25 శాతం ఫండింగ్ ఎన్ఆర్బీ బేరింగ్ నుంచి సేకరించామని తెలిపాడు. సీఈఏటీ టైర్లు, టాటా మోటార్లు తమ బడ్జెట్ అవసరాల్లో ఐదవ వంతు, ఎనిమిద వంతు సహకరించినట్టు టీమ్ పేర్కొంది. ఐఐటీ బాంబే తనకు తాను మూడోవంతు ఈ ప్రాజెక్టుకు సహకరించింది. ఇతర ఫండ్స్ ను టెకనెక్టివిటీ, హార్నెస్ టెక్నాలజీస్, వెక్టార్, స్మాఆష్, ఇమాజినేరియం, ఏషియన్ పెయింట్స్ వంటి కంపెనీల ద్వారా సేకరించారు. ప్రధాని నరేంద్రమోదీ చొరవ తీసుకున్న ఎఫ్ఏఎమ్ఈ(ఫాస్టర్ అడాప్షన్ అండ్ మానుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్)కు ఇది సమాంతరంగా ఉంటుందని టీమ్ వెల్లడించింది.