ఒంగోలు టూటౌన్ : ‘అరటి చెట్లలో పోషకాలు లోపిస్తే ఎదుగుదల ఉండదు. దిగుబడి తగ్గుతుంద’ని ఉద్యానశాఖ ఏడీ బీ రవీంద్రబాబు(83744 49050) తెలిపారు. పోషక లోపాలను సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపడితే దిగుబడి పెరుగుతుందని పేర్కొన్నారు. పోషక లోపాలను ఎలా గుర్తించాలి, రైతులు తీసుకోవాల్సిన నివారణ చర్యలపై ‘సాక్షి’కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రశ్న : అరటిలో ఏఏ పోషకాలు లోపిస్తాయి?
జ : జింక్, బోరాన్, ఇనుము, మాంగనీస్ లాంటి సూక్ష్మ పోషకాలు లోపిస్తాయి.
ప్ర : జింకు లోపాన్ని గుర్తించడం ఎలా. నివారణ చర్యలేంటి?
జ : అరటి ఆకుల ఈనెల వెంట తెల్లని చారలు మొదలై ఆకులు పాలిపోతాయి. దీని నివారణకు మొక్కకు 10 గ్రాముల చొప్పున జింక్ సలే ్ఫట్‌ను భూమిలో వేయాలి. 2 గ్రా.జింక్ సల్ఫేట్‌ను లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
ప్ర : బోరాన్ లోపాన్ని ఎలా గుర్తించాలి. నివారణ మార్గాలు?
జ : ఆకులపై ఈనెలు ఉబ్బెత్తుగా తయారై, పెలుసుగా మారతాయి. ఆకులపై నిలువు చారలు ఏర్పడతాయి. దీని నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము బోరాక్స్ మందు కలిపి ఆకులపై 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
ప్ర : అన్నబేధి మందును ఏ ధాతు లోపానికి వాడతారు?
జ : ఇనుప ధాతు లోప నివారణకు వాడతారు. మొక్కలో ఇనుప ధాతువు లోపిస్తే లేత ఆకులపై తెలుపు చారలు ఏర్పడతాయి. చెట్టు ఎదుగుదల ఆగిపోతుంది. దీని నివారణకు 5 గ్రాముల అన్నబేధిని లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. మాంగనీస్ లోపిస్తే.. ముదురు ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు 2 గ్రాముల మాంగనీస్ సల్ఫేట్‌ను లీటరు నీటికి కలిపి ఆకులన్నీ తడిసేలా పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేస్తే లోపించిన పోషకాలు మెరుగుపడతాయి.
అరటిలో పోషక లోపం.. దిగుబడిపై ప్రభావం
Published Thu, Sep 25 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM
Advertisement
Advertisement