ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: అరకొర దిగుబడితో వరి రైతులు అల్లాడిపోతున్నారు. ఎకరాకు రూ.20 వేలు ఖర్చు చేసినా కనీసం రెండు పుట్లు కూడా ధాన్యం పండక పోవడంతో అప్పులపాలవుతున్నారు. ఇలాగైతే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. మండల పరిధిలోని కొత్తపల్లె పంచాయతీలో వందల ఎకరాల్లో వరి(జగిత్యాల) సాగు చేస్తున్నారు. కొందరు భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఎకరాకు 4-5 పుట్లు పండితే కానీ రైతుకు పెట్టుబడి రాదు. ఎకరాకు రూ.20 వేల ఖర్చుపెట్టినా ఎర్ర తెగులు ఆశించడంతో 15 రోజులకోసారి 5 సార్లు మందులు కొట్టాల్సి వస్తోంది. దీంతో ఖర్చు మరింత పెరిగింది. రైతు కుటుంబ సభ్యులే పనులు చేసుకుంటున్నా కూలీల అవసరం తప్పడంలేదు. మందులు కొట్టేందుకు, నాట్లు వేసేందుకు రోజుకు రూ.150 ఇవ్వాల్సి వ స్తోందని వాపోతున్నారు.
మరోవైపు పంట దిగుబడి బాగా వచ్చిందనుకుంటే వడ్లల్లో బియ్యం గింజలు లేక పోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 14 బస్తాల దిగుబడి రావడంతో కనీసం ఖర్చులు కూడా రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి రైతులకు ఏర్పడింది. అయినా ఏ అధికారి కానీ, ప్రభుత్వం కానీ ఆదుకోలేకపోయిందని అన్నదాతలుఆరోపిస్తున్నారు. పుట్టి వడ్లను గత ఏడాది రూ.6,800లకు విక్రయించగా ఈ ఏడాది ధర మరింత పడిపోయిందని వాపోతున్నారు. పొలాలను పరిశీలించిన అగ్రికల్చరల్ జాయింట్ డైరక్టర్ జయచంద్ర రైతుల పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు వెల్లడించారు.
గిట్టుబాటు ధర లేదు..పంట దిగుబడి లేదు
ఏడేళ్లుగా మూడెకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. నా భర్త సుబ్బరాయుడు, నేను, కుటుంబ సభ్యులంతా కలిసి పనిచేస్తున్నాం. ఎకరాకు రూ.22వేలుపైగానే ఖర్చయింది. ఈ ఏడాది ఎర్రతెగులు సోకడంతో నాలుగైదు సార్లు మందులు కొట్టాల్సి వచ్చింది. ఎకరాకు 5 పుట్లు పండితే ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం ఖర్చులు పోను కూళ్లు గిట్టుబాటు అవుతాయి. కౌలు చెల్లించడం కూడా ప్రస్తుత పరిస్థితిలో భారమైంది. ఎకరాకు 1040 కిలోల వడ్లు దిగుబడి వచ్చాయి. ఈ లెక్కన కనీసం రెండు పుట్లు కూడా దిగుబడి రాలేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.
ఎలా బతకాలి..!
Published Sat, Dec 7 2013 5:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM
Advertisement
Advertisement