‘చీరలంటే చీరలు... చీరల మీద చిలకలు/ రైకలంటే రైకలు... రైకల మీద రంగులు’
‘జానపదమైనా సరే–
‘అబ్బబ్బా దేవుడూ... అయోధ్య రాముడు సీతమ్మ నాథుడు...
శ్రీరామచంద్రుడు’... ఇలా ఆధాత్మికమైనా సరే–ఈ జనరేషన్ ఆ జనరేషన్ అనే తేడా లేకుండా ఆబాలగోపాలం కోలాటం సంబరాల సందడిలో ఉత్సాహతరంగమై ఎగరాల్సిందే.
తెలుగు వారి సాంస్కృతిక చిరునామాలలో ఒకటి... కోలాటం. కళ అనేది పుస్తకాల్లో కాదు ప్రజల మధ్య, ప్రజలతో ఉంటేనే నిత్యనూతనంగా వెలిగిపోతుంది. ఈ ఎరుకతో కోలాటానికి పూర్వ వైభవం తేవడానికి ముందుకు కదిలారు ప్రొద్దుటూరు మహిళలు.
కడప జిల్లా ప్రొద్దుటూరులోని మహిళలు కోలాట నృత్యానికి కొత్త హంగులను జోడించి ఆ కళకు మరింత ఆదరణ వచ్చేలా కృషి చేస్తున్నారు. బండి మల్లిక ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన మాస్టర్ సాయి భరత్ దగ్గర కోలాటంలో శిక్షణ తీసుకుంది. తనలాగే శిక్షణ తీసుకున్న దాదాపు నాలుగు వందలమందితో ‘సావిత్రి బాయి పూలే అభ్యుదయ మహిళా కోలాట బృందం’ ఏర్పాటు చేసింది.
అందరినీ ఒకే తాటి పైకి...
కోలాటం సంప్రదాయ స్ఫూర్తిని పదిలంగా కా΄ాడేలా పూలమాలలు, లెజిన్స్, భజన తాళాలు... మొదలైన వాటితో అన్నమాచార్య కీర్తనలతో నృత్యప్రదర్శనలు చేస్తూ కోలాటానికి కొత్త శోభను తీసుకువస్తున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో కోలాటం నేర్చుకున్న వారు ఎవరికి వారు బృందాలుగా వుండడంతో వారందరినీ ఒకేతాటిపై తీసుకువచ్చి కొత్తగా ఏదైనా సాధించాలనే ఆలోచన మల్లికకు వచ్చింది.
వండర్స్ బుక్ ఆఫ్ రికార్డ్‌లోకి దశావతార కోలాటం
పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల క్షేత్రంలో 222 మంది మహిళలు కోలాటంతో దశావతార జానపద నృత్య ప్రదర్శన చేశారు. ‘గోవిందుడేలరాడే.. గోపాలుడేలరాడే.. మా అయ్య ఏలరాడే..’ అనే పాటతో ఆకట్టుకున్నారు. ఈ ప్రదర్శన తో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ‘వండర్స్ బుక్ ఆఫ్ రికార్డ్’లో చోటు సాధించారు.
కాలంతో పాటు ప్రవహించాలి...
ప్రొద్దుటూరుకు మాత్రమే పరిమితం కాకుండా హైదరాబాద్, తిరుచానూరు, శ్రీకాళహస్తి, ఒంటిమిట్ట, అరుణాచలంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో, తిరుమల తిరుపతి ఆలయాల బ్రహ్మోత్సవాలలో తమ కోలాటంతో కనుల పండగ చేస్తున్నారు బృందం సభ్యులు.
‘కాలేజీలో పనిచేస్తూనే సాయంత్రం వేళల్లో, సెలవుల్లో కోలాటం నేర్చుకున్నాను. శారీరక, మానసిక ఉల్లాసానికి ఉపకరించే కళ ఇది. ్ర΄ాచీన జానపద కళలకు జీవం పోయాలనే లక్ష్యంతో కోలాటం ఆడుతున్నాం. ఈ కళ నిలువ నీరులా ఉండకూడదు. కాలంతోపాటు ప్రవహించాలి. ప్రతి తరం సొంతం చేసుకోవాలి’ అంటుంది ‘గౌతమి ఇంజినీరింగ్ కాలేజీ’లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న భూమిరెడ్డి నాగమణి.
ఇక అయోధ్య రాముడి దగ్గరికి...
‘దశావతారం’ కోలాట నృత్య ప్రదర్శనకు ప్రత్యేక గుర్తింపు లభించడం సంతోషంగా ఉంది. ప్రదర్శనల కోసం ఎవరి దగ్గరా డబ్బు తీసుకోకుండా సొంత ఖర్చులతో దేవస్థానాలలో ప్రదర్శనలు చేస్తున్నాం. బయట ఎక్కడా ప్రదర్శనలు చేయం. అయోధ్యలో కోలాటం ప్రదర్శన చేయడానికి అనుమతి కోసం ప్రయత్నిస్తున్నాం. ఈ తరం పిల్లలు కూడా కోలాటానికి దగ్గర కావాలి. ఏ కళా దానికి అదే దూరం కాదు. సంప్రదాయ కళలకు చేరువ కావడం అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. ఒక్కరిద్దరు కాకుండా కళాకారులందరూ ఐక్యంగా కృషి చేస్తే ఎంత అద్భుతం సృష్టించవచ్చో నిరూపించాం. – బండి మల్లిక
అరుణాచల కొండల్లో... అలుపెరగని కోలాటం
బండి మల్లిక నేతృత్వంలో తమిళనాడులోని అరుణాచలంలో గిరి ప్రదక్షణ సందర్భంగా ‘సావిత్రి బాయి పూలే కోలాట బృందం’లోని 111 మంది మహిళా కళాకారులు 14 కిలోమీటర్లు కోలాటాన్ని ప్రదర్శించారు. కోలాట కర్రలతో అన్నమయ్య, శివనామస్మరణ కీర్తనలకు లయబద్ధంగా నృత్యం చేశారు. సాయంత్రం 6.30 గంటలకు మొదలైన కోలాట నృత్యం మరుసటి రోజు ఉదయం 3.40 గంటల వరకు కొనసాగింది. ఏకధాటిగా తొమ్మిది గంటల పాటు గిరి నృత్య ప్రదక్షిణలో అలసిపోకుండా కోలాటం పూర్తి చేసిన వీరి ప్రతిభ ఉత్తర అమెరికాలోని ‘తానా బుక్ ఆఫ్ రికార్డు’ లో నమోదైంది. ‘భారత్ టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ లోనూ చోటు సాధించారు.
– మోపూరు బాలకృష్ణారెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప
ఫొటోలు: షేక్ మహబూబ్ బాషా,
ప్రొద్దుటూరు.
Comments
Please login to add a commentAdd a comment