అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జనవరి 22న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ నేపధ్యంలోనే జగద్గురు రామానందాచార్య స్వామి రామభద్రాచార్య అమృత మహోత్సవం అయోధ్యలో జనవరి 14 నుండి జనవరి 22 వరకు జరగనుంది.
ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని సహా పలువురు కళాకారులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో హేమమాలిని తన నృత్య ప్రదర్శను ఇవ్వనున్నారు. ఈ సంగతిని ఆమె ఒక వీడియో సందేశం ద్వారా తెలియజేశారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ రామ మందిర ప్రతిష్ఠాపన సమయంలో నేను అయోధ్యకు వెళ్తున్నాను. జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనతో అక్కడ ఒక భవ్యమైన ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
జనవరి 17న అయోధ్యలో జరిగే స్వామి రామభద్రాచార్యుల అమృత మహోత్సవ కార్యక్రమంలో రామాయణం ఆధారంగా ఉండే నృత్యరూపకాలన్ని ప్రదర్శించే అవకాశం తనకు లభించిందని పేర్కొన్నారు. కాగా అయోధ్యలో ఈరోజు (జనవరి 14) నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మాలినీ అవస్తి మొదటి రోజు కార్యక్రమంలో తన ప్రతిభను ప్రదర్శించనున్నారు.
జనవరి 22న జరిగే రామాలయ ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనవరి 22 మధ్యాహ్నం రామాలయంలోని గర్భగుడిలో రామ్‌లల్లాను ప్రతిష్టించాలని నిర్ణయించింది. రాముడి జన్మస్థలమైన అయోధ్య దేశ ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుంది.
Comments
Please login to add a commentAdd a comment