festivel
-
Guru Nanak Jayanti: కార్తీక పౌర్ణమి నాడే గురునానక్ జయంతి ఎందుకు చేస్తారంటే..
హిందువులు కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ నెలలో పూజలు, వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఇదే మాసంలోని ఈరోజు (నవంబర్ 15)కు ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజున దేవ్ దీపావళి, కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి మూడు పర్వదినాలు కలసి వచ్చాయి. అయితే కార్తీక పౌర్ణమి నాడే గురునానక్ జయంతిని ఎందుకు జరుపుకుంటారనే విషయానికి వస్తే..గురునానక్ జయంతి సిక్కులకు ఎంతో ముఖ్యమైన పండుగ. దీనిని సిక్కులు ప్రతి సంవత్సరం కార్తీక పూర్ణిమ రోజున జరుపుకుంటారు. దీనిని ‘గురుపర్వ’ లేదా ‘ప్రకాశ పర్వ’ అని కూడా అంటారు. సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ ఈరోజునే జన్మించారు. ఆయన సిక్కుల మొదటి గురువు. గురునానక్ జయంతి సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వస్తుంది. సిక్కులు గురునానక్ జయంతి వేడుకలను ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ రోజున గురుద్వారాలలో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు.ఈ సంవత్సరం సిక్కులు గురునానక్ దేవ్ 555వ జయంతిని జరుపుకుంటున్నారు. ఆయన 1469వ సంవత్సరంలో కార్తీక పూర్ణిమ రోజున జన్మించారని చెబుతుంటారు. అందుకే ప్రతీయేటా గురునానక్ జయంతిని కార్తీక పూర్ణిమ రోజున జరుపుకుంటారు. గురునానక్ జయంతికి రెండు రోజుల ముందు సిక్కులు ‘అఖండ పాత్’నిర్వహిస్తారు. గురుగ్రంథ సాహిబ్‌ను 48 గంటలపాటు నిరంతరం పఠిస్తారు.గురునానక్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న సిక్కులు ఈ రోజు ఉదయాన్నే నగర కీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్‌ను పల్లకిలో మోస్తూ, షాబాద్ కీర్తనను ఆలపిస్తూ నగరంలో ఊరేగింపు నిర్వహించారు. ఈరోజంతా గురుద్వారాలలో కీర్తనలు ఆలపించనున్నారు. గురునానక్ దేవ్ బోధనలపై సిక్కు మత పెద్దలు ఉపన్యసించనున్నారు.గురునానక్ జయంతి రోజున గురుద్వారాలలో ప్రత్యేక ‘లంగర్’(అన్నదానం) నిర్వహించనున్నారు. దీనిలో అన్ని మతాలవారు కలిసి భోజనం చేస్తారు. ఇది సమాజానికి సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సందేశాన్ని అందిస్తుంది. గురునానక్.. సమానత్వం, ప్రేమ, సేవ నిజాయితీలు అందరిలో ఉండాలనే సందేశాన్ని అందించారు. కులమతాలకు అతీతంగా అందరూ సోదరభావంలో మెలగాలని గురునానక్ తెలియజేశారు.ఇది కూడా చదవండి: Karthika Pournima: కార్తీక పౌర్ణమి విశిష్టత..! త్రిపుర పూర్ణిమ అని ఎందుకు పిలుస్తారు? -
అక్కడ కనిపించని దీపావళి వేడుకలు.. కారణమిదే..
దీపావళి వేడుకలను భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గురువారం(అక్టోబర్ 31) ఘనంగా చేసుకోనున్నారు. దీపావళి కోసం షాపింగ్ చేయడంతో సహా అన్ని సన్నాహాలు చాలా ముందుగానే ప్రారంభిస్తారు.దీపావళినాడు లక్ష్మీ దేవిని, గణేశుడిని పూజిస్తారు. అయితే మన దేశంలో దీపావళి జరుపుకోని కొన్ని ప్రదేశాలు ఉన్నాయని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఆ ప్రదేశాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి పండుగను దక్షిణ రాష్ట్రమైన కేరళలో జరుపుకోరు. కేరళలో కొచ్చిలో మాత్రమే దీపావళి జరుపుకుంటారు. కేరళలో దీపావళి జరుపుకోకపోవడానికి అనేక కారణాలున్నాయి.మహాబలి అనే రాక్షసుడు కేరళను పరిపాలించేవాడు. అతన్ని ఇక్కడి ప్రజలు పూజిస్తారు. దీపావళి ఒక రాక్షసుని ఓటమిని గుర్తు చేస్తూ చేసుకునే పండుగ కావడంతో దీనిని ఇక్కడి ప్రజలు జరుపుకోరు. రాముడు రావణుడిని ఓడించి, అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని దీపావళి చేసుకుంటారనే సంగతి అందరికీ తెలిసిందే. కేరళలో దీపావళి జరుపుకోకపోవడానికి రెండవ కారణం అక్కడ హిందువుల సంఖ్య తక్కువగా ఉండటం. అందుకే రాష్ట్రంలో దీపావళి సందడి కనిపించదు. కేరళతో పాటు తమిళనాడులో కూడా దీపావళి జరుపుకోరు. అక్కడ ప్రజలు నరక చతుర్దర్శిని వేడుకగా జరుపుకుంటారు. ఇది కూడా చదవండి: ‘మా సోషల్ మీడియాను రంగంలోకి దింపుతాం’ -
రెండవ రోజు వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
కర్నాటకలోని ఉడుపిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నిన్న ప్రారంభమైన వేడుకలు ఈరోజు (మంగళవారం) కూడా కొనసాగుతున్నాయి. యూపీలోని మధురలో నిన్న(సోమవారం) రాత్రి అత్యంత వేడుకగా శ్రీకృష్ణునికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. Shri Krishna Matha, Udupi 🙏#KrishnaJanmashtami pic.twitter.com/IBmWwwCudS— Visit Udupi (@VisitUdupi) August 26, 2024ఉడిపి శ్రీకృష్ణుని ఆలయంలో నేడు శ్రీకృష్ణ లీలోత్సవం అత్యంత వేడుకగా జరగనుంది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు శ్రీ కృష్ణ భక్తులు ఇప్పటికే ఉడుపికి తరలివచ్చారు. ఉత్సవాల్లో తొలి రోజున పలువురు చిన్నారులు బాలకృష్ణుని వేషధారణలో ఆలయంలో కనువిందు చేశారు. అలాగే రోజంతా స్వామివారి సమక్షంలో వివిధ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.#WATCH | Mathura, Uttar Pradesh: Aarti begins at Shri Krishna Janmasthan temple at the time of Shri Krishna Janma as the clock hits midnight pic.twitter.com/i80lWyaGb3— ANI (@ANI) August 26, 2024నేడు జరిగే శ్రీకృష్ణుని లీలోత్సవంలో బంగారు రథంలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఊరేగిస్తారు. ఈ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కానుంది. అలాగే మఠంలో భక్తులకు సంప్రదాయాలకు చిహ్నంగా నిలిచే వివిధ పోటీలను నిర్వహించనున్నారు.#WATCH | Manipur | Shri Krishn Janmashtami being celebrated at Shree Shree Govindajee Temple, in Imphal pic.twitter.com/nQXk2aGK3b— ANI (@ANI) August 26, 2024ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడి గోవిందరాజ ఆలయంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య జన్మాష్టమి వేడులను నిర్వహిస్తున్నారు. -
అయోధ్యలో కృష్ణాష్టమి వేడుకలకు సన్నాహాలు
అయోధ్యలోని నూతన రామాలయంలో తొలిసారిగా కృష్ణాష్టమి వేడుకలు జరగనున్నాయి. ఇందుకు ఘనంగా సన్నాహాలు జరుగుతున్నాయి. రామనగరిలోని మఠాలు, ఆలయాల్లో ఉత్సవశోభ నెలకొంది. నూతన రామాలయంలో బాలరాముని ప్రతిష్ఠ తరువాత జరుగుతున్న తొలి జన్మాష్టమి వేడుకలు ఇవి.జన్మాష్టమి నాడు రామ్‌లల్లాకు 50 కిలోల పంచామృతంతో అభిషేకం చేయనున్నారు. సాయంత్ర వేళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రామనగరి అయోధ్యలో కృష్ణభక్తి కూడా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో పురాతన కృష్ణ దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాలన్నింటిలో కూడా జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు.అయోధ్యలో రెండు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. బాలరాముని ఆస్థానంలో ఆగస్టు 26న జన్మాష్టమి వేడుకలు జరుపుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయోధ్యలోని గోకుల్ భవన్, బ్రిజ్మోహన్ కుంజ్, రాధా బ్రిజ్రాజ్ ఆలయం, రాజ్ సదన్ వద్ద ఉన్న రాధా మాధవ్ ఆలయం, గురుధామ్, ఇస్కాన్ ఆలయాల్లో జన్మాష్టమి వేడుకలకు సన్నాహాలు పూర్తయ్యాయి. -
నవమి వేళ.. శ్రీసీతారాముల విగ్రహ ప్రతిష్ఠ!
శ్రీరామ నవమి సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్గీర్ చంపా జిల్లాలోని కులీపోతా గ్రామంలో శ్రీసీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొంటున్నారు. చైత్ర నవరాత్రుల ప్రారంభం నుంచి ఇక్కడ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ దక్షిణముఖి హనుమాన్ 30 ఏళ్లుగా గ్రామంలో కొలువైవున్నాడన్నారు. ఇప్పుడు ఈ ఆలయ పునరుద్ధరణ జరిగిందని, ఏప్రిల్ 17న శ్రీరామ నవమి రోజున ఆలయ ప్రాంగణంలో శ్రీసీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుందని తెలిపారు. ఏప్రిల్ 16న కలశ స్థాపన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. శ్రీరామనవమి రోజున ఉదయం విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని, అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి పూర్ణాహుతి, మహా హారతి, ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 18 నుంచి అఖండ హరినామ సంకీర్తన ప్రారంభమవుతుందని, ఇది ఏప్రిల్ 25 వరకు కొనసాగుతుందని తెలిపారు. హనుమంతుని జయంతిని ఏప్రిల్ 23 న నిర్వహించనున్నామన్నారు. -
Ugadi 2024: క్రోధిని కార్యసాధనంగా మలచుకుందాం!
ఉగాది తెలుగువారి తొలిపండుగ. ప్రభవతో మొదలు పెట్టి అక్షయ వరకు తెలుగు సంవత్సరాలు 60. ఈ వరుసలో ఇప్పుడు మనం జరుపుకుంటున్న ఉగాదికి క్రోధి నామ సంవత్సర ఉగాది అని పేరు. క్రోధి అంటే కోపం కలవారని సామాన్యార్థం. క్రోధి అనే పదానికి కొన్ని నిఘంటువులు కోప స్వభావులైన కుక్క, దున్న΄ోతు అని అర్థం చెప్పినప్పటికీ, దానిని పరిగణనలోకి తీసుకోనక్కరలేదు. అన్ని స్వభావాల లాగే మనిషికి కోపం లేదా క్రోధం కూడా అవసరమే. మనకు ఎంత అవసరమో, అంతవరకు మాత్రమే కోపాన్ని ఉంచుకోవాలి. మిగిలిన దానిని నిగ్రహించుకోవాలి. ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రుడు కూడా కొన్ని సందర్భాలలో కోపించాడు. అలా మన జీవితాలకు అవసరమైన మేరకు మాత్రమే కోపాన్ని ఈ ఉగాది ఇస్తుందని, ఇవ్వాలనీ ఆశిద్దాం. ఉగాదితో చాంద్రమాన సంవత్సరం మొదలవుతుంది. పౌర్ణమిచంద్రుడు చిత్త లేదా చిత్ర నక్షత్రంతో కూడి ఉన్న మాసాన్ని చైత్రమాసంగా పిలుస్తారు. చైత్రమాసం తొలిరోజు అంటే చైత్రశుక్ల పాడ్యమి రోజు ఉగాది అవుతుంది. చంద్రుడు ఒక నక్షత్రంతో మొదలుపెట్టి, భూమి చుట్టూ తిరిగి మళ్లీ ఆ నక్షత్రం దగ్గరకు రావడానికి పట్టే కాలం నక్షత్రమాసం అవుతుంది. ఆ రోజు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. కాలానికి సూర్య, చంద్ర గమనాలుప్రాతిపదిక కాబట్టి ఈ మేరకు చాంద్ర–సౌర సంవత్సరం అవుతుంది. వ్యావహారిక శకానికి పూర్వం తొలిదశలో సప్తఋషులు నక్షత్ర సంవత్సరాన్ని, చాంద్ర–సౌర సంవత్సరాన్ని కలిపి పంచాంగాన్ని అమలులోకి తెచ్చారు. మూడు, ఐదు సంవత్సరాలలో వచ్చే అధికమాసాలను కలుపుకుని ఐదు సంవత్సరాలతో ఒక యుగం అని పంచాంగ పరంగా అమలు చేశారు. అప్పట్లో ఆ యుగం ఆరంభం శరత్ విషువత్, శరత్ ఋతువు లో ఉండేది. ఈ ఐదు సంవత్సరాల యుగంలో మొదటి సంవత్సరంలో మొదటి రోజు యుగాది అయింది; అదే ఉగాది అయింది. ఈ యుగం జ్యోతిష శాస్త్రానికి అనుగుణం గా కూడా రూపొందింది. ‘జ్యోతి’ అంటే నక్షత్రం అనీ ‘షం’ అంటే సంబంధించిన అనీ అర్థం. జ్యోతిషం అంటే నక్షత్రానికి సంబంధించినది అని అర్థం. చాంద్ర– సౌర గమనాలప్రాతిపదికన మన పంచాంగం నిర్మితమైంది. పంచాంగం ప్రకారం మనకు ఉగాది నిర్ణీతమైంది. విశ్వామిత్ర మహర్షి పంచాంగంలోనూ, కాలగణనంలోనూ కొన్ని ప్రతిపాదనలను, మార్పులను తీసుకు వచ్చాడు. ఆ తరువాత కాలక్రమంలో జరుగుతూ వచ్చిన ఖగోళమార్పులకు తగ్గట్లు గర్గ మహాముని సంవత్సరాదిని వసంత విషువత్కు మార్చాడు. ఆర్యభట్టు, వరాహమిహిరుడు దాన్నే కొనసాగించారు. అదే ఇప్పటికీ కొనసాగుతోంది. సాంప్రదాయిక సంవత్సరాన్ని లేదా ఆచార వ్యవహారాల కోసం సంవత్సరాన్ని చైత్రమాసంతో మొదలుపెట్టారు. వసంతం, వసంతంతోపాటు ఉగాది... ఈ రెండు ప్రాకృతిక పరిణామాల్ని మనం మన జీవితాలకు ఆదర్శంగా తీసుకోవాలి, వసంత ఋతువు రావడాన్ని వసంతావతారం అని కూడా అంటారు. వసంతావతారం సంవత్సరానికి ఉన్న అవతారాలలో గొప్పది, ఆపై శోభాయామానమైంది. సంవత్సరానికి శోభ వసంతం. వసంతం మనకు వచ్చే ఋతువుల్లో ప్రధానమైంది లేదా కేంద్రభాగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, చెట్లకు కొత్త చివుళ్లు, కోయిలల గానాలు, పచ్చదనం, పువ్వుల కళకళలను తీసుకు వచ్చేది వసంతమే. అందుకే వసంతంలో ఎక్కువ వేడి, చలి ఉండవు. వాతావరణం ఉల్లాసకరంగా ఉంటుంది. వసంతం శ్రేష్ఠమైంది కాబట్టే శ్రీకృష్ణుడు భగవద్గీతలో తాను ఋతువుల్లో వసంతాన్ని అని చె΄్పాడు. నాటి కవులు, పండితులు మొదలుకొని కళాకారుల వరకు అందరికీ వసంత రుతువంటేనే మక్కువ. వసంతాన్ని కుసుమాకరం అనీ, కుసుమాగమం అనీ అంటారు. కుసుమానికి పుష్పం, పండు, ఫలం అని అర్థాలు ఉన్నాయి. ఈ మూడూ మనకు ఎంతో అవసరం అయినవి. తప్పకుండా మనం వీటిని పొందాలి. మన జీవితాలు కూడా నిండుగా పుష్పించాలి, పండాలి, ఫలవంతం అవ్వాలి. వసంతాన్ని ప్రకృతి ఇస్తున్న సందేశంగా మనం గ్రహించాలి. వసంతం ఒక సందేశం దాన్ని మనం అందుకోవాలి, అందుకుందాం. సంవత్సరంలో ఉండే మంచితనం వసంతం. వసంతం ప్రకృతి నుంచి మనకు అందివచ్చే మంచితనం. ‘...సంతో వసంతవల్లోకహితం చరంతః ...‘ అని వివేక చూడామణిలో జగద్గురు ఆదిశంకరాచార్యులవారు అన్నారు. అంటే మంచివాళ్లు వసంతంలాగా లోకహితాన్ని ఆచరిస్తారు అని అర్థం. వసంతం వంటి హితం. హితం వంటి వసంతం మనకు, సంఘానికి, దేశానికి, ప్రపంచానికి ఎంతో అవసరం. శుభానికి తొలి అడుగుగా, మంచితనానికి మారు పేరుగా అన్ని ఆరంభాలకూ ఆది అయిన తొలి పండుగగా ఉగాదికి విశిష్టత ఉంది. ఇతర పండుగలలా కాకుండా ఉగాది కాలానికి, ప్రకృతికి సంబంధించిన పండుగ. మనిషి కాలానికి, ప్రకృతికి అనుసంధానం అవ్వాలని తెలియజెప్పే ఒక విశిష్టమైన పండుగ. ఆరు ఋతువులకు ఆదిగా వచ్చేది ఈ పండుగ. సంవత్సరంలోని ఆరు ఋతువులకు ప్రతీకలుగా తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపుల్ని తీసుకుని ఆ రుచుల కోసం కొత్త బెల్లం, మిరియాల΄÷డి, వేపపువ్వు, మామిడి పిందెలు, ఉప్పు, కొత్త చింతపండు కలిపి తయారు చేసిన ఉగాది పచ్చడిని మనం తీసుకుంటున్నాం. నింబకుసుమ భక్షణం అని దీనికి పేరు. ఇది ఉగాది పండుగలో ముఖ్యాంశం. మరో ముఖ్యాంశం పంచాంగశ్రవణం. ఆదిలోనే ఎవరి రాశి ప్రకారం వారికి సంవత్సరంలో జరగడానికి అవకాశం ఉన్న మేలు, కీడులను ఆయా రాశి గల వ్యక్తులకు సూచన్రపాయంగా పంచాంగం తెలియచెబుతుంది. పంచాంగ శ్రవణానికి ముందుగా మనం అభ్యంగన స్నానం చేసి, మామిడి తోరణాలతో, పుష్పాలతో ఇళ్లను అలంకరించుకుని దైవపూజ చెయ్యాలి. ప్రకృతి ఇచ్చిన సందేశాలుగా అందివచ్చిన ఉగాదిని, వసంతాన్ని ఆకళింపు చేసుకుని, ఆదర్శంగా తీసుకుని, మనం మనకు, ఇతరులకు ఈ ఏడాదిలోని అన్ని ఋతువుల్లోనూ హితకరం అవుదాం. కాలం ఒక ప్రవాహం కాలం నదిలాంటిది. ముందుకు ప్రవహిస్తుందే కానీ, వెనక్కి తిరగదు. అలా ముందుకు ప్రవహించే నదిలో ఎన్నో సెలయేర్లు, వాగులు, వంకలు కలిసి ఉన్నట్టే... కాలవాహినిలో తృటి, క్షణం, ముహూర్తం, దినం మొదలైన కాలగతి సూచికలు మిళితమై ఉంటాయి. వీటిన్నింటి మేలు కలయికే కాల ప్రవాహం. ఇటువంటి కాలాన్ని ఉగాది రూపంలో ఆరాధించాలన్నదిప్రాచీనుల నిర్దేశ్యం. ప్రతి కొత్త సంవత్సరం శుభపరంపరలతో కొనసాగాలని కోరుకోవడంతోపాటు శుభాచరణకు మనల్ని మనం సమాయత్తం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఆరు రుచులలో అనేక అర్థాలు ఉగాదికి సంకేతంగా చెప్పుకునే ఆరు రుచుల కలయికలో అనంతమైన అర్థముంది. ప్రకృతి లేనిదే జీవి లేదు. జీవి లేని ప్రకృతి అసంపూర్ణం. కాబట్టి సరికొత్త ప్రకృతి అందించే తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు రుచుల సమ్మేళనంతో తయారయ్చే ఉగాది పచ్చడి సేవనం ఆరోగ్యదాయకం. జీవితమంటే కేవలం కష్టాలు లేదా సుఖాలే కాదు, అన్ని విధాలైన అనుభవాలూ, అనుభూతులూ ఉంటాయి, ఉండాలి! అలా ఉన్నప్పుడే జీవితానికి అర్థం పరమార్థం. ఈ సత్యాన్ని బోధిస్తూనే ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఉగాది పచ్చడి. పంచాంగ శ్రవణ ఫలమేమిటి? ఉగాదినాటి పంచాంగ శ్రవణం గంగాస్నాన ఫలంతో సమానమని శాస్త్రం చెబుతోంది. అంతేకాదు. ఉగాది పంచాంగ శ్రవణం వల్ల. భూమి, బంగారం, ఏనుగులు, గోవులతో కూడిన సర్వలక్షణ లక్షితమైన కన్యను యోగ్యుడైన వరునకు దానం చేస్తే కలిగే ఫలంతో సమానమైన ఫలాన్నిస్తుందని శాస్త్రోక్తి. వీటితోపాటు సంవత్సరానికి అధిపతులైన రాజాది నవనాయకుల గ్రహఫలితాలను శాస్త్రోక్తంగా వినడం వల్ల గ్రహదోషాలు నివారితమై , వినేవారికి ఆరోగ్యాన్ని, యశస్సును, ఆయుష్షునూ వృద్ధి చేసి, సంపదతో కూడిన సకల శుభఫలాలనూ ఇస్తుందంటారు పెద్దలు. కాబట్టి ఉగాదినాడు పంచాంగ ఫలాలను తెలుసుకోవడం వల్ల భవిష్యత్ కార్యాచరణను చేపట్టవచ్చు. నూతనత్వానికి నాంది బ్రహ్మదేవుడు సృష్టినిప్రారంభించినదీ, ప్రజానురంజకంగా పాలించిన శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగినదీ, వెయ్యేళ్లపాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినదీ, శకకారుడైన శాలివాహనుడు కిరీట ధారణ చేసినదీ, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తిన పీఠాన్ని అధిష్ఠించిందీ ఉగాదినాడేనని చారిత్రక, పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి నూతనకార్యాలుప్రారంభించడానికి ఉగాదిని మించిన శుభతరుణం మరొకటి లేదనే కదా అర్థం. – డి.వి.ఆర్. భాస్కర్ -
అయోధ్యలో హోలీ వేడుకలు.. రంగుల్లో రామ్‌లల్లా!
రామ్‌లల్లా అయోధ్యలోని నూతన రామాలయంలో కొలువైన దరిమిలా తన మొదటి హోలీని జరుపుకుంటున్నాడు. రంగుల పండుగ సందర్భంగా బాలరాముని మనోహర విగ్రహం పూలతో అలంకృతమయ్యింది. బాలరాముని నుదిటిపై గులాల్ పూశారు. గులాబీ రంగు దుస్తులతో రామ్‌లల్లా విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. హోలీ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు రామ్‌లల్లాను దర్శించుకునేందుకు ఆలయంలో బారులతీరారు. రంగుల పండుగ హోలీ సందర్భంగా ఆలయ ట్రస్టు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ధార్మిక నగరి అయోధ్యలో ఎక్కడ చూసినా హోలీ సందడి కనిపిస్తోంది. అయోధ్యలో గత ఏకాదశి నుంచి హోలీ వేడుకలు ప్రారంభమయ్యాయి. రామనగరిలో కొలువైన దేవతలు, రుషులకు రంగులు పూశారు. రాముని పరమ భక్తుడైన హనుమంతునికి కూడా హోలీ రంగులను పూశారు. -
10 పాయింట్లలో బీహార్ గొప్పతనం!
ప్రతియేటా మార్చి 22న బీహార్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రాష్ట్రం పేరు వినగానే ఇదొక వెనుకబడిన ప్రాంతమనే భావన అందరిలో కలుగుతుంది. అయితే బీహార్‌కు చెందిన కొన్ని విషయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద వైఫై జోన్ బీహార్ రాజధాని పట్నాలో ఉంది. ఇది దాదాపు 20 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీని సాయంతో పాట్నా నిట్ నుండి దానాపూర్ వరకు జనం ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుకోవచ్చు. పేదరికపు కొలిమిలో శ్రమించిన మనుషులు మహనీయులు అవుతారని ఎవరో చెప్పినది బీహార్‌ను చూస్తే నిజమనిపిస్తుంది. బీహార్‌లో పేదరికం తాండవిస్తున్నప్పటికీ, ఈ రాష్ట్రం నుండి చాలా మంది ఉన్నతాధికారులుగా మారారు. దేశంలోని పలువురు ఐఏఎస్‌లు, బ్యాంకు పీవోలు బీహార్ నుండి వచ్చినవారే కావడం విశేషం. ప్రాచీన కాలంలో బీహార్‌ను మగధ అని పిలిచేవారు. అలాగే రాజధాని పట్నాను పాటలీపుత్ర పేరుతో పిలిచేవారు. బ్రిటిష్ కాలంలో క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్రాలలో బీహార్ ఒకటి. అదే సమయంలో మహాత్మా గాంధీ బీహార్‌లోని చంపారణ్ నుండి స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రారంభించారు. దీనిని చంపారణ్ ఉద్యమం అని పిలుస్తారు. సున్నా లేని గణితానికి విలువ లేదు. ఈ సంగతి ప్రపంచమంతటికీ తెలుసు. సున్నాను కనిపెట్టిన ఆర్యభట్ట బీహార్లోనే జన్మించారు. బాలీవుడ్‌కు గర్వకారణంగా నిలిచిన నటుడు పంకజ్ త్రిపాఠి బీహార్‌కు చెందినవారే. అలాగే దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా బీహార్‌కు చెందినవారే. బీహార్‌కి చెందిన తినుబండారం లిట్టీ చోఖా ఎంతో ఫేమస్ అయ్యింది. వెజ్ మొదలుకొని నాన్ వెజ్ వరకు బీహార్‌లో చాలా వంటకాలు అందుబాటులో ఉంటాయి. బీహార్‌లో జరిగే ఛత్ పండుగ యావత్ దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రపంచంలో అస్తమించే సూర్యుణ్ణి కూడా ఆరాధించే ఏకైక పండుగ ఇదే. బీహార్‌కు చెందిన మిథిల పెయింటింగ్ ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందింది. దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బీహార్లోనే జన్మించారు. -
మకర సంక్రాంతికి ఏ రాష్ట్రంలో ఏంచేస్తారు?
దేశవ్యాప్తంగా నేడు మకర సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన ఈ తరుణం నుంచి హిందువులు శుభకార్యాలను ప్రారంభిస్తారు. మకర సంక్రాంతి నాడు చేసే గంగాస్నానం, దానధర్మాలు, పూజలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మకరసంక్రాంతి నాడు ఏ రాష్ట్రాల్లో ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. పంజాబ్ పంజాబ్‌లో మకర సంక్రాంతిని మాఘీగా జరుపుకుంటారు. తెల్లవారుజామున నదీస్నానం చేస్తారు. ఈ రోజున నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని, పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. మాఘి నాడు శ్రీ ముక్త్సార్ సాహిబ్‌లో భారీ జాతర నిర్వహిస్తారు. తమిళనాడు దక్షిణ భారతదేశంలో మకర సంక్రాంతిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. దీనిని తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు. నాలుగు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు భోగి పొంగల్, రెండవ రోజు సూర్య పొంగల్, మూడవ రోజు మట్టు పొంగల్, నాల్గవ రోజు కన్యా పొంగల్ నిర్వహిస్తారు. పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో ఈ పండుగ సందర్భంగా గంగాసాగర్ వద్ద జాతర నిర్వహిస్తారు. స్నానం చేసిన తర్వాత నువ్వులను దానం చేస్తారు. ఈ రోజున యశోదమాత.. శ్రీ కృష్ణుడిని దక్కించుకునేందుకు ఉపవాసం చేశారని చెబుతారు. అలాగే ఈ రోజునే గంగామాత భగీరథుడిని అనుసరిస్తూ, గంగా సాగర్‌లోని కపిలముని ఆశ్రమాన్ని చేరిందని అంటారు. కేరళ కేరళలో సంక్రాంతిని మకర విళక్కు పేరుతో నిర్వహిస్తారు. శబరిమల ఆలయానికి సమీపంలో ఆకాశంలో మకర జ్యోతిని భక్తులు సందర్శిస్తారు. కర్ణాటక కర్నాటకలో సంక్రాంతిని ‘ఏలు బిరోదు’ అనే పేరుతో జరుపుకుంటారు. స్థానిక మహిళలు.. చెరకు, నువ్వులు, బెల్లం, కొబ్బరిని ఉపయోగించి చేసిన వంటకాన్ని చుట్టుపక్కలవారికి పంచిపెడతారు. గుజరాత్ మకర సంక్రాంతిని గుజరాతీలో ఉత్తరాయణం అని అంటారు. రెండు రోజుల పాటు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. గాలిపటాలను ఎగురవేస్తారు. ప్రత్యేక వంటకాలను తయారుచేస్తారు. ఇది కూడా చదవండి: మొదలైన జల్లికట్టు.. తమిళనాట సందడే సందడి! -
గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు? శ్రీరామునితో సంబంధం ఏమిటి?
సూర్య భగవానుని గొప్పదనాన్ని గుర్తుచేసుకునే పండుగే మకరసంక్రాంతి. ఈ రోజున స్నానం చేసి, సూర్యభగవానుని పూజించి, దానాలు చేస్తారు. మకర సంక్రాంతి పండుగను మన దేశంలో చాలా పేర్లతో పిలుస్తారు. తమిళనాడులో పొంగల్, గుజరాత్లో ఉత్తరాయణం, పంజాబ్‌లో లోహ్రీ, అస్సాంలో భోగాలి, బెంగాల్లో గంగాసాగర్, ఉత్తరప్రదేశ్‌లో ఖిచ్డీ, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అని పిలుస్తారు. సంక్రాంతి నాడు ఆకాశంలో గాలిపటాలు ఎగురుతూ కనిపిస్తాయి. పతంగుల పోటీలు జరుగుతుంటాయి. ఒకరి గాలిపటాన్ని మరొకరు కట్ చేసేందుకు ప్రయత్నిస్తూ వినోదిస్తారు. పిల్లలే కాదు పెద్దలు కూడా ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేస్తారు. అయితే సంక్రాంతిరోజున గాలిపటాలు ఎగురవేయడం వెనుక ఉద్దేశం ఏమిటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక పలు ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి మీకు తెలుసా? మకర సంక్రాంతి నాడు గాలిపటాలు ఎగురవేయడం వెనుక పలు శాస్త్రీయ కారణాలున్నాయి. బహిరంగ ప్రదేశంలో ఆకాశంలో గాలిపటాలు ఎగురవేయడం ద్వారా మనకు సూర్యుని నుండి విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ డి మన శరీరానికి ఎంతో అవసరం. అంతేకాకుండా ఎండలో నిలుచుని గాలిపటాలు ఎగురవేయడం ద్వారా మనకు చలినుంచి రక్షణ దొరుకుతుంది. శరీరాన్ని వ్యాధుల బారి నుండి రక్షించుకోవచ్చు. మకర సంక్రాంతి వేళ గాలిపటాలు ఎగురవేయడం వెనుక మతపరమైన కారణాలు కూడా ఉన్నాయి. ఇతిహాసాలలోని వివరాల ప్రకారం మకర సంక్రాంతి నాడు గాలిపటాలు ఎగురవేసే సంప్రదాయాన్ని శ్రీరాముడు ప్రారంభించాడు. శ్రీరాముడు తొలిసారి గాలిపటం ఎగురవేసినప్పుడు, ఆ గాలిపటం ఇంద్రలోకానికి వెళ్లింది. నాటి నుంచి శ్రీరాముడు ప్రారంభించిన సంప్రదాయాన్ని హిందువులు భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నారు. మకర సంక్రాంతి రోజున పతంగులు ఎగురవేయడం, ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం ద్వారా సౌభ్రాతృత్వం, సంతోషం వెల్లివిరుస్తాయి. గాలిపటం అనేది ఆనందం, స్వేచ్ఛ, ఐశ్వర్యానికి చిహ్నమని చెబుతుంటారు. ఇది కూడా చదవండి: పతంగుల పరిశ్రమ వృద్ధిలో ప్రధాని మోదీ పాత్ర ఏమిటి? -
అయోధ్యలో నటి హేమమాలిని నృత్య ప్రదర్శన!
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జనవరి 22న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ నేపధ్యంలోనే జగద్గురు రామానందాచార్య స్వామి రామభద్రాచార్య అమృత మహోత్సవం అయోధ్యలో జనవరి 14 నుండి జనవరి 22 వరకు జరగనుంది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని సహా పలువురు కళాకారులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో హేమమాలిని తన నృత్య ప్రదర్శను ఇవ్వనున్నారు. ఈ సంగతిని ఆమె ఒక వీడియో సందేశం ద్వారా తెలియజేశారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ రామ మందిర ప్రతిష్ఠాపన సమయంలో నేను అయోధ్యకు వెళ్తున్నాను. జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనతో అక్కడ ఒక భవ్యమైన ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. జనవరి 17న అయోధ్యలో జరిగే స్వామి రామభద్రాచార్యుల అమృత మహోత్సవ కార్యక్రమంలో రామాయణం ఆధారంగా ఉండే నృత్యరూపకాలన్ని ప్రదర్శించే అవకాశం తనకు లభించిందని పేర్కొన్నారు. కాగా అయోధ్యలో ఈరోజు (జనవరి 14) నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మాలినీ అవస్తి మొదటి రోజు కార్యక్రమంలో తన ప్రతిభను ప్రదర్శించనున్నారు. జనవరి 22న జరిగే రామాలయ ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనవరి 22 మధ్యాహ్నం రామాలయంలోని గర్భగుడిలో రామ్‌లల్లాను ప్రతిష్టించాలని నిర్ణయించింది. రాముడి జన్మస్థలమైన అయోధ్య దేశ ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుంది. -
ఐక్యతకు ప్రతీక మొహర్రం..!
సత్యసాయి: హిందూముస్లింల ఐక్యతకు ప్రతీకగా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మొహర్రం వేడకలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామాల్లోని చావిడిలో పీర్లను కొలువుదీర్చి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. గుండం తవ్వకంతో మొదలు.. గ్రామాల్లో గుండం తవ్వకాలతో మొహర్రం వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం ప్రత్యేక ప్రదేశాల్లో భద్రపరచిన పీర్లను వెలికి తీసి శుభ్రం చేసి ప్రత్యేకంగా అలంకరించి 5వ రోజు చావిడిలో ప్రతిష్టిస్తారు. చావిడి వద్ద గుండంలో టన్నుల కొద్దీ కట్టెలు వేసి నిప్పంటిస్తారు. ముజావర్ల ఆధ్వర్యంలో ఆరాధన ప్రక్రియను నిర్వహిస్తారు. మొదటి ఐదు రోజులు చావిడిలో పీర్లను కొలువుదీర్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. 7వ రోజు చిన్న సరిగెత్తు నిర్వహించి పీర్ల గ్రామోత్సవం చేస్తారు. పదో రోజు పెద్ద సరిగెత్తులో భాగంగా పానకాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అదే రోజు వైభవంగా దీపారాధన ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28న పెద్ద సరిగెత్తును అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అదే రోజు ఉపవాస దీక్షలతో అగ్ని గుండం ప్రవేశం చేస్తారు. అనంతరం నిప్పుల గుండం పూడ్చి దానిమ్మ, తదితర పండ్ల మొక్కలు నాటడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. మొహర్రంతో నూతన సంవత్సరం ఆరంభం మొహర్రం అంటే ఉర్దూలో త్యాగం, క్షమాపణ అని అర్థం. ఇస్లాం ధర్మం ప్రకారం మొహర్రం నుంచి ఇస్లామిక్ క్యాలెండర్ ఆరంభమవుతుంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం.. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం ఈ నెల 19న ప్రారంభమై 29తో ముగుస్తుంది. ఇస్లాం ధర్మ పరిరక్షణలో భాగంగా ఇమామ్, హుస్సేన్, తదితర వీరుల సంస్మరణార్థం మొహర్రం నిర్వహిస్తున్నట్లు ముస్లిం మతపెద్దలు చెబుతున్నారు. క్రీ.శ.14వ శతాబ్దంలో ఇరాక్‌లోని కర్బలా ప్రాంతంలో శాంతి స్థాపనకు చేసిన యుద్ధంలో వారు తమ ప్రాణ త్యాగం చేసినట్లుగా చరిత్ర చెబుతోంది. దీంతో అప్పటి నుంచి మొహర్రంను ముస్లింలు సంతాప దినాలుగా నిర్వహిస్తున్నారు. -
సోషల్ మీడియాలో అరకు ఎంపీ వ్యంగ్యాస్త్రం
తొలిరోజు ఏర్పాటుచేసిన బెలూన్లు.. 16 గాలిలోకి ఎగిరిన బెలూన్లు.. 13 రైడ్‌కి వెళ్లిన పర్యాటకులు.. 30మంది చూసేందుకు వచ్చిన వీక్షకులు.. 50 నుంచి 60మంది ప్రదర్శన సాగిన సమయం.. అరగంటలోపే బందోబస్తులో ఉన్న పోలీసులు.. 1000 మంది మొత్తం ఫెస్టివల్ ఖర్చు.. సుమారు రూ.5 కోట్లు ..ఈ లెక్క చూస్తేనే అరకు లోయలో బెలూన్ ఫెస్టివల్ ఏస్థాయిలో జరిగిందో అర్థమవుతుంది. అర్ధగంట సంబరానికి ఐదు కోట్లు ఖర్చు చేసిన పాలకుల నిర్వాకం ఇప్పుడు విమర్శల పాలవుతోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్ కోసం పాకులాడిన పాలకులు.. వాతావరణ సూచనలను సైతం పట్టించుకోకపోవడంతో ఆహ్లాదకరంగా సాగాల్సిన అరకులో తలపెట్టిన బెలూన్ ఉత్సవాలు కాస్త ఉసూరుమనిపించాయి. మంగళవారం తొలిరోజే మొక్కుబడిగా సాగిన ఉత్సవంలో అరగంట సేపే.. అదీ 13 బెలూన్లే ఎగిరాయి. ఆ తర్వాత రెండు రోజులూ ఈదు రు గాలులు, చిరుజల్లులతో మొత్తం కార్యక్రమాలు రద్దయ్యాయి. ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా అరకులోయ వంటి ప్రదేశాల్లో రైడింగ్ సురక్షితం కాదని మొదటిరోజే భావించిన బెలూనిస్టులు ఆ తర్వాత రైడింగ్‌కు ఏమాత్రం ప్రయత్నించలేదు. అల్పపీడనం ఉందని చెప్పినా.. బెలూన్ ఫెస్టివల్ జరిగే మూడురోజుల పాటు ప్రతికూల వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉపరితలం నుంచి ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తాల్లో గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఉత్సవాల ప్రారంభానికి ఐదురోజుల ముందే ప్రకటించారు. అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని, ఫలితంగా గగనతలంలోనే గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని ముందుగానే స్పష్టం చేశారు. హాట్ ఎయిర్ బెలూన్లు సముద్రమట్టానికి ఐదు వేల అడుగుల ఎత్తు వరకు పయనిస్తాయని నిర్వాహకులు చెప్పిన నేపథ్యంలో అక్కడ ఉధృతంగా ఉండే గాలుల ప్రభావంతో అవి అదుపు తప్పే ప్రమాదం ఉంటుందని నిపుణులు ముందుగానే అభిప్రాయపడ్డారు. ఈశాన్య గాలులు బలంగా వీస్తుండడం వల్ల హాట్ ఎయిర్ బెలూన్లు కొండ, కోనల నడుమ ఎత్తులో విహరించడం అంత శ్రేయస్కరం కాదని, వీటిని నియంత్రించడం కూడా కష్టమని ముందుగానే పేర్కొన్నారు. పైగా మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఈ ప్రాంతంలో భద్రతాపరంగా కూడా సమస్యలు ఎదురవుతాయన్న అభిప్రాయమూ వ్యక్తమైంది. కానీ ప్రభుత్వం గానీ, అధికారులు గానీ ఏమాత్రం పట్టించుకోకుండా అట్టహాసంగా ఏర్పాట్లు చేసేశారు. విదేశాల నుంచి వచ్చిన బెలూనిస్టుల కోసం కొత్తబల్లుగూడ వద్ద 42 టెంట్లతో పాటు కాన్ఫరెన్స్, డైనింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు ఖర్చు చేశామని పర్యాటకశాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీరాములు నాయుడు చెప్పినప్పటికీ రెవెన్యూ శాఖ వాటాతో కలిపి రూ.5కోట్లు దాటిందని అంచనా. మంత్రి అఖిల ప్రియతోనే సరి... ఇక ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి హాజరవుతామని చెబుతూ వచ్చిన జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు తొలిరోజు డుమ్మా కొట్టారు. రెండో రోజు బుధవారం మంత్రి గంటా శ్రీనివాసరావు వస్తారని చెప్పినప్పటికీ చివరి నిమిషంలో పర్యటన వాయిదా పడింది. ఇక మూడో రోజు గురువారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు విచ్చేస్తారని సమాచారం ఇచ్చినప్పటికీ వర్షం కారణంగా రద్దయిందని మళ్లీ ప్రకటించారు. ఇక గురువారం సాయంత్రం ముగింపు కార్యక్రమాలకు గంటాను వెళ్లమని సీఎం చెప్పినప్పటికీ వాతావరణం అనుకూలించక ఆయన పర్యటనా రద్దయింది. సాయంత్రానికి పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ మాత్రం వచ్చారు. మొత్తంగా ప్రభుత్వ పెద్దలు, కనీసం జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకుండానే మూడురోజుల పండుగను తూతూ మంత్రంగా గురువారం రాత్రి ముగించేశారు. ఆదిలోనే హంసపాదు.. ప్రతికూల వాతావరణం పెద్దగా లేని తొలిరోజు మంగళవారమే బెలూన్ ఫెస్టివల్ అట్టర్ ఫ్లాఫ్ అయింది. ముందుగా ఎవరికీ అవగాహన కల్పించకపోవడం, సోషల్ మీడియాలో తప్ప పెద్దగా ప్రచారం చేయకపోవడంతో తొలిరోజే తూతూ మంత్రంలా సాగింది. 13 దేశాల నుంచి వచ్చిన బెలూనిస్టులు 16 హాట్ ఎయిర్ బెలూన్లను ఏర్పాటు చేసినప్పటికీ 13 బెలూన్లు మాత్రమే గాలిలోకి లేచాయి. మిగిలిన మూడు సాంకేతిక కారణాలతో ఓపెన్ కాలేదు. 13 బెలూన్లలో ఒక్కో బెలూన్‌లో ఇద్దరు, ముగ్గురు చొప్పున మొత్తం 30 మందిని మాత్రమే రైడ్‌కి తీసుకువెళ్లారు. కనీసం సందర్శకులు కూడా లేక ఆ ప్రాంతం వెలవెలబోయింది. 50నుంచి 60మంది సందర్శకులు మాత్రమే విచ్చేశారు. చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు కూడా పెద్దగా రాలేదు. కానీ పోలీసులు మాత్రం అడుగడుగునా కనిపించారు. ఏజెన్సీలో జరుగుతున్న ఈ ఫెస్టివల్ బందోబస్తుకు బెటాలియన్ పోలీసులతో సహా వెయ్యిమందికిపైగా బందోబస్తుకు కేటాయించారు. థ్యాంక్స్ టూ ఏపీ గవర్నమెంట్ సోషల్ మీడియాలో అరకు ఎంపీ వ్యంగ్యాస్త్రం అరకు ఏజెన్సీ ప్రమోషన్ పేరిట జరిగిన ఈ బెలూన్ ఫెస్టివల్‌కు కనీసం అరకు ప్రాంత ప్రజాప్రతినిధులకైనా సమాచారం ఇవ్వలేదు. మంత్రులు, ముఖ్యమంత్రి రాక కోసం తీవ్రంగా పరితపించిన అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులకు కనీస మాత్రంగా కూడా ఆహ్వానించలేదు. దీనిపై అరకు ఎంపీ కొత్తపల్లి గీత బాహటంగానే సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మా ప్రాంతంలో జరుగుతున్న బెలూన్ల పండుగకు ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా ఆహ్వానమూ లేదూ.. కనీసం సమాచారమూ లేదు.. థ్యాంక్స్ టూ ఏపీ గవర్నమెంట్ . అని ఆమె పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. గాలిదే భారం సాక్షి, విశాఖపట్నం: ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న అరకు బెలూన్ ఫెస్టివల్‌కు ప్రకృతి బ్రేకులు వేసింది. ఈ నెల 14న తొలిరోజు అరకొర, అపశ్రుతుల మధ్య బెలూన్ల పండగ గంట సేపటికే పరిమితమైంది. మర్నాడు బుధవారం వర్షం కారణంగా నిర్వాహకులు బెలూన్లు ఎగురవేసే సాహసం చేయలేకపోయారు. దీంతో ముగింపు రోజైన గురువారమైనా బెలూన్లతో సందడి చేయాలనుకున్న బెలూనిస్టులకు వరుణుడు ఆ అవకాశం ఇవ్వలేదు. ఇలా రూ.కోట్ల రూపాయలు వెచ్చించి మూడు రోజులు అట్టహాసంగా నిర్వహించాలనుకున్న అరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ సందడి లేకుండానే ముగిసింది. పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ గురువారం సాయంత్రం అరకులోయ వెళ్లారు. వాతావరణం అనుకూలిస్తే శుక్రవారం ఉదయమైనా బెలూన్లను ఎగురవేయించాలని నిర్వాహకులను కోరారు. గాలులు, వర్షం లేనిపక్షంలో బెలూన్లు గాలిలోకి పంపడానికి అంగీకరించినట్టు పర్యాటకశాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీరాములునాయుడు ‘సాక్షి’కి చెప్పారు. దీంతో శుక్రవారం వరుణుడు కరుణ కోసం వీరంతా ఎదురు చూస్తున్నారు. -
బెలూన్ పండుగ..బుడగేనా!
అంతర్జాతీయ ఫెస్టివల్..దక్షిణ భారతంలోనే మొదటిసారి నిర్వహణ.. మూడు రోజులపాటు ఆకాశంలో విహరించనున్న సాహసికులు.. ఇలా ఎంతో హడావుడి చేశారు.. తీరా ప్రారంభోత్సవానికి మాత్రం ప్రముఖులంతా డుమ్మా కొడుతున్నారు.. మరోవైపు.. వాతావరణం బెలూన్ సంబరాలను బుడగలా మార్చేస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏజెన్సీలోని అరకులో అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ప్రకటిం చడంతో కోట్ల ఖర్చుతో అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ముహూర్త సమయానికి తీవ్ర అల్పపీడనం ఏర్పడటం.. ఈదురు గాలులు.. చిరుజల్లులకు తోడు అదే సమయంలో విశాఖలో అగ్రిహ్యాకథాన్‌కు ఉప రాష్ట్రపతి వస్తున్నారన్న కారణంతో ప్రముఖులు హాజరుకావడంలేదు.. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో బెలూన్లు విహరించే ఎత్తును 5వేల అడుగుల నుంచి 40 అడుగులకు కుదించేశారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అంతా.. ఇంతా.. అని చివరికి బెలూన్ పండగ పూర్తి కాకముందే గాలి తీసేశారు మన ప్రభుత్వ పెద్దలు. అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌కు ఆతిథ్యమిచ్చేందుకు అరకు ముస్తాబైనా... ప్రారంభోత్సవం చేసేందుకు పెద్దలు ఎవ్వరూ ముందుకు రావడం లేదు.మంగళవారం నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ ఫెస్టివల్లో 13 దేశాల నుంచి బెలూనిస్టులు వస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా పండుగ చేస్తున్నామని చెప్పిన పాలకులు ఇప్పటికే రూ.ఐదు కోట్ల పైన ఖర్చు చేశారని అంచనా. తీరా ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఎవ్వరూ సుముఖత వ్యక్తం చేయడం లేదని అంటున్నారు. జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు బుధవారం నుంచి విశాఖ నగరంలో ప్రారంభం కానున్న అగ్రి హాకథాన్ సదస్సు ఏర్పాట్లలో ఉన్న దృష్ట్యా రావడం సాధ్యం కాదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న బెలూన్ ఫెస్టివల్‌కు మంగళవారం ఓ రెండు, మూడు గంటలు కేటాయించడం వారిద్దరికీ పెద్ద పనికాదు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు వస్తున్న దృష్ట్యా ఆహ్వానించేందుకు వారిద్దరూ నగరంలోనే ఉండిపోతున్నారని చెబుతున్నారు. అయితే అరకులో జరిగే బెలూన్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం ఉదయం 7 గంటలకే కావడంతో రోడ్డు మార్గంలో ఉదయం అక్కడకు వెళ్లినా తిరిగి మధ్యాహ్నం 12 గంటల్లోపే మంత్రులు విశాఖ చేరుకోవచ్చు. కానీ మన మంత్రులు అసలు ఆ దిశగా కూడా ఆలోచించకుండా కార్యక్రమానికి ఎగవేశారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు కూడా ఉప రాష్ట్రపతికి స్వాగత ఏర్పాట్లలో నిమగ్నం కావడంతో అక్కడకు రావడం లేదు. ఇక కృష్ణా జిల్లా విజయవాడలో ఫెర్రీ ఘాట్ వద్ద రెండురోజుల కిందట జరిగిన బోటు ప్రమాద ఘటన నేపథ్యంలో పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ అరకు పర్యటనను వాయిదా వేసుకున్నట్టు చెబుతున్నారు. ఈ ఘటన దరిమిలా పర్యాటక శాఖ ఉన్నతాధికారులు కూడా అరకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో ఏజెన్సీ స్థాయి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పి.రవితో అంతర్జాతీయ బెలూన్ ఫెస్టివల్‌ను ప్రారంభించేందుకు పర్యాటక అధికారులు ఏర్పాట్లు చేశారు. అరకులో ఫెస్టివల్‌కు ఏర్పాట్లు సాక్షి, విశాఖపట్నం: అందాల అరకులో మరో పండగకు వేదికయింది. దక్షిణాది రాష్ట్రాల్లోనే తొలిసారిగా నిర్వహించే అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌కు ఆతిథ్యమిస్తోంది. మంగళవారం నుం చి మూడు రోజులపాటు జరిగే ఈ ఫెస్టివల్లో 13 దేశాల నుంచి బెలూనిస్టులు 16 హాట్ ఎయిర్ బెలూన్లతో పాల్గొననున్నారు. పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా పర్యాటకశాఖ నేతృత్వంలో ఈ–ఫ్యాక్టర్ సంస్థ ఈ ఫెస్టివల్‌ను నిర్వహించనుంది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇందులో పాల్గొనే బెలూన్ పైలట్లు కొంతమంది హెలికాప్టర్‌లోనూ, మరికొందరు రోడ్డు మార్గంలోనూ సోమవారం సాయంత్రానికి అరకులోయకు చేరుకున్నారు. వీరికి అరకు సమీపంలోని దళపతిగూడ వద్ద 42 టెంట్లతో పాటు అక్కడే కాన్ఫరెన్స్, డైనింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు సాయంత్రం 6.30 నుంచి 8 గంటల వరకు రెయిడ్స్ ఉంటాయి. బెలూన్ రెయిడ్స్ కోసం తొలుత మూడు, నాలుగు ప్రాం తాలను పరిశీలించారు. చివరకు అరకు సమీపంలోని సుంకరమెట్టను ఎంపిక చేశారు. అక్కడ నుంచి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చంపగూడ వరకు బెలూన్ రెయిడ్ చేయనున్నారు. సముద్రమట్టానికి ఐదు వేల అడుగుల ఎత్తు వరకు బెలూనిస్టులు విహరిస్తారు. కానీ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వల్ల గాలుల ఉధృతి అధికంగా ఉండడంతో అంత ఎత్తులో ఎగిరేందుకు ఎంతవరకు వాతావరణం సహకరిస్తుందోనన్న ఆందోళన నిర్వాహకుల్లో నెలకొంది. మరోవైపు ఈ బెలూన్ రెయిడ్స్‌లో పాల్గొన దలచిన వారు ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్న సూచనతో ఇప్పటిదాకా దాదాపు 6500 మంది వరకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. లాటరీ విధానంలో రోజుకు 300 మందిని ఉచితంగా బెలూన్లలో విహరించేందుకు అనుమతిస్తారు. -
జాతరకెళితే బురద పూస్తారు..!
అవునా నిజమేనా...!అని ఆశ్చర్యపోవద్దు. ఇదో వింతజాతర.బురదమాంబజాతరలో ఎంతటి వ్యక్తి అయినా బురదరాయించుకోవాల్సిందే. మగవారుఏ వయస్సులో ఉన్నా ఎటువంటిమినహాయింపు ఉండదు. ఆడవారికి మాత్రమే మినహాయింపుఉంటుంది. ఈ విచిత్ర జాతరరాంబిల్లి మండలం దిమిలి గ్రామంలోరెండేళ్లకోసారి నిర్వహిస్తారు. రాంబిల్లి : బురదమాంబ జాతర రోజు దిమిలిలో ఉంటే ఎంతటివారైనా బురద పూయించుకోవాల్సిందే. మహిళలు పూజలకు మాత్రమే పరిమితం. ఎంతటి స్దాయి వ్యక్తి అయినా వయస్సుతో సంబంధం లేకుండా మగవారైతే చాలు డ్రెయినేజీల్లో బురదలో వేప కొమ్మలు ముంచి ఒంటిపై పూస్తారు. ఇదో వింత పండగ. ఈ గ్రామదేవత దల్లమాంబ జాతరలో భాగంగా అనుపు మహోత్సవం సందర్భంగా రెండేళ్లకోసారి ఈ జాతరను నిర్వహిస్తారు. సోమవారం అర్ధరాత్రి నుంచే ఈ బురద మహోత్సవం ప్రారంభం అవుతోంది. మంగళవారం ఉదయం 9గంటల వరకు ఈ జాతర నిర్వహిస్తారు. వేపకొమ్మలు చేతబట్టి ఆయా కొమ్మలను మురుగుకాలువల్లో ముంచి ఆయా బురదను ఒకరిపై ఒకరు పూసుకొని కేరింతలు కొడతారు. గ్రామంలో వీధుల్లో ఈ జాతర నిర్వహిస్తారు. జాతర అనంతరం ఆయా కొమ్మలను అమ్మవారి ఆలయం వద్ద వుంచి పూజలు చేస్తారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా, భక్తుల కొంగుబంగారంలా బురదమాంబ అమ్మవారిని భక్తులు భావిస్తారు. బురద పూసుకున్నప్పటికీ ఎటువంటి చర్మవ్యాధులు సోకకపోవడం అమ్మవారి మహత్మ్యంగా భక్తులు భావిస్తారు. ఈ జాతర నిర్వహణకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బురదమాంబ అమ్మవారు -
గంగమ్మ ఒడికి గౌర మ్మా..
సద్దుల బతుకమ్మ నేడు పలుప్రాంతాల్లో సంబరాలు వర్షం ఎఫెక్ట్ ‘నిద్రపో గౌరమ్మ... నిద్రపోవమ్మా... నిద్రకు నూరేండ్లు.... నీకు వెయ్యేండ్లు... నినుగన్న తల్లికి నిండు నూరేళ్లు... వెళ్లి రావమ్మా... మళ్లీ రావమ్మా’ అంటూ బతుకమ్మ అంటూ మహిళలు వీడ్కోలు పలికారు. కరీంనగర్: జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తొమ్మిది రోజులపాటు భక్తి శ్రద్ధలు, ఆనందోత్సాహాలతో పూజించి గౌరమ్మను గంగమ్మ ఒడికి సాగనంపారు. అయితే ఈసారి బతుకమ్మ పండుగపై పండితులు ఒక స్పష్టమైన తేదీని ప్రకటించకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆదివారం కూడా జిల్లాలో పలుచోట్ల సంబరాలు జరుగనున్నాయి. మరోవైపు బతుకమ్మ పండుగకు వర్షం అడ్డంకిగా మారింది. రాత్రివరకు వాన కురియడంతో మహిళలు ఆడేందుకు ఇబ్బందులు పడ్డారు. జిల్లా కేంద్రంలోని 41, 42వ డివిజన్లలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ పాల్గొన్నారు. 41వ డివిజన్ కార్పొరేటర్ చల్లా స్వరూపరాణì పేర్చిన 10 అడుగుల బతుకమ్మ ఆకట్టుకుంది. హుస్నాబాద్‌లో మహిళలు వానలోనే బతుకమ్మ ఆడారు. బతుకమ్మలపై విద్యుత్ స్తంభంపడడంతో పరుగులు పెట్టారు. కరెంట్ సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. మూడుగంటలపాటు వర్షం పడడంతో వానలోనే బతుకమ్మ ఆడారు. వర్షం ఎఫెక్ట్‌తో కొందరు బతుకమ్మ ఆట ఆడకుండానే నిమజ్జనం చేశారు. చొప్పదండిలో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. స్థానిక కుడి చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. గోదావరిఖనిలోని కోదండరామాలయం, కాశీవిశ్వేశ్వరాలయం, రాజరాజేశ్వరాలయం, పవర్‌హౌస్‌లోని దుర్గామాత ఆలయాల వద్ద బతుకమ్మను భక్తిశ్రద్ధలతో ఆడి పాటలు పాడారు. కోలాటాలతో సందడి చేశారు. రాజీవ్‌నగర్‌లో దేశంకోసం అమరులైన వీరజవాన్లకు బతుకమ్మ ఆటలతోపాటు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. అనంతరం గోదావరిలో నిమజ్జనం చేశారు. ౖయెటింక్లయిన్‌కాలనీలో వర్షం కురుస్తున్నా మహిళలు బతుకమ్మ ఆడేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. హుజూరాబాద్ పట్టణంలో మహిళలు, యువతులు, చిన్నారులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బతుకమ్మ సద్దుల ప్రాంగణానికి చేరుకుని ఆడారు. అనంతరం స్థానిక వాగులో నిమజ్జనం చేశారు. మంత్రి ఈటల రాజేందర్ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున పాల్గొని మహిళలతో కలిసి ఆడిపాడారు. జగిత్యాలలో నిర్వహించిన బంగారు బతుకమ్మ వేడుకల్లో జెడ్పీచైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన, జగిత్యాల సబ్ కలెక్టర్ శశాంక దంపతులు పాల్గొన్నారు. కరీంనగర్ మండలం సీతారాంపూర్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. మంథనిలో గౌరమ్మను కొలిచి బతుకమ్మ ఆటాపాటలతో అలరించారు. సుల్తానాబాద్ మండల కేంద్రంలో బతుకమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రారంభించారు. మహిళలు చెరువులో నిమజ్జనం చేసి వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. వేములవాడలో మూడురోజుల క్రితమే సద్దుల వేడుకలు నిర్వహించగా.. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో శనివారం జరుపుకున్నారు. సిరిసిల్ల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, జగిత్యాల ప్రాంతాల్లో ఆదివారం సద్దుల బతుకమ్మ సంబురాలు జరగనున్నాయి. -
నవ్విస్తూ..ఆలోచింపజేస్తూ..
విశాఖ–కల్చరల్ : రంగసాయి థియేటర్ ఫెస్టివల్ అంగరంగð భవంగా సాగింది. రంగసాయి నాటక సంఘం 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కళాభారతి ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన విభిన్న అంశాల రంగస్థల ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. సమాజంలో జరుగుతున్న పరిణామాలను అనుసరిస్తూ మంచిని చెప్తూ..కష్టాన్ని మరిపించే వినోదాత్మకమైన మంచిని ఆలోచింపజేసే వినూత్న రంగస్థల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అలరించిన ప్రదర్శనలు ప్రదర్శించిన ఆంధ్రశ్రీ అపర చాణుక్యుడు పెద్దాపురానికి చెందిన చల్లా పాపారావు ప్రదర్శించిన ఏకపాత్రాభినయంతో ఫెస్టివల్ ప్రారంభమైంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గ్రహీత కోరుకొండ రంగరావు ప్రదర్శించిన ప్లాస్టిక్ భూతం విచిత్ర వేషధారణ,మిమిక్రీ ప్రేక్షకుల్ని నవ్వుల జల్లు కురిపించింది. విశాఖకు చెందిన నవర థియేటర్ ఆర్ట్స్ వారిచే ప్రదర్శించిన నటులున్నారు జాగ్రత్త అనే లఘునాటిక కళాత్మకంగా ప్రదర్శించారు. ప్రముఖ నంది అవార్డు గ్రహీత చలసాని కృష్ణప్రసాద్ దర్శకత్వంలో మధురవాడ వారిచే సుదర్శన కల్చరల్ అసోసియేషన్ ప్రదర్శించిన కన్యాశుల్కం ప్రవాసనం ప్రదర్శన విశేషంగా అలరించింది. నగరానికి చెందిన కేవీ మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగస్థల నటుడు, దర్శకుడు పి. శివప్రసాద్ దర్శకత్వంలో స్వాగతం నాటిక ఆకట్టుకుంది. తర్వాత విజయనగరంచే వెయిట్‌లిఫ్టింగ్, చిన్నదాని సింగారం అనే అంశాలపై ఆదియ్య మాస్టారు సారధ్యంలో ముకాభినయం ప్రదర్శన కళాహదయాలను ఆకట్టుకుంది. ఆఖరిగా 65 మంది కళాకారులతో ఆరు నంది అవార్డులు అందుకున్న మహేశ్వరి ప్రసాద్ యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారిచే ఎన్.ఎస్.నారాయణ రచనలో వాసు దర్శకత్వం వహించిన అశ్వరశరభ సాంఘిక నాటిక ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ప్రేక్షకుల ఆదరణకు రుణపడి ఉంటా గత ఆరేళ్ల నుంచి 400లకు పైగా విభిన్న సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహించామని నిర్వాహకుడు బాదంగీర్‌సాయి తెలిపారు. వందకుపైగా నాటిక, నాటకాలు తమ సంస్థ ద్వారా ప్రదర్శించడం జరిగిందని, మొట్టమొదటిగా ఈఏడాది రాష్ట్రప్రభుత్వ భాషా సాంస్కతిక శాఖ తరఫున ఆర్థికసాయంతో రంగసాయి ఫెస్టివల్‌ను చేపట్టామన్నారు. దీనికి ప్రభుత్వం అన్నివిధాల సహకరించినందుకు కతజ్ఞతలు తెలిపారు. ఘనంగా రంగసాయి ఆత్మీయ పురస్కారం ప్రదానం రంగసాయి థియేటర్ ఫెస్టివల్–2016 సందర్భంగా గరికపాటి బాలగంగాధర తిలక్‌కు రంగసాయి ఆత్మీయ పురస్కారాన్ని అందజేశారు. తొలుత ఫెస్టివల్ మహోత్సవాన్ని కళాపోషకులు నిర్వహకులు రంగసాయి నాటక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బాదంగీర్‌సాయి, చలసాని కష్ణప్రసాద్, దుండు నాగేశ్వరరావు, శివజ్యోతి, కొణతాల రాజు, పి.శివప్రసాద్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమం ఆద్యంతం సీనియర్ పాత్రికేయుడు ఎన్.నాగేశ్వరరావు వ్యాఖ్యతగా వ్యవహరించారు. -
అమ్మా బెలైల్లినాదో.. తల్లీ బెలైల్లినాదో...
నగర వాతావరణంలో ఎన్నో హంగులు, ఆర్భాటాలు, మరెన్నో మార్పు చేర్పులు చోటు చేసుకున్నాయి. ప్రజల జీవన సరళి ఎంతగానో మారిపోయింది. ఉమ్మడిగా ఉన్న రాష్ట్రం రెండుగా చీలిపోయింది. కానీ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో గ్రామదేవతలకు సమర్పించే బోనాల పండుగలో మాత్రం ఏమార్పూ రాలేదు. దాదాపు 800 ఏళ్లకు పైగా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో ప్రజలంతా ఇంచుమించు ఒకేవిధంగా జరుపుకుంటున్న పండుగ బహుశ ఇదొక్కటేనేమో! ఆషాఢ మాసంలో ఎంతో వేడుకగా తెలంగాణ ప్రజలు జరుపుకునే బోనాల పండుగ విశేషాలలోకి వెళితే... బోనమంటే మరేమిటో కాదు, గ్రామదేవతలకు సమర్పించే మొక్కుబడి లేదా నియమ నిష్ఠలతో తయారుచేసే నైవేద్యమన్నమాట. ఆడపడుచులంతా కలసి దీనిని ఘటాలలో ఉంచి ఊరేగింపుగా వెళ్లి గుడిలో అమ్మవారికి సమర్పిస్తారు. (అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పాత్రలను ఘటాలంటారు). దీనిని తయారు చేయడమే కాదు, సమర్పించడం కూడా ఎంతో విశిష్టమైనదే! మట్టి కుండ లేదా రాగి, ఇత్తడి, స్టీలు పాత్ర లేదా బిందెలను సున్నం, పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. అందులో అన్నం, పెరుగు, బెల్లంతో చేసిన నైవేద్యాన్ని ఉంచుతారు. దానిపై వేపమండలు వేసి దానిపై చేయి పెట్టి అందులో చింతపండు నీళ్లు, ఉల్లిపాయ ముక్కలు కలుపుతారు. దాని మీద మూత పెట్టి ఆ మూత మీద దీపం వెలిగిస్తారు. దీనినే గండదీపం అంటారు. ముఖంపై పసుపు రాసుకుని, కుంకుమ దిద్దుకుని, ముందుగా సిద్ధంచేసుకుని ఉంచిన బోనాన్ని భక్తిశ్రద్ధలతో తలపై పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. కొందరు భక్తులు తమ మొక్కుబడిని బట్టి, శక్తిని బట్టి ఇతర కానుకలు కూడా సమర్పిస్తారు. భోజనం అనే శబ్దానికి గ్రామ్యరూపమే బోనం. పూర్వకాలంలో మశూచి, ప్లేగు, కలరా, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలి, గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకునిపోయేవి. అందుకే అలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా, సకాలంలో మంచి వర్షాలు పడి, పంటలు బాగా పండి అందరూ సుఖసంతోషాలతో ఉండాలనే సంకల్పంతో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా భాగ్యనగర వాసులు అమ్మవారి అంశలైన పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, బాలమ్మ, మహంకాళమ్మ... అనే గ్రామదేవతలకు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పసుపు కుంకుమలు, చీరసారెలతో భోజన నైవేద్యాలను సమర్పించి భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఈ సంబురానికే బోనాలపండుగ అని పేరు. బోనాలు ఎందుకు? ఆషాఢమాసమంటే వర్షాకాలం. కలరా, ప్లేగు, మశూచి, క్షయ, తట్ట్టు, పొంగు, అమ్మవారు వంటి అంటువ్యాధులు వ్యాపించడానికి అవకాశం ఉన్న మాసం. అందుకే ప్రజలెవరూ ఈ వ్యాధుల బారిన పడకుండా గ్రామాలను చల్లగా చూసేందుకే గ్రామదేవతలకు బోనాలు సమర్పిస్తారు. పసుపు నీళ్లు, వేపాకులతో సాక పెట్టి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, అమ్మవారికి సమర్పించగా మిగిలిన పదార్థాలను ప్రసాదాలుగా స్వీకరిస్తారు. పోతురాజుల కొరడా దెబ్బలకోసం కొట్టుకుంటారు! పోతురాజు అంటే అమ్మవారికి సోదరుడు. చిన్న అంగవస్త్రాన్ని ధరించి, కాళ్లకు మువ్వల గజ్జెలు, బుగ్గన నిమ్మకాయలు పెట్టుకుని, కంటినిండా కాటుక, నుదుట రూపాయి కాసంత బొట్టు పెట్టుకుని, పేనిన కొబ్బరి లేదా నూలు తాళ్లకు పసుపు రాసి, దానిని కొరడాలా ఝుళిపిస్తూ, పాటలకు అనుగుణంగా చిందులేస్తూ సందడి చేస్తారు వీరు. ఈ కొరడా దెబ్బ తగిలితే పిశాచ భయం పోతుందని, దుష్టశక్తులు దూరమవుతాయని, కీడు తొలగిపోతుందని భక్తులు ఈ దెబ్బలకోసం కాచుకుని కూచుంటారు. ఆధ్యాత్మిక త‘రంగం బోనాల పండుగలోని ముఖ్యమైన సంప్రదాయం రంగం చెప్పడం. ఇది మరుసటి రోజు జరుగుతుంది. రంగం చెప్పడమంటే భవిష్యవాణిని వినిపించడమే. అంటే రాబోయే కాలంలో వర్షాలు ఎలా కురుస్తాయి? పంటలు ఎలా పండుతాయి... వంటి వివరాలు చెప్పడమన్నమాట. ఒక కుటుంబానికి చెందిన అవివాహిత మహిళ మాత్రమే తరతరాలుగా ఇలా రంగం చెప్పే సంప్రదాయముంది. సికింద్రాబాద్‌లోని చారిత్రాత్మకమైన ఉజ్జయినీ మహంకాళి దేవాలయంలో అంగరంగ వైభవంగా.... కిక్కిరిసిన భక్తుల మధ్య జరిగే ఈ కార్యక్రమాన్ని చూడడానికి భక్తులు పోటీలు పడ తారు. గర్భగుడిలోని అమ్మవారిని తదేకంగా చూస్తూ ఆ అమ్మ అంశను తనలో ఇముడ్చుకుందా అన్నట్లు పచ్చికుండపై పాదంమోపి భక్తి పూనకంతో ఊగిపోతూ భవిష్యద్వాణిని వినిపిస్తుందీమె. ఆధ్యాత్మిక పరంగా... బోనాలు సమర్పించడాన్ని జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేయడంగా కూడా ఆధ్మాత్మికవేత్తలు చెబుతారు. విజ్ఞాన శాస్త్ర పరంగా చూస్తే వేపాకు, పసుపు, బోనాల పాటలు నేలపైనా, గాలిలోనూ ఉండే సూక్ష్మజీవులను నాశనం చేసి, వాతావరణాన్ని క్రిమిరహితం చేయడానికి దోహదపడతాయి. నృత్యవిన్యాసాలు, బోనాల సంబురాలు ప్రజలందరినీ ఒక్కతాటిమీద నడిపిస్తాయి. ఇటువంటి వేడుకలను జరుపుకోవడం తామరాకుమీద నీటి బొట్టులా ఉండే పట్టణ వాసులకు ఇప్పటికాలంలో ఎంతో అవసరం. అమ్మ అందరినీ చల్లగా చూడాలని కోరుకుందాం. - డి .వి.ఆర్. -
సమ్మక్క జాతరలో రూ.20 వేలు చోరీ
సమ్మక్క జాతరలో రూ.20 వేలు చోరీ కోల్‌సిటీ : గోదావరిఖని శివారులో గోదావరి వంతెన సమీపంలోని సమ్మక్క-సారలమ్మ జాతరలో గురువారం గుర్తుతెలియని వ్యక్తులు ఓ భక్తుడి నుంచి రూ.20 వేలు దోచుకుపోయారు. ఆదిలాబాద్ జిల్లా మద్దిపల్లి గ్రామానికి చెందిన మద్దిపెల్లి మల్లయ్య అనే బియ్యం వ్యాపారి జాతరకు వచ్చాడు. తన జేబులో ఉన్న రూ.20 వేలు గుర్తుతెలియని వ్యక్తులు సినీఫక్కీలో దోచుకుపోయారు. డబ్బులు చోరీ కావడం పై ఆందోళనకు గురైన బాధితుడు జా తరలోని కంట్రోల్ రూం పోలీసులకు తెలిపాడు. జాతరలో దొంగలు తిరుగుతున్నారనే విషయం తెలిసిన పోలీ సులు అప్రమత్తమయ్యారు. అనుమా నం ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.