హిందువులు కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ నెలలో పూజలు, వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఇదే మాసంలోని ఈరోజు (నవంబర్ 15)కు ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజున దేవ్ దీపావళి, కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి మూడు పర్వదినాలు కలసి వచ్చాయి. అయితే కార్తీక పౌర్ణమి నాడే గురునానక్ జయంతిని ఎందుకు జరుపుకుంటారనే విషయానికి వస్తే..
గురునానక్ జయంతి సిక్కులకు ఎంతో ముఖ్యమైన పండుగ. దీనిని సిక్కులు ప్రతి సంవత్సరం కార్తీక పూర్ణిమ రోజున జరుపుకుంటారు. దీనిని ‘గురుపర్వ’ లేదా ‘ప్రకాశ పర్వ’ అని కూడా అంటారు. సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ ఈరోజునే జన్మించారు. ఆయన సిక్కుల మొదటి గురువు. గురునానక్ జయంతి సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వస్తుంది. సిక్కులు గురునానక్ జయంతి వేడుకలను ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ రోజున గురుద్వారాలలో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు.
ఈ సంవత్సరం సిక్కులు గురునానక్ దేవ్ 555వ జయంతిని జరుపుకుంటున్నారు. ఆయన 1469వ సంవత్సరంలో కార్తీక పూర్ణిమ రోజున జన్మించారని చెబుతుంటారు. అందుకే ప్రతీయేటా గురునానక్ జయంతిని కార్తీక పూర్ణిమ రోజున జరుపుకుంటారు. గురునానక్ జయంతికి రెండు రోజుల ముందు సిక్కులు ‘అఖండ పాత్’నిర్వహిస్తారు. గురుగ్రంథ సాహిబ్‌ను 48 గంటలపాటు నిరంతరం పఠిస్తారు.
గురునానక్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న సిక్కులు ఈ రోజు ఉదయాన్నే నగర కీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్‌ను పల్లకిలో మోస్తూ, షాబాద్ కీర్తనను ఆలపిస్తూ నగరంలో ఊరేగింపు నిర్వహించారు. ఈరోజంతా గురుద్వారాలలో కీర్తనలు ఆలపించనున్నారు. గురునానక్ దేవ్ బోధనలపై సిక్కు మత పెద్దలు ఉపన్యసించనున్నారు.
గురునానక్ జయంతి రోజున గురుద్వారాలలో ప్రత్యేక ‘లంగర్’(అన్నదానం) నిర్వహించనున్నారు. దీనిలో అన్ని మతాలవారు కలిసి భోజనం చేస్తారు. ఇది సమాజానికి సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సందేశాన్ని అందిస్తుంది. గురునానక్.. సమానత్వం, ప్రేమ, సేవ నిజాయితీలు అందరిలో ఉండాలనే సందేశాన్ని అందించారు. కులమతాలకు అతీతంగా అందరూ సోదరభావంలో మెలగాలని గురునానక్ తెలియజేశారు.
ఇది కూడా చదవండి: Karthika Pournima: కార్తీక పౌర్ణమి విశిష్టత..! త్రిపుర పూర్ణిమ అని ఎందుకు పిలుస్తారు?
Comments
Please login to add a commentAdd a comment