అమ్మా బెలైల్లినాదో.. తల్లీ బెలైల్లినాదో... | bonalu festivel special story's | Sakshi
Sakshi News home page

అమ్మా బెలైల్లినాదో.. తల్లీ బెలైల్లినాదో...

Published Sun, Jul 17 2016 12:41 AM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

అమ్మా బెలైల్లినాదో.. తల్లీ బెలైల్లినాదో...

అమ్మా బెలైల్లినాదో.. తల్లీ బెలైల్లినాదో...

 నగర వాతావరణంలో ఎన్నో హంగులు, ఆర్భాటాలు, మరెన్నో మార్పు చేర్పులు చోటు చేసుకున్నాయి. ప్రజల జీవన సరళి ఎంతగానో మారిపోయింది. ఉమ్మడిగా ఉన్న రాష్ట్రం రెండుగా చీలిపోయింది. కానీ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో గ్రామదేవతలకు సమర్పించే బోనాల పండుగలో మాత్రం ఏమార్పూ రాలేదు. దాదాపు 800 ఏళ్లకు పైగా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో ప్రజలంతా ఇంచుమించు ఒకేవిధంగా జరుపుకుంటున్న పండుగ బహుశ ఇదొక్కటేనేమో! ఆషాఢ మాసంలో ఎంతో వేడుకగా తెలంగాణ ప్రజలు జరుపుకునే బోనాల పండుగ విశేషాలలోకి వెళితే...
 
 బోనమంటే మరేమిటో కాదు, గ్రామదేవతలకు సమర్పించే మొక్కుబడి లేదా నియమ నిష్ఠలతో తయారుచేసే నైవేద్యమన్నమాట. ఆడపడుచులంతా కలసి దీనిని ఘటాలలో ఉంచి ఊరేగింపుగా వెళ్లి గుడిలో అమ్మవారికి సమర్పిస్తారు. (అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పాత్రలను ఘటాలంటారు). దీనిని తయారు చేయడమే కాదు, సమర్పించడం కూడా ఎంతో విశిష్టమైనదే! మట్టి కుండ లేదా రాగి, ఇత్తడి, స్టీలు పాత్ర లేదా బిందెలను సున్నం, పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. అందులో అన్నం, పెరుగు, బెల్లంతో చేసిన నైవేద్యాన్ని ఉంచుతారు. దానిపై వేపమండలు వేసి దానిపై చేయి పెట్టి అందులో చింతపండు నీళ్లు, ఉల్లిపాయ ముక్కలు కలుపుతారు. దాని మీద మూత పెట్టి ఆ మూత మీద దీపం వెలిగిస్తారు. దీనినే గండదీపం అంటారు. ముఖంపై పసుపు రాసుకుని, కుంకుమ దిద్దుకుని, ముందుగా సిద్ధంచేసుకుని ఉంచిన బోనాన్ని భక్తిశ్రద్ధలతో తలపై పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. కొందరు భక్తులు తమ మొక్కుబడిని బట్టి, శక్తిని బట్టి ఇతర కానుకలు కూడా సమర్పిస్తారు.
 
 భోజనం అనే శబ్దానికి గ్రామ్యరూపమే బోనం. పూర్వకాలంలో మశూచి, ప్లేగు, కలరా, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలి, గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకునిపోయేవి. అందుకే అలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా, సకాలంలో మంచి వర్షాలు పడి, పంటలు బాగా పండి అందరూ సుఖసంతోషాలతో ఉండాలనే సంకల్పంతో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా భాగ్యనగర వాసులు అమ్మవారి అంశలైన పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, బాలమ్మ, మహంకాళమ్మ... అనే గ్రామదేవతలకు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పసుపు కుంకుమలు, చీరసారెలతో భోజన నైవేద్యాలను సమర్పించి  భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఈ సంబురానికే బోనాలపండుగ అని పేరు.

 బోనాలు ఎందుకు?
 ఆషాఢమాసమంటే వర్షాకాలం. కలరా, ప్లేగు, మశూచి, క్షయ, తట్ట్టు, పొంగు, అమ్మవారు వంటి అంటువ్యాధులు వ్యాపించడానికి అవకాశం ఉన్న మాసం. అందుకే ప్రజలెవరూ ఈ వ్యాధుల బారిన పడకుండా గ్రామాలను చల్లగా చూసేందుకే  గ్రామదేవతలకు బోనాలు సమర్పిస్తారు. పసుపు నీళ్లు, వేపాకులతో సాక పెట్టి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, అమ్మవారికి సమర్పించగా మిగిలిన పదార్థాలను ప్రసాదాలుగా స్వీకరిస్తారు.

 పోతురాజుల కొరడా దెబ్బలకోసం కొట్టుకుంటారు!
 పోతురాజు అంటే అమ్మవారికి సోదరుడు. చిన్న అంగవస్త్రాన్ని ధరించి, కాళ్లకు మువ్వల గజ్జెలు, బుగ్గన నిమ్మకాయలు పెట్టుకుని, కంటినిండా కాటుక, నుదుట రూపాయి కాసంత బొట్టు పెట్టుకుని, పేనిన కొబ్బరి లేదా నూలు తాళ్లకు పసుపు రాసి, దానిని కొరడాలా ఝుళిపిస్తూ, పాటలకు అనుగుణంగా చిందులేస్తూ సందడి చేస్తారు వీరు. ఈ కొరడా దెబ్బ తగిలితే పిశాచ భయం పోతుందని, దుష్టశక్తులు దూరమవుతాయని, కీడు తొలగిపోతుందని భక్తులు ఈ దెబ్బలకోసం కాచుకుని కూచుంటారు.

 ఆధ్యాత్మిక త‘రంగం
 బోనాల పండుగలోని ముఖ్యమైన సంప్రదాయం రంగం చెప్పడం. ఇది మరుసటి రోజు జరుగుతుంది. రంగం చెప్పడమంటే భవిష్యవాణిని వినిపించడమే. అంటే రాబోయే కాలంలో వర్షాలు ఎలా కురుస్తాయి? పంటలు ఎలా పండుతాయి... వంటి వివరాలు చెప్పడమన్నమాట. ఒక కుటుంబానికి చెందిన అవివాహిత మహిళ మాత్రమే తరతరాలుగా ఇలా రంగం చెప్పే సంప్రదాయముంది. సికింద్రాబాద్‌లోని చారిత్రాత్మకమైన ఉజ్జయినీ మహంకాళి దేవాలయంలో అంగరంగ వైభవంగా.... కిక్కిరిసిన భక్తుల మధ్య జరిగే ఈ కార్యక్రమాన్ని చూడడానికి భక్తులు పోటీలు పడ తారు. గర్భగుడిలోని అమ్మవారిని తదేకంగా చూస్తూ ఆ అమ్మ అంశను తనలో ఇముడ్చుకుందా అన్నట్లు పచ్చికుండపై పాదంమోపి భక్తి పూనకంతో ఊగిపోతూ భవిష్యద్వాణిని వినిపిస్తుందీమె.

 ఆధ్యాత్మిక పరంగా...
 బోనాలు సమర్పించడాన్ని జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేయడంగా కూడా ఆధ్మాత్మికవేత్తలు చెబుతారు. విజ్ఞాన శాస్త్ర పరంగా చూస్తే వేపాకు, పసుపు, బోనాల పాటలు నేలపైనా, గాలిలోనూ ఉండే సూక్ష్మజీవులను నాశనం చేసి, వాతావరణాన్ని క్రిమిరహితం చేయడానికి దోహదపడతాయి. నృత్యవిన్యాసాలు, బోనాల సంబురాలు ప్రజలందరినీ ఒక్కతాటిమీద నడిపిస్తాయి. ఇటువంటి వేడుకలను జరుపుకోవడం తామరాకుమీద నీటి బొట్టులా ఉండే పట్టణ వాసులకు ఇప్పటికాలంలో ఎంతో అవసరం. అమ్మ అందరినీ చల్లగా చూడాలని కోరుకుందాం.   - డి .వి.ఆర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement