దేశవ్యాప్తంగా నేడు మకర సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన ఈ తరుణం నుంచి హిందువులు శుభకార్యాలను ప్రారంభిస్తారు. మకర సంక్రాంతి నాడు చేసే గంగాస్నానం, దానధర్మాలు, పూజలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మకరసంక్రాంతి నాడు ఏ రాష్ట్రాల్లో ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
పంజాబ్
పంజాబ్‌లో మకర సంక్రాంతిని మాఘీగా జరుపుకుంటారు. తెల్లవారుజామున నదీస్నానం చేస్తారు. ఈ రోజున నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని, పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. మాఘి నాడు శ్రీ ముక్త్సార్ సాహిబ్‌లో భారీ జాతర నిర్వహిస్తారు.
తమిళనాడు
దక్షిణ భారతదేశంలో మకర సంక్రాంతిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. దీనిని తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు. నాలుగు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు భోగి పొంగల్, రెండవ రోజు సూర్య పొంగల్, మూడవ రోజు మట్టు పొంగల్, నాల్గవ రోజు కన్యా పొంగల్ నిర్వహిస్తారు.
పశ్చిమ బెంగాల్
పశ్చిమ బెంగాల్‌లో ఈ పండుగ సందర్భంగా గంగాసాగర్ వద్ద జాతర నిర్వహిస్తారు. స్నానం చేసిన తర్వాత నువ్వులను దానం చేస్తారు. ఈ రోజున యశోదమాత.. శ్రీ కృష్ణుడిని దక్కించుకునేందుకు ఉపవాసం చేశారని చెబుతారు. అలాగే ఈ రోజునే గంగామాత భగీరథుడిని అనుసరిస్తూ, గంగా సాగర్‌లోని కపిలముని ఆశ్రమాన్ని చేరిందని అంటారు.
కేరళ
కేరళలో సంక్రాంతిని మకర విళక్కు పేరుతో నిర్వహిస్తారు. శబరిమల ఆలయానికి సమీపంలో ఆకాశంలో మకర జ్యోతిని భక్తులు సందర్శిస్తారు.
కర్ణాటక
కర్నాటకలో సంక్రాంతిని ‘ఏలు బిరోదు’ అనే పేరుతో జరుపుకుంటారు. స్థానిక మహిళలు.. చెరకు, నువ్వులు, బెల్లం, కొబ్బరిని ఉపయోగించి చేసిన వంటకాన్ని చుట్టుపక్కలవారికి పంచిపెడతారు.
గుజరాత్
మకర సంక్రాంతిని గుజరాతీలో ఉత్తరాయణం అని అంటారు. రెండు రోజుల పాటు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. గాలిపటాలను ఎగురవేస్తారు. ప్రత్యేక వంటకాలను తయారుచేస్తారు.
ఇది కూడా చదవండి: మొదలైన జల్లికట్టు.. తమిళనాట సందడే సందడి!
Comments
Please login to add a commentAdd a comment