సోషల్‌ మీడియాలో అరకు ఎంపీ వ్యంగ్యాస్త్రం | Criticisms on International Balloon Festival in AP | Sakshi
Sakshi News home page

రూ.5కోట్లే ఎగిరాయ్‌

Published Fri, Nov 17 2017 11:04 AM | Last Updated on Fri, Nov 17 2017 11:14 AM

Criticisms on International Balloon Festival in AP - Sakshi - Sakshi

గురువారం సాయంత్రం ఎగరేయడానికి సిద్ధం చేసిన బెలూన్లు

తొలిరోజు ఏర్పాటుచేసిన బెలూన్లు.. 16 గాలిలోకి ఎగిరిన బెలూన్లు.. 13 రైడ్‌కి వెళ్లిన పర్యాటకులు.. 30మంది చూసేందుకు వచ్చిన వీక్షకులు.. 50 నుంచి 60మంది ప్రదర్శన సాగిన సమయం.. అరగంటలోపే బందోబస్తులో ఉన్న పోలీసులు.. 1000 మంది మొత్తం ఫెస్టివల్‌ ఖర్చు.. సుమారు రూ.5 కోట్లు  ..ఈ లెక్క చూస్తేనే అరకు లోయలో బెలూన్‌ ఫెస్టివల్‌ ఏస్థాయిలో జరిగిందో అర్థమవుతుంది.
అర్ధగంట సంబరానికి ఐదు కోట్లు ఖర్చు చేసిన పాలకుల నిర్వాకం ఇప్పుడు విమర్శల పాలవుతోంది.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
అంతర్జాతీయ బ్రాండ్‌ ఇమేజ్‌ కోసం పాకులాడిన పాలకులు.. వాతావరణ సూచనలను సైతం పట్టించుకోకపోవడంతో ఆహ్లాదకరంగా సాగాల్సిన అరకులో తలపెట్టిన బెలూన్‌ ఉత్సవాలు కాస్త ఉసూరుమనిపించాయి. మంగళవారం తొలిరోజే మొక్కుబడిగా సాగిన ఉత్సవంలో అరగంట సేపే.. అదీ 13 బెలూన్లే ఎగిరాయి. ఆ తర్వాత రెండు రోజులూ ఈదు రు గాలులు, చిరుజల్లులతో మొత్తం కార్యక్రమాలు రద్దయ్యాయి. ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా అరకులోయ వంటి ప్రదేశాల్లో రైడింగ్‌ సురక్షితం కాదని మొదటిరోజే భావించిన బెలూనిస్టులు ఆ తర్వాత రైడింగ్‌కు ఏమాత్రం ప్రయత్నించలేదు.

అల్పపీడనం ఉందని చెప్పినా..
బెలూన్‌ ఫెస్టివల్‌ జరిగే మూడురోజుల పాటు ప్రతికూల వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉపరితలం నుంచి ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తాల్లో గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఉత్సవాల ప్రారంభానికి ఐదురోజుల ముందే ప్రకటించారు. అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని, ఫలితంగా గగనతలంలోనే  గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని ముందుగానే  స్పష్టం చేశారు. హాట్‌ ఎయిర్‌ బెలూన్లు సముద్రమట్టానికి ఐదు వేల అడుగుల ఎత్తు వరకు పయనిస్తాయని నిర్వాహకులు చెప్పిన నేపథ్యంలో అక్కడ ఉధృతంగా ఉండే గాలుల ప్రభావంతో అవి అదుపు తప్పే ప్రమాదం ఉంటుందని నిపుణులు ముందుగానే అభిప్రాయపడ్డారు. ఈశాన్య గాలులు బలంగా వీస్తుండడం వల్ల హాట్‌ ఎయిర్‌ బెలూన్లు కొండ, కోనల నడుమ ఎత్తులో విహరించడం అంత శ్రేయస్కరం కాదని, వీటిని నియంత్రించడం కూడా కష్టమని ముందుగానే పేర్కొన్నారు.

పైగా మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న  ఈ ప్రాంతంలో భద్రతాపరంగా కూడా సమస్యలు ఎదురవుతాయన్న అభిప్రాయమూ వ్యక్తమైంది. కానీ ప్రభుత్వం గానీ, అధికారులు గానీ ఏమాత్రం పట్టించుకోకుండా అట్టహాసంగా ఏర్పాట్లు చేసేశారు. విదేశాల నుంచి వచ్చిన  బెలూనిస్టుల కోసం కొత్తబల్లుగూడ వద్ద 42 టెంట్లతో పాటు కాన్ఫరెన్స్, డైనింగ్‌ హాళ్లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు ఖర్చు చేశామని పర్యాటకశాఖ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీరాములు నాయుడు చెప్పినప్పటికీ రెవెన్యూ శాఖ వాటాతో కలిపి రూ.5కోట్లు దాటిందని అంచనా.

మంత్రి అఖిల ప్రియతోనే సరి...
ఇక ఫెస్టివల్‌ ప్రారంభోత్సవానికి హాజరవుతామని చెబుతూ వచ్చిన జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు తొలిరోజు డుమ్మా కొట్టారు. రెండో రోజు బుధవారం మంత్రి గంటా శ్రీనివాసరావు వస్తారని చెప్పినప్పటికీ చివరి నిమిషంలో పర్యటన వాయిదా పడింది. ఇక మూడో రోజు గురువారం ఉదయం  ముఖ్యమంత్రి చంద్రబాబు విచ్చేస్తారని సమాచారం ఇచ్చినప్పటికీ వర్షం కారణంగా రద్దయిందని మళ్లీ ప్రకటించారు. ఇక గురువారం సాయంత్రం ముగింపు కార్యక్రమాలకు గంటాను వెళ్లమని సీఎం చెప్పినప్పటికీ వాతావరణం అనుకూలించక ఆయన పర్యటనా రద్దయింది. సాయంత్రానికి పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ మాత్రం వచ్చారు.  మొత్తంగా ప్రభుత్వ పెద్దలు, కనీసం జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకుండానే మూడురోజుల పండుగను తూతూ మంత్రంగా గురువారం రాత్రి ముగించేశారు.

ఆదిలోనే హంసపాదు..
ప్రతికూల వాతావరణం పెద్దగా లేని తొలిరోజు మంగళవారమే బెలూన్‌ ఫెస్టివల్‌ అట్టర్‌ ఫ్లాఫ్‌ అయింది. ముందుగా ఎవరికీ అవగాహన కల్పించకపోవడం, సోషల్‌ మీడియాలో తప్ప పెద్దగా ప్రచారం చేయకపోవడంతో తొలిరోజే తూతూ మంత్రంలా సాగింది. 13 దేశాల నుంచి వచ్చిన బెలూనిస్టులు 16 హాట్‌ ఎయిర్‌ బెలూన్లను ఏర్పాటు చేసినప్పటికీ 13 బెలూన్లు మాత్రమే గాలిలోకి లేచాయి. మిగిలిన మూడు సాంకేతిక కారణాలతో ఓపెన్‌ కాలేదు. 13 బెలూన్లలో ఒక్కో బెలూన్‌లో ఇద్దరు, ముగ్గురు చొప్పున మొత్తం 30 మందిని మాత్రమే రైడ్‌కి తీసుకువెళ్లారు. కనీసం సందర్శకులు కూడా లేక ఆ ప్రాంతం వెలవెలబోయింది. 50నుంచి 60మంది  సందర్శకులు మాత్రమే విచ్చేశారు. చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు కూడా పెద్దగా రాలేదు. కానీ పోలీసులు మాత్రం అడుగడుగునా కనిపించారు. ఏజెన్సీలో జరుగుతున్న ఈ ఫెస్టివల్‌ బందోబస్తుకు బెటాలియన్‌ పోలీసులతో సహా వెయ్యిమందికిపైగా బందోబస్తుకు కేటాయించారు.

థ్యాంక్స్‌ టూ ఏపీ గవర్నమెంట్‌
సోషల్‌ మీడియాలో అరకు ఎంపీ వ్యంగ్యాస్త్రం

అరకు ఏజెన్సీ ప్రమోషన్‌ పేరిట జరిగిన ఈ బెలూన్‌ ఫెస్టివల్‌కు కనీసం అరకు ప్రాంత ప్రజాప్రతినిధులకైనా సమాచారం ఇవ్వలేదు. మంత్రులు, ముఖ్యమంత్రి రాక కోసం తీవ్రంగా పరితపించిన అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులకు కనీస మాత్రంగా కూడా ఆహ్వానించలేదు. దీనిపై అరకు ఎంపీ కొత్తపల్లి గీత బాహటంగానే సోషల్‌ మీడియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మా ప్రాంతంలో జరుగుతున్న బెలూన్ల పండుగకు ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా ఆహ్వానమూ లేదూ.. కనీసం సమాచారమూ లేదు.. థ్యాంక్స్‌ టూ ఏపీ గవర్నమెంట్‌ . అని ఆమె పోస్ట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.

గాలిదే భారం
సాక్షి, విశాఖపట్నం: ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న అరకు బెలూన్‌ ఫెస్టివల్‌కు ప్రకృతి బ్రేకులు వేసింది. ఈ నెల 14న తొలిరోజు అరకొర, అపశ్రుతుల మధ్య బెలూన్ల పండగ గంట సేపటికే పరిమితమైంది. మర్నాడు బుధవారం వర్షం కారణంగా నిర్వాహకులు బెలూన్లు ఎగురవేసే సాహసం చేయలేకపోయారు. దీంతో ముగింపు రోజైన గురువారమైనా బెలూన్లతో సందడి చేయాలనుకున్న బెలూనిస్టులకు వరుణుడు ఆ అవకాశం ఇవ్వలేదు. ఇలా రూ.కోట్ల రూపాయలు వెచ్చించి మూడు రోజులు అట్టహాసంగా నిర్వహించాలనుకున్న అరకు హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ఫెస్టివల్‌ సందడి లేకుండానే ముగిసింది. పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ గురువారం సాయంత్రం అరకులోయ వెళ్లారు. వాతావరణం అనుకూలిస్తే శుక్రవారం ఉదయమైనా బెలూన్లను ఎగురవేయించాలని నిర్వాహకులను కోరారు.  గాలులు, వర్షం లేనిపక్షంలో బెలూన్లు గాలిలోకి పంపడానికి అంగీకరించినట్టు పర్యాటకశాఖ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీరాములునాయుడు ‘సాక్షి’కి చెప్పారు. దీంతో శుక్రవారం వరుణుడు కరుణ కోసం వీరంతా ఎదురు చూస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement