అంతర్జాతీయ ఫెస్టివల్..దక్షిణ భారతంలోనే మొదటిసారి నిర్వహణ.. మూడు రోజులపాటు ఆకాశంలో విహరించనున్న సాహసికులు.. ఇలా ఎంతో హడావుడి చేశారు.. తీరా ప్రారంభోత్సవానికి మాత్రం ప్రముఖులంతా డుమ్మా కొడుతున్నారు.. మరోవైపు.. వాతావరణం బెలూన్ సంబరాలను బుడగలా మార్చేస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఏజెన్సీలోని అరకులో అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ప్రకటిం చడంతో కోట్ల ఖర్చుతో అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ముహూర్త సమయానికి తీవ్ర అల్పపీడనం ఏర్పడటం.. ఈదురు గాలులు.. చిరుజల్లులకు తోడు అదే సమయంలో విశాఖలో అగ్రిహ్యాకథాన్‌కు ఉప రాష్ట్రపతి వస్తున్నారన్న కారణంతో ప్రముఖులు హాజరుకావడంలేదు.. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో బెలూన్లు విహరించే ఎత్తును 5వేల అడుగుల నుంచి 40 అడుగులకు కుదించేశారు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అంతా.. ఇంతా.. అని చివరికి బెలూన్ పండగ పూర్తి కాకముందే గాలి తీసేశారు మన ప్రభుత్వ పెద్దలు. అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌కు ఆతిథ్యమిచ్చేందుకు అరకు ముస్తాబైనా... ప్రారంభోత్సవం చేసేందుకు పెద్దలు ఎవ్వరూ ముందుకు రావడం లేదు.మంగళవారం నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ ఫెస్టివల్‌లో 13 దేశాల నుంచి బెలూనిస్టులు వస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా పండుగ చేస్తున్నామని చెప్పిన పాలకులు ఇప్పటికే రూ.ఐదు కోట్ల పైన ఖర్చు చేశారని అంచనా. తీరా ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఎవ్వరూ సుముఖత వ్యక్తం చేయడం లేదని అంటున్నారు. జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు బుధవారం నుంచి విశాఖ నగరంలో ప్రారంభం కానున్న అగ్రి హాకథాన్ సదస్సు ఏర్పాట్లలో ఉన్న దృష్ట్యా రావడం సాధ్యం కాదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
వాస్తవానికి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న బెలూన్ ఫెస్టివల్‌కు మంగళవారం ఓ రెండు, మూడు గంటలు కేటాయించడం వారిద్దరికీ పెద్ద పనికాదు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు వస్తున్న దృష్ట్యా ఆహ్వానించేందుకు వారిద్దరూ నగరంలోనే ఉండిపోతున్నారని చెబుతున్నారు. అయితే అరకులో జరిగే బెలూన్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం ఉదయం 7 గంటలకే కావడంతో రోడ్డు మార్గంలో ఉదయం అక్కడకు వెళ్లినా తిరిగి మధ్యాహ్నం 12 గంటల్లోపే మంత్రులు విశాఖ చేరుకోవచ్చు. కానీ మన మంత్రులు అసలు ఆ దిశగా కూడా ఆలోచించకుండా కార్యక్రమానికి ఎగవేశారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు కూడా ఉప రాష్ట్రపతికి స్వాగత ఏర్పాట్లలో నిమగ్నం కావడంతో అక్కడకు రావడం లేదు. ఇక కృష్ణా జిల్లా విజయవాడలో ఫెర్రీ ఘాట్ వద్ద రెండురోజుల కిందట జరిగిన బోటు ప్రమాద ఘటన నేపథ్యంలో పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ అరకు పర్యటనను వాయిదా వేసుకున్నట్టు చెబుతున్నారు. ఈ ఘటన దరిమిలా పర్యాటక శాఖ ఉన్నతాధికారులు కూడా అరకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో ఏజెన్సీ స్థాయి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పి.రవితో అంతర్జాతీయ బెలూన్ ఫెస్టివల్‌ను ప్రారంభించేందుకు పర్యాటక అధికారులు ఏర్పాట్లు చేశారు.
అరకులో ఫెస్టివల్‌కు ఏర్పాట్లు
సాక్షి, విశాఖపట్నం: అందాల అరకులో మరో పండగకు వేదికయింది. దక్షిణాది రాష్ట్రాల్లోనే తొలిసారిగా నిర్వహించే అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌కు ఆతిథ్యమిస్తోంది. మంగళవారం నుం చి మూడు రోజులపాటు జరిగే ఈ ఫెస్టివల్‌లో 13 దేశాల నుంచి బెలూనిస్టులు 16 హాట్ ఎయిర్ బెలూన్లతో పాల్గొననున్నారు. పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా పర్యాటకశాఖ నేతృత్వంలో ఈ–ఫ్యాక్టర్ సంస్థ ఈ ఫెస్టివల్‌ను నిర్వహించనుంది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇందులో పాల్గొనే బెలూన్ పైలట్లు కొంతమంది హెలికాప్టర్‌లోనూ, మరికొందరు రోడ్డు మార్గంలోనూ సోమవారం సాయంత్రానికి అరకులోయకు చేరుకున్నారు. వీరికి అరకు సమీపంలోని దళపతిగూడ వద్ద 42 టెంట్లతో పాటు అక్కడే కాన్ఫరెన్స్, డైనింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు.
మంగళవారం ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు సాయంత్రం 6.30 నుంచి 8 గంటల వరకు రెయిడ్స్ ఉంటాయి. బెలూన్ రెయిడ్స్ కోసం తొలుత మూడు, నాలుగు ప్రాం తాలను పరిశీలించారు. చివరకు అరకు సమీపంలోని సుంకరమెట్టను ఎంపిక చేశారు. అక్కడ నుంచి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చంపగూడ వరకు బెలూన్ రెయిడ్ చేయనున్నారు. సముద్రమట్టానికి ఐదు వేల అడుగుల ఎత్తు వరకు బెలూనిస్టులు విహరిస్తారు. కానీ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వల్ల గాలుల ఉధృతి అధికంగా ఉండడంతో అంత ఎత్తులో ఎగిరేందుకు ఎంతవరకు వాతావరణం సహకరిస్తుందోనన్న ఆందోళన నిర్వాహకుల్లో నెలకొంది. మరోవైపు ఈ బెలూన్ రెయిడ్స్‌లో పాల్గొన దలచిన వారు ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్న సూచనతో ఇప్పటిదాకా దాదాపు 6500 మంది వరకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. లాటరీ విధానంలో రోజుకు 300 మందిని ఉచితంగా బెలూన్లలో విహరించేందుకు అనుమతిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment