సత్యసాయి: హిందూముస్లింల ఐక్యతకు ప్రతీకగా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మొహర్రం వేడకలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామాల్లోని చావిడిలో పీర్లను కొలువుదీర్చి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు.
గుండం తవ్వకంతో మొదలు..
గ్రామాల్లో గుండం తవ్వకాలతో మొహర్రం వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం ప్రత్యేక ప్రదేశాల్లో భద్రపరచిన పీర్లను వెలికి తీసి శుభ్రం చేసి ప్రత్యేకంగా అలంకరించి 5వ రోజు చావిడిలో ప్రతిష్టిస్తారు. చావిడి వద్ద గుండంలో టన్నుల కొద్దీ కట్టెలు వేసి నిప్పంటిస్తారు. ముజావర్ల ఆధ్వర్యంలో ఆరాధన ప్రక్రియను నిర్వహిస్తారు.
మొదటి ఐదు రోజులు చావిడిలో పీర్లను కొలువుదీర్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. 7వ రోజు చిన్న సరిగెత్తు నిర్వహించి పీర్ల గ్రామోత్సవం చేస్తారు. పదో రోజు పెద్ద సరిగెత్తులో భాగంగా పానకాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అదే రోజు వైభవంగా దీపారాధన ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఈ నెల 28న పెద్ద సరిగెత్తును అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అదే రోజు ఉపవాస దీక్షలతో అగ్ని గుండం ప్రవేశం చేస్తారు. అనంతరం నిప్పుల గుండం పూడ్చి దానిమ్మ, తదితర పండ్ల మొక్కలు నాటడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం.
మొహర్రంతో నూతన సంవత్సరం ఆరంభం
మొహర్రం అంటే ఉర్దూలో త్యాగం, క్షమాపణ అని అర్థం. ఇస్లాం ధర్మం ప్రకారం మొహర్రం నుంచి ఇస్లామిక్ క్యాలెండర్ ఆరంభమవుతుంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం.. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం ఈ నెల 19న ప్రారంభమై 29తో ముగుస్తుంది.
ఇస్లాం ధర్మ పరిరక్షణలో భాగంగా ఇమామ్, హుస్సేన్, తదితర వీరుల సంస్మరణార్థం మొహర్రం నిర్వహిస్తున్నట్లు ముస్లిం మతపెద్దలు చెబుతున్నారు. క్రీ.శ.14వ శతాబ్దంలో ఇరాక్‌లోని కర్బలా ప్రాంతంలో శాంతి స్థాపనకు చేసిన యుద్ధంలో వారు తమ ప్రాణ త్యాగం చేసినట్లుగా చరిత్ర చెబుతోంది. దీంతో అప్పటి నుంచి మొహర్రంను ముస్లింలు సంతాప దినాలుగా నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment