మహిళాభ్యున్నతే లక్ష్యం
పుట్టపర్తి అర్బన్: మహిళాభ్యున్నతే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కలెక్టర్ చేతన్ సూచించారు. శనివారం బ్రాహ్మణపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఎస్పీ రత్న, ఐసీడీఎస్ పీడీ వరలక్ష్మి, డీపీఓ సమత, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజ్ బేగం, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, మెప్మా అధ్యక్షురాలు పద్మావతి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రాజేశ్వరి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా పలు శాఖలకు చెందిన మహిళా సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. ముఖ్య అతిథి కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా కఠిన చర్యలు తీసుకొని పూర్తిగా నిర్మూలించాలన్నారు. ఈ విషయంలో ప్రతి మహిళా ప్రభుత్వానికి తోడ్పాటునందించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల హక్కులు, సామాజిక ఆర్థిక సహకారంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాయన్నారు. ప్రతి మగాడి విజయం వెనుక తల్లి, చెల్లి, అక్క, కూతురూ ఇలా ఎవరో ఒకరు ఉంటారన్నారు. ప్రతి విజయం వెనుక మాతృమూర్తి దీవెన ఉందని, అందుకే లోకంలో తల్లిని మించిన దైవం లేదన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ఎస్పీ రత్న మాట్లాడుతూ జిల్లాలో మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పారు. ప్రతి మహిళా చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, పోక్సో శక్తి యాప్ తదితర అంశాల గురించి క్షుణ్ణంగా వివరించారు. అనంతరం పలువురి మహిళలను మెమొంటోలు, ప్రశంసాపత్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల నృత్య ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది. అనంతరం డీఆర్‌డీఏ ద్వారా మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ కింద 4,380 మందికి రూ.74 కోట్లు, సీ్త్రనిధి ద్వారా 2,979 మందికి రూ.29.79 కోట్లు, మెప్మా ద్వారా 4,205 మందికి రూ.21.34 కోట్లు, ఎంఎస్‌ఎంఈ ద్వారా ఐదుగురికి రూ.60 లక్షలు, పరిశ్రమల ద్వారా ముద్ర స్టాండప్ పథకాల ద్వారా 59 మందికి రూ.4 కోట్లు, పీఎం విశ్వకర్మ పథకం ద్వారా 160 మందికి రూ.1.15 కోట్ల చొప్పున చెక్కులను అందించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి హరికిరణ్, మెప్మా ప్రతినిధులు, డీఆర్‌డీఏ సిబ్బంది, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బాల్య వివాహాలను
పూర్తిగా నిర్మూలించాలి
చట్టాలపై మహిళలకు
అవగాహన ఉండాలి
మహిళా దినోత్సవంలో
కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న
Comments
Please login to add a commentAdd a comment