సత్యసాయి: వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవ చూపుతున్నారు. వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగం ద్వారా విప్లవమే తీసుకురావచ్చని భావించి దేశంలో ఎక్కడా లేని విధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువత, రైతులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడంతోపాటు వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విస్తృత ప్రయోజనాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు.
డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు..
ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్‌కు అనుబంధంగా ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ (ఏపీడీసీ)ను 2018 నవంబరులో ఏర్పాటు చేశారు. ఎం.మధుసూదన్‌రెడ్డి దీనికి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేయటంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో డ్రోన్ల వినియోగాన్ని పెంచేందుకు కార్పొరేషన్ కృషి చేస్తోంది.
డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధి, తయారీ, నిర్వహణ రంగంలో ఉన్న స్టార్టప్ కంపెనీలకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. డీజీసీఏ నిబంధనల మేరకు డ్రోన్ల నిర్వహణను క్రమబద్ధం చేయటంతో పాటు రక్షణాత్మక చర్యలు చేపడుతోంది. డ్రోన్ టెక్నాలజీలో రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఉన్నతంగా నిలబెట్టేందుకు కార్పొరేషన్ కృషి చేస్తోంది.
అన్ని రంగాల్లోనూ డ్రోన్‌ల వినియోగం..
రానున్న కాలంలో రైతులంతా డ్రోన్‌లను వినియోగించే నైపుణ్యం సాధిస్తారని ఏపీ డ్రోన్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆళ్ల రవీంద్రారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా డ్రోన్‌ల వినియోగం అన్ని రంగాల్లో పెరిగిపోతోందని చెప్పారు.
పరిపాలన, పోలీస్, వ్యవసాయం, గనులు, ఇన్సూరెన్స్, మీడియా, వినోద రంగాల్లో డ్రోన్‌లను వినియోగించటం ద్వారా మానవ వనరులు, సమయం, డబ్బు ఆదా అవుతోందని, కచ్చితత్వం ఉంటోందని చెప్పారు. డ్రోన్ వినియోగ నిబంధనలను పౌర విమానయాన శాఖ సడలించినందున డ్రోన్‌ల అభివృద్ధికి పెద్ద ఎత్తున స్టార్టప్ కంపెనీలు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు.
సమగ్ర భూ సర్వేతో ప్రాధాన్యం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూసర్వే కార్యక్రమంలో డ్రోన్‌లను పెద్ద సంఖ్యలో వినియోగిస్తున్నారు. ఆర్బీకేల ద్వారా కిసాన్ డ్రోన్‌లను 50 శాతం సబ్సిడీపై రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. వచ్చే నెలలో మరో 500 కిసాన్ డ్రోన్‌లు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ద్వారా రైతులకు డ్రోన్‌ల వినియోగంలో శిక్షణ ఇస్తున్నారు. పంటలకు ఎరువులు వేయటం, పురుగు మందులు చల్లడం వంటివి డ్రోన్‌ల ద్వారా చేపట్టటం ద్వారా వృథాను అరికట్టడంతో పాటు రైతులను ప్రమాదకర పురుగుమందుల బారి నుంచి రక్షించవచ్చు.
నిబంధనలు సరళతరం..
డ్రోన్‌లు లేదా యూఏవీ (అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్)ల నిర్వహణను చట్టబద్ధం చేస్తూ 2021 ఆగస్టు 26న పౌర విమానయాన శాఖ కొత్త పాలసీని ప్రకటించింది. 2022లో నిబంధనలను మరింత సరళతరం చేస్తూ పాలసీలో సవరణలు తీసుకువచ్చింది. 2 కిలోల లోపు బరువు ఉన్న వినోదం కోసం ఉపయోగించే డ్రోన్‌లను ఆపరేట్ చేసేందుకు ఎలాంటి రిమోట్ పైలెట్ సర్టిఫికెట్ అవసరం లేదు.
డ్రోన్‌లను ప్రభుత్వం అయిదు కేటగిరీలుగా వర్గీకరించింది. 250 గ్రాములలోపు బరువు ఉండేది నానో డ్రోన్. 250–2 కిలోల మధ్య బరువు ఉంటే మైక్రో డ్రోన్. 2 కిలోల నుంచి 25 కిలోల మధ్య బరువు ఉండేవి చిన్న డ్రోన్‌లు. 25–150 కిలోల మధ్య బరువు ఉండే డ్రోన్‌లను మధ్యస్థ డ్రోన్‌లుగానూ 150 కిలోల పైగా బరువు ఉండేవాటిని పెద్ద డ్రోన్‌లుగానూ వర్గీకరించారు.
అనుమతులు తప్పనిసరి..
నానో, మైక్రో కేటగిరీల్లోని నాన్ కమర్షియల్ డ్రోన్‌లను మినహాయిస్తే మిగిలిన అన్ని రకాల డ్రోన్‌ల ఆపరేషన్‌కు డిజిటల్ స్కై ఆన్‌లైన్ ప్లాట్ ఫాం నుంచి ముందస్తు అనుమతులు పొందాల్సిందే...డ్రోన్‌ల ద్వారా సరుకుల రవాణా కోసం ప్రభుత్వం ప్రత్యేక కారిడార్‌లను నిర్దేశిస్తుంది.
రిమోట్ పైలెట్ సర్టిఫికెట్ పొందాలంటే అధీకృత సంస్థలో నిర్దేశిత కాలం పైలెట్ శిక్షణ పొంది ఉండాలి. శిక్షణ సంస్థ నుంచి పొందిన సర్టిఫికెట్‌తో పాటు నైపుణ్య పరీక్ష తర్వాత నిర్దేశిత ఫీజు చెల్లిస్తే డీజీసీఏ(సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం) పైలెట్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది.
ఇది పది సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. కనీసం టెన్త్ పాసై 18 ఏళ్లకుపైబడి 65 సంవత్సరాలలోపు వయస్సు కలిగి, ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థలో శిక్షణ పొందిన ఎవరైనా రిమోట్ పైలెట్ సర్టిఫికెట్ పొందేందుకు అర్హులే.
డ్రోన్‌ల వేగంపై పరిమితులు..
మైక్రో డ్రోన్ భూమికి 60 మీటర్ల ఎత్తుకుపైన, సెకనుకు 25 మీటర్ల వేగానికి మించి ప్రయాణించరాదు. చిన్న డ్రోన్ 120 మీటర్ల ఎత్తుకుపైగా...సెకనుకు 25 మీటర్ల వేగానికి మించి ప్రయాణించరాదు. మధ్యరకం, పెద్ద డ్రోన్‌లు డీజీసీఏ అనుమతుల మేరకు ఆ పరిధిలోనే ప్రయాణించాలి.
నిషేధిత ప్రాంతాల్లో డ్రోన్‌లను ఆపరేట్ చేయటం నేరం. పౌరవిమానయాన శాఖ వెబ్‌సైట్‌లోని మ్యాప్‌లో ఆకుపచ్చ రంగు కలిగిన ప్రాంతంలో డ్రోన్‌లు ప్రయాణించవచ్చు. పసుపురంగు ప్రాంతంలో నిబంధనల మేరకు ప్రయాణించాలి. ఎరుపురంగు సూచించిన ప్రాంతంలో డ్రోన్‌లను అనుమతించరు. అంతర్జాతీయ విమానాశ్రయాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో, ఇతర ఎయిర్‌పోర్టులకు మూడు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్‌లను అనుమతించరు.
అంతర్జాతీయ సరిహద్దులకు 25 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్‌లను నిషేధించారు. హోం మంత్రిత్వ శాఖ నిర్దేశించిన కీలక ప్రాంతాల్లో డ్రోన్‌ల ఆపరేషన్‌కు ప్రత్యేక అనుమతులు తీసుకోవాలి. రాష్ట్ర రాజధాని ప్రాంతాల్లో సెక్రటేరియట్ కాంప్లెక్సుకు మూడు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్‌లను అనుమతించరు. వీటితో పాటు నిషేధిత, ప్రమాదకర ప్రాంతాల్లో డ్రోన్‌లను ఆపరేట్ చేసేందుకు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment