భారీగా పెరిగిన ఉల్లి దిగుబడులు | Massive increase onion yield | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన ఉల్లి దిగుబడులు

Published Mon, Mar 14 2016 2:39 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM

భారీగా పెరిగిన ఉల్లి దిగుబడులు

భారీగా పెరిగిన ఉల్లి దిగుబడులు

2 కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి..
గతం కంటే 14 లక్షల మెట్రిక్ టన్నులు అదనం
9 లక్షల మెట్రిక్ టన్నులు తగ్గిన కూరగాయల ఉత్పత్తి
2015-16 ఉద్యాన పంటల ఉత్పత్తి అంచనాలు విడుదల చేసిన కేంద్రం

 
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉల్లి దిగుబడులు భారీగా పెరిగాయి. గత ఏడాది ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గడం.. ధరలు ఆకాశానికి ఎగబాకడంతో కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. 2015-16 సీజన్‌లో ఉద్యాన పం టల ఉత్పత్తి మొదటి అంచనా నివేదికను కేం ద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఆ నివేదిక వివరాలను తెలంగాణ ఉద్యానశాఖకు పంపించింది. 2014-15లో 29.32 లక్షల ఎకరాల్లో ఉల్లి సాగు చేయగా... అప్పట్లో 1.89 కోట్ల మెట్రిక్ టన్నుల ఉల్లి దిగుబడి వచ్చింది. 2015-16 సీజన్లో 29.45 లక్షల ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. గతేడాది కంటే అదనంగా 13 లక్షల ఎకరాల్లో ఉల్లి సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో 2.03 కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అయింది. గత ఏడాది కంటే అదనంగా 14 లక్షల మెట్రిక్‌టన్నుల దిగుబడి వచ్చింది. తెలంగాణ ఉద్యానశాఖ కూడా ఉల్లి సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు కృషి చేసింది. గతంలో రాష్ట్రంలో 37,500 ఎకరాల్లో ఉల్లిసాగు విస్తీర్ణం ఉం డగా... ఈ ఏడాది అదనంగా మరో 25 వేల ఎకరాల్లో విస్తీర్ణాన్ని పెంచేందుకు కృషి జరి గింది. పైగా ఉల్లిసాగు చేసే రైతులకు ఎకరానికి రూ.5 వేల సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు.
 
కూరగాయలపై కరువు దెబ్బ
కరువు పరిస్థితుల నేపథ్యంలో సాగు విస్తీర్ణం తగ్గడంతో కూరగాయల దిగుబడులు తగ్గాయి. 2014-15లో కూరగాయల సాగు విస్తీర్ణం 2.38 కోట్ల ఎకరాల్లో ఉండగా.. ఆ ఏడాది 16.94 కోట్ల మెట్రిక్ టన్నులు పండాయి. 2015-16లో 2.36 కోట్ల ఎకరాల్లో కూరగాయల సాగు జరగ్గా.. దిగుబడి 16.85 కోట్లకు పడిపోయింది. గత ఏడాది కంటే 9 లక్షల మెట్రిక్ టన్నులు తగ్గింది. వంకాయ, క్యాబేజీ, బీన్స్, క్యాప్సికం తదితర వాటి ఉత్పత్తి భారీగా పడిపోయింది. ఆలుగడ్డ, టమాట దిగుబడులు మాత్రం పెరిగాయి. టమాట 1.82 కోట్ల మెట్రిక్ టన్నులు పండింది. గత ఏడాది కంటే టమాట 19 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా పండటం గమనార్హం. ఆలుగడ్డ 4.80 కోట్ల మెట్రిక్ టన్నులు పండింది. కూరగాయల దిగుబడులు తగ్గడంతో వాటి ధరలు పెరిగే అవకాశం ఉందని గమనించిన కేంద్రం నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది.
 
24 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా పండ్ల దిగుబడి
 దేశవ్యాప్తంగా పండ్ల దిగుబడి గత ఏడాది కంటే 24 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా ఉండటం గమనార్హం. 2014-15లో అన్ని రకాల పండ్ల దిగుబడి 8.66 కోట్ల మెట్రిక్ టన్నులు ఉండగా... 2015-16లో 8.90 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది. గత ఏడాది కంటే సాగు విస్తీర్ణం పెరగడమే ఇందుకు కారణం. ఇదిలావుంటే సుగంధ ద్రవ్యాలు గత ఏడాది 28.09 కోట్ల మెట్రిక్ టన్నులు కాగా... ఈ ఏడాది 28.24 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement