Onion cultivation
-
ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారిస్తున్న రైతులు
-
మట్టి బాట మాయం.. మురుగు నీరు దూరం
(జి. రాజశేఖర్‌నాయుడు, కర్నూలు): కర్నూలు జిల్లా మండల కేంద్రం దేవనకొండకు 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఐరన్‌బండ బీ సెంటర్ గ్రామం. ఉదయం 7 గంటలకు కర్నూలు నుంచి బయలుదేరితే రెండు గంటల ప్రయాణం. 9 గంటల ప్రాంతంలో దారిలో ఉల్లి నాట్లు వేయిస్తున్న మద్దిలేటి అనే రైతును ‘సాక్షి ’పలుకరించింది. గత ఏడాది రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశానని, ధర బాగా ఉండడం వల్ల క్వింటాల్ రూ.4,800కు అమ్ముడుపోగా మొత్తం రూ.8 లక్షలు చేతికొచ్చిందని సంతోషంగా చెప్పాడు. ఈ ఏడాదీ ధరలు బాగా ఉంటాయనే రెండు ఎకరాల్లో తిరిగి ఉల్లి సాగు చేస్తున్నానన్నాడు. గ్రామంలోకి అడుగుపెట్టగా బందే నవాజ్, ప్రకాశం అనే యువకులు ఎదురయ్యారు. గ్రామంలో ఫ్లోరైడ్ సమస్య ఉందని, మినరల్ వాటర్ ప్లాంట్ పాడైనందున నాలుగు కిలోమీటర్లు నడచి వెళ్లి తాగునీటిని తెచ్చుకునేవారమని చెప్పారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే చర్యలు తీసుకున్నారని తెలిపారు. ► గ్రామ సచివాలయం సమీపంలో చెట్టు కింద కొందరు వృద్ధులు కూర్చొని ఉన్నారు. ప్రభుత్వంతో ఏ పని ఉన్నా దేవనకొండకు వెళ్లాల్సిన అవసరం ఇప్పుడు లేదన్నారు. అన్ని పనులు ఊర్లోనే జరిగిపోతున్నాయని చెప్పారు. దశాబ్దాలుగా కంకర తేలిన రోడ్డుపై ప్రయాణంతో ఇబ్బంది పడేవాళ్లం.. సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన అనంతరం రోడ్డు కోసం ఇచ్చిన అర్జీపై వెంటనే స్పందన లభించింది. రూ.3.50 కోట్లతో నేడు కరివేముల మెయిన్ రోడ్డు నుంచి తమ గ్రామం వరకు 6 కి.మీ. మేర రోడ్డు నిర్మించినట్లు చెప్పారు . ► పుట్టుకతోనే దివ్యాంగుడైన కొడుకు(11) పింఛన్ కోసం తల్లి బోయ రంగమ్మ గతంలో ఆరేళ్ల పాటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగింది. ఎలాగైనా పింఛన్ వచ్చేలా చూడాలని కూలీనాలీ చేసిన సొమ్ము రూ.10 వేల వరకు ఖర్చు చేసింది. ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. గ్రామ వలంటీరుకు చెప్పగానే సమస్య పరిష్కారమైంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయించి నెలకు రూ.3 వేలు పింఛన్ ఇంటికే తెచ్చి ఇస్తున్నారని రంగమ్మ చెప్పింది. ► వర్షాకాలంలో గ్రామంలోని అంతర్గత రోడ్లు మురుగు నీటితో నిండిపోయేవి. ప్రస్తుతం రూ.18 లక్షల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. ► ఇంకా స్ధానికులు ఏమన్నారంటే...రేషన్‌కార్డు లేదని, ప్రభుత్వ పథకం మంజూరు కాలేదని చెబితే, వెంటనే సచివాలయంలో కారణం వివరిస్తున్నారు. ఆయా సమస్యలకు పరిష్కారమార్గాన్ని చూపుతున్నారు. రైతులకు సంబంధించిన పాసు పుస్తకాలు, అడంగల్ సమస్యలు వేగంగా పరిష్కారం అవుతున్నాయి. ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరు ఉపయోగించుకుంటున్నారు. పెట్టుబడి సాయం అందింది కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభిస్తోంది. పెట్టుబడి కోసం అధిక వడ్డీలకు అప్పులు చేయకుండా గత ఏడాది నుంచి ఆర్ధిక సాయం అందిస్తున్నారు.ఇçప్పుడు అందిన సాయంతో వ్యవసాయానికి మందులు, విత్తనాలు తెచ్చుకున్నాను. – పెద్ద శేషన్న, రైతు అమ్మ ఒడి కింద రూ.15 వేలు ఇచ్చారు నా కొడుకు దావీదు 2వ తరగతి చదువుతున్నాడు. అమ్మ ఒడి పథకం కింద రూ.15 వేలు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన ఈ డబ్బును పొదుపుగా కొడుకు చదువుకు వినియోగిస్తాను. పేద పిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపుతున్నందుకు రుణపడి ఉంటాం. – రంగవేణి, గృహిణి మా ఊరు రోడ్డు బాగుపడింది ఎన్నో ఏళ్లుగా ఎవరూ పట్టించుకోని రోడ్డు బాగుపడింది. గతంలో ఈ రోడ్డుపై ప్రయాణం అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని చేయాల్సి వచ్చేది. కొత్త రోడ్డు వేయాలని కోరిన వెంటనే తారురోడ్డు వేశారు. – నాయక్ సుభాన్ -
ఉల్లి.. లొల్లి..
సాక్షి, నారాయణఖేడ్: ఉల్లి సాగు చేసే రైతులకు ఈ ఏడాది కూడా కష్టాలు తప్పేలా లేవు. ప్రతీ ఏటా కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి విత్తనాలు ఈ ఏడాదీ ఏడిపిస్తున్నాయి. ఉద్యానవన శాఖ పంపిణీ చేసే సబ్సిడీ విత్తనాలు రెండేళ్లుగా రావడమే లేదు. సబ్సిడీ విత్తనాలు అందక రైతులపై ఆర్థిక భారం తప్పడం లేదు. జిల్లాలో ఉల్లి విత్తనాలు దొరకక పక్క రాష్ట్రమైన మహారాష్ట్రకు పరుగులు తీయాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో దాదాపుగా మూడు వేల ఎకరాల్లో సాగయ్యే ఉల్లి గురించి పట్టించుకున్న నాథుడే లేకుండాపోయాడు. ఉల్లి సాగు చేసే రైతులకు ఏటా కష్టాలు తప్పడం లేదు. విత్తన సమస్య వారిని నిత్యం వేధిస్తూనే ఉంది. సమస్య ఎలా ఉన్నా ఈ రబీ సీజన్లో ఉల్లి సాగు చేసేందుకు రైతులు రెడీ అయిపోయారు. కొన్ని చోట్ల దుక్కులు దున్నుతుండగా అక్కడక్కడా ఉల్లి నారు కూడా పోశారు. ఉల్లి నారు చల్లడానికి రైతులు జిల్లాలో తీవ్ర విత్తన కొరతను ఎదుర్కొంటున్నారు. చేసిదిలేక పక్కనున్న మహారాష్ట్రలోని పండరిపూర్, సోలాపూర్ ప్రాంతాలకు వెళ్లి ఉల్లి విత్తనాలు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఉద్యాన వనశాఖ అధికారులు సబ్సిడీపై ఉల్లి విత్తనాలు అందించేవారు. కానీ రెండేళ్లుగా సబ్సిడీ విత్తనాల పంపిణీని నిలిపివేయడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉల్లిగడ్డను మార్కెట్‌కు తరలిస్తున్న రైతులు (ఫైల్) గతంలో శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీలో కేజీ విత్తనాలు రూ. 250 నుంచి రూ.350 వరకు ఇచ్చేవారని రైతులు తెలిపారు. దీంతో ఎంతగానో సౌకర్యవంతంగా ఉండేదని పేర్కొంటున్నారు. సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం బంద్ చేయడంతో ఇబ్బందులు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. మహారాష్ట్రలో కిలో విత్తనాలను రూ.1250 నుండి 1500 చొప్పున తీసుకువస్తున్నామని పేర్కొంటున్నారు.దీంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరం సాగుకు రెండు కిలోల ఉల్లి విత్తనాలు అవసరం ఉంటాయని రైతులు తెలిపారు. నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో ఉల్లి ఎక్కువగా సాగు చేస్తున్నారు. నారాయణఖేడ్, మనూరు, నాగల్గిద్ద, అందోల్ పరిధిలోని వట్పల్లి, రేగోడ్, జహీరాబాద్, రాయికోడ్, కోహీర్, న్యాల్కల్ ప్రాంతాల్లో ఉల్లి సాగవుతుంది. సంగారెడ్డి పరిధిలో కాస్తా తక్కువ ఉల్లిసాగు ఉంటుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. పండరీపూర్ నుంచి తెచ్చుకుంటున్నాం గతంలో సబ్సిడీపై ఉల్లి విత్తనాలు ఇచ్చేవారు. దాంతో మాకు ఎంతో సౌలత్ ఉండేది. రెండుళ్లుగా సబ్సిడీ విత్తనాలు ఇస్తలేరు. అధికారులను అడిగితే సర్కారు నుండి రావడం లేదని చెప్తున్నారు. చేసేదిలేక పండరిపూర్‌కు వెళ్లి పంచగంగ విత్తనాలు రూ.1500 చొప్పున తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇక్కడ కొనాలంటే రూ. 2 వేలకు కిలో ఇస్తున్నారు. అధికారులు, నాయకులు రైతులకు న్యాయం చేయాలి. రైతులను ఆదుకోకపోతే ఎలా? కిలోకు వెయ్యి మిగిలినా మాకు రెండు కలుపుల ఖర్చు ఎల్లుతుంది. –శివాజిరావు పాటిల్, మాయికోడ్ సబ్సిడీ అంశం మా పరిధిలోది కాదు రైతులకు సబ్సిడీపై మేం రెండేళ్ల క్రితం వరకు ఉల్లితోపాటు ఇతర కూరగాయ విత్తనాలు అందించాం. ప్రస్తుతం ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం లేదు. దీంతో రైతులకు సబ్సిడీ విత్తనాలు అందించలేకపోతున్న మాట వాస్తవమే. సబ్సిడీపై ఉల్లి విత్తనాలు అందించాలని చాలా మంది రైతులు మాకు విన్నవిస్తున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం. –సునీత, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి సబ్సిడీ విత్తనాలివ్వాలి ప్రభుత్వం ఉల్లి సాగు చేస్తున్న రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా సాగుచేస్తున్న రైతులకు సబ్సిడీపై విత్తనాలు ఇస్తే మాకు కాస్త పెట్టుబడి భారం తగ్గడంతోపాటు ప్రభుత్వం అందించే విత్తనాలపై నమ్మకం ఉంటుంది. ఈ దిశగా అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. –సుభాష్‌రావు, రాణాపూర్ -
ధరలేక దిగాలు
భారీగా నష్టపోతామంటూ ఉల్లి రైతు ఆందోళన పెట్టుబడులు కూడా రాని వైనం తాడేపల్లి రూరల్ : నారు వేసే సమయంలో రైతులను ఊరించిన ఉల్లి.. పంట చేతికొచ్చే సమయంలో కంటనీరు తెప్పిస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సంవత్సరం కనీసం పెట్టుబడులైనా వచ్చే సూచనలు కనబడడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఈ ఏడాది దాదాపు 1300 ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. గతేడాది పంట లాభసాటిగా ఉండడంతో ఈ ఏడాది రైతులు ఉత్సాహంతో సాగుచేశారు. అయితే నాట్లు వేసే సమయంలో కేజీ ఉల్లిపాయలు రూ. 20 ఉండగా, ప్రస్తుతం రూ.7 కు చేరింది. దీంతో రైతులు దిగాలు పడుతున్నారు. పంట దిగుబడి వస్తే ఎకరాకు రూ. 30 వేలు, దిగుబడి తగ్గితే రూ. 60 వేల చొప్పున నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి ఇలా... జిల్లాలు దాటి నారు కొనుగోలు చేయడంతో నారు ఖర్చు ఒక్కటే రూ. 20 వేలు అవుతోంది. నారు కొనుగోలు చేసిన తరువాత దుక్కికి ఎకరాకు రూ. 1800, సాళ్లు చేయడానికి ఇద్దరు కూలీలకు రూ. 1000, నాటు వేయడానికి 26 మందికి రూ. 5200, దమ్ము చేయడానికి రూ. 2500, ఎరువులు, పురుగు మందులకు రూ. 20 వేలు, కలుపు తీయడానికి (4సార్లు) రూ. 5600, నీటి తడి పెట్టేందుకు రూ 2500, కోత కోసేందుకు రూ. 7600, మోత కూలీకి రూ. 2500 మొత్తం రూ. 68,700 అవుతోంది. ఇదిగాక రాజధాని పుణ్యమా అంటూ కౌలు అమాంతంగా పెరిగి రూ. 40 వేలకు చేరింది. ఉల్లి పంట ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. కౌలుతో కలిపి మొత్తం రూ. 88,700 పెట్టుబడి అవుతోంది. బాగా ఊరిన పంట పొలాల్లో ఉల్లి దిగుబడి 180 బస్తాలు కాగా, ఊరని పొలాలలో 90 బస్తాలు మాత్రమే అయ్యాయి. కేజి రూ. 7 చొప్పున 40 కేజీల బస్తా రూ. 280కు అమ్ముడు పోతుండగా, 180 బస్తాలకు రూ. 50,400 వస్తోంది. నష్టం రూ. 38, 300 వస్తోందని రైతులు లెక్కలు చెబుతున్నారు. అలాగే ఉల్లి గడ్డ ఊరని పొలాల్లో రాబడి రూ. 25,200 కాగా, నష్టం రూ. 63,500 వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు నియోజక వర్గంలో పండిన ఉల్లి రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు చెన్నై, బెంగుళూరు, భువనేశ్వర్‌లకు ఎగుమతి అవుతుంది. ఎంత ప్రసిద్ధి చెందినా రైతుకి మాత్రం ప్రతిఫలం అందడం లేదని వాపోతున్నారు. అంతేకాక తాతలు తండ్రుల నుంచి ఉల్లి పండిస్తున్నా వ్యవసాయ అధికారులు నారుమళ్లు పెంపకం గురించి, వాటి పోషణ గురించి వివరించకపోవడం వల్ల భారీ పెట్టుబడులు పెట్టాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. రేటు చూస్తే భయమేస్తోంది ఎకరంన్నరలో ఉల్లి సాగు చేశాను. రేటు చూసి భయమేస్తోంది. చేతికి వచ్చిన పంటను భూమిలో నుంచి పీకి మార్కెట్‌కు తరలిస్తే ఎంత నష్టం వస్తుందో అర్థం కావడం లేదు. పంట పీకాలా? వద్దా? అని ఆలోచిస్తున్నాను. మరో పది రోజుల్లో పీకకపోతే భూమిలోనే ఉల్లి గడ్డలు కుళ్లిపోతాయి. రేటు పెరుగుతుందేమోనని ఆశతో ఎదురు చూస్తున్నాను. – తమ్మా నాగిరెడ్డి, ఉండవల్లి -
పెరిగిన ఉల్లి సాగు విస్తీర్ణం
వేముల :ఈ ఏడాది ఉల్లి సాగు గణనీయంగా పెరిగింది. పులివెందుల నియోజకవర్గంలో 2650 ఎకరాలకుపైనే ఉల్లి సాగైంది. సాగుకు పెట్టుబడులు అధికమైనా.. ఆశాజనకంగా ధరలు ఉంటాయనే నమ్మకంతో ఉల్లిపైనే దృష్టి పెట్టి సాగు చేశామని రైతులు అంటున్నారు. కాగా నియోజకవర్గంలో వేముల మండలంలోనే ఉల్లి సాగు ఎక్కువగా సాగైంది. మామూలుగా ఉల్లిని మే నెలలోనే రైతులు సాగు చేస్తారు. అయితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో సాగుకు అనుకూలించలేదు. సాగు చేసినా.. అధిక వేడికి ఉల్లి మొలక రాకపోతే నష్టపోతామని రైతులు సాగుకు ఆలస్యం చేశారు. దీంతో జూన్ నెలలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉల్లి పంటను రైతులు సాగు చేసుకున్నారు. అంతేకాక గత ఏడాది తుఫాన్ ప్రభావంతో నవంబరు నెలలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు ప్రవహించాయి. దీని ప్రభావంతో బోర్లలో భూగర్భజలాలు ఉండటంతో వ్యవసాయ బోర్ల కింద ఉల్లి పంటను సాగు చేశారు. పెరిగిన విస్తీర్ణం : గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 20శాతం మేర ఉల్లి సాగు పెరిగింది. గత ఏడాది 2150 ఎకరాల్లో సాగైతే.. ఈ ఏడాది 2650ఎకరాల్లో సాగైంది. పంట కాలం ఎక్కువైనా రైతులు ఉల్లి సాగుకే మొగ్గు చూపారు. గత ఏడాది ముందుగా ఉల్లి సాగు చేసుకున్న రైతులు అధిక ఆదాయం పొందారు. ఎకరాకు రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఆదాయం వచ్చింది. అందుకే ఈ ఏడాది కూడా కొంతమంది రైతులు ముందస్తుగానే అనుకున్న సమయానికి దిగుబడులు వచ్చేలా సాగు చేసుకున్నారు. పెట్టుబడులు అధికమైనా.. : ఉల్లి సాగులో పెట్టుబడులు ఎక్కువైనా.. సాగుకు రైతులు వెనుకాడలేదు. సాగు చేసే సమయంలో ఎకరాకు రూ.10వేలకుపైనే పెట్టుబడులు అవుతున్నాయి. అలాగే ఉల్లిలో దిగుబడులు చేతికొచ్చేవరకు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఉల్లి ఎక్కువగా నీటి తడులు అందించాల్సి రావంతో గడ్డి ఎక్కువగా ఉంటుంది. ఇందుకోసం కూలీల ఖర్చు తడిసి మోపెడవుతోంది. పంట కాలం 6నెలలు కావడంతో పంటను పీకివేసే వరకు కలుపు తీయాల్సి ఉంటుంది. అంతేకాక అదనంగా ఎరువులు వేయడంతో పెట్టుబడులు పెరిగిపోతున్నాయని రైతులు అంటున్నారు. ఆశాజనకంగా ధరలు ఉంటాయని.. : దిగుబడులు చేతికందే సమయానికి ఆశాజనకంగా మార్కెట్ ధరలు ఉంటాయనే ఉల్లి సాగు చేశామని రైతులు అంటున్నారు. దీంతో పెట్టుబడులు అధికమవుతున్నా రైతులు వెనుతిరిగి చూడలేదు. అంతేకాక సాగులో దిగుబడులు తగ్గినా ధరలతో మంచి ఆదాయం ఉంటుందని రైతులు భావిస్తున్నారు. భూగర్భజలాలు ఉండటంతోనే.. : ఈ ఏడాది బోర్లల్లో భూగర్భజలాలు ఉండటంతో ఉల్లి సాగు పెరిగింది. సాగులో దిగుబడులు వచ్చే సమయానికి ధరలు ఉంటాయని రైతులు భావిస్తున్నారు. దీంతోనే నియోజకవర్గంలో ఉల్లి సాగు గణనీయంగా పెరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే 20శాతం మేర ఉల్లి సాగు పెరిగింది.– రాఘవేంద్రారెడ్డి(హెచ్‌వో), పులివెందుల . -
మహారాష్ట్రకు ఖేడ్ రైతులు
♦ ఉల్లి సాగుపై త్వరలో అధ్యయనం రూ.400 కోట్లతో డ్రిప్పు ♦ ఎక్కడా లేని సబ్సిడీ మన దగ్గరే.. ♦ ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి నారాయణఖేడ్: రాష్ట్రంలో ఉల్లిసాగును లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. నారాయణఖేడ్ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఉల్లిసాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహారాష్ట్రలో ఉల్లి రైతులు ఆర్థికంగా ఎలా ఎదుగుతున్నారో అధ్యయనం చేసేందుకు ఈ ప్రాంత రైతులను రెండు బస్సుల్లో తీసుకెళ్తామన్నారు. అధ్యయనం తరువాత గిడ్డంగుల నిర్మాణం తదితర అంశాలపై దృష్టి సారిస్తామన్నారు. ఎక్కడా లేనివిధంగా సబ్సిడీ... బిందు, తుంపర సేద్యానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు కేటాయించిందని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధం గా రాష్ట్రంలో స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ పైపులను సబ్సిడీ రూపంలో రైతులకు అందజేస్తున్నామని చెప్పారు. ఉద్యాన, పట్టు పరిశ్రమ, సూక్ష్మ సాగు కోసం పలు పథకాల అమలుకు మండల స్థాయిలో అధికారులను నియమించి నట్టు తెలిపారు. ఉల్లి రైతుల కోసం రూ.200 కోట్లతో పాలీహౌస్‌లు నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. ఎకరాలోపు దాదాపు 100 నుంచి 120 క్వింటాళ్ల ఉల్లిని పండించేలా కృషి చేయాలన్నారు. అధునాతన వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి సేంద్రి య పద్ధతిలో పంటలను సాగుచేస్తే అధిక దిగుబడులు సాధ్యమన్నారు. ఉల్లితోపాటు కూరగాయలూ సాగుచేసుకోవాలని సూచించారు. ఖేడ్‌ను సస్యశ్యామలం చేస్తాం: ఎమ్మెల్యే ఖేడ్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి అన్నారు. గోదావరి నీటిని ఈ ప్రాంత ప్రజలకు అందించి పంటలు బాగా పండేలా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. నియోజకవర్గంలో భూగర్భ జలాలు తక్కువగా ఉన్నందున బిందు, తుంపర సేద్యంపై గ్రామీణ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. ఉల్లి గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. ఉద్యాన శాఖ డిప్యూటీ డెరైక్టర్ రామలక్ష్మి మాట్లాడుతూ... రైతులు స్ప్రింక్లర్లు, డ్రిప్ ఉపయోగించి ఆరుతడి పంటలు సాగు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. సమావేశంలో ఎంపీపీ సంజీవరెడ్డి, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డెరైక్టర్లు సోమేశ్వర్రావు, లత, ఆత్మ చైర్మన్ భాస్కర్, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
భారీగా పెరిగిన ఉల్లి దిగుబడులు
2 కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి.. గతం కంటే 14 లక్షల మెట్రిక్ టన్నులు అదనం 9 లక్షల మెట్రిక్ టన్నులు తగ్గిన కూరగాయల ఉత్పత్తి 2015-16 ఉద్యాన పంటల ఉత్పత్తి అంచనాలు విడుదల చేసిన కేంద్రం హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉల్లి దిగుబడులు భారీగా పెరిగాయి. గత ఏడాది ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గడం.. ధరలు ఆకాశానికి ఎగబాకడంతో కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. 2015-16 సీజన్లో ఉద్యాన పం టల ఉత్పత్తి మొదటి అంచనా నివేదికను కేం ద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఆ నివేదిక వివరాలను తెలంగాణ ఉద్యానశాఖకు పంపించింది. 2014-15లో 29.32 లక్షల ఎకరాల్లో ఉల్లి సాగు చేయగా... అప్పట్లో 1.89 కోట్ల మెట్రిక్ టన్నుల ఉల్లి దిగుబడి వచ్చింది. 2015-16 సీజన్లో 29.45 లక్షల ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. గతేడాది కంటే అదనంగా 13 లక్షల ఎకరాల్లో ఉల్లి సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో 2.03 కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అయింది. గత ఏడాది కంటే అదనంగా 14 లక్షల మెట్రిక్‌టన్నుల దిగుబడి వచ్చింది. తెలంగాణ ఉద్యానశాఖ కూడా ఉల్లి సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు కృషి చేసింది. గతంలో రాష్ట్రంలో 37,500 ఎకరాల్లో ఉల్లిసాగు విస్తీర్ణం ఉం డగా... ఈ ఏడాది అదనంగా మరో 25 వేల ఎకరాల్లో విస్తీర్ణాన్ని పెంచేందుకు కృషి జరి గింది. పైగా ఉల్లిసాగు చేసే రైతులకు ఎకరానికి రూ.5 వేల సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. కూరగాయలపై కరువు దెబ్బ కరువు పరిస్థితుల నేపథ్యంలో సాగు విస్తీర్ణం తగ్గడంతో కూరగాయల దిగుబడులు తగ్గాయి. 2014-15లో కూరగాయల సాగు విస్తీర్ణం 2.38 కోట్ల ఎకరాల్లో ఉండగా.. ఆ ఏడాది 16.94 కోట్ల మెట్రిక్ టన్నులు పండాయి. 2015-16లో 2.36 కోట్ల ఎకరాల్లో కూరగాయల సాగు జరగ్గా.. దిగుబడి 16.85 కోట్లకు పడిపోయింది. గత ఏడాది కంటే 9 లక్షల మెట్రిక్ టన్నులు తగ్గింది. వంకాయ, క్యాబేజీ, బీన్స్, క్యాప్సికం తదితర వాటి ఉత్పత్తి భారీగా పడిపోయింది. ఆలుగడ్డ, టమాట దిగుబడులు మాత్రం పెరిగాయి. టమాట 1.82 కోట్ల మెట్రిక్ టన్నులు పండింది. గత ఏడాది కంటే టమాట 19 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా పండటం గమనార్హం. ఆలుగడ్డ 4.80 కోట్ల మెట్రిక్ టన్నులు పండింది. కూరగాయల దిగుబడులు తగ్గడంతో వాటి ధరలు పెరిగే అవకాశం ఉందని గమనించిన కేంద్రం నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది. 24 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా పండ్ల దిగుబడి దేశవ్యాప్తంగా పండ్ల దిగుబడి గత ఏడాది కంటే 24 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా ఉండటం గమనార్హం. 2014-15లో అన్ని రకాల పండ్ల దిగుబడి 8.66 కోట్ల మెట్రిక్ టన్నులు ఉండగా... 2015-16లో 8.90 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది. గత ఏడాది కంటే సాగు విస్తీర్ణం పెరగడమే ఇందుకు కారణం. ఇదిలావుంటే సుగంధ ద్రవ్యాలు గత ఏడాది 28.09 కోట్ల మెట్రిక్ టన్నులు కాగా... ఈ ఏడాది 28.24 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది. -
ఉల్లి రైతులకు రూ.5 వేల సబ్సిడీ
ప్రభుత్వానికి ఉద్యానశాఖ ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉల్లి సాగును ప్రోత్సహించేందుకు రైతులకు ఎకరానికి రూ.5 వేల సబ్సిడీ ఇవ్వాలని ఉద్యాన శాఖ యోచిస్తోంది. ఈ మేర కు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తెలిసింది. ప్రస్తుతం 75 శాతం రాయితీతో ఉల్లి విత్తనాలు సరఫరా చేస్తున్నారు. దీంతోపాటు ఉల్లి సాగు చేసే రైతులకు రూ.5 వేలు సబ్సిడీ ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15 వేల హెక్టార్లలో ఉల్లి సాగు చేస్తుండగా... మరో 10 హెక్టార్లకు పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఉల్లి సాగు కోసం ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేసి ఉల్లి సాగు చేసే రైతులను గుర్తించారు. ప్రస్తుతం ఎకరానికి రూ. 60 వేల వరకు ఖర్చుచేస్తే కేవలం 6 టన్నుల ఉల్లి మాత్రమే పండుతోంది. దీంతో కొత్తగా విత్తనం తీసుకొచ్చారు. అది ఎకరానికి 12 టన్నుల దిగుబడి ఇస్తుంది. ప్రస్తుతం కిలో ఉల్లి ఉత్పత్తి చేయాలంటే రూ. 10 ఖర్చు అవుతోంది. ఈ నేపథ్యంలో కనీస మద్దతు ధర ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. -
రెండింతలైన ఉల్లిసాగు
నాసిక్: సామాన్యులకే కాదు అధికారంలో ఉన్న పెద్దలకు దడపుట్టిస్తున్న ఉల్లి ధర మరికొద్ది రోజుల్లో చుక్కల్లోంచి నేలకు దిగిరావచ్చంటున్నారు రాష్ట్ర వ్యవసాయ అధికారులు. ఉల్లిపంటకు పుట్టిల్ల్లయిన నాసిక్ ప్రాంతంలో ఈ సంవత్సరం ఖరీఫ్, లేట్ ఖరీఫ్‌లో పంట విస్తీరణం రెట్టింపయింది. గత ఖరీఫ్ కాలంలో 6,626 హెక్టార్లలో పంటసాగుకాగా, ఈ సంవత్సరం అది 17,473 హెక్టార్లకు చేరింది. ‘‘పంట విస్తీర్ణం పెరిగిన దృష్ట్యా దిగుబడులు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం 3,49,460 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది’’ అని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ఆర్ బొంబే తెలిపారు. ‘‘ఖరీఫ్ తర్వాత ఆలస్యంగా సాగు చేసేవారివల్ల కూడా పంటసాగు బాగా పెరిగింది. ఈ సంవత్సరం 31,197 హెక్టార్ల విస్తీర్ణంలో సాగయింది. లేట్ ఖరీఫ్‌కు సంబంధించిన పంట దిగుబడులు కూడా 5,92,743 టన్నులకు పెరిగే అవకాశం ఉంది. డిసెంబర్-జనవరి మాసాల్లో రాష్ట్ర ఉల్లి మార్కెట్లను ముంచెత్తనుందని అధికారులంటున్నారు. దిగుబడులు బాగా పెరగడంతో ధరలు పడిపోయే అవకాశం ఉంది. ఇది రైతులకు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది’’ అని వ్యవసాయ అధికారి వివరించారు. ఈ సంవత్సరం వర్షాలు కూడా చాలనన్ని ఉండి వాతావరణం ఉల్లిసాగుకు అనుకూలంగానే ఉంది. అయితే నాసిక్ ప్రాంతంలో ఖరీఫ్‌లో ఆలస్యంగా సాగుకు వినియోగించే ఉల్లి రకాల నిల్వ కాలం చాలా తక్కువ. దీంతో రైతులు తప్పనిసరిగా వ్యాపారుల కోరిన ధరలకే ఇవ్వాల్సి రావొచ్చు. నవంబర్ నుంచి ధరలు కొంత నిలకడగా మారినా డిసెంబర్ నాటికి పరిస్థితి రైతులకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులంటున్నారు. వ్యాపారులు కూడా కొనుగోలు చేసిన సరుకును రబీ సరుకులా నిల్వచేసుకొనే అవకాశం లేనందున మార్కెట్ ధరలపై బాగానే ప్రభావం చూపుతుంది. వ్యాపారులు సరుకును ఇబ్బడిముబ్బడిగా నిల్వ చేసుకొనే అవకాశం లేదు. రబీ పంట నిల్వ ఎక్కువ కాలం ఉంటుంది. ఉల్లికి మద్ధతు ధర కోరుతూ మహారాష్ట్ర షేత్కారీ సంఘటన్ మార్చిలో భారీ ఆందోళన నిర్వహించింది. ఈ సంవత్సరం 90 శాతం సగటు దిగుబడులు సాధించే అవకాశ ఉందని అధికారులంటున్నారు.