మహారాష్ట్రకు ఖేడ్ రైతులు | khed formers tour to maharastra | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రకు ఖేడ్ రైతులు

Published Thu, Jun 23 2016 1:56 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

మహారాష్ట్రకు ఖేడ్ రైతులు - Sakshi

మహారాష్ట్రకు ఖేడ్ రైతులు

ఉల్లి సాగుపై త్వరలో అధ్యయనం రూ.400 కోట్లతో డ్రిప్పు
ఎక్కడా లేని సబ్సిడీ మన దగ్గరే..
ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి

 నారాయణఖేడ్: రాష్ట్రంలో ఉల్లిసాగును లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. నారాయణఖేడ్ మండల పరిషత్ కార్యాలయ  సమావేశ మందిరంలో బుధవారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఉల్లిసాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహారాష్ట్రలో ఉల్లి రైతులు ఆర్థికంగా ఎలా ఎదుగుతున్నారో అధ్యయనం చేసేందుకు ఈ ప్రాంత రైతులను రెండు బస్సుల్లో తీసుకెళ్తామన్నారు. అధ్యయనం తరువాత గిడ్డంగుల నిర్మాణం తదితర అంశాలపై దృష్టి సారిస్తామన్నారు.

 ఎక్కడా లేనివిధంగా సబ్సిడీ...
బిందు, తుంపర సేద్యానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు కేటాయించిందని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధం గా రాష్ట్రంలో స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ పైపులను సబ్సిడీ రూపంలో రైతులకు అందజేస్తున్నామని చెప్పారు. ఉద్యాన, పట్టు పరిశ్రమ, సూక్ష్మ సాగు కోసం పలు పథకాల అమలుకు మండల స్థాయిలో అధికారులను నియమించి నట్టు తెలిపారు. ఉల్లి రైతుల కోసం రూ.200 కోట్లతో పాలీహౌస్‌లు నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. ఎకరాలోపు దాదాపు 100 నుంచి 120 క్వింటాళ్ల ఉల్లిని పండించేలా కృషి చేయాలన్నారు. అధునాతన వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి సేంద్రి య పద్ధతిలో పంటలను సాగుచేస్తే అధిక దిగుబడులు సాధ్యమన్నారు. ఉల్లితోపాటు కూరగాయలూ సాగుచేసుకోవాలని సూచించారు.

 ఖేడ్‌ను సస్యశ్యామలం చేస్తాం: ఎమ్మెల్యే
ఖేడ్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి అన్నారు. గోదావరి నీటిని ఈ ప్రాంత ప్రజలకు అందించి పంటలు బాగా పండేలా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. నియోజకవర్గంలో భూగర్భ జలాలు తక్కువగా ఉన్నందున బిందు, తుంపర సేద్యంపై గ్రామీణ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. ఉల్లి గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. ఉద్యాన శాఖ డిప్యూటీ డెరైక్టర్ రామలక్ష్మి మాట్లాడుతూ... రైతులు స్ప్రింక్లర్లు, డ్రిప్ ఉపయోగించి ఆరుతడి పంటలు సాగు  ఆర్థికంగా ఎదగాలని సూచించారు. సమావేశంలో ఎంపీపీ సంజీవరెడ్డి, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డెరైక్టర్లు సోమేశ్వర్‌రావు, లత, ఆత్మ చైర్మన్ భాస్కర్, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement