ఉల్లి.. లొల్లి.. | Joint Medak District Farmers Not Getting Onion Seeds On Subsidy | Sakshi
Sakshi News home page

ఉల్లి.. లొల్లి..

Published Sat, Sep 14 2019 12:23 PM | Last Updated on Sat, Sep 14 2019 12:23 PM

Joint Medak District Farmers Not Getting Onion Seeds On Subsidy - Sakshi

సాక్షి, నారాయణఖేడ్‌: ఉల్లి సాగు చేసే రైతులకు ఈ ఏడాది కూడా కష్టాలు తప్పేలా లేవు. ప్రతీ ఏటా కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి విత్తనాలు ఈ ఏడాదీ ఏడిపిస్తున్నాయి. ఉద్యానవన శాఖ పంపిణీ చేసే సబ్సిడీ విత్తనాలు రెండేళ్లుగా రావడమే లేదు. సబ్సిడీ విత్తనాలు అందక రైతులపై ఆర్థిక భారం తప్పడం లేదు. జిల్లాలో ఉల్లి విత్తనాలు దొరకక పక్క రాష్ట్రమైన మహారాష్ట్రకు పరుగులు తీయాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు  వాపోతున్నారు.         

జిల్లాలో దాదాపుగా మూడు వేల ఎకరాల్లో సాగయ్యే ఉల్లి గురించి పట్టించుకున్న నాథుడే లేకుండాపోయాడు. ఉల్లి సాగు చేసే రైతులకు ఏటా కష్టాలు తప్పడం లేదు. విత్తన సమస్య వారిని నిత్యం వేధిస్తూనే ఉంది. సమస్య ఎలా ఉన్నా ఈ రబీ సీజన్‌లో ఉల్లి సాగు చేసేందుకు రైతులు రెడీ అయిపోయారు. కొన్ని చోట్ల దుక్కులు దున్నుతుండగా అక్కడక్కడా ఉల్లి నారు కూడా పోశారు. ఉల్లి నారు చల్లడానికి రైతులు జిల్లాలో తీవ్ర విత్తన కొరతను ఎదుర్కొంటున్నారు. చేసిదిలేక పక్కనున్న మహారాష్ట్రలోని పండరిపూర్, సోలాపూర్‌ ప్రాంతాలకు వెళ్లి ఉల్లి విత్తనాలు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఉద్యాన వనశాఖ అధికారులు సబ్సిడీపై ఉల్లి విత్తనాలు అందించేవారు. కానీ రెండేళ్లుగా సబ్సిడీ విత్తనాల పంపిణీని నిలిపివేయడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఉల్లిగడ్డను మార్కెట్‌కు తరలిస్తున్న రైతులు (ఫైల్‌)

గతంలో శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీలో కేజీ విత్తనాలు రూ. 250 నుంచి రూ.350 వరకు ఇచ్చేవారని రైతులు తెలిపారు. దీంతో ఎంతగానో సౌకర్యవంతంగా ఉండేదని పేర్కొంటున్నారు. సబ్సిడీ విత్తనాలు  ఇవ్వడం బంద్‌ చేయడంతో ఇబ్బందులు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. మహారాష్ట్రలో కిలో విత్తనాలను రూ.1250 నుండి 1500 చొప్పున తీసుకువస్తున్నామని పేర్కొంటున్నారు.దీంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరం సాగుకు రెండు కిలోల ఉల్లి విత్తనాలు అవసరం ఉంటాయని రైతులు తెలిపారు. నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో ఉల్లి ఎక్కువగా సాగు చేస్తున్నారు. నారాయణఖేడ్, మనూరు, నాగల్‌గిద్ద, అందోల్‌ పరిధిలోని వట్‌పల్లి, రేగోడ్, జహీరాబాద్, రాయికోడ్, కోహీర్, న్యాల్‌కల్‌ ప్రాంతాల్లో ఉల్లి సాగవుతుంది.  సంగారెడ్డి పరిధిలో కాస్తా తక్కువ ఉల్లిసాగు ఉంటుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.

పండరీపూర్‌ నుంచి తెచ్చుకుంటున్నాం
గతంలో సబ్సిడీపై ఉల్లి విత్తనాలు ఇచ్చేవారు. దాంతో మాకు ఎంతో సౌలత్‌ ఉండేది. రెండుళ్లుగా సబ్సిడీ విత్తనాలు ఇస్తలేరు. అధికారులను అడిగితే సర్కారు నుండి రావడం లేదని చెప్తున్నారు. చేసేదిలేక పండరిపూర్‌కు వెళ్లి పంచగంగ విత్తనాలు రూ.1500  చొప్పున తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇక్కడ కొనాలంటే రూ. 2 వేలకు కిలో ఇస్తున్నారు. అధికారులు, నాయకులు రైతులకు న్యాయం చేయాలి. రైతులను ఆదుకోకపోతే ఎలా? కిలోకు వెయ్యి మిగిలినా మాకు రెండు కలుపుల ఖర్చు ఎల్లుతుంది.   
 –శివాజిరావు పాటిల్, మాయికోడ్‌

సబ్సిడీ అంశం మా పరిధిలోది కాదు
రైతులకు సబ్సిడీపై మేం రెండేళ్ల క్రితం వరకు ఉల్లితోపాటు ఇతర కూరగాయ విత్తనాలు అందించాం. ప్రస్తుతం ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం లేదు. దీంతో రైతులకు సబ్సిడీ విత్తనాలు అందించలేకపోతున్న మాట వాస్తవమే. సబ్సిడీపై ఉల్లి విత్తనాలు అందించాలని చాలా మంది రైతులు మాకు విన్నవిస్తున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం. 
–సునీత, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి 

సబ్సిడీ విత్తనాలివ్వాలి 
ప్రభుత్వం ఉల్లి సాగు చేస్తున్న రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా సాగుచేస్తున్న రైతులకు సబ్సిడీపై విత్తనాలు ఇస్తే మాకు కాస్త పెట్టుబడి భారం తగ్గడంతోపాటు ప్రభుత్వం అందించే విత్తనాలపై నమ్మకం ఉంటుంది. ఈ దిశగా అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది.
–సుభాష్‌రావు, రాణాపూర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement