Horticultural
-
ఉద్యాన విస్తరణకు డిజిటల్ సేవలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాలను (ఆర్బీకేలను) వన్‌స్టాప్ కేంద్రాలుగా తీర్చిదిద్దిన ప్రభుత్వ స్ఫూర్తితో ఉద్యానరంగంలో డిజిటల్ విస్తరణ సేవలకు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శ్రీకారం చుట్టింది. విస్తరణ విభాగాన్ని బలోపేతం చేయడం ద్వారా వర్సిటీకి అనుబంధంగా ఉన్న 42 సంస్థలను ఆర్బీకేలతో అనుసంధానిస్తూ ‘రీచింగ్ ది అన్ రీచ్డ్’ అనే నినాదంతో పెద్ద ఎత్తున విస్తరణ కార్యక్రమాలను అమలు చేస్తోంది. డిజిటల్ సమాచార వ్యవస్థను శాటిలైట్ సమాచార వ్యవస్థకు అనుసంధానం చేస్తూ పరిశోధనల ఫలితాలతో పాటు సాంకేతిక సమాచారాన్ని నేరుగా రైతులకు చేరవేస్తోంది. అందుబాటులోకి తీసుకొచ్చిన విస్తరణ సేవలిలా.. రైతు సలహా కేంద్రం ద్వారా వర్సిటీలోని 42 సంస్థలను అనుసంధానం చేసి సాంకేతికతను బదలాయిస్తున్నారు. ఫోన్ నంబరు 96180 21200 ద్వారా రైతులకు విస్తరణ సేవలతోపాటు నిరంతర సలహాలందిస్తున్నారు. మొక్కల పరిరక్షణ సలహా కేంద్రం (ప్లాంట్ ప్రొటెక్షన్ అడ్వైజరీ సెల్) ద్వారా వివిధ ఉద్యాన పంటలను ఆశిస్తున్న చీడపీడలపై నిఘా ఉంచుతూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఉద్యాన నైపుణ్య శిక్షణ కేంద్రంలో రైతులతో పాటు యువత, మహిళలకు నైపుణ్యతలో శిక్షణనిస్తున్నారు. అడ్వాన్స్ డ్రై ఫ్లవర్ టెక్నాలజీ, పనస, తాటి, జీడిమామిడి తదితర పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్–విలువ జోడింపు, అడ్వాన్స్ నర్సరీ యాజమాన్యం, చిన్న తరహా పౌల్ట్రీ ఫామ్స్ నిర్వహణ, ఆక్వాసాగు, పుట్టగొడుగుల పెంపకం, జీవనియంత్రణ కారకాల ఉత్పత్తి–వాడకం వంటి విషయాల్లో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన ‘హార్టీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్’ ద్వారా ఉద్యాన, వ్యవసాయ పట్టభద్రులతోపాటు గ్రామీణ యువత, మహిళలను ఉద్యానరంగంలో వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కౌన్సెలింగ్, టెక్నికల్–బిజినెస్ మానిటరింగ్, కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెన్సీ, బిజినెస్ ప్లాన్ తయారీ, ఇంక్యుబేషన్, పైలెట్ స్కేల్ ప్రొడక్షన్ వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఆన్లైన్ శిక్షణ కేంద్రం ద్వారా వివిధ రకాల శిక్షణ ఇస్తున్నారు. ఇన్ఫర్మేషన్ కియోస్క్ ద్వారా ఉద్యానపంటల సాగు విధానాలు, సస్యరక్షణ చర్యలు, సాంకేతిక విధానాలు 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. రైతులతో వెబినార్లు, శాస్త్రవేత్తలతో ఫోన్ ఇన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉద్యానవాణి–90.8 ఎఫ్ఎం (కమ్యూనిటీ రేడియో స్టేషన్) ద్వారా రోజు వాతావరణం, నెలవారీ ఉద్యానపంటల్లో చేపట్టాల్సిన చర్యలు, అవసరమైన సలహాలు సూచనలు ప్రసారం చేస్తున్నారు. వర్సిటీ కార్యక్రమాల వీడియోలను ఎప్పటికప్పుడు యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు వాడే రైతుల కోసం అభివృద్ధి చేసిన వైఎస్సార్ ఉద్యానబంధు యాప్ ద్వారా 33 రకాల ఉద్యానపంటల సాగు సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, ఇతర ప్రముఖ చానళ్ల ద్వారా ఫోన్ ఇన్ లైవ్, ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 50కిపైగా పంటల వారీగా రైతులతో ఏర్పాటు చేసిన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో శాస్త్రవేత్తలు, అధికారులు, ఆర్బీకే సిబ్బందిని భాగస్వామ్యం చేశారు. వీటిద్వారా రైతులతోపాటు గ్రామీణ యువత, మహిళలకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వర్సిటీ అనుబంధ సంస్థలను ఆర్బీకేలతో అనుసంధానించారు. ఇంటిగ్రేటెడ్ కాల్‌సెంటర్, ఆర్బీకే చానల్ ద్వారా పరిశోధన ఫలితాలు, సాంకేతిక సమాచారాన్ని రైతులకు చేరవేస్తున్నారు. ఆధునిక ఎలక్ట్రానిక్ విభాగం ద్వారా నూతన సాంకేతిక విధానాలపై శాస్త్రవేత్తలు, çసంబంధిత నిపుణులతో రికార్డు చేసి ఆర్బీకేల్లోని స్మార్ట్ టీవీల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఆర్బీకేలకు అనుసంధానించాం గుణాత్మక విద్య, పరిశోధన ఫలితాలు రైతులకు చేరవేసే లక్ష్యంతో విస్తరణ విభాగాన్ని బలోపేతం చేశాం. వర్సిటీలోని 42 సంస్థల ద్వారా నిరంతరం ప్రత్యక్ష, అంతర్జాల మాధ్యమాల ద్వారా పలు సంప్రదాయ విస్తరణ కార్యక్రమాలను రైతులకు అందుబాటులో తీసుకొచ్చాం. శాస్త్ర, సాంకేతిక సమాచారం అందించడం ప్రధాన లక్ష్యంగా ఆర్బీకేలకు అనుబంధంగా ఇవి పనిచేస్తున్నాయి. – డాక్టర్ టి.జానకిరామ్, వైస్ చాన్సలర్ -
ఉద్యాన పాలిటెక్నిక్‌లో ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
తాడేపల్లిగూడెం: ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాలకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి ఈ నెల 18 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. ఈ డిప్లమో పూర్తి చేసిన విద్యార్థులు విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్లుగా చేరడానికి అవకాశాలు రావడంతో పాటు సొంతంగా ఉద్యాన నర్సరీలు ఏర్పాటు చేసుకోడానికి మార్గాలున్నాయి. ఉద్యాన డిప్లమో రెండేళ్ల కోర్సు పూర్తయిన తర్వాత హార్టీసెట్‌లో ర్యాంక్ వస్తే, బీఎస్సీ హార్టీకల్చర్ కోర్సులను అభ్యసించే అవకాశం ఉంటుంది. దరఖాస్తుకు అర్హతలు పదో తరగతి తత్సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులైన రాష్ట్రంలోని విద్యార్థులు మాత్రమే ఈ కోర్సు చేయడానికి అర్హులు. పదో తరగతి కంపార్టుమెంట్లో ఉత్తీర్ణులైనవారు, ఇంటర్మీడియట్ ఫెయిలైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ ఉత్తీర్ణులైన వారు, దాని కంటే పై చదువులు చదివిన వారు అర్హులు కారు. పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో కనీసం 5 గ్రేడ్ పాయింట్ యావరేజ్ (హిందీతో కలిపి) సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ చాలెంజ్డ్ అభ్యర్థులు కనీసం 4 గ్రేడ్ పాయింట్ పొంది ఉండాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యాన పాలిటెక్నిక్‌లతో కలిపి మొత్తం 480 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యాన పాలిటెక్నిక్‌లలో 200 సీట్లు, ప్రైవేట్ ఉద్యాన పాలిటెక్నిక్‌లలో 280 సీట్లు ఉన్నాయని తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ టి.జానకిరామ్ తెలిపారు. ప్రవేశాలు, కోర్సు వివరాల విషయంలో సందేహాలుంటే డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఏఎస్ పద్మావతమ్మను 73826 33640 నంబర్లో సంప్రదించవచ్చు. -
AP: సిరులు కురిపిస్తున్న ‘అనంత’ పంటలు
సాక్షి, అనంతపురం (అగ్రికల్చర్): కరువు కాటకాలకు చిరునామాగా ఉన్న అనంతపురం జిల్లా రెండేళ్లుగా ఉద్యాన సిరులకు నిలయంగా మారింది. రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పండ్ల తోటల రైతులు కష్టాల నుంచి గట్టెక్కి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఆపిల్, కివీ లాంటి నాలుగైదు పంటలు మినహాయిస్తే అన్నిరకాల పండ్ల తోటలు, పూలు, కూరగాయలు, ఔషధ, సుగంధ పంటలు పండిస్తూ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుస్తున్నారు. 2.02 లక్షల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో పండ్లు, పూలు, కూరగాయల వంటి ఉద్యాన తోటలు జిల్లాలో విస్తరించాయి. ఏటా సరాసరి 50 లక్షల నుంచి 52 లక్షల టన్నుల వరకు ఫలసాయం వస్తుండగా.. తద్వారా ఏటా రూ.10 వేల కోట్లకు పైగా టర్నోవర్ జరుగుతున్నట్టు ఉద్యాన శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముకుందాపురంలో విస్తరించిన చీనీ తోటలు చీనీ, ద్రాక్ష, దానిమ్మ, బొప్పాయి, సపోటా, వక్క, చింత, రేగు, బెండ, గులాబీ, కనకాంబరం తోటల విస్తీర్ణం పరంగా అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండగా.. అరటి, మామిడి, కర్బూజా, కళింగర , మిరప, టమాటా, వంగ, ఉల్లి, బంతి తదితర తోటల సాగులో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇటీవల జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు అరటి ఎగుమతులు జరుగుతున్నాయి. ఇక్కడి పండ్ల ఉత్పత్తులు ఢిల్లీలోని ప్రధాన మార్కెట్ అజాద్‌పూర్ మండీతో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా లాంటి ఉత్తరాది రాష్ట్రాలు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మార్కెట్లకూ వెళ్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జిల్లాలో ఉద్యాన విప్లవం మొదలైంది. అనంతపురం మార్కెట్లో జోరుగా చీనీ అమ్మకాలు రైతు పక్షపాతిగా ఆయన హయాంలో ప్రోత్సాహకాలు, రాయితీలు అందజేయడంతో ఇక్కడి రైతులు ఉద్యాన పంటలపై దృష్టి సారించారు. వైఎస్ ఐదేళ్ల పాలనలో కేవలం ఉద్యాన శాఖకు రూ.80 కోట్లు ఖర్చు చేయడంతో కొత్తగా 40 వేల హెక్టార్లు సాగులోకి వచ్చాయి. 90 శాతం రాయితీతో బిందు, తుంపర సేద్యపు పరికరాలకు రూ.280 కోట్లు వెచ్చించడంతో పండ్ల తోటల సాగుకు బీజం పడి ఇప్పుడు ఫ్రూట్‌బౌల్ ఆఫ్ ఏపీగా ఖ్యాతి పొందింది. ఉద్యాన పంటలే శరణ్యం వ్యవసాయ పంటల వల్ల నష్టాలు వస్తుండటంతో మా ప్రాంతంలో ఎక్కువ మంది అరటి లాంటి ఉద్యాన పంటలు సాగు చేస్తున్నాం. మాకున్న 7 ఎకరాల్లో అరటి, మధ్యలో పంట మార్పిడి కోసం ఒకసారి టమాటా వేస్తాం. రెండేళ్లలో మూడు అరటి పంటలు తీస్తాం. ఎకరాకు 80 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. – ఎల్.శేఖర్, రైతు, ఎల్లుట్ల గ్రామం విదేశాలకు ఎగుమతి అవుతున్న ‘అనంత’ నాణ్యమైన అరటి ఉద్యాన పంటలకు అనువు ఇక్కడి పొడి వాతావరణం, గాలిలో తేమ శాతం తక్కువ ఉంటాయి. నేల రకాలు, మురుగునీరు పోయే వ్యవస్థ ఉండటం వల్ల ఉద్యాన పంటలకు అనువుగా మారాయి. ఇక్కడ పండించే పండ్లు, కూరగాయల్లో నిల్వ గుణం, తీపిదనం, రుచి, నాణ్యత, పోషకాలు మెండుగా ఉండటం, దూరప్రాంతాలను ఎగుమతి చేయడానికి వీలుగా గట్టిదనం ఉండటంతో దేశంలో ప్రధాన మార్కెట్లలో డిమాండ్ పెరుగుతోంది. – జి.సతీష్, జి.చంద్రశేఖర్, సహాయ సంచాలకులు, ఉద్యాన శాఖ నాణ్యమైన దానిమ్మ చదవండి: వినూత్న ఆలోచన: పాత చీరలతో కొత్త పుంతలు! కొత్త వంగడాల రూపకల్పనలో వైఎస్సార్ వర్సిటీ రికార్డు -
కరోనా దెబ్బతో ఊడిన ఉద్యోగాలు
సాక్షి, కరీంనగర్: అవును.. వారు రోడ్డునపడ్డారు. కరోనా ప్రభావం.. నిధుల లేమి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు శాపంగా మారింది. ఈ మేరకు ఉద్యాన శాఖలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే నుంచి విధుల్లోకి రావొద్దని స్పష్టం చేయగా, 15 ఏళ్లుగా సేవలందిస్తున్న సదరు ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వయసు పైబడటం.. ఇతర మార్గాలు లేకపోవడంతో తమ కుటుంబాలను ఎలా పోషించేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 15 కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా ఉద్యానశాఖలో అమలయ్యే పథకాలకు సర్కారు ఇచ్చే వార్షిక బడ్జెట్లో 5 శాతం నిధులను ఉద్యోగుల జీతభత్యాలకు ఖర్చు చేస్తారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం.. ఏడాదిగా కొత్త పథకాలు లేకపోవడంతో వీరి సేవలు అవసరం లేదని ప్రభుత్వం భావించింది. పైగా లాక్డౌన్ తోడవడంతో ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో మే 1 నుంచి విధులకు హాజరు కానక్కర్లేదని సదరు ఔట్‌సోరి్సంగ్ ఏజెన్సీకి జిల్లా అధికారులు సమాచారమిచ్చారు. ఉమ్మడి జిల్లాలో ఉద్యాన విస్తరణాధికారులు, అకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్ ఉద్యోగాలు పోయినట్లే. దశాబ్దానికిపైగా సేవలు.. ఉద్యాన పంటల సాగులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా తొలి 5 స్థానాల్లో ఉంది. సాధారణ పంటలకు సమీపంగా ఈ పంటలను పండిస్తున్నారు. ఏటా దాదాపు 75 వేల ఎకరాల్లో కూరగాయలు, పండ్లు, పూలతోటలను సుమారు 53 వేల మంది రైతులు సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంత ఎక్కువ మొత్తంలో మామిడి దిగుబడి ఉమ్మడి జిల్లాలోనే ఉంది. ఇతర జిల్లాల ప్రజల అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతటి కీలకమైన విభాగంలో ఉద్యోగులను తొలగించడంతో ఉద్యాన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ శాఖలో కరీంనగర్ జిల్లాలో జిల్లా అధికారి, ముగ్గురు ఉద్యాన అధికారులు మాత్రమే ఉన్నారు. ఉద్యాన అధికారులు ఒక్కొక్కరూ ఆరేడు మండలాల వ్యవహారాలను చూస్తున్నారు. సుమారు 15 ఏళ్ల కిందట ఉద్యాన విస్తరణా«ధికారులను ఔట్‌సోరి్సంగ్ విధానంలో విధుల్లోకి తీసుకున్నారు. వీరు ప్రస్తుతం ఒక్కొక్కరు మూడు, నాలుగు మండలాల పరిధిలో సేవలందిస్తున్నారు. ఉన్నపళంగా వీరిని తొలగించడంతో రైతులకు ఇబ్బందే. ఆరు నెలలుగా అందని వేతనాలు.. ఉద్యాన శాఖకు కేటాయించే నిధులతోనే ఔట్‌సోరి్సంగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తుంటారు. బిందు, తుంపర సేద్యం, పందిరి తోటలు, షెడ్‌నెట్ ఇతరత్ర పథకాలకు ప్రభుత్వం నిధులు కేటాయించడం.. లబి్ధదారులకు సకాలంలో సేవలందేలా చూడటంలో వీరి బాధ్యత గత నవంబర్ నుంచి వీరికి వేతనాలు రాకపోగా ఉద్యోగాల నుంచి తొలగింపు ఉత్తర్వు రావడం ఆందోళనకు గురిచేస్తోంది. రానున్న రోజుల్లో నీటిని పొదుపుగా వాడుకునేలా.. ఉద్యాన పంటలను ప్రొత్సహించేలా చర్యలుంటాయన్న సమాచారంతో తమ ఉద్యోగాలకు భరోసా ఉంటుందని వేతనాల్లేకున్నా విధులు నిర్వహిస్తున్నామని ఔట్‌సోరి్సంగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయని, మే నుంచి విధులకు రావొద్దని ఔట్‌సోరి్సంగ్ ఉద్యోగులకు చెప్పామని ఉద్యాన శాఖ అధికారి తెలిపారు. -
ఉల్లి.. లొల్లి..
సాక్షి, నారాయణఖేడ్: ఉల్లి సాగు చేసే రైతులకు ఈ ఏడాది కూడా కష్టాలు తప్పేలా లేవు. ప్రతీ ఏటా కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి విత్తనాలు ఈ ఏడాదీ ఏడిపిస్తున్నాయి. ఉద్యానవన శాఖ పంపిణీ చేసే సబ్సిడీ విత్తనాలు రెండేళ్లుగా రావడమే లేదు. సబ్సిడీ విత్తనాలు అందక రైతులపై ఆర్థిక భారం తప్పడం లేదు. జిల్లాలో ఉల్లి విత్తనాలు దొరకక పక్క రాష్ట్రమైన మహారాష్ట్రకు పరుగులు తీయాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో దాదాపుగా మూడు వేల ఎకరాల్లో సాగయ్యే ఉల్లి గురించి పట్టించుకున్న నాథుడే లేకుండాపోయాడు. ఉల్లి సాగు చేసే రైతులకు ఏటా కష్టాలు తప్పడం లేదు. విత్తన సమస్య వారిని నిత్యం వేధిస్తూనే ఉంది. సమస్య ఎలా ఉన్నా ఈ రబీ సీజన్లో ఉల్లి సాగు చేసేందుకు రైతులు రెడీ అయిపోయారు. కొన్ని చోట్ల దుక్కులు దున్నుతుండగా అక్కడక్కడా ఉల్లి నారు కూడా పోశారు. ఉల్లి నారు చల్లడానికి రైతులు జిల్లాలో తీవ్ర విత్తన కొరతను ఎదుర్కొంటున్నారు. చేసిదిలేక పక్కనున్న మహారాష్ట్రలోని పండరిపూర్, సోలాపూర్ ప్రాంతాలకు వెళ్లి ఉల్లి విత్తనాలు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఉద్యాన వనశాఖ అధికారులు సబ్సిడీపై ఉల్లి విత్తనాలు అందించేవారు. కానీ రెండేళ్లుగా సబ్సిడీ విత్తనాల పంపిణీని నిలిపివేయడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉల్లిగడ్డను మార్కెట్‌కు తరలిస్తున్న రైతులు (ఫైల్) గతంలో శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీలో కేజీ విత్తనాలు రూ. 250 నుంచి రూ.350 వరకు ఇచ్చేవారని రైతులు తెలిపారు. దీంతో ఎంతగానో సౌకర్యవంతంగా ఉండేదని పేర్కొంటున్నారు. సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం బంద్ చేయడంతో ఇబ్బందులు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. మహారాష్ట్రలో కిలో విత్తనాలను రూ.1250 నుండి 1500 చొప్పున తీసుకువస్తున్నామని పేర్కొంటున్నారు.దీంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరం సాగుకు రెండు కిలోల ఉల్లి విత్తనాలు అవసరం ఉంటాయని రైతులు తెలిపారు. నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో ఉల్లి ఎక్కువగా సాగు చేస్తున్నారు. నారాయణఖేడ్, మనూరు, నాగల్గిద్ద, అందోల్ పరిధిలోని వట్పల్లి, రేగోడ్, జహీరాబాద్, రాయికోడ్, కోహీర్, న్యాల్కల్ ప్రాంతాల్లో ఉల్లి సాగవుతుంది. సంగారెడ్డి పరిధిలో కాస్తా తక్కువ ఉల్లిసాగు ఉంటుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. పండరీపూర్ నుంచి తెచ్చుకుంటున్నాం గతంలో సబ్సిడీపై ఉల్లి విత్తనాలు ఇచ్చేవారు. దాంతో మాకు ఎంతో సౌలత్ ఉండేది. రెండుళ్లుగా సబ్సిడీ విత్తనాలు ఇస్తలేరు. అధికారులను అడిగితే సర్కారు నుండి రావడం లేదని చెప్తున్నారు. చేసేదిలేక పండరిపూర్‌కు వెళ్లి పంచగంగ విత్తనాలు రూ.1500 చొప్పున తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇక్కడ కొనాలంటే రూ. 2 వేలకు కిలో ఇస్తున్నారు. అధికారులు, నాయకులు రైతులకు న్యాయం చేయాలి. రైతులను ఆదుకోకపోతే ఎలా? కిలోకు వెయ్యి మిగిలినా మాకు రెండు కలుపుల ఖర్చు ఎల్లుతుంది. –శివాజిరావు పాటిల్, మాయికోడ్ సబ్సిడీ అంశం మా పరిధిలోది కాదు రైతులకు సబ్సిడీపై మేం రెండేళ్ల క్రితం వరకు ఉల్లితోపాటు ఇతర కూరగాయ విత్తనాలు అందించాం. ప్రస్తుతం ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం లేదు. దీంతో రైతులకు సబ్సిడీ విత్తనాలు అందించలేకపోతున్న మాట వాస్తవమే. సబ్సిడీపై ఉల్లి విత్తనాలు అందించాలని చాలా మంది రైతులు మాకు విన్నవిస్తున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం. –సునీత, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి సబ్సిడీ విత్తనాలివ్వాలి ప్రభుత్వం ఉల్లి సాగు చేస్తున్న రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా సాగుచేస్తున్న రైతులకు సబ్సిడీపై విత్తనాలు ఇస్తే మాకు కాస్త పెట్టుబడి భారం తగ్గడంతోపాటు ప్రభుత్వం అందించే విత్తనాలపై నమ్మకం ఉంటుంది. ఈ దిశగా అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. –సుభాష్‌రావు, రాణాపూర్ -
చామంతులు.. ప్రగతి కాంతులు!
హైదరాబాద్‌కు చెందిన శ్రీధర్(9705524169), శ్రీనివాస్‌లు మండల పరిధిలోని కొడిప్యాక శివారులో 10 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. సాగుకు యోగ్యం కావనుకున్న నేలలో చామంతి సాగు చేపట్టారు. మొత్తం భూమిలో చామంతికి సంబంధించిన మ్యారీగోల్డ్తోపాటు వివిధ రంగుల చామంతి పూలను సాగు చేస్తూ హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. మూడు నెలలకు కోతకు వచ్చే ఈ పంటను ప్రతినిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. తోట పనులను చూసుకునేందుకు నాయుడు అనే వ్యక్తిని నియమించారు. తరచూ వచ్చిపోతూ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అతనికి వివరిస్తుంటారు. ఎకరా భూమిలో సుమారు 10నుంచి 12వేల మొక్కలు సాగు చేయవచ్చన్నారు. ఒక చామంతి మొక్కను సీజన్‌ను బట్టి రూ.4 నుంచి రూ.12కు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. మూడు నెలల పాటు మొక్కను సంరక్షించేందుకు సుమారు రూ.40నుంచి రూ.50 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని వివరించారు. మూడు నెలల తర్వాత ఒక మొక్క నుంచి కిలోన్నర నుంచి రెండు కిలోల దిగుబడి వస్తుందని తెలిపారు. ఇలా రెండు, మూడు పర్యాయాలు పువ్వులు చేతికి వస్తాయని చెప్పారు. కిలో పూలకు మార్కెట్లో స్థిరంగా రూ.40 నుంచి రూ.70 వరకు పలుకుతుందని తెలిపారు. దీపావళి, కార్తీకపౌర్ణిమ, బతుకమ్మ పండుగ తదితర సీజన్లలో వీటి ధర కిలోకు రూ.200 నుంచి రూ.300 వరకు కూడా పలుకుతుందన్నారు. డ్రిప్ పద్ధతిలో సాగు చేస్తున్నందున కూలీల అవసరం లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం చామంతి సాగు వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని ఇతర ప్రాంతాలతో పాటు స్థానిక రైతులు కూడా తమ తోటను చూసేందుకు వస్తున్నారని తెలిపారు. సలహాల కోసం సంప్రదించాలన్నారు.