సాక్షి, అనంతపురం (అగ్రికల్చర్): కరువు కాటకాలకు చిరునామాగా ఉన్న అనంతపురం జిల్లా రెండేళ్లుగా ఉద్యాన సిరులకు నిలయంగా మారింది. రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పండ్ల తోటల రైతులు కష్టాల నుంచి గట్టెక్కి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఆపిల్, కివీ లాంటి నాలుగైదు పంటలు మినహాయిస్తే అన్నిరకాల పండ్ల తోటలు, పూలు, కూరగాయలు, ఔషధ, సుగంధ పంటలు పండిస్తూ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుస్తున్నారు. 2.02 లక్షల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో పండ్లు, పూలు, కూరగాయల వంటి ఉద్యాన తోటలు జిల్లాలో విస్తరించాయి. ఏటా సరాసరి 50 లక్షల నుంచి 52 లక్షల టన్నుల వరకు ఫలసాయం వస్తుండగా.. తద్వారా ఏటా రూ.10 వేల కోట్లకు పైగా టర్నోవర్ జరుగుతున్నట్టు ఉద్యాన శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముకుందాపురంలో విస్తరించిన చీనీ తోటలు
చీనీ, ద్రాక్ష, దానిమ్మ, బొప్పాయి, సపోటా, వక్క, చింత, రేగు, బెండ, గులాబీ, కనకాంబరం తోటల విస్తీర్ణం పరంగా అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండగా.. అరటి, మామిడి, కర్బూజా, కళింగర , మిరప, టమాటా, వంగ, ఉల్లి, బంతి తదితర తోటల సాగులో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇటీవల జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు అరటి ఎగుమతులు జరుగుతున్నాయి. ఇక్కడి పండ్ల ఉత్పత్తులు ఢిల్లీలోని ప్రధాన మార్కెట్ అజాద్‌పూర్ మండీతో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా లాంటి ఉత్తరాది రాష్ట్రాలు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మార్కెట్లకూ వెళ్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జిల్లాలో ఉద్యాన విప్లవం మొదలైంది.
అనంతపురం మార్కెట్‌లో జోరుగా చీనీ అమ్మకాలు
రైతు పక్షపాతిగా ఆయన హయాంలో ప్రోత్సాహకాలు, రాయితీలు అందజేయడంతో ఇక్కడి రైతులు ఉద్యాన పంటలపై దృష్టి సారించారు. వైఎస్ ఐదేళ్ల పాలనలో కేవలం ఉద్యాన శాఖకు రూ.80 కోట్లు ఖర్చు చేయడంతో కొత్తగా 40 వేల హెక్టార్లు సాగులోకి వచ్చాయి. 90 శాతం రాయితీతో బిందు, తుంపర సేద్యపు పరికరాలకు రూ.280 కోట్లు వెచ్చించడంతో పండ్ల తోటల సాగుకు బీజం పడి ఇప్పుడు ఫ్రూట్‌బౌల్ ఆఫ్ ఏపీగా ఖ్యాతి పొందింది.
ఉద్యాన పంటలే శరణ్యం
వ్యవసాయ పంటల వల్ల నష్టాలు వస్తుండటంతో మా ప్రాంతంలో ఎక్కువ మంది అరటి లాంటి ఉద్యాన పంటలు సాగు చేస్తున్నాం. మాకున్న 7 ఎకరాల్లో అరటి, మధ్యలో పంట మార్పిడి కోసం ఒకసారి టమాటా వేస్తాం. రెండేళ్లలో మూడు అరటి పంటలు తీస్తాం. ఎకరాకు 80 టన్నుల వరకు దిగుబడి వస్తోంది.
– ఎల్.శేఖర్, రైతు, ఎల్లుట్ల గ్రామం
విదేశాలకు ఎగుమతి అవుతున్న ‘అనంత’ నాణ్యమైన అరటి
ఉద్యాన పంటలకు అనువు
ఇక్కడి పొడి వాతావరణం, గాలిలో తేమ శాతం తక్కువ ఉంటాయి. నేల రకాలు, మురుగునీరు పోయే వ్యవస్థ ఉండటం వల్ల ఉద్యాన పంటలకు అనువుగా మారాయి. ఇక్కడ పండించే పండ్లు, కూరగాయల్లో నిల్వ గుణం, తీపిదనం, రుచి, నాణ్యత, పోషకాలు మెండుగా ఉండటం, దూరప్రాంతాలను ఎగుమతి చేయడానికి వీలుగా గట్టిదనం ఉండటంతో దేశంలో ప్రధాన మార్కెట్లలో డిమాండ్ పెరుగుతోంది.
– జి.సతీష్, జి.చంద్రశేఖర్, సహాయ సంచాలకులు, ఉద్యాన శాఖ
నాణ్యమైన దానిమ్మ
చదవండి: వినూత్న ఆలోచన: పాత చీరలతో కొత్త పుంతలు!
కొత్త వంగడాల రూపకల్పనలో వైఎస్సార్ వర్సిటీ రికార్డు
Comments
Please login to add a commentAdd a comment