ఉద్యాన విస్తరణకు డిజిటల్‌ సేవలు | Digital Services For Horticultural Varsity Expansion | Sakshi
Sakshi News home page

ఉద్యాన విస్తరణకు డిజిటల్‌ సేవలు

Published Sun, May 15 2022 7:12 PM | Last Updated on Sun, May 15 2022 7:17 PM

Digital Services For Horticultural Varsity Expansion - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ రైతుభరోసా కేంద్రాలను (ఆర్బీకేలను) వన్‌స్టాప్‌ కేంద్రాలుగా తీర్చిదిద్దిన ప్రభుత్వ స్ఫూర్తితో ఉద్యానరంగంలో డిజిటల్‌ విస్తరణ సేవలకు డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం శ్రీకారం చుట్టింది. విస్తరణ విభాగాన్ని బలోపేతం చేయడం ద్వారా వర్సిటీకి అనుబంధంగా ఉన్న 42 సంస్థలను ఆర్బీకేలతో అనుసంధానిస్తూ ‘రీచింగ్‌ ది అన్‌ రీచ్డ్‌’ అనే నినాదంతో పెద్ద ఎత్తున విస్తరణ కార్యక్రమాలను అమలు చేస్తోంది. డిజిటల్‌ సమాచార వ్యవస్థను శాటిలైట్‌ సమాచార వ్యవస్థకు అనుసంధానం చేస్తూ పరిశోధనల ఫలితాలతో పాటు సాంకేతిక సమాచారాన్ని నేరుగా రైతులకు చేరవేస్తోంది. 

అందుబాటులోకి తీసుకొచ్చిన విస్తరణ సేవలిలా.. 
రైతు సలహా కేంద్రం ద్వారా వర్సిటీలోని 42 సంస్థలను అనుసంధానం చేసి సాంకేతికతను బదలాయిస్తున్నారు. ఫోన్‌ నంబరు 96180 21200 ద్వారా రైతులకు విస్తరణ సేవలతోపాటు నిరంతర సలహాలందిస్తున్నారు. మొక్కల పరిరక్షణ సలహా కేంద్రం (ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ అడ్వైజరీ సెల్‌) ద్వారా వివిధ ఉద్యాన పంటలను ఆశిస్తున్న చీడపీడలపై నిఘా ఉంచుతూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఉద్యాన నైపుణ్య శిక్షణ కేంద్రంలో రైతులతో పాటు యువత, మహిళలకు నైపుణ్యతలో శిక్షణనిస్తున్నారు. అడ్వాన్స్‌ డ్రై ఫ్లవర్‌ టెక్నాలజీ, పనస, తాటి, జీడిమామిడి తదితర పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్‌–విలువ జోడింపు, అడ్వాన్స్‌ నర్సరీ యాజమాన్యం, చిన్న తరహా పౌల్ట్రీ ఫామ్స్‌ నిర్వహణ, ఆక్వాసాగు, పుట్టగొడుగుల పెంపకం, జీవనియంత్రణ కారకాల ఉత్పత్తి–వాడకం వంటి విషయాల్లో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 

కొత్తగా ఏర్పాటు చేసిన ‘హార్టీ బిజినెస్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌’ ద్వారా ఉద్యాన, వ్యవసాయ పట్టభద్రులతోపాటు గ్రామీణ యువత, మహిళలను ఉద్యానరంగంలో వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కౌన్సెలింగ్, టెక్నికల్‌–బిజినెస్‌ మానిటరింగ్, కెపాసిటీ బిల్డింగ్‌ కన్సల్టెన్సీ, బిజినెస్‌ ప్లాన్‌ తయారీ, ఇంక్యుబేషన్, పైలెట్‌ స్కేల్‌ ప్రొడక్షన్‌ వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. 

ఆన్‌లైన్‌ శిక్షణ కేంద్రం ద్వారా వివిధ రకాల శిక్షణ ఇస్తున్నారు. ఇన్‌ఫర్మేషన్‌ కియోస్క్‌ ద్వారా ఉద్యానపంటల సాగు విధానాలు, సస్యరక్షణ చర్యలు, సాంకేతిక విధానాలు 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. రైతులతో వెబినార్లు, శాస్త్రవేత్తలతో ఫోన్‌ ఇన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఉద్యానవాణి–90.8 ఎఫ్‌ఎం (కమ్యూనిటీ రేడియో స్టేషన్‌) ద్వారా రోజు వాతావరణం, నెలవారీ ఉద్యానపంటల్లో చేపట్టాల్సిన చర్యలు, అవసరమైన సలహాలు సూచనలు ప్రసారం చేస్తున్నారు. వర్సిటీ కార్యక్రమాల వీడియోలను ఎప్పటికప్పుడు యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. 
స్మార్ట్‌ ఫోన్లు వాడే రైతుల కోసం అభివృద్ధి చేసిన వైఎస్సార్‌ ఉద్యానబంధు యాప్‌ ద్వారా 33 రకాల ఉద్యానపంటల సాగు సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దూరదర్శన్, ఆల్‌ ఇండియా రేడియో, ఇతర ప్రముఖ చానళ్ల ద్వారా ఫోన్‌ ఇన్‌ లైవ్, ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

50కిపైగా పంటల వారీగా రైతులతో ఏర్పాటు చేసిన వాట్సాప్, టెలిగ్రామ్‌ గ్రూపుల్లో శాస్త్రవేత్తలు, అధికారులు, ఆర్బీకే సిబ్బందిని భాగస్వామ్యం చేశారు. వీటిద్వారా రైతులతోపాటు గ్రామీణ యువత, మహిళలకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వర్సిటీ అనుబంధ సంస్థలను ఆర్బీకేలతో అనుసంధానించారు. ఇంటిగ్రేటెడ్‌ కాల్‌సెంటర్, ఆర్బీకే చానల్‌ ద్వారా పరిశోధన ఫలితాలు, సాంకేతిక సమాచారాన్ని రైతులకు చేరవేస్తున్నారు. ఆధునిక ఎలక్ట్రానిక్‌ విభాగం ద్వారా నూతన సాంకేతిక విధానాలపై శాస్త్రవేత్తలు, çసంబంధిత నిపుణులతో రికార్డు చేసి ఆర్‌బీకేల్లోని స్మార్ట్‌ టీవీల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

ఆర్బీకేలకు అనుసంధానించాం
గుణాత్మక విద్య, పరిశోధన ఫలితాలు రైతులకు చేరవేసే లక్ష్యంతో విస్తరణ విభాగాన్ని బలోపేతం చేశాం. వర్సిటీలోని 42 సంస్థల ద్వారా నిరంతరం ప్రత్యక్ష, అంతర్జాల మాధ్యమాల ద్వారా పలు సంప్రదాయ విస్తరణ కార్యక్రమాలను రైతులకు అందుబాటులో తీసుకొచ్చాం. శాస్త్ర, సాంకేతిక సమాచారం అందించడం ప్రధాన లక్ష్యంగా ఆర్బీకేలకు అనుబంధంగా ఇవి పనిచేస్తున్నాయి.
– డాక్టర్‌ టి.జానకిరామ్, వైస్‌ చాన్సలర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement