రైతు సంక్షేమానికి బడ్జెట్‌లో మొండి చెయ్యి
‘అన్నదాతా సుఖీభవ’కు రూ.10,716.74కోట్లు అవసరం
కేటాయింపులు రూ.1,000 కోట్లే
కౌలురైతులకు పెట్టుబడి సాయం ప్రస్తావనే లేదు
పంటల బీమా పథకం భారం ఇక రైతులపైనే
సాక్షి, అమరావతి: ఆచరణ సాధ్యం కాని హామీలతో అన్నదాతలను ఊహల పల్లకిలో ఊరేగించిన కూటమి ప్రభుత్వం కాడి పారేసి చేతులెత్తేసింది! ఓటాన్ అకౌంట్‌తో ఐదు నెలలు కాలక్షేపం చేయగా సోమవారం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్‌లోనూ రైతుల నోట్లో మట్టి కొట్టింది. సూపర్ సిక్స్ హామీల అమలుతో పాటు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం కేటాయింపులు ఉంటాయన్న ఆశలను నీరుగార్చి నిలువు దగా చేసింది. తాము అధికారంలోకి రాగానే బేషరతుగా ప్రతీ రైతు కుటుంబానికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందచేస్తామని సూపర్ సిక్స్‌లో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి.
ఆచరణకు వచ్చేసరికి మాట మార్చి పీఎం కిసాన్‌తో కలిపి జమ చేస్తామని రైతులను మరోసారి మోసగించింది. గత ఐదేళ్లలో 53.58లక్షల మంది రైతులకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.34,288.17 కోట్లు పెట్టుబడి సాయం అందించింది. అయితే, ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సుమారు 53.58 లక్షల మంది రైతులకు రూ.20 వేల చొప్పున రూ.10,716.74 కోట్లు కేటాయించాలి. కానీ తాజా బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు కేవలం రూ.వెయ్యి కోట్లు మాత్రమే. ఈ మొత్తాన్ని పీఎం కిసాన్ సాయం అందుకున్న వారికి మాత్రమే జమ చేసినా... ఒక్కో కుటుంబానికి ఈ ఏడాది రూ.నాలుగు వేలకు మించి పెట్టుబడి సాయం అందే పరిస్థితి కనిపించడం లేదు. పైగా కౌలు రైతులు, దేవదాయ, అటవీ, భూ సాగు దారులకు పెట్టుబడి సాయం అందిస్తామన్న ప్రస్తావన ఎక్కడా లేదు.
రైతుల నెత్తిన ప్రీమియం పిడుగు
రైతులపై పైసా భారం పడకుండా గత ఐదేళ్లూ విజయవంతంగా అమలైన ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపివేస్తున్నట్లు అసెంబ్లీలో వ్యవవసాయ శాఖ మంత్రి అచ్చెన్న అధికారికంగా ప్రకటించారు. ఖరీఫ్ సీజన్ వరకు మాత్రమే రైతుల ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని, రబీ–2024–25 నుంచి ఈ పథకంలో స్వచ్ఛంద నమోదు పద్ధతిలో రైతులను భాగస్వాములను చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఫలితంగా రబీలో నోటిఫై చేసిన 15 పంటలకు ప్రీమియం వాటాగా రైతులపై రూ.300 కోట్లకు పైగా భారం పడుతుంది.
అంతేకాకుండా రూ.3 లక్షల వరకు సున్నా వడ్డీ రాయితీ, 90% సబ్సిడీపై డ్రిప్ పరికరాల పంపిణీ గురించి బడ్జెట్‌లో ప్రస్తావన లేదు. ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాల నిధికి పైసా కూడా విదల్చలేదు. వేటకు వెళ్లే ప్రతీ మత్స్యకార కుటుంబానికి రూ.20వేల చొప్పున వేట నిషేధ భృతి అందిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అటకెక్కించేసింది. జోన్‌తో సంబంధం లేకుండా ఆక్వా సర్విస్ కనెక్షన్లకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా చేస్తామని ఇచ్చిన హామీకి కూడా పైసా కేటాయించలేదు.
పథకాల పేర్లు మార్చి.. ప్రశంసిస్తూ
జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పలు పథకాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారంటూ ఎన్నికల్లో దు్రష్పచారం చేసిన కూటమి.. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా వాటి గొప్పతనాన్ని ప్రశంసించడం గమనార్హం. వాటి పేర్లు మార్చి తాము కొనసాగిస్తున్నట్లు తేటతెల్లం చేసింది.
రూ.43,402.33 కోట్ల అంచనాలతో వ్యవసాయ బడ్జెట్
సాక్షి, అమరావతి: స్వర్ణాంధ్ర–2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రబీ సీజన్ నుంచి స్పచ్ఛంద నమోదు విధానం ద్వారా రైతులను భాగస్వాములను చేసి, పీఎంఎఫ్‌బీవైతో అనుసంధానం చేసి అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతు కుటుంబానికి రూ.20 వేలు పెట్టుబడి సాయాన్ని పీఎం కిసాన్‌తో కలిపి అన్నదాత సుఖీభవ పథకం పేరిట అమలు చేయబోతున్నట్టు చెప్పారు. రూ.43,402.33 కోట్ల అంచనాలతో రూపొందించిన వ్యవసాయ బడ్జెట్‌ను అచ్చెన్నాయుడు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment