తెలంగాణ: పంట పండింది | Telangana Farmer Happy With Paddy Yield | Sakshi
Sakshi News home page

తెలంగాణ: పంట పండింది

Published Fri, Apr 17 2020 1:43 AM | Last Updated on Fri, Apr 17 2020 7:41 AM

Telangana Farmer Happy With Paddy Yield - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఈసారి యాసంగిలో రైతన్నను అదృష్టం ‘వరి’ంచింది.. పొలాలన్నీ సిరుల కళ్లాలయ్యాయి. నిన్నటివరకు పచ్చగా కళకళలాడిన వరిపొలాల తెలంగాణ మాగాణి.. నేడు బంగారు వర్ణపు కంకులతో మెరిసిపోతూ రైతింట ‘పంట పండించింది’. నేల ఈనిందా.. బంగారం పండిందా అన్నట్టుగా.. ఎటుచూసినా పొలాల్లో కోతల కోలాహలం.. కళ్లాల్లో నిండారబోసిన ధాన్యపు రాశులు.. ఆనందంతో మురిసిపోతున్న రైతన్న కోతల వేగాన్ని పెంచాడు. కరోనా నేపథ్యంలో రైతుకు ఏ చిన్నకష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకున్న ప్రభుత్వం.. రైతు చెంతనే 7వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కోటి మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు పకడ్బందీ చర్యలు తీసుకుంది. నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తోంది.

ఊపిరిలూదిన ప్రాజెక్టులు, చెరువులు
రాష్ట్రంలో గతేడాది జూన్‌లో విస్తారంగా వర్షాలు కురవడంతో ఎస్సారెస్పీ, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎల్లంపల్లి నీటితో నిండాయి. దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 60 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోసి ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. దీంతో సాగునీటి ప్రాజెక్టుల కింద ఏకంగా 40లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఎస్సారెస్పీ మొదటి, రెండో దశల కిందే 12 లక్షల ఎకరాలు సాగు కాగా, నాగార్జునసాగర్‌ కింద 6.40లక్షల ఎకరాల్లో పూర్తిస్థాయిలో సాగు జరిగింది. ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసి దాదాపు 5వేల చెరువులు నింపారు. దీంతో భూగర్భ జలాలు పెరిగాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో భూగర్భజల సగటు మట్టం గతేడాది 12 మీటర్ల వరకు ఉండగా, అది ఈ ఏడాది ఏకంగా 7 మీటర్లకు చేరింది. దీంతో బోర్ల కింద సాగు పెరిగింది. ఇందులో ఎక్కువగా వరి పంటే సాగైంది. గతేడాది యాసంగిలో మొత్తంగా 18.57లక్షల ఎకరాలలో వరి సాగవగా, అది ఈ ఏడాది ఏకంగా 40లక్షల ఎకరాలకు పెరిగింది. పంటకు ఎక్కడా నీటి కొరత లేకుండా ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతిలో చివరి తడి వరకు నీటిని అందించడంతో దిగుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగింది.

ఇబ్బడిముబ్బడిగా దిగుబడులు
ప్రస్తుతం కరీంనగర్, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలో వరికోతలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ ఎకరాకి కొన్నిచోట్ల 30 – 32 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. మిగతాచోట్ల ఎకరాకు 27 – 29 క్వింటాళ్ల ధాన్యం వస్తోంది. ఈ క్రమంలోనే కోటి మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో కనీసంగా 91లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. గతేడాది యాసంగిలో 37లక్షల మెట్రిక్‌ టన్నులు, మొన్నటి ఖరీఫ్‌లో 47.11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించగా, ఇప్పుడది రెట్టింపైంది.

‘అన్నపూర్ణ’ జిల్లాలివి..
ప్రాజెక్టుల్లో నీటి లభ్యత మెరుగ్గా ఉండటం, కాళేశ్వరం జలాలతో నీటి ఎత్తిపోతలు పెరగడంతో గోదావరి పరివాహక జిల్లాలైన ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్‌తో పాటు కష్ణా పరివాహకంలోని నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో గణనీయంగా పంటలు సాగయ్యాయి. 
– ఉమ్మడి కరీంగనర్‌ జిల్లాలో 2018–19 యాసంగిలో వరిసాగు విస్తీర్ణం 3.72లక్షల ఎకరాలు కాగా, అది ఈ ఏడాది 7.92లక్షల ఎకరాలకు పెరిగింది. ధాన్యం దిగుబడి 9.14లక్షల మెట్రిక్‌ టన్నులు ఉండగా, అది ఈ ఏడాది 15.95లక్షల వరకు ఉంటుందని అంచనా. 
– దేవాదుల, ఎస్సారెస్పీ–2 ప్రాజెక్టుల ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరందడంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈ సీజన్‌లో 4,38,033 ఎకరాల్లో వరి సాగైంది. 9.32 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఖరీఫ్‌లో 557 కేంద్రాలను ఏర్పాటు చేయగా ప్రస్తుతం 1,031 పెట్టాలని భావిస్తున్నారు. అవసరమైతే వీటి సంఖ్యను పెంచుతారు.
– పూర్వ నల్లగొండ జిల్లాలో సాగర్, ఎస్సారెస్పీ–2 కింద నింపిన చెరువుల పరిధిలో ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుత నల్లగొండ జిల్లాలోనే గత సీజన్‌లో 1.75లక్షల ఎకరాల్లో సాగు జరగ్గా, ప్రస్తుతం 3.75లక్షల ఎకరాలు సాగయ్యాయి. ఈ ఏడాది ఇక్కడ 7.58లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యం వస్తుందని అంచనా. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే ముగిసిన ఖరీఫ్‌లో 1.15లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించగా, ఈ ఏడాది 8.64 లక్షల టన్నుల మేరకు సేకరిస్తారని అంచనా. 
– ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 14లక్షల మెట్రిక్‌ టన్నులు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో 8.50లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేశారు.

పది రోజుల్లోనే 3.81లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్లు..
ఈ నెల మొదటి వారం నుంచి మొదలైన ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కేవలం పది రోజుల్లోనే ఏకంగా 3,516 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.81లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు పుంజుకుంటుండటంతో ఇకపై సేకరణ మరింత ముమ్మరం కానుంది. కొనుగోలు కేంద్రాల్లో పరిమిత దూరం పాటించాలని రైతులకు సూచిస్తున్నారు. ఖరీఫ్‌లో చెల్లించిన మద్దతు ధర మాదిరే ఏ గ్రేడ్‌ ధాన్యం క్వింటాకు రూ.1,835, సాధారణ రకానికి రూ.1,815గా చెల్లిస్తున్నారు. ఇప్పటికే రూ.500 కోట్ల మేర చెల్లింపుల ప్రక్రియ పూర్తయింది. ఇక కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లింగ్‌ కేంద్రాలకు తరలించేలా రవాణా ఏర్పాట్లు చేశారు.

(కేస్‌ స్టడీ)
ఈ ఫొటోలోని రైతు పేరు గాదె మహేందర్‌రెడ్డి. రుద్రగూడెం (వరంగల్‌ రూరల్‌ జిల్లా నల్లబెల్లి మండలం) గ్రామానికి చెందిన ఈయన నాలుగు ఎకరాల్లో రబీలో వరి సాగు చేశాడు. గత ఖరీఫ్, రబీలో వరి పంటలకు భారీగా తెగుళ్లు ఆశించడంతో అనుకున్న స్థాయిలో దిగుబడి రాలేదు. ప్రస్తుత రబీలో చెరువు, బావి నీటి ఆధారంగా వరి సాగు చేశాడు. అదృష్టవశాత్తూ తెగుళ్లు సోకలేదు. పంట ఆశాజనకంగా ఉంది. మరో వారంలో కోతకు సిద్ధమవుతున్నట్టు ఆనందంగా చెప్పాడు. ఈయనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా పలువురు రైతులు రబీలో వచ్చే దిగుబడులతో అప్పులు సైతం తీర్చుకోవచ్చనే సంతోషంతో ఉన్నారు.

కేస్‌ స్టడీ–2:
ఈ రైతు పేరు గంగాధరి రమేష్‌. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌కు చెందిన ఈయన పాకాల ఆయకట్టు, బావి కింద 12 ఎకరాల్లో వరి సాగు చేశాడు. గత ఖరీఫ్‌లో 35 బస్తాల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం రబీలో 40 – 45 బస్తాల దిగుబడి వస్తుందనే ఆశతో ఉన్నాడు. పాకాల సరస్సులోని నీటి లభ్యత ఆధారంగా వరి.. ఈసారి సిరులు కురిపించనుందని రమేష్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. 

నీళ్లకు లోటులేదు.. పంటకు కొదవలేదు
ఈసారి చెరువుల నీళ్లు మంచిగున్నయి. గతేడాది కన్నా బోర్లు కూడా మంచిగ పోసినయ్‌. అందుకే ధాన్యం గింజలు మంచిగెళ్లింది. గతంల 25 క్వింటాళ్లు ఎకరాకు వస్తే ఈ ఏడాది 28 నుంచి 30 క్వింటాళ్లు వస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇప్పుడిప్పుడే ధాన్యం తరలిస్తున్నం.
– సురేందర్, మాటూరు, నాగిరెడ్డిపేట, కామారెడ్డి జిల్లా

నాలుగు పుట్లు పండినయ్‌..
గతేడాది ఎకరం నేలలో వరి పంట వేస్తే మూడు పుట్ల వడ్లు పండాయి. తిండికోసం ఇంటికే వాడుకున్నా. ఈ ఏడాది అంతే విస్తీర్ణంలో వరి పంట వేస్తే నాలుగు పుట్ల వడ్లు పండినయ్‌. పుష్కలంగా నీళ్లుండటంతో పంట దిగుబడి పెరిగింది.
– కొర్ర శంకర్‌. గుండ్రాతిమడుగు పెద్దతండా, కురవి మండలం, వరంగల్‌ జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement