government decision
-
టీఎస్‌కు బదులు ‘టీజీ’!
సాక్షి, హైదరాబాద్: వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లో తెలంగాణ రాష్ట్ర కోడ్‌ను తెలిపే ‘టీఎస్’కు బదులుగా ‘టీజీ’ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభు త్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఉద్యమకాలంలో తెలంగాణను సంక్షిప్తరూపంలో ‘టీజీ’గా పరిగణించేవారని.. ఈ క్రమంలోనే కోడ్‌ను ‘టీజీ’గా మార్చేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైందని ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి. ఇందుకోసం రాష్ట్ర మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. దీనితోపాటు మరో 20 ప్రధాన అంశాలను కేబినెట్ చర్చించనున్నట్టు తెలిసింది. గ్రూప్–1 పోస్టులు పెంపు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మరో 64 గ్రూప్–1 పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీచేసే అంశంపై కేబినెట్ చర్చించనుంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ద్వారా 503 గ్రూప్–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో.. ఈ అదనపు పోస్టుల భర్తీకి అనుబంధ నోటిఫికేషన్ జారీచేసే అవకాశాలు ఉన్నాయి. ఇక వివిధ శాఖలు/విభాగాల్లో పదవీ విరమణ తర్వాత కూడా కొనసాగుతున్న 1,049 మంది ప్రభుత్వ అధికారుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ‘బడ్జెట్’ తేదీల ఖరారు శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించే తేదీని కేబినెట్ ఖరారు చేయనుంది. సమావేశాల తొలిరోజున గవర్నర్ తమిళిసై చేయనున్న ప్రసంగాన్ని ఆమోదించనుంది. 8 నుంచి బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని ప్రభుత్వంయోచి స్తోంది. 9న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జీఎస్టీ చట్ట సవరణ, పీఆర్ చట్ట సవరణ, సిటీ సివిల్ కోడ్ చట్ట సవరణ బిల్లులకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. ధరణిపై అధ్యయన కమిటీ సమరి్పంచిన మధ్యంతర నివేదికపై కూడా సమీక్షించి తదుపరి కార్యాచరణను ఖరారు చేయనుంది. రాష్ట్ర గవర్నర్ గతంలో నిలిపివేసిన బిల్లులను తిరిగి పరిశీలన కోసం పంపాలన్న అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. కులగణనపై చర్చ.. రాష్ట్రంలో చేపట్టనున్న కులగణనకు చట్టబద్ధత కల్పించేందుకు వీలుగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బడ్జెట్ కేటాయింపుల కోసం వివిధ శాఖల మంత్రులు చేసిన ప్రతిపాదనలను పరిశీలించనున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో భాగమైన రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీలను అమల్లోకి తెచ్చే అంశంపై చర్చించనున్నారు. ఈ రెండు పథకాలను ఎప్పుడు ప్రారంభించాలి, ఏ మేర ఆర్థిక భారం పడుతుందన్నది పరిశీలించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లపైనా చర్చించే అవకాశం ఉందని తెలిసింది. ఏ రాష్ట్రమో తెలిపే ‘కోడ్’ అది.. వాహనాల నంబర్ ప్లేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)లలో వాహనం ఏ రాష్ట్రంలో రిజిస్టర్ అయిందో తెలియజేసేలా కోడ్ ఉంటుంది. తెలంగాణ ఏ ర్పాటై, బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ప్రభుత్వం ఏర్పాటు చేశాక.. వాహనాల నంబర్లో రాష్ట్ర కోడ్‌గా ‘టీఎస్’ అనే అక్షరాలను పొందుపర్చాలని నిర్ణయించింది. అప్పటి టీఆర్ఎస్ పార్టీ పేరును పోలినట్టుగా ‘టీఎస్’ అనే అక్షరాలను కోడ్‌గా ఖరారు చేశారంటూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు మండిపడ్డాయి. తాజాగా ‘టీఎస్’కు బదులు ‘టీజీ’ అనే స్టేట్ కోడ్‌ను వినియోగించాలని నిర్ణయానికి వచ్చింది. -
విధుల్లోకి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు
-
రగిలిన చిచ్చు
కాకినాడ రూరల్: కాపులను బీసీల్లో చేర్చి 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న చంద్రబాబు సర్కారు నిర్ణయంతో చిచ్చు రగిలింది. ప్రభుత్వ నిర్ణయంపై మండిపడిన బీసీలు ఉద్యమ పథంలో కదం తొక్కారు. కాపు రిజర్వేషన్లపై తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట బీసీలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్త్తతకు దారి తీసింది. వందలాదిగా కలెక్టరేట్‌కు తరలివచ్చిన బీసీలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. టైర్లు తగులబెట్టారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని కాజులూరు మండలం కోలంకకు చెందిన యువకుడు మేడిశెట్టి ఇజ్రాయిల్ ఆత్మహత్యా యత్నం చేశాడు. అక్కడే ఉన్న బీసీ నాయకులు స్పందించి నీరు పోయడంతో అతడు స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో కలెక్టరేట్‌వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీసీ ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తోందంటూ పలువురు బీసీలు మండిపడ్డారు. జస్టిస్ మంజునాథ కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కమిషన్ ఏం చెప్పిందో తేల్చకుండా కాపులకు అశాస్త్రీయంగా బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం తగదన్నారు. కేవలం కమిషన్ సభ్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కాపులకు, బీసీలకు మధ్య గొడవలు సృష్టించడానికే చంద్రబాబు ప్రభుత్వం ఈ బిల్లు తేవడానికి ప్రయత్నించినట్టుందంటూ మండిపడ్డారు. బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాపులను బీసీల్లో కలుపుతూ ప్రభుత్వం చేసిన ప్రకటనపై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రత్యేక కార్యాచరణతో ప్రజల్లోకి.. ఆందోళనలో పాల్గొన్న పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ, కాపులను బీసీల్లో చేరుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించేందుకు రాష్ట్రంలోని బీసీ నాయకులంతా సమావేశమై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. ప్రభుత్వానికి ఇబ్బందులు కలగజేస్తామని హెచ్చరించారు. తెలుగుదేశానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరూ కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయాన్ని వ్యతిరేకిస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు రావనో, మంత్రి పదవులు రావనో అనుకునేవారికి ఎమ్మెల్యే అవకుండానే బీసీలంతా బుద్ధి చెబుతారన్నారు. కాపుల ఓట్లతోనే ఎమ్మెల్యేలుగా గెలుస్తామని అనుకుంటే ఏవిధంగా చేయాలో బీసీలందరూ నిర్ణయిస్తారని అన్నారు. చంద్రబాబు ప్రకటిస్తే అయిపోయేది కాదని, దీనిని ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను సహితం ఖాతరు చేయనివారికి సరైన గుణపాఠం చెబుతామని మల్లాడి స్పష్టం చేశారు. ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి సహకరించిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు, బీసీ ఆందోళనకు సహకరించని ప్రజాప్రతినిధుల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ, కాపులను బీసీల్లో చేర్చడానికి తాను పూర్తిగా వ్యతిరేకినని అన్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నానన్నారు. దేశంలో ఎవరు ఉన్నత పదవుల్లో ఉన్నా రాజ్యాంగానికి లోబడి పని చేయాల్సిందేనని గుర్తు చేశారు. సామాజిక, విద్యా రంగాల్లో వెనుకబాటుతనం ఉన్నవారు మాత్రమే రిజర్వేషన్లకు అనుకూలమని రాజ్యాంగం చెబుతోందని వివరించారు. రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు రాజ్యాంగానికి లోబడే ఉన్నాయన్నారు. ఈ ఆందోళనలో రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు చొల్లంగి వేణుగోపాల్, మాకినీడి భాస్కర్, పంపన రామకృష్ణ, కడలి ఈశ్వరి, గుబ్బల వెంకటేశ్వరరావు, కుండల సాయికుమార్, ఎ.శ్రీనివాసరావు, వాసంశెట్టి త్రిమూర్తులు, గరికిన అప్పన్న తదితరులు కూడా పాల్గొన్నారు. -
కాపులకు రిజర్వేషన్లపై బీసీల కన్నెర్ర
అమలాపురం టౌన్: కాపులను బీసీల్లో చేర్చుతూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయంపై అమలాపురంలో బీసీలు కన్నెర చేశారు. రోడ్డెక్కి నిరసన తెలిపారు. బీసీల రిజర్వేషన్లను హరించేందుకు కుట్ర పన్నిన ముఖ్యమంత్రి చంద్రబాబు శవ యాత్ర నిర్వహించారు. చంద్రబాబు దిష్టి బొమ్మ దహనం చేశారు. బీసీలను సామాజికంగా అణిచి వేసేందుకే చంద్రబాబు ప్రభుత్వం కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసిం దని రాష్ట్ర బీసీ నాయకులు ధ్వజమెత్తారు. తొలుత సూర్యనగర్‌లోని బీసీ నేత, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి స్వగృహం ఆవరణలో కోనసీమ బీసీ నాయకులు సమావేశమయ్యారు. రాష్ట్ర బీసీ సంఘాల కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంజునాథ కమిషన్ అధ్యక్షుడైన మంజునాథ్ లేకుండా కొంతమంది సభ్యులతో ఆదరాబాదరగా కేబినెట్ టేబుల్ నోట్ కింద అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టడం ఓ పథకం ప్రకారం చేశారని ఆరోపించారు. ఇందుకు నిరసనగా గ్రామ గ్రామాన బీసీలు ధర్నాలు, రాస్తారోకోలతో తమ ఆవేదన, ఆగ్రహాన్ని తెలపాలని సమావేశం పిలుపునిచ్చింది. అనంతరం చంద్రబాబు దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి, గడియారం స్తంభం సెంటరుకు చేరుకుని, దిష్టిబొమ్మను దహనం చేశారు. వివిధ బీసీ కులాలు, సంఘాల నాయకులు మట్టపర్తి మురళీకృష్ణ, చెల్లుబోయిన శ్రీనివాసరావు, కుడుపూడి బాబు, మట్టపర్తి నాగేంద్ర, వాసంశెట్టి సత్యం, పేట వెంకటేశ్వరరావు, కుడుపూడి త్రినాథ్, తాళాబత్తుల లక్ష్మణరావు, ఊటుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు, కాళే వెంకటేశ్వరరావు, కుడుపూడి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి సుభాష్, ఐవీ సత్యనారాయణ, కుంజే సుబ్బరాజు, పసుపులేటి శ్రీనివాసరావు తదితరులు ధర్నా, రాస్తారోకో తదితర నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీసీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి రాజోలు: కాపులకు రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటున్న సమయంలో కనీసం మాట్లాడలేని బీసీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి ఆ పార్టీ నుంచి బయటకు రావాలని బీసీ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. తాటిపాకలోని రాజోలు తాలూకా శెట్టిబలిజ సంఘ భవనం ఎదుట 216 జాతీయ రహదారిపై శనివారం బీసీ సంఘ నాయకులు ధర్నా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకు అలవాటన్నారు. రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అసెంబ్లీలో కాపు మహిళలు జీడిపప్పు వలుస్తూ కష్టాలు పడిపోతున్నారని మాట్లాడారని, బీసీ కులాల్లో ఉన్న మహిళలు కల్లు అమ్మడం, బట్టలు ఉతకడం, కూలి పనులకు వెళ్లడం కనిపించడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే సూర్యారావు దిష్టిబొమ్మను దహనం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘ నాయకులు గుబ్బల బాబ్జి, చెల్లుబోయిన రాంబాబు, గుబ్బల శ్రీను, కంబాల చంద్రరావు, గుబ్బల నరేంద్రకుమార్, యనమదల సీతారామరాజు, మట్టపర్తి రెడ్డి, మామిడిశెట్టి మనోహర్, చెల్లుబోయిన శ్రీను, బొమ్మిడి వెంకటేష్, గుబ్బల రమేష్, చింతా రామకృష్ణ, గెద్దాడ రాంబాబు, వెలుగొట్ల శ్రీను, మొల్లేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు నిర్ణయంతో పెరగనున్న విమాన చార్జీలు?
కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో దేశీయ విమాన చార్జీలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రాంతీయ కనెక్టివిటీని పెంచేందుకు ఉద్దేశించిన నిధి కోసం ప్రత్యేకంగా ఒక లెవీ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దూరాన్ని బట్టి వివిధ విమాన ప్రయాణాలపై లెవీ విధించనున్నట్లు ప్రకటించింది. విమానయాన సంస్థలు ఎటూ ఈ మొత్తాన్ని ప్రయాణికుల మీదే మోపుతాయి కాబట్టి టికెట్ల ధరలు పెరగడం ఖాయమని అంటున్నారు. లెవీ వివరాలు ఇలా ఉన్నాయి... వెయ్యి కిలోమీటర్ల లోపు దూరం వెళ్లే విమానాలకు రూ. 7,500 లెవీ విధిస్తారు. అలాగే 1000 నుంచి 1500 కిలోమీటర్ల వరకు దూరం వెళ్లే విమానాలకు రూ. 8000, 1500 కిలోమీటర్లకు మించిన దూరం వెళ్లే స్వదేశీ విమానాలకు రూ. 8,500 చొప్పున ఈ రీజనల్ కనెక్టివిటీ లెవీ ఉంటుంది. దాంతో విమాన చార్జీలు కూడా ఆ మేరకు పెరగక తప్పదు. అయితే.. మొత్తం విమాన ప్రయాణానికి కలిపి ఈ లెవీ ఉంటుంది కాబట్టి, అది మొత్తం అన్ని టికెట్లకూ పంపిణీ అవ్వాలి. ఆ లెక్కన చూసుకుంటే తక్కువ మొత్తమే పెరగాలి. కానీ ఎంత మేర పెరుగుదల ఉంటుందనేది నిర్ణయం పూర్తిగా అమలైతే తప్ప తెలియదు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ లెవీ అమలవుతుందని పౌరవిమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ నయన్ తెలిపారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
- సింహాచలం భూముల క్రమబద్దీకరణ - కేబినెట్లో తాజాగా ఆమోదం - 12,149 మందికి లబ్ది - 60 గజాల్లోపు ఆక్రమించుకున్న 1665 మందికి ఉచితం సాక్షి, విశాఖపట్నం: దశాబ్దాల కల సాకారమవుతోంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సింహాచలం భూముల ఆక్రమిత బాధితులకు ఊరట లభించింది. ఏళ్లతరబడి ఆక్రమించుకున్నవారివే క్రమబద్ధీకరించాలని శనివారం విజయవాడలో కేబినెట్ సమావేశంలో సర్కార్ నిర్ణయం తీసుకుంది. 2008లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుననుసరించి పంచగ్రామాల భూముల సమస్యను పరిష్కరించాలని నిర్ణయించింది. సింహాచలం దేవస్థానికిచెందిన 419ఎకరాల భూమి రెండు దశాబ్దాల క్రితం ఆక్రమణకు గురైంది. ఈ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.2232కోట్లకు పైగా ఉంది. 12,149 మంది ఆక్రమించు కుని పక్కాకట్టడాలు నిర్మించుకున్నారు. 2008వరకు ఆక్రమించుకుని నిర్మించుకున్న పక్కా భవనాలను క్రమబద్ధీకరించాలని కేబినెట్ నిర్ణయించింది. ఆక్రమించుకున్న వారిని మూడు కేటగిరిలుగా విభజించింది. తొలికేటగిరిలో 60 చదరపు గజాలలోపు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న నిరుపేదలకు ఉచితంగా క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. 300 గజాల్లోపు ఆక్రమించుకున్న వారికి 1998 సంవత్సరం నాటి మార్కెట్ రేటులో 70 శాతంతో పాటు నాటి నుంచి నేటి వరకు ఏటా 9 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తే క్రమబద్దీకరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక 300 గజాలకు పైబడి ఆక్రమించుకున్న వారికి మాత్రం ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం వసూలు చేసి రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించింది. ఈ విధంగా 60 చదరపు గజాల్లోపు ఆక్రమించుకున్న వారు 1665 మంది ఉండగా, 300 చదరపు గజాల్లోపు ఆక్రమించుకున్న వారు 9366 మంది ఉన్నారు. 300 చదరపు గజాలు పైబడి ఆక్రమించుకున్న వారు 1118 ఉన్నట్టుగా లెక్క తేల్చారు. ఈ భూమికి ప్రత్యామ్నాయంగా 547 ఎకరాలను సింహాచలం దేవస్థానానికి కేటాయించాలని కేబినెట్ నిర్ణయిం చింది. ఈభూముల కనీసవిలువ రూ.609కోట్లు ఉంటుందని అంచనా వేసింది. దేవస్థానం నష్టపోతున్న 419 ఎకరాల భూమి విలువ రూ.2232 కోట్లుగా లెక్క తేల్చింది. ఈ మేరకు ప్రత్యామ్నాయ భూమితో పాటు రెగ్యులరైజేషన్ ద్వారా వచ్చే రూ.989కోట్ల ఆదాయాన్ని కూడా దేవస్థానానికి చెందేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. -
ఆసరా..గాభరా!
- జీరో ఖాతాలకు బ్యాంకర్ల కొర్రీలు.. - లబ్ధిదారుల అవస్థలు - జంట జిల్లాల్లో 4.52 లక్షల ఆసరా పింఛన్లు - బ్యాంకు ఖాతాలు 1.51 లక్షలు మాత్రమే - అయోమయంలో 3.01 లక్షల మంది... సాక్షి, సిటీబ్యూరో: పింఛన్లు అందక ఆసరా లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకర్ల కొర్రీలు, జీరో ఖాతాల ఓపెనింగ్‌లో కష్టాలతో దాదాపు 3 లక్షల మంది లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. బ్యాంకు ఖాతాల ద్వారానే సామాజిక పింఛన్లు(ఆసరా) పంపిణీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయం కారణంగా లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చే యాల్సి వస్తోంది. ఆసరా పింఛన్లకు సంబంధించి జీరో ఖాతాలు తెరవాలని అధికారయంత్రాంగం బ్యాంకర్లను ఆదేశించినా..సరిగ్గా పట్టించుకోకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. పింఛన్లు పంపిణీ చేసే తేదీ (10) దగ్గర పడుతుండటంతో మరింత టెన్షన్‌కు గురవుతున్నారు. ఖాతాల కోసం బ్యాంకులకు వెళ్లితే సాయంత్రం లేదా రేపు...ఎల్లుండి రావాలని సమాధానం వస్తుండడంతో వారు ఆవేదన చెందుతున్నారు. వికలాంగులు, వృద్ధులైతే బ్యాంకుల చుట్టూ ప్రతిరోజు తిరగలేక మధ్య దళారులను ఆశ్రయిస్తున్నారు. జీరో ఖాతాలు తెరిపించినందుకుగాను దళారులకు రూ.50 నుంచి రూ. 100 వరకు ముట్టజెప్పాల్సివస్తుందంటున్నారు. అధికార యంత్రాంగం జోక్యం చేసుకుంటే తప్ప ఖాతాలపై బ్యాంకర్లు కనికరించే పరిస్థితి లేదంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ నెల ఆసరా పింఛన్లు వరకు బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసుకోవటం కష్టమని లబ్ధిదారులంటున్నారు. అధికారులు మాత్రం బ్యాంకు ఖాతాలు లేకుండా ఆసరా పింఛన్లు ఇవ్వలేమంటున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాలలో మొత్తంగా ఆసరా పింఛన్‌దారులు 4,52,168 మంది ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో 1,65,025 మంది, రంగారెడ్డి జిల్లాలో 2,87,143 మంది ఉన్నారు. అయితే బ్యాంకు ఖాతాలు మాత్రం ఇప్పటి వరకు జంట జిల్లాలలో 1.51 లక్షలే ఆసరా పింఛ న్లతో అనుసంధానమయ్యాయి. ఇందులో హైదరాబాద్ జిల్లాలో 78 వేలు కాగా, రంగారెడ్డి జిల్లాలో 73 వేల వరకు ఉన్నాయి. జంట జిల్లాల్లో ఇంకా 3,01,168 ఆసరా పింఛన్లు బ్యాంకు ఖాతాలతో అనుసంధానం కావాల్సి ఉంది. దీంతో ఈనెలలో పింఛన్ల పంపిణీపై అధికారయంత్రాంగం మల్లగుల్లాలు పడుతుండగా... బ్యాంకు ఖాతాలు లేని లబ్ధిదారులు మాత్రం పింఛన్ వస్తుందో..రాదోనని టెన్షన్ పడుతున్నారు. -
బదిలీ కావాలంటే.. బేరం కుదరాలి!
జిల్లాలో బదిలీల జాతర మొదలు కానుంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై మే 1 నుంచి 20 వరకూ నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దాదాపు ఖరారయింది. దీంతో ఉద్యోగులు ఆశించిన స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే పోస్టింగ్‌ల్లో ప్రాధాన్యత దక్కనుంది. దీంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే, ఎంపీల సిఫార్సు లేఖలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బదిలీ కావాలని వెళుతున్న వారికి ముందు బేరం కుదరాలిగా అనే మాటలు ఎదురవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం : ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై మే 1-20 వరకూ ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేయనుంది. ఈమేరకు ఆర్థికశాఖ రెండుమూడురోజుల్లో జీవో జారీచేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జిల్లా, జోనల్‌స్థాయి ఉద్యోగుల బదిలీలకు మాత్రమే ప్రభుత్వం అనుమతిని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కేడర్ ఉద్యోగులను బదిలీ నుంచి మినహాయించనున్నారు. అలాగే మే 1కి ఉద్యోగంలో చేరి రెండేళ్ల సర్వీసు పూర్తికాని వాళ్లకు మినహాయింపు ఇవ్వనున్నారు. ఐదేళ్లు పూర్తయినవారిని కచ్చితంగా బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పనితీరు, దీర్ఘకాలం ఒకేచోట ఉన్నవారు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, భార్యాభర్తలు ఉద్యోగులుగా ఉండి వేర్వేరు చోట్ల ఉన్న వారికి బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే రాష్ట్రకేడర్ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నారు. ఎమ్మెల్యే లేఖలే పోస్టింగుకు కీలకం: ఆశించినచోట పోస్టింగు దక్కించుకునేందుకు అధికారపార్టీ నేతల ఆశీస్సులు తప్పనిసరి అని భావించిన అధికారులు వారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ‘మీరు చెప్పినట్లుగా నడుచుకుంటాను. నాకు లెటర్ ఇవ్వండిసార్!’ అంటూ ఇళ్లచుట్టూ తిరుగుతున్నారు. కొందరు అధికారులు నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటు ఎంపీ లెటరు కూడా తీసుకుంటున్నారు. ఉరవకొండ, కదిరి నియోజకవర్గాల్లో మాత్రం ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన వారు కావడంతో మాజీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, కందికుంట ప్రసాద్‌లతో సిఫార్సు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు నాయకులు ఈ లేఖలు ఇప్పిచ్చేందుకు పోస్టును బట్టి రేట్ ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పదేళ్ల తర్వాత టీడీపీ అధికారంలోకి రావడం, ఇసుక తవ్వకాలు మినహా తక్కిన వాటిలో ఆదాయం లేకపోవడంతో ప్రస్తుతం బదిలీ పర్వాన్ని ఉపయోగించుకోనున్నారు. వీలైనంత వరకూ ముడుపులు తీసుకుని పోస్టింగులు ఇప్పించేందుకు సిద్ధమైనట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తహశీల్దార్, ఎంపీడీవో, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్‌తో పాటు పలు కీలకశాఖలకు సంబంధించిన పోస్టులను తాము సిఫార్సు చేస్తూ లేఖలు ఇచ్చినవారికే ఇవ్వాలని కొందరు ప్రజాప్రతినిధులు ఇప్పటికే ఆయా శాఖల ఉన్నతాధికారులకు హుకూం జారీ చేసినట్లు తెలిసింది. అధికారులు కూడా అధికారపార్టీ చెప్పిన వారికే పోస్టింగులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. లేదంటే తమ స్థానాలకు ఎక్కడ ముప్పువాటిల్లుతుందో అని జంకుతున్నారు. ఎంపీడీవోల నియామకంలో ఎమ్మెల్యేతో పాటు జెడ్పీ చైర్పర్సన్ సిఫార్సు తప్పనిసరి అవుతోంది. ఎమ్మెల్యే లేఖ ఇచ్చినా జెడ్పీచైర్‌పర్సన్ అభిప్రాయం కూడా ఉన్నతాధికారులు తెలుసుకుంటున్నారు. తమకు అనుకూలంగా వ్యవహరించని అధికారులను బదిలీ చేయాలని ఇప్పటికే పలువురు మండలస్థాయి నేతలు జెడ్పీ చైర్పర్సన్ చమన్ దృష్టికి తీసుకొచ్చారు. మే 1నుంచి బదిలీల ప్రక్రియ మొదలయ్యే పరిస్థితులు ఉండటంతో అధికారులు సెలవుల్లో వెళ్లి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 20రోజులు కాసుల పంట: టీడీపీలో ఎమ్మెల్యేల వద్ద సన్నిహితంగా ఉండే టీడీపీ కార్యకర్తలు అధికారులతో పోస్టింగుకు బేరం మాట్లాడుకుని ఎమ్మెల్యేలతో లెటర్లు ఇప్పించేందుకు బేరాలు మొదలెట్టారు. తమ సన్నిహితులకు ఫోన్ చేసి ‘ఎవరికైనా పోస్టింగు కావాలంటే చెప్పు..ఇప్పిస్తాం’ అని వీలైనన్ని బదిలీలు తమ పరిధిలోకి వచ్చేలా చూస్తున్నారు. మేలో వందల సంఖ్యలో బదిలీలు జరగనున్నాయి. దీంతో టీడీపీ నేతల జేబుల్లోకి అధికారుల సొమ్ము భారీగా చేరనుంది. -
ఎస్వీ షుగర్స్‌లో క్రషింగ్.. చిత్తూరులో పెండింగ్
* నేటి నుంచి శ్రీవెంకటేశ్వర సహకార చక్కెర పరిశ్రమలో క్రషింగ్.. * చిత్తూరు షుగర్స్‌లో క్రషింగ్‌పై నీలినీడలు * 30న ఎండీలతో సీఎం కీలక సమావేశం.. * బకాయిల చెల్లింపుపై నిర్ణయం తీసుకోకపోతే సహకార పరిశ్రమలకు కష్టకాలమే సాక్షి ప్రతినిధి, తిరుపతి: చెరకు రైతుకు ఒకింత తీపి కబురు.. మరింత చేదువార్త..! క్రషింగ్కూ రికవరీకి ముడిపెట్టి డిసెం బర్ 25 తర్వాతే సహకార చక్కెర పరిశ్రమల్లో క్రషింగ్ ప్రారంభించాలన్న ఉత్తర్వులను ప్రభుత్వం సడలించింది. రేణిగుం ట మండలం గాజులమండ్యంలోని శ్రీవెంకటేశ్వర సహకార చక్కెర పరిశ్రమ(ఎస్వీ షుగర్స్)లో గురువారం క్రషింగ్ ప్రా రంభించనున్నారు. కానీ.. చిత్తూరు సహకార చక్కెర పరిశ్రమ(చిత్తూరు షుగర్స్)లో మాత్రం క్రషింగ్‌కు ప్రభుత్వం అనుమతించలేదు. రెండేళ్ల నుంచి బకాయిలు చెల్లించని నేపథ్యంలో ఎస్వీ షుగర్స్‌కు చెరకును సరఫరా చేసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. ఈ నెల 30న సహకార చక్కెర పరిశ్రమల మేనేజింగ్ డెరైక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో బకాయిలను చెల్లించే లా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సహకార పరిశ్రమలకు.. రైతులకూ ప్రయోజనం. లేదంటే ఇరు వర్గాలకూ కష్టకాలమేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. జిల్లాలో 87,004 హెక్టార్లలో చెరకు పంటనుసాగుచేశారు. హెక్టారుకు కనిష్ఠంగా 80 టన్నుల చొప్పున 69.6 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో మూడు ప్రైవేటు, రెండు సహకార చక్కెర పరిశ్రమలు ఉన్నాయి. ప్రైవేటు చక్కెర పరిశ్రమల్లో అక్టోబర్ నాలుగో వారం నుంచే క్రషింగ్‌ను ప్రారంభించారు. సహకార చక్కెర పరిశ్రమల్లో పరిస్థితులను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ.. డిసెంబర్ 25 తర్వాత క్రషింగ్ చేస్తే రికవరీ పర్సంటేజీ అధికంగా ఉంటుందని, అప్పుడే క్రషింగ్ ప్రారంభించాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. కానీ.. 1.5 లక్షల టన్నుల చెరకు క్రషింగ్‌కు ఎస్వీ షుగర్స్, 50 వేల టన్నుల క్రషింగ్‌కు చిత్తూరు షుగర్స్ రైతులతో ఒప్పందం చేసుకున్నాయి. డిసెంబర్ 25 వరకూ క్రషింగ్ ప్రారంభించకపోతే.. ప్రైవేటు ఫ్యాక్టరీలు పూర్తి స్థాయిలో చెరకును కొనుగోలు చేస్తాయని సహకార ప్యాక్టరీల యాజమాన్యాలు ప్రభుత్వానికి నివేదించాయి. దాంతో ఎస్వీ షుగర్స్‌లో క్రషింగ్‌కు ప్రభుత్వం అనుమతించింది. కానీ.. చిత్తూరు షుగర్స్‌లో క్రషింగ్‌కు అనుమతించలేదు. మద్దతు ధరపై మీనవేషాలు.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో టన్ను చెరకుకు ఆయా ప్రభుత్వాలు రూ.2,650ను మద్దతు ధరగా ప్రకటించాయి. మన రాష్ట్రంలో ఇప్పటిదాకా చెరకు మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించలేదు. ఎస్వీ షుగర్స్ యాజమాన్యం టన్ను చెరకును కనిష్ఠంగా రూ.1,450 నుంచి గరిష్ఠంగా రూ.1,550 వరకూ ఖరీదు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. చెరకు రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తే.. ధరను పెంచాలని భావిస్తోంది. ఇదే అదునుగా తీసుకున్న ప్రైవేటు చక్కెర పరిశ్రమలు చెరకు రైతును లూటీ చేస్తున్నాయి. టన్ను చెరకు కనిష్ఠంగా రూ.1,850 నుంచి రూ.1,950 వరకూ ఖరీదు చేస్తూ చెరకు రైతును నట్టేట ముంచుతున్నాయి. గతేడాది కేన్ కమిషనర్ బెన్హర్ ఎక్కా ప్రతిపాదనల మేరకు టన్ను చెరకు రూ.2,650ను మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బకాయిలు చెల్లిస్తేనే మనుగడ.. 2012-13, 2013-14 క్రషింగ్ సీజన్లో టన్ను చెరకుకు ప్రభుత్వం రూ.2,100ను మద్దతు ధరగా ప్రకటించింది. సహకార చక్కెర పరిశ్రమలు రైతులకు టన్ను రూ.1800 చెల్లించగా. రూ.300ను ప్రభుత్వం చెల్లించేలా అప్పట్లో ఒప్పందం కుదిరింది. కానీ.. ప్రభుత్వం తాను చెల్లిస్తానన్న రూ.300 రెండేళ్లుగా రైతులకు చెల్లించలేదు. గత రెండేళ్లకు గాను ఎస్వీ షుగర్స్‌కు చెరకు సరఫరా చేసిన రైతులకు రూ.8.62 కోట్లు, చిత్తూరు షుగర్స్‌కు సరఫరా చేసిన రైతులకు రూ.8.5 కోట్ల మేర బకాయిపడింది. బకాయిలను తక్షణమే చెల్లించాలంటూ రైతులు ఉద్యమిస్తున్నారు. ఈ ఏడాది క్రషింగ్ సజావుగా సాగకపోతే సహకార ఫ్యాక్టరీలకు మనుగడ ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహకార పరిశ్రమలను తెగనమ్మడానికి ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో బకాయిల చెల్లింపుపై ఈనెల 30న సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం లేదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. -
బంగారు తల్లీ.. మోసపోతున్నావా చెల్లీ!
- బంగారు తల్లికి బ్రేక్..ఆ స్థానంలో - ‘మహాలక్ష్మి’ పథకం అమలుకు ప్రభుత్వ నిర్ణయం - మూడేళ్లలో మూడుసార్లు పథకం పేర్లు, విధివిధానాలు మార్పు - పథకం మార్చిన ప్రతిసారీ ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులు - ‘సీమ’లో బాలికా సంరక్షణ పథకం పెండింగ్ దరఖాస్తులే 12,425 - బంగారు తల్లి దరఖాస్తులదీ అదే పరిస్థితి... సాక్షి, చిత్తూరు: బంగారుతల్లి పథకం పేరు మారనుంది. ఆడబిడ్డలకు అండగా ఉండేం దుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రవేశపెట్టిన ‘బాలికా సంరక్షణ పథకాన్ని’ ‘బంగారుతల్లి’గా గత ఏడాది అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మార్పు చేశారు. దీంతో అప్పటి వరకూ అమలవుతున్న బాలికాసంరక్షణ పథకం అటకెక్కింది. అప్పటికే దరఖాస్తు చేసుకుని ఉన్న వారికి అన్యాయం జరిగింది. సరిగ్గా గత ఏడాది జూలై ఒకటిన ప్రారంభమైన బంగారుతల్లి పథకాన్ని ఏడాది గడవకముందే ‘చంద్రబాబు’ ప్రభుత్వం ఎత్తేసేం దుకు రంగం సిద్ధం చేసింది. ఆ స్థానంలో ‘మహాలక్ష్మి’ పేరుతో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత బుధవారం ప్రకటన కూడా చేశారు. దీంతో ‘బంగారుతల్లి’ లబ్ధిదారులు, దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంది. భ్రూణ హత్యల నివారణ కోసం మొదలైన పథకం: ఆడపిల్ల పుట్టడం భారమని భావించే కుటుంబాల్లో స్వాంతన కల్గించి, వారికి ఆర్థికంగా అండగా నిలిచి, తద్వారా భ్రూణ హత్యలను నివారించేందుకు 2005 ఏప్రిల్ 1న ‘బాలికాసంరక్షణ పథకాన్ని’ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 11వ తేదీ త ర్వాత ఒకరు లేదా ఇద్దరు ఆడపిల్లలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారు. ఈ పథకానికి అర్హులు. ఒక ఆడపిల్లకే ఆపరేషన్ చేయించుకుంటే లక్ష రూపాయలు, ఇద్దరికైతే చెరో 30వేల రూపాయలను ఈ పథకం ద్వారా అందిస్తారు. ఈ బాండ్లకు పూచీ ఎవరో? గత ఏడాది జూలై 1 నుంచి ‘బంగారుతల్లి పథకం’ అమలవుతోంది. దీంతో అప్పటివరకూ బాలికా సంరక్షణ పథకం కింద వచ్చిన దరఖాస్తులను కిరణ్ ప్రభుత్వం చెత్తబుట్టలో పడేసింది. 2013 మార్చి 31వరకూ రాయలసీమలో 12,425 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ 2010-11, 11-12లో దరఖాస్తు చేసుకున్నవి. నిబంధనల మేరకు వీటన్నిటికి దరఖాస్తు చేసుకున్న ఆర్థిక సంవత్సరంలోనే బాండ్లు అందించాలి. కానీ అలా జరగలేదు. గత ఏడాది మార్చి 31న బాలికాసంరక్షణ పథకాన్ని కిరణ్ ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటివరకూ బాండ్లు అందకుండా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా రద్దు చేయాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు వాటికి బాండ్లు ఇవ్వలేదు. ఇదేంటని అప్పట్లో ప్రశ్నిస్తే బర్త్ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్ సరిగాలేవని, కంప్యూటర్లో పేర్ల నమోదు తప్పుగా నమోదయ్యాయని కుంటిసాకులు చెప్పారు. దీంతో 12,425 మంది దరఖాస్తుదారులు తీవ్రంగా నష్టపోయారు. ఆపై 2013 మే 1 నుంచి పుట్టిన పిల్లలకు మాత్రమే ‘బంగారుతల్లి’ని వర్తింపజేశారు. ఇప్పుడు ‘బంగారు తల్లి’ లబ్ధిదారులకు ఇక్కట్లు 2013 మే 1నుంచి పుట్టిన బిడ్డలకు ‘బంగారుతల్లి’ పథకం వర్తింపజేశారు. ఈ పథకం నిర్వహణను ఐసీడీఎస్, డీఆర్డీఏలకు సంయుక్తంగా అప్పగించారు. గత ఏడాది మే 1నుంచి జూన్ 23 వరకూ పుట్టిన ఆడబిడ్డల వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేశారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే బిడ్డతల్లికి తొలిదశలో 2,500 రూపాయలు చెల్లించారు. అయితే ఈ బాధ్యతను ఏఎన్ఎంలకు, జననాల సర్వే బాధ్యత అంగన్వాడీ కార్యకర్తలకు, బాలికల వివరాల నమోదు బాధ్యత వీఆర్వోలకు అప్పగించారు. దీంతో శాఖల మధ్య సమన్వయం లేక వచ్చిన ద రఖాస్తుల్లో 20-30 శాతం మందికి కూడా బాండ్లు అందలేదు. దాదాపు 70 శాతం దరఖాస్తులకు ఇంకా బాండ్లు అందించాల్సి ఉంది. రాయలసీమలో ‘బంగారుతల్లి’ ద్వారా 3500 దరఖాస్తులకు బాండ్లు అందించాల్సి ఉంది. ‘మహాలక్ష్మి’తో మరిన్ని చిక్కులు ‘బంగారుతల్లి’ ద్వారా బిడ్డ పుట్టినప్పటి నుంచి డిగ్రీ పట్టా పొందే వరకూ డబ్బులు తల్లి ఖాతాలో జమ చేస్తారు. మహాలక్ష్మి పథకం ప్రవేశపెడితే బాండ్లు పొందిన వారికి ఏ పథకం అమలవుతుంది? అసలు అమలవుతుందా? లేదా? అని లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ఎందుకంటే ‘బంగారుతల్లి’ ప్రవేశంతో ‘బాలికాసంరక్షణ’ బాండ్లు బుట్టదాఖలయ్యాయి. అదే పరిస్థితి ఇప్పుడు తలె త్తే ప్రమాదం ఉంది. పథకాల మార్పు వల్ల 2010 నుంచి లబ్ధిదారులకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. వీటికి ‘మహాలక్ష్మి’ కష్టాలు తోడవనున్నాయి. -
కండలేరుకు ‘చంద్ర’గ్రహణం
మంచినీటి పథకం రద్దుకు ప్రభుత్వ నిర్ణయం ! మాజీ సీఎం కిరణ్ జీవో ఇస్తే...దాన్ని రద్దుచేసే యోచనలో సీఎం చంద్రబాబు నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో చిత్తూరు జిల్లా వాసులకు తాగునీటి ఇక్కట్లు కండలేరును రద్దు చేస్తామని ఇటీవల ప్రకటించిన ఎంపీ సీఎం రమేష్ సాక్షి, చిత్తూరు: కొన్నేళ్లుగా మంచినీటి సమస్యతో చిత్తూరు జిల్లా ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. వీరి సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెల్సిందే. చిత్తూరు ప్రజలకు తాగునీళ్లు అందించేందుకు దాదాపు పాలకులంతా నిర్లిప్తత ప్రదర్శించారు. 2004లో సీఎంగా అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి గాలేరు-నగరి, హంద్రీ-నీవా ద్వారా కృష్ణాజలాలను జిల్లాకు రప్పించి సాగు, తాగునీటినందిం చేందుకు శ్రీకారం చుట్టారు. ఆయన హఠాన్మరణంతో ఆ పథకం ఆగిపోయింది. తర్వాత ముఖ్యమంత్రి పీఠమెక్కిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కండలేరు నీటిని జిల్లాకు రప్పించి సాగునీటి సమస్య పరిష్కరించేందుకు ఉపక్రమించారు. రూ.7,430 కోట్లతో మంచినీటి పథకం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 2012లో కండ లేరు మంచినీటి పథకాన్ని మంజూరు చేసింది. 2012లో జీవో ఎంఎస్ నంబర్ 27, 29, 12/2012 ను జారీచేసింది. 6టీఎంసీలను జిల్లాకు రప్పించేం దుకు 7,430 కోట్ల రూపాయలతో ఈ భారీ మంచి నీటి ప్రాజెక్టును చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు విదేశీ నిధుల సాయంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయం నుంచి పైపులైన్ ద్వారా నీటిని పంపింగ్ చేసి తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతో పాటు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు, 10 వేలకుపైగా కుగ్రామాలకు మంచినీరు అందించడం ఈ పథకం లక్ష్యం. తొలి విడతలో భాగంగా రూ.5,900 కోట్లతో టెండర్లు ఆహ్వానించారు. దాదాపు 176 కిలోమీటర్లు ప్రధాన పైపులైన్ నిర్మించి, లింకులైన్ ఏర్పాటు చేసే నీటిని సరఫరా చేసేందుకు డిజైన్ రూపొందించారు. గతేడాది జిల్లా పర్యటనకు వచ్చిన కిరణ్ ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందని జిల్లావాసులంతా ఆశగా ఎదురుచూశారు. బాబు రాకతో...కండలేరుకు మంగళం కండలేరు ప్రాజెక్టు పూర్తయితే ఈ పేరు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి దక్కుతుంది. ఆ కారణంతోనే ఈ ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ఎంపీ సీఎం రమేష్ కండలేరు ప్రాజెక్టును ఆపేస్తామని స్పష్టం చేశారు. ఆ స్థానంలో ఎన్టీఆర్ సుజలస్రవంతి ద్వారా మంచినీరు అందిస్తామన్నారు. బాబుగారి మాట రమేష్ నోట వచ్చిందని జిల్లాలో జోరుగా చర్చసాగుతోంది. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా 20 లీటర్ల మినరల్ వాటర్‌ను 2 రూపాయలకే ఇస్తామని టీడీపీ మ్యానిఫెస్టోలో ప్రకటించింది. అయితే కేవలం దీంతోనే మంచినీటి సమస్య తీరదు. కనీస అవసరాలకు మంచినీరు అవసరం. ఈ క్రమంలో కండలేరు మంచినీటి పథకం పూర్తయితేనే బాగుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తాగునీటికి అల్లాడుతున్న జనాలు ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలు మంచినీటికోసం అల్లాడిపోతున్నారు. చిత్తూరు కార్పొరేషన్లో ప్రతి ఇంటికీ మంచినీటి సంప్ నిర్మాణం అనివార్యమైంది. ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేయడం, సంప్‌లో నింపుకోవడం అలవాటుగా మారిపోయింది. తిరుపతి, మదనపల్లెతో పాటు దాదాపు అన్ని మునిసిపాలిటీలు, మండలాల ప్రజలు మంచినీటి సమస్యతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టును పూర్తి చేసి, జిల్లా వాసుల దాహార్తిని శాశ్వతంగా తీర్చాలని ప్రజలు కోరుకుంటున్నారు. ‘‘తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతో పాటు జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలు, 10 వేలకుపైగా గ్రామాలకు శాశ్వతంగా మంచి నీటిని అందిస్తాం.. అందుకే కండలేరు మంచినీటి పథకానికి అనుమతులు ఇచ్చాం. మొదటి విడత రూ.5,900 కోట్లతో టెండర్లు పిలిచాం. ఇది పూర్తయితే చిత్తూరు జిల్లాకు భవిష్యత్‌లో తాగునీటి సమస్య రాదు.’’ - 2013లో అప్పటి సీఎం, కిరణ్‌కుమార్‌రెడ్డి ‘‘కండలేరు ప్రాజెక్టుకు నిధులు లేవు. కేవలం టెండర్లు పిలిచారు. హడ్కో నుంచి అనుమతి కూడా తీసుకోలేదు. 150 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు. దాన్ని ఎన్నికల సమయంలో ఎందుకు ఇచ్చారో అందరికీ తెలుసు. కండలేరు ప్రాజెక్టును ఆపేస్తాం. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా తాగునీరు అందిస్తాం.’’ -ఇటీవల చిత్తూరు పర్యటనలో ఎంపీ సీఎం రమేష్ -
మురికివాడలకు మోక్షం
సాక్షి, ముంబై: ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 2000 సంవత్సరం వరకు మురికివాడలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికలు సమీపించడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా, మురికివాడ వాసులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. లబ్ది పొందేవారిలో అనేక మంది తెలుగు ప్రజలు కూడా ఉన్నారు. మురికివాడ ఇళ్లను క్రమబద్ధీకరించాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉన్నా బుధవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఆమోదం లభించింది. అయితే అ నిర్ణయాన్ని ఎలా అమలుచేయనున్నారనేది మాత్రం ప్రభుత్వం స్పష్టం చేయలేదు. దీంతో ప్రజల్లో కొంత ఆయోమయం నెలకొంది. ఇప్పటివరకు 1995 సంవత్సరం వరకు మురికివాడలను క్రమబద్ధీకరించారు. 1995 తర్వాత వెలసిన మురికివాడలను క్రమబద్ధీకరించేందుకు నిరాకరించారు. దీంతో అనేకమంది రోడ్లెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. దీంతో 2000 సంవత్సరం వరకు వెలిసిన మురికివాడలను కూడా క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1995 వరకు పది లక్షలు ఉన్న మురికివాడలు 2011 వరకు 27 లక్షలకు చేరుకుంది. రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయంతో 2000 సంవత్సరం వరకు వెలిసిన మురికివాడల్లో నివసించే లక్షలాది మందికి లాభం చేకూరనుంది. అయితే 1995 జనవరి ఒకటి తర్వాత వెలిసిన మురికివాడలను క్రమబద్ధీకరించలేమని గతంలో సుప్రీంకోర్టుకు అందించిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కోంది. దీంతో రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలుచేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి తీసుకోవల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. -
నిజాం షుగర్స్ భవితవ్యంపై నిర్ణయం?
మెదక్, న్యూస్‌లైన్: నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ యాజ మాన్య భవితవ్యంపై సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు మంత్రివర్గ ఉప సంఘం సమావేశమై ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటే ఎంత పరిహారం చెల్లించాలనే విషయంపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కాగా రైతుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి కలెక్టర్ల ద్వారా నివేదిక తెప్పించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత నెలలో ఫ్యాక్టరీ భవితవ్యంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రైవేట్ యాజమాన్యాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తరుణంలో కేబినెట్ సమావేశంలో చర్చించారు. ఈ మేరకు రైతుల అభిప్రాయం తెలుసుకొని ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అయితే నియోజకవర్గ పరిధిలోని మంభోజిపల్లి దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న 12 మండలాలకు చెందిన సుమారు 3వేల మంది రైతులు రెండుమార్లు ఈ విషయమై సమావేశమయ్యారు. మొదటిసారి కేవలం రైతుల సమక్షంలో రెండోసారి ఆర్డీఓ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే నిర్ణయం తీసుకోవాలని రైతులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అయితే ఇందులో కొంతమంది పెద్ద రైతులు అధిక ధరలు రావాలంటే ప్రైవేటీకరణే బాగుంటుందని అభిప్రాయ పడగా, చిన్న సన్నకారు రైతులంతా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని కోరారు. ప్రస్తుత మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం మేరకు కలెక్టర్లు రైతులను అభిప్రాయాలు కోరితే తెలంగాణ ఏర్పడిన అనంతరమే తమ నిర్ణయం చెబుతామని రైతులంటున్నారు. మందకొడిగా చెరకు క్రషింగ్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్ణయం విషయంలో స్పష్టత రాక పోవడంతో ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం మొక్కుబడిగా క్రషింగ్ నిర్వహిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. మంభోజిపల్లి షుగర్ ఫ్యాక్టరీ సామర్థ్యం రోజుకు 2500 టన్నులు కాగా, ఈ ఏడు ఫ్యాక్టరీ ప్రారంభమై 30 రోజులు గడిచినా నేటికీ కేవలం 47వేల టన్నులు మాత్రమే క్రషింగ్ అయినట్లు తెలుస్తోంది. అలాగే 15 రోజుల్లో బిల్లులు చెల్లించాల్సిఉనప్పటికీ ఇప్పటి వరకు నయాపైసా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము రెండు, మూడు రోజులపాటు ఫ్యాక్టరీ పరిసరాల్లో పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు. తద్వారా చెరకు ఎండిపోయి తూకంలో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. తమకే అప్పగించాలనే ఉద్దేశంతో యాజమాన్యం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. అలాగే పర్మిట్లలో సైతం తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎన్డీఎస్ఎల్ ఏజీఎం కృష్ణారెడ్డి మాట్లాడుతూ యంత్రాలు సరిగా పనిచేయక పోవడం వల్లే ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. హౌస్ కమిటీ నివేదిక అమలయ్యేనా? చంద్రబాబు హయాంలో కేవలం రూ.65.40 కోట్లకు మూడు భారీ చెక్కర ఫ్యాక్టరీలను ప్రైవేట్ యాజమాన్యాలకు కట్టబెట్టడంపై అప్పట్లో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి 31-08-2004 నాడు జె.రత్నాకర్‌రావు ఆధ్వర్యంలో 9మంది సభ్యులతో అసెంబ్లీ హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు రెండేళ్లపాటు వివరాలు సేకరించిన కమిటీ 31-08-2006న ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీలను ప్రభుత్వపరం చేసుకోవాలని నివేదిక సమర్పించినట్లు కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి తెలిపారు. అయితే ఒకవేళ ప్రభుత్వపరం చేసుకుంటే అప్పట్లో తీసుకున్న రూ.65.40 కోట్లు మాత్రమే పరిహారంగా ఇవ్వాలని శశిధర్‌రెడ్డి అభిప్రాయ పడ్డారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ప్యాక్టరీలను స్వాధీనం చేసుకోవాలన్నారు. -
రైతుకు నిరాశ మిగిల్చిన
ఏవీఆర్ హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు రెండో దశకు ఉప కాలువల గ్రహణం పట్టింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తి కావాల్సి ఉన్నా ఒక్క అడుగూ ముందుకు పడడం లేదు. ఉప కాలువలు, వాటికి అవసరమైన భూ సేకరణ చర్యలే లేవు. గిట్టుబాటు ధర సమస్యపై కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. అందుకనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బి.కొత్తకోట, న్యూస్‌లైన్: అనంత వెంకటరెడ్డి(ఏవీఆర్) హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఉప కాలువల పనులు అటకెక్కారుు. చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల్లో 4.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం 31 ప్యాకేజీల్లో ప్రాజెక్ట్ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది. చివరి పొలాల దాకా నీటిని అందించేందుకు ప్రధాన, బ్రాంచ్ కెనాళ్ల నుంచి ఉప కాలువల పనులు చేయాల్సి ఉంది. దీని బాధ్యత కాంట్రాక్టర్లదే. ప్రభుత్వం ఎకరాకు రూ.4,700తో పనులు చేపట్టేందుకు నిర్ణయించడంతో ఏజెన్సీలు (కాంట్రాక్టర్లు) అంగీక రించి ఒప్పందం చేసుకున్నాయి. ఉప కాలువల నిర్మాణంలో కల్వర్టులు, రోడ్లు, వంతెనల అవసరం ఏర్పడితే కాంట్రాక్టర్లే నిర్మాణం చేయాలి. 200 6లో ప్రాజెక్టు కాలువల పనులు చేపట్టిన కాం ట్రాక్టర్లు దాదాపుగా పూర్తి చేశారు. పుంగనూరు, పెద్దపంజాణి మండలాల్లో ఉప కాలువల సర్వే పనులు నత్తనడకన సాగుతున్నారుు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దమండ్యంలో నామమాత్రపు సర్వే జరుగుతోంది. మిగతా ఎక్కడా సర్వే ఊసేలేదు. వీటికి అవసరమైన భూ సేకరణ చర్యలూ లేవు. మొదట భూసేకరణ జరగాల్సి ఉన్నా అధికార యంత్రాంగం దృష్టి పెట్టడంలేదు. అదనపు భారం రూ.246కోట్లు ఒప్పందం మేరకు ఉప కాలువలను పనులు చేయలేమంటూ కాంట్రాక్టర్లు చేతులేత్తేశారు. ఇరవై ఏళ్ల క్రితం తెలుగుగంగ ప్రాజెక్టుకు ఇచ్చిన విధంగానే తమకూ విలువ పెంచాలన్న డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వం ప్రతిపాదనలను పంపాలని సూచిం చింది. ఏడాది క్రితమే ఉన్నతాధికారులు ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల డిమాండ్ మేరకు విలువ పెంచుతూ ప్రతిపాదనలను పంపారు. ఎకరాకు రూ.4,700తో ఒప్పందం జరగ్గా, దాన్ని రూ. 10,500కు పెంచాలని ఉన్నతాధికారులు ప్రతి పాదించారు. దీంతో ఎకరాకు రూ. 5,800 పెంచిన ట్లవుతుంది. దీన్ని ప్రభుత్వం సవరిస్తూ నిర్ణయం తీసుకుంటే అదనంగా రూ. 246.50 కోట్ల భారం భరించాల్సి ఉంటుంది. దాంతో అనుమతి ఇవ్వకుండా కాలయూపన చేస్తోంది. అనుమతి రావాల్సి ఉంది ఉప కాలువల నిర్మాణానికి గిట్టుబాటు ధరను పెంచుతూ పంపిన ప్రతిపాదనలకు ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. పాత ఒప్పందం రూ.4,700 మేరకు కాకుండా ఎకరాకు రూ.10,500 పెంచాలని నివేదించాం. ఉప కాలువల పనులు కొన్ని చోట్ల జరుగుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం కోసం కాంట్రాక్టర్లు వేచి ఉన్నారు. -పి.కృష్ణ, ఎస్ఈ, ప్రాజెక్టు సర్కిల్-3 -
అ‘క్రమబద్ధీకరణ’
సాక్షి, కరీంనగర్ : మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై విజిలెన్స్ విచారణ జరిపించాలన్న ప్రభుత్వ నిర్ణయం అప్పడు విధులు నిర్వహించిన బల్దియా అధికారుల వెన్నులో చలిపుట్టిస్తోంది. 2008కి ముం దు ఉన్న అక్రమ కట్టడాలను క్రమబద్ధం చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించగా ఇదే అదనుగా బల్దియా, టౌన్‌ప్లానింగ్ అధికారులు డబ్బులు దండుకున్నారన్న ఆరోపణలు వినిపించాయి. జీహెచ్ఎంసీ పరిధిలో క్రమద్ధీకరణ వ్యవహారంపై జరిగిన విచారణలో భారీగా అక్రమాలు జరిగినట్టు తేలింది. మిగ తా కార్పొరేషన్ల పరిధిలో కూడా ఇదేవిధంగా అవినీతి జరిగి ఉంటుందని భావించిన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు సిద్ధమయినట్టు తెలిసింది. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వేలాదిగా అక్రమ నిర్మాణాలు జరిగాయి. భవన నిర్మాణాల కోసం వెళితే అధికారులు పెట్టే ఇబ్బందులు, కొర్రీలకు భయపడి అనుమతులు లేకుండానే నిర్మాణాలు పూర్తిచేసుకున్నారు. అక్రమ కట్టడాలను నియంత్రించాల్సిన ప్రణాళిక విభాగం అధికారులు ముడుపులు అందుకుని చూసీచూడనట్టు ఊరుకున్నారు. ముందస్తు అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా కట్టడాలు చేపట్టడం వల్ల బల్దియాల ఆదాయానికి గండిపడింది. బల్దియాలను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా 2008లో రాష్ట్రప్రభుత్వం అక్రమ భవన నిర్మాణాల క్రమబద్ధీకరణ పథకాన్ని (బీపీఎస్) ప్రవేశపెట్టింది. అక్రమంగా భవనాలు నిర్మించుకున్న యజమానులకు ఊరటకల్పించే ఈ స్కీం కింద కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 2,539 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 2009 సెప్టెంబర్ వరకు 1,604 దరఖాస్తులకు అమోదం తెలిపారు. సరైన డాక్యుమెంట్లు లేకపోవడం తదితర కారణాలతో 905 దరఖాస్తులను తిరస్కరించారు. కమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారి నిర్మాణాలను పూర్తిగా పరిశీలించకుండానే ఆమోదం తెలిపినందుకు భవన యజమానుల నుంచి అధికారులు పెద్ద మొత్తాల్లో ముడుపులు అందుకున్నారని, నిబంధనల ఉల్లంఘనలకు తగ్గట్టుగా జరిమానాలు విధించలేదని అనుమానాలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్ధీకరణ జరగడం వల్ల బల్దియాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయి. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరపాలని, అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవడంతోపాటు క్రమబద్దీకరణలో జరిగిన అక్రమాలను కూడా సవరించాలని భావిస్తుంది. నేడో రేపో విజిలెన్స్ విచారణ ప్రారంభం కానుండడం అటు అధికారులను, ఇటు భవన యజమానులను ఆందోళనకు గురిచూస్తోంది. -
రూ.1800 కోట్ల రుణ సేకరణకు ప్రభుత్వ నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 1,800 కోట్ల రుణ సేకరణకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి 13వ తేదీన ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించనుంది. గతంలోనే సెక్యూరిటీల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.3,000 కోట్ల రుణాన్ని సమీకరించింది. తాజా రుణ సేకరణతో ఇప్పటి వరకు ప్రభుత్వం 4,800 కోట్ల రూపాయలు అప్పు చేసినట్లు అవుతుంది. -
మరో ఏడాది
పెద్దపల్లి, న్యూస్‌లైన్ : మావోయిస్టు పార్టీపై మరో ఏడాది పాటు నిషేధాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న మరో ఆరు సంఘాలపైనా నిషేధం పొడిగించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ర్ట ప్రభుత్వం గతేడాది పొడిగించిన నిషేధం ఉత్తర్వుల గడువు ఈ నెల 17తో ముగియనుంది. దీంతో కొత్త ఉత్తర్వులు ఈ నెల 18 నుంచి 2014 ఆగస్టు 17 వరకు అమలులో ఉంటాయి. రాష్ట్రంలోని పీపుల్స్‌వార్ పార్టీ 2004లో బీహార్ ఎంసీసీతో విలీనమై మావోయిస్టు పార్టీగా అవతరించింది. అంతకుముందు నుంచే పీపుల్స్‌వార్ పార్టీని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. 1989లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మొదటిసారిగా నిషేధాన్ని విధించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి 1991లో నిషేధాన్ని సడలించారు. ఆ తర్వాత నక్సల్స్ కార్యకలాపాలు జోరందుకున్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. 1992లో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి తిరిగి పీపుల్స్‌వార్ పార్టీపై నిషేధం విధించారు. అప్పటి నుంచి నిషేధం 2004 వరకు విధింపు, సడలింపు కొనసాగింది. 2004లో అప్పటి ప్రభుత్వం పీపుల్స్‌వార్ పార్టీతో శాంతి చర్చలు జరిపింది. ఓవైపు చర్చలు జరుగుతుండగా మరోవైపు పలుచోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెండో దఫా శాంతిచర్చలను విరమించుకుంది. అదే సంవత్సరం పీపుల్స్‌వార్ పార్టీ విలీనంతో మావోయిస్టు పార్టీగా అవతరించింది. దీంతో 2004 ఆగస్టు 8న కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీపై దేశవ్యాప్తంగా నిషేధాన్ని విధించింది. ప్రతి సంవత్సరం ఈ నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఒకప్పుడు మావోయిస్టు పార్టీ కార్యకలాపాలకు అడ్డాగా ఉన్న జిల్లాలో అనేక సంఘటనలు జరిగాయి. విప్లవోద్యమాల చరిత్రలో చెరగని ముద్ర వేసిన జిల్లా ప్రజల్లో మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం పొడిగించడం చర్చనీయాంశంగా మారింది. మరో ఆరు సంఘాలపై.. మావోయిస్టు పార్టీతోపాటు మరో ఆరు అనుబంధ సంఘాలపై కూడా ఏడాది నిషేధం పొడిగించింది. మావోయిస్టు పార్టీతోపాటు సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస), విప్లవ కార్మిక సమాఖ్య(వికాస), ఆలిండియా రివల్యూషనరీ స్టూడెంట్ ఫెడరేషన్(ఏఐఆర్ఎస్ఎఫ్), రాడికల్ స్టూడెంట్ యూనియన్(ఆర్ఎస్యూ), రైతు కూలీ సంఘం(ఆర్సీఎస్), రాడికల్ యూత్ లీగ్(ఆర్‌వైఎల్) నిషేధం విధించిన సంఘాల జాబితాలో ఉన్నాయి. ఇవి చట్ట వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడుతున్నందున నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ఆ ప్రకటనలో పేర్కొంది. మావోయిస్టులతోపాటు అనుబంధ సంఘాలకు సహకరించిన వారిపైనా చట్టపరమైన, కఠిన శిక్షలుంటాయని హెచ్చరించింది.