అమలాపురం టౌన్: కాపులను బీసీల్లో చేర్చుతూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయంపై అమలాపురంలో బీసీలు కన్నెర చేశారు. రోడ్డెక్కి నిరసన తెలిపారు. బీసీల రిజర్వేషన్లను హరించేందుకు కుట్ర పన్నిన ముఖ్యమంత్రి చంద్రబాబు శవ యాత్ర నిర్వహించారు. చంద్రబాబు దిష్టి బొమ్మ దహనం చేశారు. బీసీలను సామాజికంగా అణిచి వేసేందుకే చంద్రబాబు ప్రభుత్వం కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసిం దని రాష్ట్ర బీసీ నాయకులు ధ్వజమెత్తారు. తొలుత సూర్యనగర్‌లోని బీసీ నేత, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి స్వగృహం ఆవరణలో కోనసీమ బీసీ నాయకులు సమావేశమయ్యారు. రాష్ట్ర బీసీ సంఘాల కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంజునాథ కమిషన్ అధ్యక్షుడైన మంజునాథ్ లేకుండా కొంతమంది సభ్యులతో ఆదరాబాదరగా కేబినెట్ టేబుల్ నోట్ కింద అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టడం ఓ పథకం ప్రకారం చేశారని ఆరోపించారు.
ఇందుకు నిరసనగా గ్రామ గ్రామాన బీసీలు ధర్నాలు, రాస్తారోకోలతో తమ ఆవేదన, ఆగ్రహాన్ని తెలపాలని సమావేశం పిలుపునిచ్చింది. అనంతరం చంద్రబాబు దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి, గడియారం స్తంభం సెంటరుకు చేరుకుని, దిష్టిబొమ్మను దహనం చేశారు. వివిధ బీసీ కులాలు, సంఘాల నాయకులు మట్టపర్తి మురళీకృష్ణ, చెల్లుబోయిన శ్రీనివాసరావు, కుడుపూడి బాబు, మట్టపర్తి నాగేంద్ర, వాసంశెట్టి సత్యం, పేట వెంకటేశ్వరరావు, కుడుపూడి త్రినాథ్, తాళాబత్తుల లక్ష్మణరావు, ఊటుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు, కాళే వెంకటేశ్వరరావు, కుడుపూడి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి సుభాష్, ఐవీ సత్యనారాయణ, కుంజే సుబ్బరాజు, పసుపులేటి శ్రీనివాసరావు తదితరులు ధర్నా, రాస్తారోకో తదితర నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
బీసీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి
రాజోలు: కాపులకు రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటున్న సమయంలో కనీసం మాట్లాడలేని బీసీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి ఆ పార్టీ నుంచి బయటకు రావాలని బీసీ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. తాటిపాకలోని రాజోలు తాలూకా శెట్టిబలిజ సంఘ భవనం ఎదుట 216 జాతీయ రహదారిపై శనివారం బీసీ సంఘ నాయకులు ధర్నా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకు అలవాటన్నారు. రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అసెంబ్లీలో కాపు మహిళలు జీడిపప్పు వలుస్తూ కష్టాలు పడిపోతున్నారని మాట్లాడారని, బీసీ కులాల్లో ఉన్న మహిళలు కల్లు అమ్మడం, బట్టలు ఉతకడం, కూలి పనులకు వెళ్లడం కనిపించడం లేదని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే సూర్యారావు దిష్టిబొమ్మను దహనం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘ నాయకులు గుబ్బల బాబ్జి, చెల్లుబోయిన రాంబాబు, గుబ్బల శ్రీను, కంబాల చంద్రరావు, గుబ్బల నరేంద్రకుమార్, యనమదల సీతారామరాజు, మట్టపర్తి రెడ్డి, మామిడిశెట్టి మనోహర్, చెల్లుబోయిన శ్రీను, బొమ్మిడి వెంకటేష్, గుబ్బల రమేష్, చింతా రామకృష్ణ, గెద్దాడ రాంబాబు, వెలుగొట్ల శ్రీను, మొల్లేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment