పార్లమెంట్‌లో ఓబీసీ బిల్లు ఆమోదించాలి | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో ఓబీసీ బిల్లు ఆమోదించాలి

Published Thu, Sep 21 2023 12:50 AM

BC commission members demand on OBC Reservation Bill - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చట్టసభల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించే ఓబీసీ రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంట్‌లో వెంటనే ఆమోదించాలని బీసీ కులాలకు చెందిన ప్రభుత్వ కార్పొరేషన్‌ చైర్మన్లు, రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌తో పాటు శాసనసభల్లో వెనుకబడిన తరగతులకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించాలన్నారు. బేగంపేట హరితప్లాజాలో టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో బుధవారం బీసీకులాలకు చెందిన వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లు, బీసీ కమిషన్‌ సభ్యులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

చట్టసభల్లో ఓబీసీలకు 33శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లు పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ 2024లో సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని మహిళా ఓటర్లను ఆకర్షించేందుకే బీజేపీ బిల్లు ఆమోదించిందని, ఈ బిల్లులో బీసీ మహిళల సబ్‌కోటా తేల్చలేదని ఆరోపించారు. 50శాతం ఉన్న బీసీలకు మహిళల కోటాలో 50శాతం రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణా వాటర్‌ రీసోర్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వి.ప్రకాశ్‌ మాట్లాడుతూ ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోదీ అగ్రకుల ఆధిపత్య అహంకారం ప్రదర్శిస్తున్నారని, ఆయన్ను బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిగా ప్రజలు పరిగణించడం లేదన్నారు. ఓబీసీ రిజర్వేషన్‌ బిల్లు ఆమోదించడంతోపాటు, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలన్నారు. టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ బీసీ ప్రధానితో బీసీల తలరాత మారుతుందని భావించామని, కానీ అలా జరగలేదని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు.

బీసీ కమిషన్‌ చైర్మన్‌ కృష్ణమోహన్‌ మాట్లాడుతూ బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, క్రిమిలేయర్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం ఆదాయ పరిమితి పెంచాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. బీసీలను బీజేపీ రెండో శ్రేణి పౌరులుగా చూస్తుందన్నారు. వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లు ఆంజనేయగౌడ్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, పిట్టల రవీందర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ డీఎన్‌ఏలోనే బీసీ వ్యతిరేకత ఉందన్నారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లు తీరు నోటితో చెప్పి నొసటితో వెక్కిరించినట్టు ఉందని వారు మండిపడ్డారు. 33 జిల్లాల్లో బీసీ చైతన్య సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లు అనిల్‌ కుర్మాచలం, రవీందర్‌ సింగ్, బీసీ కమిషన్‌ సభ్యులు కిషోర్‌ గౌడ్, శుభప్రద్‌ పటేల్, నాయకులు తాడూరి శ్రీనివాస్, గోసుల శ్రీనివాస్‌ యాదవ్, జూలూరు గౌరీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement
Advertisement