OBC Reservation
-
పార్లమెంట్లో ఓబీసీ బిల్లు ఆమోదించాలి
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించే ఓబీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో వెంటనే ఆమోదించాలని బీసీ కులాలకు చెందిన ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌తో పాటు శాసనసభల్లో వెనుకబడిన తరగతులకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. బేగంపేట హరితప్లాజాలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం బీసీకులాలకు చెందిన వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ కమిషన్ సభ్యులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చట్టసభల్లో ఓబీసీలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ 2024లో సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని మహిళా ఓటర్లను ఆకర్షించేందుకే బీజేపీ బిల్లు ఆమోదించిందని, ఈ బిల్లులో బీసీ మహిళల సబ్‌కోటా తేల్చలేదని ఆరోపించారు. 50శాతం ఉన్న బీసీలకు మహిళల కోటాలో 50శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణా వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి.ప్రకాశ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోదీ అగ్రకుల ఆధిపత్య అహంకారం ప్రదర్శిస్తున్నారని, ఆయన్ను బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిగా ప్రజలు పరిగణించడం లేదన్నారు. ఓబీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించడంతోపాటు, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలన్నారు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ బీసీ ప్రధానితో బీసీల తలరాత మారుతుందని భావించామని, కానీ అలా జరగలేదని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ మాట్లాడుతూ బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, క్రిమిలేయర్ గైడ్‌లైన్స్ ప్రకారం ఆదాయ పరిమితి పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీసీలను బీజేపీ రెండో శ్రేణి పౌరులుగా చూస్తుందన్నారు. వివిధ కార్పొరేషన్ చైర్మన్లు ఆంజనేయగౌడ్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, పిట్టల రవీందర్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీరు నోటితో చెప్పి నొసటితో వెక్కిరించినట్టు ఉందని వారు మండిపడ్డారు. 33 జిల్లాల్లో బీసీ చైతన్య సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో వివిధ కార్పొరేషన్ చైర్మన్లు అనిల్ కుర్మాచలం, రవీందర్ సింగ్, బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, శుభప్రద్ పటేల్, నాయకులు తాడూరి శ్రీనివాస్, గోసుల శ్రీనివాస్ యాదవ్, జూలూరు గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నదగిన తీర్పు
మన దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ల విధానం ప్రతిభకు అవరోధంగా మారిందని, అది సమానావకాశాలను దెబ్బతీస్తున్నదని వాదించేవారికి సుప్రీంకోర్టు తాజా తీర్పు కళ్లు తెరిపించాలి. మెడికల్, డెంటల్ కోర్సుల్లో యూజీ, పీజీ అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష నీట్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ తీర్పు వెలువడింది. ఓబీసీ కోటా, ఆర్థికంగా వెనకబడినవారి కోటా సక్రమమైనవేనని ఈ నెల 7న మధ్యంతర ఉత్తర్వులిచ్చిన సుప్రీంకోర్టు గురువారం అందుకు సంబంధించిన పూర్తి స్థాయి తీర్పును వెల్లడించింది. ఎంబీబీఎస్‌లో కోటాను వినియోగించుకుని పట్టభద్రులైనవారిని ఇక వెనకబడినవారిగా పరిగణించాల్సిన అవసరం లేదని, పీజీ అడ్మిషన్లకు కేవలం ప్రతిభే గీటురాయిగా ఉండాలని పిటిషనర్లు వాదించారు. పీజీ స్థాయిలోనూ, సూపర్ స్పెషాలిటీ స్థాయిలోనూ అత్యున్నత శ్రేణి నైపుణ్యం, పరిజ్ఞానం అవసరమవుతాయని... వీటిని బేఖాతరు చేసి కోటా అమలు చేయడం వల్ల జాతీయ ప్రయోజనాలు దెబ్బతింటాయన్నది పిటిషనర్ల ఆందోళన. 2021–22 విద్యా సంవత్సరం కోసం నిర్వహించే నీట్ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓబీసీ కోటా ఉత్తర్వులివ్వడాన్ని కూడా ఎత్తిచూపి, ఆ విధంగా చూసినా అది చెల్లుబాటుకాదని వాదించారు. ఆట మొదలయ్యాక దానికి సంబంధించిన నిబంధనలు ఎలా మారతాయన్నది పిటిషనర్ల ప్రశ్న. ఈ తీర్పులో జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం సవివరమైన తీర్పునిచ్చింది. కోటా అమలుకు వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడానికి రాజ్యాంగ పరంగా 15(4), 15(5) అధికరణల కింద ప్రభుత్వానికి తిరుగులేని అధికారం ఉన్నదని చెబుతూ 15(1) అధికరణలో సూచించిన ‘సుదృఢమైన సమానత్వం’ సాధనకు ఈ నిర్ణయం అనుగుణ మైనదేనని వివరించింది. అసలు పరీక్షల్లో సాధించే మార్కులు ప్రతిభకు కొలమానమా, కాదా అనే అంశాన్ని కూడా లోతుగా పరిశీలించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. అత్యధిక మార్కులు సాధించిన వ్యక్తి మంచి పనులకు ఆ ప్రతిభను వినియోగించనప్పుడు అతన్ని ప్రతిభావంతు డనవచ్చునా లేదా అని జస్టిస్ చంద్రచూడ్ సంధించిన ప్రశ్నకు ఎవరి దగ్గరా జవాబుండదు. నీట్ ప్రవేశాల్లో కోటా అమలుపై దాఖలైన పిటిషన్లలో లేవనెత్తిన అంశాలు నిజానికి చాలా పాతవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు బీసీ కోటా అమలుకు చర్యలు తీసుకున్నప్పుడూ... మాజీ ప్రధాని స్వర్గీయ వీపీ సింగ్ మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేసినప్పుడూ వాటిని వ్యతిరేకించినవారు ‘ప్రతిభ’ వాదనే లేవదీశారు. కోటా కింద ఎంపికయ్యేవారంతా ఎలాంటి తెలివితేటలూ లేనివారని, వారికి అవకాశాలు కల్పిస్తే ప్రతిభ కలిగిన తామంతా రోడ్డున పడతామని వాదించారు. దేశంలో శతాబ్దాలుగా వేళ్లూనుకున్న కుల వ్యవస్థ కారణంగా అట్టడుగు వర్గాలు సామాజిక అణచివేతకు గురయ్యాయి. పర్యవసానంగా విద్యాగంధానికీ, అందువల్ల కలిగే ఫలాలకూ దూరమయ్యాయి. ఎదుగూబొదుగూ లేకుండా మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలోనే ‘వ్యవస్థీకృత అవరోధాల’ కారణంగా వెనకబడిన వర్గాలకు సమానావకాశాలు దక్కకుండా పోయాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవస్థీకృత అవరోధాలు కేవలం ఆ వర్గాలకు అన్యాయం చేయడం మాత్రమే కాదు... దేశ పురోగతిని కూడా ఆటంకపరిచాయన్నది చేదు నిజం. మెజారిటీ పౌరులకు ప్రవేశంలేని... వారి ప్రమేయంలేని వ్యవస్థ ఏలుబడిలో ఉన్న దేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉండగలదా? నీట్ వంటి పరీక్షలు అభ్యర్థు లందరికీ సమానావకాశాలు ఇస్తాయన్నది వాస్తవమే కావొచ్చు. కానీ ఆ సమానావకాశాల ద్వారా లబ్ధి పొందేందుకు అనువైన వాతావరణం కొన్ని వర్గాలకు కొరవడినప్పుడు అవి అర్థరహిత మవుతాయి. అక్కడే కోటా అవసరమవుతుంది. వ్యక్తుల్లో కనబడే ప్రతిభలో నిగూఢమైన వారసత్వ నేపథ్యం ఉంటుందని, దాన్ని ఒకరి స్వయంకృషిగా మాత్రమే అర్థం చేసుకోవడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడటం గమ నించదగ్గది. శతాబ్దాల అసమానతలు సృష్టించిన సామాజిక అంతరాలను సాధ్యమైనంతవరకూ తగ్గించాలంటే అవకాశాలను అందుకోవడంలో విఫలమవుతున్నవారికి ఆలంబనగా ఉండాలన్న ఉద్దేశంతోనే రాజ్యాంగం రిజర్వేషన్ల విధానానికి చోటిచ్చింది. ఈ రిజర్వేషన్లను మొదట్లోనే ఎస్సీ, ఎస్టీలతోపాటు సామాజికంగా వెనకబడిన కులాలకు కూడా కల్పించి ఉంటే బాగుండేది. రాజ్యాంగంలోని 15, 16 అధికరణలు కేంద్ర ప్రభుత్వానికి అందుకు అవకాశమిచ్చాయి కూడా. కానీ మన పాలకులు నిర్లక్ష్యం చేశారు. జనతాపార్టీ పాలనలో 1979లో సామాజికంగా వెనకబడిన కులాలను గుర్తించేందుకు మండల్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ ఏడాది వ్యవధిలోనే నివేదికను సమర్పించింది. కానీ దాదాపు మరో దశాబ్దంపాటు అది ఫైళ్లకే పరిమితమయింది. చివరకు 1989లో నాటి వీపీ సింగ్ సర్కారు ఆ కమిషన్ సిఫార్సులకు బూజు దులిపి అమల్లోకి తీసుకొచ్చింది. విద్యా ఉద్యోగావకాశాల్లో కల్పించే కోటాను అందుకోలేని కులాలు ఈనాటికీ ఉన్నాయంటేనే సమానత్వ సాధనకు మనం ఎన్ని వేల యోజనాల దూరంలో ఉన్నామో ఆలోచించు కోవాల్సిందే. ప్రతిభవంటి నిరర్థకమైన వాదనలకు తాజా తీర్పు అడ్డుకట్ట వేయగలిగితేనే అలాంటి సమానత్వ భావన దిశగా మనం కదులుతున్నట్టు లెక్క. -
ఓబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ బద్దమేనన్న సుప్రీం
-
ఓబీసీ రిజర్వేషన్ రద్దు.. ఓటు అడిగేందుకు రావద్దు..
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని భండారా– గోండియా జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో భండారా జిల్లాల్లోని ఓ గ్రామంలో వినూత్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. దయచేసి ఓట్లు అడిగేందుకు రావద్దని గ్రామస్తులు తమ ఇంటి ముందు బోర్డులు పెట్టారు. ఓబీసీ రిజర్వేషన్ రద్దు కావడంతో నిరసనగానే వారు ఇలా బోర్డులు ఉంచారని తెలిసింది. ఓబీసీ రిజర్వేషన్ రద్దు కావడంతో ఓబీసీలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భండారా తాలూకాలోని పిపరీ గ్రామంలోని ఓబీసీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ గ్రామంలో నివసించే ప్రజలలో అత్యధికంగా ఓబీసీ కేటగిరివారే ఉన్నారు. దీంతో వీరందరూ డిసెంబర్ 21వ తేదీన జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికల కోసం దయచేసి ఎవరూ ఓటు అడిగేందుకు రావద్దని బోర్డులను తమ ఇళ్ల ముందు అమర్చి వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన బోర్డులు జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. చదవండి: (ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్) -
ముఖ్యమంత్రి జగన్ బీసీల పక్షపాతి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీల పక్షపాతి అని, రాజమండ్రి లోక్‌సభా స్థానాన్ని బీసీలకు ఇచ్చి.. లక్షకు పైగా మెజార్టీతో గెలిపించుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మార్గాని భరత్‌రామ్ పేర్కొన్నారు. రాజ్యాంగ (127వ సవరణ) బిల్లుపై మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఓబీసీల జాబితా రూపొందించుకునేలా రాష్ట్రాలకు హక్కులు కల్పించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గతంలో దేశవ్యాప్తంగా 671 కులాలు గుర్తింపునకు నోచుకోలేదని, దేశ జనాభాలో ఐదోవంతు మంది రిజర్వేషన్లకు నోచుకోలేదని పేర్కొన్నారు. తాజా బిల్లును రాష్ట్ర ప్రభుత్వం, సీఎం తరఫున స్వాగతిస్తున్నామన్నారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు అనేక సందర్భాల్లో నష్టపోతున్నాయని, నీట్ పరీక్షల విషయానికి వస్తే ఓబీసీ కులాలు వేలాది సీట్లు కోల్పోయాయని తెలిపారు. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు ఆదర్శప్రాయంగా ఉన్నాయని, వెనకబడిన కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచారని వివరించారు. నామినేటెడ్ పదవులను కూడా 50 శాతం బీసీలకు కేటాయించారని, మహిళలకు సైతం 50 శాతం పదవులు కట్టబెట్టారని తెలిపారు. కులాల వారీగా జనగణన చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్‌లో రాజకీయంగా, ఆర్థికపరంగా కూడా అందాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో కూడా ఓబీసీలకు అవకాశం కల్పించాలని కోరారు. కులాల వారీగా ప్రత్యేక బీసీ జనగణన చేపట్టండి చర్చలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కులాల వారీగా ప్రత్యేక బీసీ జనగణన చేపట్టాలని, సుదీర్ఘకాలంగా ఉన్న ఈ డిమాండ్‌ను కేంద్రం తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కొద్ది నెలల్లో జనగణన ప్రారంభం కానున్న దృష్ట్యా.. కులాల వారీ జనగణన చేపట్టేందుకు ఇది తగిన సమయమని వైఎస్సార్సీపీ అభిప్రాయపడుతోందన్నారు. అనేక సంస్థలతో పాటు ప్రముఖ సామాజిక కార్యకర్తలు అర్థవంతమైన ప్రణాళిక కోసం, వెనుకబడిన బీసీల అభ్యున్నతికి ఈ ప్రత్యేక జనగణన అవసరాన్ని నొక్కి చెప్పారని గుర్తు చేశారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభాలో 40–55 శాతం మధ్య ఓబీసీలు ఉండగా.. 2009, 2014 సాధారణ ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికైన వారిలో కేవలం వరుసగా 18 శాతం, 20 శాతం మాత్రమే ఓబీసీలకు చెందిన వారు ఉన్నారని పేర్కొన్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఈ లోపాలను సవరించి ప్రతి రంగంలో బీసీలకు న్యాయం చేసే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. గడచిన నాలుగేళ్లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ మెడికల్ కోర్సుల్లో రిజర్వేషన్లు అమలుకాక ఓబీసీలు 11,027 సీట్లు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతుల (ఎస్ఈబీసీ) జాబితాను రాష్ట్రాలే రూపొందించుకునేలా తాజా రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా రాష్ట్రాలకు రాజ్యాంగం ప్రసాదించిన సమాఖ్య హక్కులను గౌరవిస్తూ బీసీ కులాల సాధికారతకు కేంద్రం దోహదపడిందని పేర్కొన్నారు. -
‘రాజ్యాధికారంతో బీసీల సాధికారత’
సాక్షి, హైదరాబాద్: కోట్లాడి తెచుకున్న హక్కులు, రిజర్వేషన్లకు న్యాయం జరిగే వరకు పోరాడాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. మన దేశంలో ఏ కులానికైతే అన్యాయం జరుగుతుందో అప్పుడే ఆ కులం సంఘటిత మవుతుందని తెలిపారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో 4వ నేషనల్ కన్వెన్షన్ రాష్ట్రీయ ఓబీసీ మహాసభకు ముఖ్య అతిధులుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయి జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. విదేశాంగ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మృతి పట్ల సభ నివాళి అర్పించి, వచ్చిన అతిధులను సన్మానించారు. ఈ సందర్భగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ... మహారాష్ట్ర, కేరళ, పాండిచేరీ, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 18 రాష్ట్రాల నుంచి వచ్చిన ఓబీసీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. 72 సంవత్సరాలుగా దేశంలో ఓబీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇలాంటి సమావేశాలు ఏ కులాలకు వ్యతిరేకం కాదని, వీటికి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఉందన్నారు. తెలంగాణలో మొత్తం 85 శాతం అణగారిన వర్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ‘వీపీ సింగ్ హయాంలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టిన ఆగస్టు 7నే మహా సభలను నిర్వహిస్తున్నామని, ఈ జాతీయ మహా సభలోనే బీసీలకు సంబంధించిన వెబ్ సైట్‌ను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ పొందుపర్చామని, ఈ వెబ్సైట్ ద్వారా సభ్యత్వం కూడా తీసుకోవచ్చని తెలిపారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య మాట్లాడుతూ.. రాజ్యాధికారంతో అన్ని సమస్యలకు పరిష్కరం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లతో ఆడుకునే అలవాటు పరిపాటి అయిందని, బీసీల ఆర్థిక ఎదుగుదలతోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని అభిప్రాయపడ్డారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో 52 శాతం వరకూ ఉన్న బీసీ జనాభాలో సమస్యలపై పోరాడే నాయకులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బీసీ సభ డిమాండ్లను జాతీయ స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీసీలను ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంలు చేస్తే బీసీల సమస్యలు తీరవని.. భారత రాజ్యాంగంలో బీసీలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలన్నారు. దేశంలో బీసీ కార్పొరేషన్లకు మరిన్ని నిధులు కేటాయించాలన్నారు. తెలంగాణలో బీసీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. తెలంగాణలో బీసీలకు అమలు చేసే పథకాలు, అన్ని రాష్ట్రాల్లోని సీఎంలు అమలు చేస్తే బీసీలకు ఎటువంటి సమస్యలు ఉండబోవని అన్నారు. సమావేశంలో టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఫోరమ్ అధ్యక్షుడు జైపాల్ యాదవ్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, సినీ నటుడు సుమన్, ఆర్. నారాయణమూర్తి, తెలంగాణ రాష్ట్ర బీసీ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, వివిధ రాష్ట్రల నుంచి వచ్చిన ఓబీసీ నాయకులు, ఓబీసీ మహిళా నేత, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్ల సాధనే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: బీసీ నినాదాన్ని జాతీయ స్థాయిలో వినిపించేందుకు బీసీ నేతలు సిద్ధ్దమవుతున్నారు. అన్ని వర్గాలకు జనాభా ప్రాతిపదికన ఫలాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు.. బీసీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ పలు రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం తమ ఉద్యమాలు రాష్ట్ర స్థాయికే పరిమితం కావటం వల్ల ఉపయోగం ఉండటం లేదని, వాటిని ఢిల్లీ స్థాయికి విస్తరిస్తేనే ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ఈ నెల 7న ‘జాతీయ ఓబీసీ మహాసభ’నిర్వహించనున్నారు. ఈ సభకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. 7న ఉదయం 11 నుంచి జరగనున్న ఈ సభకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. 29 రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సమావేశాన్ని రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ సమన్వయపరుస్తుంది. ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను జాజుల ఆదివారం ఆవిష్కరించారు. కాగా, జాతీయ ఓబీసీ మహాసభ అనంతరం దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టేందుకు బీసీ సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఈ సభలో చేసిన తీర్మానాలపై దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీసీలకు అవగాహన కల్పించేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నాయి. హైదరాబాద్‌లో జరిగే జాతీయ ఓబీసీ మహాసభ నాలుగోది. మొదటి సభను నాగ్‌పూర్‌లో నిర్వహించగా, రెండోది ఢిల్లీలో, మూడోది ముంబైలో నిర్వహించినట్లు జాజుల తెలిపారు. ప్రధాన డిమాండ్లు ఆయన మాటల్లోనే.. - 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో బీసీలు మినహా అన్ని వర్గాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాల్లో బీసీలు మినహా మిగతా అన్ని కులాలకు చెందిన వారు చట్టసభల్లో కాలుపెట్టారు. బీసీల్లోని వందల కులాలు ఇప్పటికీ చట్టసభల ముఖం చూడలేదు. ఈ నేపథ్యంలో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలనేది ముఖ్యమైన డిమాండ్. - దేశ జనాభాలో 54 శాతానికి పైగా ఉన్న బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి దానికి బీసీని మంత్రిగా నియమించాలి. - ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చారు. అగ్రవర్ణ పేదల కోసం 10 శాతం రిజర్వేషన్లు కల్పించారు. కానీ బీసీలకు మాత్రం పరిమితులు, 50 శాతం సీలింగ్‌ను చూపి దాటవేస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి. దాన్ని చట్టసభల్లో, ఉద్యోగుల పదోన్నతుల్లో అమలు చేయాలి. - బీసీ జనాభాను కులాల వారీగా వర్గీకరించాలి. రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లుగా కేంద్రంలో, అన్ని రాష్ట్రాల్లో ఏ, బీ, సీ, డీ, ఈ కేటగిరీలు విభజించి ఆయా కేటగిరీల్లోకి కులాలను నిర్దేశించి సమప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి. బీసీలపై ఉన్న క్రిమీలేయర్‌ను ఎత్తివేయాలి. -
రాజ్యాంగ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఓబీసీలకు రాజ్యాంగ పదవుల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ జాతీయ సంయుక్త కార్యాచరణ కమిటీ తీర్మానించింది. జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, జస్టిస్ ఈశ్వరయ్య అధ్యక్షతన సోమవారం ఢిల్లీలో జరిగిన సదస్సులో 12 రాష్ట్రాల బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ..సుప్రీంకోర్టు, హైకోర్టు, చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ రంగాల్లో రాజ్యాంగ పరంగా ఓబీసీలకు దక్కాల్సిన 27% రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల హైకోర్టు నాయమూర్తుల నియామకంలో బీసీలు జడ్జీలుగా పనికిరారంటూ కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు తప్పుడు నివే దికలు పంపారని గుర్తు చేశారు. సుప్రీం న్యాయ మూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కూడా అదే రీతిలో స్పందించడం సరికాదన్నారు. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉన్నా ప్రస్తుతం దేశంలో 14 శాతం కూడా అమలు కావడం లేదని చెప్పారు. కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు జడ్జీలుగా బీసీలు పనికిరారంటూ ఇచ్చిన తప్పుడు నివేదికలపై బీసీలకు క్షమాపణలు చెప్పాలని సీఎం చంద్రబాబును తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనసభలో 69 మంది బీసీలు ఉండాల్సి ఉన్నా కేవలం 19 మందే ఉన్నారని, ఏపీలో 80 మంది బీసీలు ఉండాల్సి ఉన్నా 34 మందే ఉన్నారని తెలిపారు. సదస్సులో మహారాష్ట్ర మంత్రి మహదేవ్ జన్కెర్, ఏపీ నుంచి ఓబీసీ నేత జి.వెంకటేశ్వర్లు, ఉమ్మడి హైకోర్టు న్యాయవాది మెట్టా చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
అనాథలకు ‘ఓబీసీ’ రిజర్వేషన్
న్యూఢిల్లీ: జనరల్ కేటగిరీకి చెందిన అనాథ పిల్లలు ఇకపై ఓబీసీ కేటగిరీతోపాటు 27 శాతం రిజర్వేషన్ పొందనున్నారు. ఈ మేరకు వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్(ఎన్సీబీసీ) గతవారం తీర్మానం చేసింది. ఈ తీర్మానం ప్రకారం తల్లిదండ్రులను కోల్పోయిన పదేళ్లలోపు పిల్లలు ఓబీసీ జాబితాలో స్థానం పొందుతారు. తద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఉద్యోగాల్లో ఓబీసీ కోటా కింద రిజర్వేషన్ లభిస్తుంది. తీర్మానం ప్రతిని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు పంపించినట్లు ఎన్సీబీసీ సభ్యుడు అశోక్ సైని తెలిపారు. ఎన్సీబీసీ ప్రతిపాదనలు అన్ని ప్రధాన పార్టీలు పరిగణనలోకి తీసుకున్నట్లు.. ఇక కేబినెట్ ఆమోదం మాత్రమే మిగిలి ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇదే తరహాలో హిజ్రాలకు ఓబీసీలో 27 శాతం కోటా అమలు చేయాలని ఎన్సీబీసీ ప్రతిపాదించగా ఓబీసీ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో కేంద్రం దానిని నిలుపుదల చేసింది. -
కాపుల ఓబీసీ డిమాండ్‌కు మద్దతు: హార్దిక్ పటేల్
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కాపులను ఓబీసీలో కలపాలనే పోరాటానికి మద్దతు ఇవ్వనున్నట్టు పటీదార్ అనామత్ ఆందోళన సమితి నేత హార్దిక్ పటేల్ బుధవారమిక్కడ చెప్పారు. కుర్మీ, గుజ్జర్, మరాఠా, పటేళ్లను సంఘటిత పర్చేందుకు అఖిల భారతీయ పటేల్ నవనిర్మాణ్ సేన ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఏపీ, తెలంగాణలో కూడా ఓబీసీ రిజర్వేషన్లు కావాలంటూ కాపులు పోరాటాలు చేస్తున్నారని, వారిని కూడా కలుపుకుపోతామన్నారు. -
గుజరాత్ ఎందుకు తగలబడుతోంది ?
న్యూఢిల్లీ: గుజరాత్ నేడు తగులబడి పోతోంది. రిజర్వేషన్ల అంశంపై రగిలిపోతోంది. ఓబీసీ రిజర్వేషన్లలో తమకూ వాటా కావాలంటూ రోడ్డెక్కిన పటేళ్లు విధ్వంసానికి తెగబడుతున్నారు. పట్టుమని పాతికేళ్లు కూడాలేని హార్దిక్ పటేల్ ఇచ్చిన పిలుపునకు మొత్తం గుజరాత్ రాష్ట్రంలో 12 శాతం ఉన్న పటేళ్లు వీధుల్లో కదం తొక్కుతున్నారు. రెండు నెలల క్రితం వరకు ఎవరికీ తెలియని హార్దిక్ పటేల్‌కు ప్రజల్లో ఇంత పాపులారిటీ ఎలా వచ్చింది? జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్య్రోద్యమం కోసం గుజరాత్లో ఇంతమందిని సమీకరించడానికి కొన్నేళ్లు పట్టింది. జన మోర్చా ఉద్యమంతో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వీపీ సింగ్ పిలుపునకు ఈ స్థాయిలో జనం ఎప్పుడూ స్పందించలేదు. అంతెందుకు 1985లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పటేళ్లు ఆందోళన నిర్వహించినప్పుడు కూడా ప్రజల నుంచి ఇంత స్పందన లేదు. మరి ఇప్పుడెందుకొస్తోంది. పైగా పటేళ్లు ఈసారి నినాదాన్ని మార్చారు. తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, తమకూ రిజర్వేషన్లలో వాటా మాత్రమే కావాలని పటేళ్లు డిమాండ్ చేస్తున్నారు. అటు అమెరికా వరకు విస్తరించిన గుజరాత్ పటేళ్ల ఆర్థిక పరిస్థితి హఠాత్తుగా తలకిందులైందా, కాదే! సొంత వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు కష్టపడి పనిచేసే పటేళ్ల కమ్యూనిటీకి ఇంటా, బయట ఎక్కడ కూడా ఆర్థిక పరిస్థితులు దిగజారిన దాఖలాలు లేవు. అమెరికాలోని పలు రాష్ట్రాలను పటేళ్ల వ్యాపారాలు విస్తరించడంతో ‘మోటల్స్’లాగా వారి హోటళ్లకు ‘పోటల్స్’ అనే పేర్లు కూడా స్థిర పడ్డాయి. రిజర్వేషన్ల కారణంగా గుజరాత్లో ఫార్వర్డ్ కులాలను ప్రభుత్వ ఉద్యోగావకాశాలు తగ్గిన మాట వాస్తవమే. కాని సొంత వ్యాపారంపైనే బతికే పటేళ్లకు దాని వల్ల వచ్చిన నష్టమేమి లేదు. మరెందుకు వారు ఆందోళన బాట పట్టారు? ఇతర అగ్ర కులాల వారు కూడా ఇప్పుడు వారి ఆందోళనకు ఎందుకు మద్దతిస్తున్నారు? దీని వెనకు లోతైన కుట్ర ఏమైనా ఉందా? వెనకాలుండి జన సమీకరణ చేయకపోతే ఇంత మంది ఓ యువకుడి వెనక ఎలా కదులుతున్నారు? గుజరాత్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాగానే హార్దిక్ పటేల్ కూడా ముందుగా హిందీలో ఉపన్యాసం ఇచ్చి తర్వాత గుజరాతీలో మాట్లాడుతున్నారు. దాని అర్థం ఏమిటీ? రిజర్వేషన్ల అంశాన్ని దేశ వ్యాప్తంగా ప్రతిధ్వనింప చేయడం కాదా? పటేళ్ల పూర్వపరాలు గమనిస్తే అవుననే సమాధానమే వస్తుంది. పటేళ్లలో లెవా, కడవా అనే రెండు వర్గాలు ఉన్నప్పటికీ వారెప్పుడూ ఐక్యంగానే ఉన్నారు. వ్యవసాయ రంగంలోనైనా, వ్యాపారం రంగంలోనైనా పటేళ్లు సొంతకాళ్లపైనే నిలబడతారు. కష్టించి పనిచేస్తారు. సామాజికంగా ఏమాత్రం వెనకబడి లేరు. ముఖ్యంగా గుజరాత్ ఓబీసీ జాబితాలో ఉన్న అన్ని కులాలకన్నా ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్లే. రాజకీయంగా కూడా వారు బాగా ఎదిగిన వాళ్లే. గుజరాత్ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా వారిని విస్మరించిన సందర్భాలు కనిపించవు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను మొదలుకొని గుజరాత్ ముఖ్యమంత్రి బాబూభాయ్ పటేల్, చిమన్ భాయ్ పటేల్, కేశూ భాయ్ పటేల్, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ వరకు అందరూ ఆ సామాజిక వర్గానికి చెందిన వారే. పటేళ్లకు రిజర్వేషన్లు కావాలనుకుంటే అది ఇచ్చే అధికారం ముఖ్యమంత్రికిగానీ, రాష్ట్ర ప్రభుత్వానికిగానీ లేదు. అలాంటప్పుడు రాష్ట్రంలో ఆందోళన చేసి లాభం ఏమిటి? నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దగ్గరికెళ్లి ఆర్జి పెట్టుకోవచ్చుకదా? అలా ఎందుకు చేయడం లేదు? 1985లో రిజర్వేషన్ల వ్యవస్థకే వ్యతిరేకంగా ఆందోళన చేసిన పటేళ్లు ఇప్పడు ఎందుకు పంథా మార్చారు. తమకూ రిజర్వేషన్లంటూ అనూహ్య డిమాండ్‌ను ఎందుకు ముందుకుతెచ్చారు? హార్థిర్ పటేల్‌ను చిన్న మోడీగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు? బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే ఆందోళన ఎందుకు ఊపందుకుంది? పటేళ్లలో బీజీపీ, ఆరెస్సెస్ నాయకులు ఎక్కువగా ఉన్నారు. ఈ రెండు పార్టీలు కూడా దేశంలో రిజర్వేషన్లకు వ్యతిరేకం. కులమతాలతో సంబంధం లేకుండా ఆర్థికంగా వెకనబడిన వర్గాలకు మాత్రమే రిజర్వేషన్లు ఉండాలన్నది ఈ పార్టీలదేకాదు, మొత్తం సంఘ్ పరివార్ సిద్ధాంతం. రిజర్వేషన్ల అంశాన్ని మరోసారి జాతీయ సమస్యను చేయాలన్నదే వారి వ్యూహమా ? ఈ సిద్ధాంతవాదులే ఇప్పుడు ఈ ఆందోళనను వెనకుండి నడిపిస్తున్నారా ? అన్నది ప్రస్తుతానికి అనుమానం. మున్ముందు ఉద్యమ పరిణామాలే అసలు అంశాన్ని బయట పెట్టవచ్చు.