రిజర్వేషన్ల సాధనే లక్ష్యం   | Goal of achieving reservation | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్ల సాధనే లక్ష్యం  

Published Mon, Aug 5 2019 3:12 AM | Last Updated on Mon, Aug 5 2019 3:12 AM

Goal of achieving reservation - Sakshi

ఆదివారం పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: బీసీ నినాదాన్ని జాతీయ స్థాయిలో వినిపించేందుకు బీసీ నేతలు సిద్ధ్దమవుతున్నారు. అన్ని వర్గాలకు జనాభా ప్రాతిపదికన ఫలాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు.. బీసీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ పలు రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం తమ ఉద్యమాలు రాష్ట్ర స్థాయికే పరిమితం కావటం వల్ల ఉపయోగం ఉండటం లేదని, వాటిని ఢిల్లీ స్థాయికి విస్తరిస్తేనే ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ఈ నెల 7న ‘జాతీయ ఓబీసీ మహాసభ’నిర్వహించనున్నారు. ఈ సభకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. 7న ఉదయం 11 నుంచి జరగనున్న ఈ సభకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

29 రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సమావేశాన్ని రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్‌ సమన్వయపరుస్తుంది. ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను జాజుల ఆదివారం ఆవిష్కరించారు. కాగా, జాతీయ ఓబీసీ మహాసభ అనంతరం దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టేందుకు బీసీ సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఈ సభలో చేసిన తీర్మానాలపై దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీసీలకు అవగాహన కల్పించేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నాయి. హైదరాబాద్‌లో జరిగే జాతీయ ఓబీసీ మహాసభ నాలుగోది. మొదటి సభను నాగ్‌పూర్‌లో నిర్వహించగా, రెండోది ఢిల్లీలో, మూడోది ముంబైలో నిర్వహించినట్లు జాజుల తెలిపారు.

ప్రధాన డిమాండ్లు ఆయన మాటల్లోనే..
- 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో బీసీలు మినహా అన్ని వర్గాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాల్లో బీసీలు మినహా మిగతా అన్ని కులాలకు చెందిన వారు చట్టసభల్లో కాలుపెట్టారు. బీసీల్లోని వందల కులాలు ఇప్పటికీ చట్టసభల ముఖం చూడలేదు. ఈ నేపథ్యంలో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలనేది ముఖ్యమైన డిమాండ్‌.
- దేశ జనాభాలో 54 శాతానికి పైగా ఉన్న బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి దానికి బీసీని మంత్రిగా నియమించాలి. 
- ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చారు. అగ్రవర్ణ పేదల కోసం 10 శాతం రిజర్వేషన్లు కల్పించారు. కానీ బీసీలకు మాత్రం పరిమితులు, 50 శాతం సీలింగ్‌ను చూపి దాటవేస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి. దాన్ని చట్టసభల్లో, ఉద్యోగుల పదోన్నతుల్లో అమలు చేయాలి.
- బీసీ జనాభాను కులాల వారీగా వర్గీకరించాలి. రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లుగా కేంద్రంలో, అన్ని రాష్ట్రాల్లో ఏ, బీ, సీ, డీ, ఈ కేటగిరీలు విభజించి ఆయా కేటగిరీల్లోకి కులాలను నిర్దేశించి సమప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి. బీసీలపై ఉన్న క్రిమీలేయర్‌ను ఎత్తివేయాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement