తాడేపల్లిలోని నివాసంలో సీఎం వైఎస్ జగన్‌కు వినతి పత్రం అందజేస్తున్న జస్టిస్ ఈశ్వరయ్య, బీసీ ప్రతినిధుల బృందం
సాక్షి, అమరావతి: బీసీల ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి అన్ని అవకాశాలు కల్పిస్తామని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని బీసీ ప్రతినిధుల బృందం పేర్కొంది. శనివారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో వైఎస్ జగన్‌ను జాతీయ ఓబీసీ కమిషన్ మాజీ చైర్మన్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య, జాతీయ ఓబీసీ మహా సభ నిర్వహణ కమిటీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇతర బీసీ నేతలు కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బీసీల క్రీమిలేయర్ రద్దు, బీసీ జనగణన నిర్వహించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు యథావిధిగా 34 శాతం అమలు చేయాలని, చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ తీసుకురావాలని, అన్ని జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిళ్లను ప్రారంభించాలని సీఎంను కోరినట్లు వారు తెలిపారు.
మొత్తం 15 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి బీసీ మేధావులు, బీసీ సంఘాలు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం కోరారన్నారు. ఆగస్టు 7న హైదరాబాద్‌లోని సరూర్ నగర్ స్టేడియంలో జరిగే జాతీయ ఓబీసీ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరు కావాలని సీఎంను ఆహ్వానించినట్లు బీసీ నేతలు చెప్పారు. జాతీయ ఓబీసీ మహాసభ అధ్యక్షుడు కేసన శంకరరావు, కె.ఆల్మేన్ రాజులు, కన్నా మాష్టారు, వెంకటేశ్వర్లు, కిషోర్, రంగనాథ్, డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు, పరమశివం, గుండాల నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment