సాక్షి, హైదరాబాద్: కోట్లాడి తెచుకున్న హక్కులు, రిజర్వేషన్లకు న్యాయం జరిగే వరకు పోరాడాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. మన దేశంలో ఏ కులానికైతే అన్యాయం జరుగుతుందో అప్పుడే ఆ కులం సంఘటిత మవుతుందని తెలిపారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో 4వ నేషనల్ కన్వెన్షన్ రాష్ట్రీయ ఓబీసీ మహాసభకు ముఖ్య అతిధులుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయి జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. విదేశాంగ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మృతి పట్ల సభ నివాళి అర్పించి, వచ్చిన అతిధులను సన్మానించారు. ఈ సందర్భగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ... మహారాష్ట్ర, కేరళ, పాండిచేరీ, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 18 రాష్ట్రాల నుంచి వచ్చిన ఓబీసీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. 72 సంవత్సరాలుగా దేశంలో ఓబీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇలాంటి సమావేశాలు ఏ కులాలకు వ్యతిరేకం కాదని, వీటికి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఉందన్నారు. తెలంగాణలో మొత్తం 85 శాతం అణగారిన వర్గాలు ఉన్నాయని పేర్కొన్నారు.
రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ‘వీపీ సింగ్ హయాంలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టిన ఆగస్టు 7నే మహా సభలను నిర్వహిస్తున్నామని, ఈ జాతీయ మహా సభలోనే బీసీలకు సంబంధించిన వెబ్ సైట్‌ను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ పొందుపర్చామని, ఈ వెబ్‌సైట్ ద్వారా సభ్యత్వం కూడా తీసుకోవచ్చని తెలిపారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య మాట్లాడుతూ.. రాజ్యాధికారంతో అన్ని సమస్యలకు పరిష్కరం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లతో ఆడుకునే అలవాటు పరిపాటి అయిందని, బీసీల ఆర్థిక ఎదుగుదలతోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని అభిప్రాయపడ్డారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో 52 శాతం వరకూ ఉన్న బీసీ జనాభాలో సమస్యలపై పోరాడే నాయకులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బీసీ సభ డిమాండ్లను జాతీయ స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీసీలను ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంలు చేస్తే బీసీల సమస్యలు తీరవని.. భారత రాజ్యాంగంలో బీసీలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలన్నారు. దేశంలో బీసీ కార్పొరేషన్లకు మరిన్ని నిధులు కేటాయించాలన్నారు. తెలంగాణలో బీసీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. తెలంగాణలో బీసీలకు అమలు చేసే పథకాలు, అన్ని రాష్ట్రాల్లోని సీఎంలు అమలు చేస్తే బీసీలకు ఎటువంటి సమస్యలు ఉండబోవని అన్నారు.
సమావేశంలో టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఫోరమ్ అధ్యక్షుడు జైపాల్ యాదవ్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, సినీ నటుడు సుమన్, ఆర్. నారాయణమూర్తి, తెలంగాణ రాష్ట్ర బీసీ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, వివిధ రాష్ట్రల నుంచి వచ్చిన ఓబీసీ నాయకులు, ఓబీసీ మహిళా నేత, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment