
మన దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ల విధానం ప్రతిభకు అవరోధంగా మారిందని, అది సమానావకాశాలను దెబ్బతీస్తున్నదని వాదించేవారికి సుప్రీంకోర్టు తాజా తీర్పు కళ్లు తెరిపించాలి. మెడికల్, డెంటల్ కోర్సుల్లో యూజీ, పీజీ అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష నీట్‌లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ తీర్పు వెలువడింది. ఓబీసీ కోటా, ఆర్థికంగా వెనకబడినవారి కోటా సక్రమమైనవేనని ఈ నెల 7న మధ్యంతర ఉత్తర్వులిచ్చిన సుప్రీంకోర్టు గురువారం అందుకు సంబంధించిన పూర్తి స్థాయి తీర్పును వెల్లడించింది. ఎంబీబీఎస్‌లో కోటాను వినియోగించుకుని పట్టభద్రులైనవారిని ఇక వెనకబడినవారిగా పరిగణించాల్సిన అవసరం లేదని, పీజీ అడ్మిషన్లకు కేవలం ప్రతిభే గీటురాయిగా ఉండాలని పిటిషనర్లు వాదించారు. పీజీ స్థాయిలోనూ, సూపర్ స్పెషాలిటీ స్థాయిలోనూ అత్యున్నత శ్రేణి నైపుణ్యం, పరిజ్ఞానం అవసరమవుతాయని... వీటిని బేఖాతరు చేసి కోటా అమలు చేయడం వల్ల జాతీయ ప్రయోజనాలు దెబ్బతింటాయన్నది పిటిషనర్ల ఆందోళన. 2021–22 విద్యా సంవత్సరం కోసం నిర్వహించే నీట్ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓబీసీ కోటా ఉత్తర్వులివ్వడాన్ని కూడా ఎత్తిచూపి, ఆ విధంగా చూసినా అది చెల్లుబాటుకాదని వాదించారు. ఆట మొదలయ్యాక దానికి సంబంధించిన నిబంధనలు ఎలా మారతాయన్నది పిటిషనర్ల ప్రశ్న. ఈ తీర్పులో జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం సవివరమైన తీర్పునిచ్చింది. కోటా అమలుకు వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడానికి రాజ్యాంగ పరంగా 15(4), 15(5) అధికరణల కింద ప్రభుత్వానికి తిరుగులేని అధికారం ఉన్నదని చెబుతూ 15(1) అధికరణలో సూచించిన ‘సుదృఢమైన సమానత్వం’ సాధనకు ఈ నిర్ణయం అనుగుణ మైనదేనని వివరించింది. అసలు పరీక్షల్లో సాధించే మార్కులు ప్రతిభకు కొలమానమా, కాదా అనే అంశాన్ని కూడా లోతుగా పరిశీలించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. అత్యధిక మార్కులు సాధించిన వ్యక్తి మంచి పనులకు ఆ ప్రతిభను వినియోగించనప్పుడు అతన్ని ప్రతిభావంతు డనవచ్చునా లేదా అని జస్టిస్ చంద్రచూడ్ సంధించిన ప్రశ్నకు ఎవరి దగ్గరా జవాబుండదు.
నీట్ ప్రవేశాల్లో కోటా అమలుపై దాఖలైన పిటిషన్లలో లేవనెత్తిన అంశాలు నిజానికి చాలా పాతవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్‌టీ రామారావు బీసీ కోటా అమలుకు చర్యలు తీసుకున్నప్పుడూ... మాజీ ప్రధాని స్వర్గీయ వీపీ సింగ్ మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేసినప్పుడూ వాటిని వ్యతిరేకించినవారు ‘ప్రతిభ’ వాదనే లేవదీశారు. కోటా కింద ఎంపికయ్యేవారంతా ఎలాంటి తెలివితేటలూ లేనివారని, వారికి అవకాశాలు కల్పిస్తే ప్రతిభ కలిగిన తామంతా రోడ్డున పడతామని వాదించారు. దేశంలో శతాబ్దాలుగా వేళ్లూనుకున్న కుల వ్యవస్థ కారణంగా అట్టడుగు వర్గాలు సామాజిక అణచివేతకు గురయ్యాయి. పర్యవసానంగా విద్యాగంధానికీ, అందువల్ల కలిగే ఫలాలకూ దూరమయ్యాయి. ఎదుగూబొదుగూ లేకుండా మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలోనే ‘వ్యవస్థీకృత అవరోధాల’ కారణంగా వెనకబడిన వర్గాలకు సమానావకాశాలు దక్కకుండా పోయాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవస్థీకృత అవరోధాలు కేవలం ఆ వర్గాలకు అన్యాయం చేయడం మాత్రమే కాదు... దేశ పురోగతిని కూడా ఆటంకపరిచాయన్నది చేదు నిజం. మెజారిటీ పౌరులకు ప్రవేశంలేని... వారి ప్రమేయంలేని వ్యవస్థ ఏలుబడిలో ఉన్న దేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉండగలదా? నీట్ వంటి పరీక్షలు అభ్యర్థు లందరికీ సమానావకాశాలు ఇస్తాయన్నది వాస్తవమే కావొచ్చు. కానీ ఆ సమానావకాశాల ద్వారా లబ్ధి పొందేందుకు అనువైన వాతావరణం కొన్ని వర్గాలకు కొరవడినప్పుడు అవి అర్థరహిత మవుతాయి. అక్కడే కోటా అవసరమవుతుంది.
వ్యక్తుల్లో కనబడే ప్రతిభలో నిగూఢమైన వారసత్వ నేపథ్యం ఉంటుందని, దాన్ని ఒకరి స్వయంకృషిగా మాత్రమే అర్థం చేసుకోవడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడటం గమ నించదగ్గది. శతాబ్దాల అసమానతలు సృష్టించిన సామాజిక అంతరాలను సాధ్యమైనంతవరకూ తగ్గించాలంటే అవకాశాలను అందుకోవడంలో విఫలమవుతున్నవారికి ఆలంబనగా ఉండాలన్న ఉద్దేశంతోనే రాజ్యాంగం రిజర్వేషన్ల విధానానికి చోటిచ్చింది. ఈ రిజర్వేషన్లను మొదట్లోనే ఎస్సీ, ఎస్టీలతోపాటు సామాజికంగా వెనకబడిన కులాలకు కూడా కల్పించి ఉంటే బాగుండేది. రాజ్యాంగంలోని 15, 16 అధికరణలు కేంద్ర ప్రభుత్వానికి అందుకు అవకాశమిచ్చాయి కూడా. కానీ మన పాలకులు నిర్లక్ష్యం చేశారు. జనతాపార్టీ పాలనలో 1979లో సామాజికంగా వెనకబడిన కులాలను గుర్తించేందుకు మండల్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ ఏడాది వ్యవధిలోనే నివేదికను సమర్పించింది. కానీ దాదాపు మరో దశాబ్దంపాటు అది ఫైళ్లకే పరిమితమయింది. చివరకు 1989లో నాటి వీపీ సింగ్ సర్కారు ఆ కమిషన్ సిఫార్సులకు బూజు దులిపి అమల్లోకి తీసుకొచ్చింది. విద్యా ఉద్యోగావకాశాల్లో కల్పించే కోటాను అందుకోలేని కులాలు ఈనాటికీ ఉన్నాయంటేనే సమానత్వ సాధనకు మనం ఎన్ని వేల యోజనాల దూరంలో ఉన్నామో ఆలోచించు కోవాల్సిందే. ప్రతిభవంటి నిరర్థకమైన వాదనలకు తాజా తీర్పు అడ్డుకట్ట వేయగలిగితేనే అలాంటి సమానత్వ భావన దిశగా మనం కదులుతున్నట్టు లెక్క.