గుజరాత్ ఎందుకు తగలబడుతోంది ?
న్యూఢిల్లీ: గుజరాత్ నేడు తగులబడి పోతోంది. రిజర్వేషన్ల అంశంపై రగిలిపోతోంది. ఓబీసీ రిజర్వేషన్లలో తమకూ వాటా కావాలంటూ రోడ్డెక్కిన పటేళ్లు విధ్వంసానికి తెగబడుతున్నారు. పట్టుమని పాతికేళ్లు కూడాలేని హార్దిక్ పటేల్ ఇచ్చిన పిలుపునకు మొత్తం గుజరాత్ రాష్ట్రంలో 12 శాతం ఉన్న పటేళ్లు వీధుల్లో కదం తొక్కుతున్నారు. రెండు నెలల క్రితం వరకు ఎవరికీ తెలియని హార్దిక్ పటేల్‌కు ప్రజల్లో ఇంత పాపులారిటీ ఎలా వచ్చింది?
జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్య్రోద్యమం కోసం గుజరాత్‌లో ఇంతమందిని సమీకరించడానికి కొన్నేళ్లు పట్టింది. జన మోర్చా ఉద్యమంతో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వీపీ సింగ్ పిలుపునకు ఈ స్థాయిలో జనం ఎప్పుడూ స్పందించలేదు. అంతెందుకు 1985లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పటేళ్లు ఆందోళన నిర్వహించినప్పుడు కూడా ప్రజల నుంచి ఇంత స్పందన లేదు. మరి ఇప్పుడెందుకొస్తోంది. పైగా పటేళ్లు ఈసారి నినాదాన్ని మార్చారు.
తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, తమకూ రిజర్వేషన్లలో వాటా మాత్రమే కావాలని పటేళ్లు డిమాండ్ చేస్తున్నారు. అటు అమెరికా వరకు విస్తరించిన గుజరాత్ పటేళ్ల ఆర్థిక పరిస్థితి హఠాత్తుగా తలకిందులైందా, కాదే! సొంత వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు కష్టపడి పనిచేసే పటేళ్ల కమ్యూనిటీకి ఇంటా, బయట ఎక్కడ కూడా ఆర్థిక పరిస్థితులు దిగజారిన దాఖలాలు లేవు. అమెరికాలోని పలు రాష్ట్రాలను పటేళ్ల వ్యాపారాలు విస్తరించడంతో ‘మోటల్స్’లాగా వారి హోటళ్లకు ‘పోటల్స్’ అనే పేర్లు కూడా స్థిర పడ్డాయి.
రిజర్వేషన్ల కారణంగా గుజరాత్‌లో ఫార్వర్డ్ కులాలను ప్రభుత్వ ఉద్యోగావకాశాలు తగ్గిన మాట వాస్తవమే. కాని సొంత వ్యాపారంపైనే బతికే పటేళ్లకు దాని వల్ల వచ్చిన నష్టమేమి లేదు. మరెందుకు వారు ఆందోళన బాట పట్టారు? ఇతర అగ్ర కులాల వారు కూడా ఇప్పుడు వారి ఆందోళనకు ఎందుకు మద్దతిస్తున్నారు? దీని వెనకు లోతైన కుట్ర ఏమైనా ఉందా? వెనకాలుండి జన సమీకరణ చేయకపోతే ఇంత మంది ఓ యువకుడి వెనక ఎలా కదులుతున్నారు?
గుజరాత్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాగానే హార్దిక్ పటేల్ కూడా ముందుగా హిందీలో ఉపన్యాసం ఇచ్చి తర్వాత గుజరాతీలో మాట్లాడుతున్నారు. దాని అర్థం ఏమిటీ? రిజర్వేషన్ల అంశాన్ని దేశ వ్యాప్తంగా ప్రతిధ్వనింప చేయడం కాదా? పటేళ్ల పూర్వపరాలు గమనిస్తే అవుననే సమాధానమే వస్తుంది. పటేళ్లలో లెవా, కడవా అనే రెండు వర్గాలు ఉన్నప్పటికీ వారెప్పుడూ ఐక్యంగానే ఉన్నారు. వ్యవసాయ రంగంలోనైనా, వ్యాపారం రంగంలోనైనా పటేళ్లు సొంతకాళ్లపైనే నిలబడతారు. కష్టించి పనిచేస్తారు. సామాజికంగా ఏమాత్రం వెనకబడి లేరు. ముఖ్యంగా గుజరాత్ ఓబీసీ జాబితాలో ఉన్న అన్ని కులాలకన్నా ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్లే. రాజకీయంగా కూడా వారు బాగా ఎదిగిన వాళ్లే. గుజరాత్ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా వారిని విస్మరించిన సందర్భాలు కనిపించవు.
సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను మొదలుకొని గుజరాత్ ముఖ్యమంత్రి బాబూభాయ్ పటేల్, చిమన్ భాయ్ పటేల్, కేశూ భాయ్ పటేల్, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ వరకు అందరూ ఆ సామాజిక వర్గానికి చెందిన వారే. పటేళ్లకు రిజర్వేషన్లు కావాలనుకుంటే అది ఇచ్చే అధికారం ముఖ్యమంత్రికిగానీ, రాష్ట్ర ప్రభుత్వానికిగానీ లేదు. అలాంటప్పుడు రాష్ట్రంలో ఆందోళన చేసి లాభం ఏమిటి? నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దగ్గరికెళ్లి ఆర్జి పెట్టుకోవచ్చుకదా? అలా ఎందుకు చేయడం లేదు? 1985లో రిజర్వేషన్ల వ్యవస్థకే వ్యతిరేకంగా ఆందోళన చేసిన పటేళ్లు ఇప్పడు ఎందుకు పంథా మార్చారు. తమకూ రిజర్వేషన్లంటూ అనూహ్య డిమాండ్‌ను ఎందుకు ముందుకుతెచ్చారు? హార్థిర్ పటేల్‌ను చిన్న మోడీగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు? బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే ఆందోళన ఎందుకు ఊపందుకుంది?
పటేళ్లలో బీజీపీ, ఆరెస్సెస్ నాయకులు ఎక్కువగా ఉన్నారు. ఈ రెండు పార్టీలు కూడా దేశంలో రిజర్వేషన్లకు వ్యతిరేకం. కులమతాలతో సంబంధం లేకుండా ఆర్థికంగా వెకనబడిన వర్గాలకు మాత్రమే రిజర్వేషన్లు ఉండాలన్నది ఈ పార్టీలదేకాదు, మొత్తం సంఘ్ పరివార్ సిద్ధాంతం. రిజర్వేషన్ల అంశాన్ని మరోసారి జాతీయ సమస్యను చేయాలన్నదే వారి వ్యూహమా ? ఈ సిద్ధాంతవాదులే ఇప్పుడు ఈ ఆందోళనను వెనకుండి నడిపిస్తున్నారా ? అన్నది ప్రస్తుతానికి అనుమానం. మున్ముందు ఉద్యమ పరిణామాలే అసలు అంశాన్ని బయట పెట్టవచ్చు.