కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌ | Pawan Kalyan sensational comments in an English TV channel interview | Sakshi
Sakshi News home page

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

Published Fri, May 10 2024 5:21 AM | Last Updated on Fri, May 10 2024 1:02 PM

Pawan Kalyan sensational comments in an English TV channel interview

ఓ ఇంగ్లిష్‌ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో పవన్‌ సంచలన వ్యాఖ్యలు

ఆ రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యమే కాదంటూ వ్యాఖ్య  

వాటి అమలుకన్నా ఉపాధికి ఉపయోగపడే నైపుణ్యాల్లో యువతకు శిక్షణే మేలని వెల్లడి 

ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ పెద్దల ప్రకటనకు జనసేన అధినేత మద్దతు  

వారి ప్రకటనలపై తనకెలాంటి నిరాశ, ఆందోళన లేదన్న పవన్‌కళ్యాణ్‌

సాక్షి, అమరావతి/వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్న కాపు రిజర్వేషన్లతో పాటు ముస్లిం రిజర్వేషన్లు అసలు అవసరమేలేదంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ రిజర్వేషన్లనే ఆయన వ్యతిరేకిస్తూ పరోక్షంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంగ్లిష్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ముస్లిం రిజర్వేషన్ల అంశంలో ఇటీవల బీజేపీ జాతీయ నేతలు చేస్తున్న ప్రకట­నలకు జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ పూర్తి మద్దతు ప్రకటించడంతో పాటు కోరుకునే వారందరికీ రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమేకాదని తన మనస్సులోని మాటను కుండబద్దలు కొట్టారు. 

ఈ రిజర్వేషన్లకు ప్రత్యామ్నాయ మార్గాలు గురించి ఆలోచన చేయాలన్నారు. ఆ ఇంటర్వ్యూలో సంబంధిత మీడియా ఛానల్‌ ప్రతినిధి.. ముస్లింలకు సంబంధించి బీజేపీ వైఖరి గురించి పవన్‌ను ప్రశ్నించినప్పుడు, బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించారు. కానీ, వాళ్లు (బీజేపీ) ముస్లిం రిజర్వేషన్లు అమలుచేయబోమని ఆ పార్టీ నేతలు నేరుగా చెబుతున్నారు కదా.. దానిపై మీరేమీ నిరాశ చెందడంలేదా అన్న ప్రశ్నకు పవన్‌ బదులిస్తూ.. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ నేతల ప్రకటనలపట్ల తానేమీ నిరాశ, ఆందోళన చెందడంలేదని చెప్పారు. అయినా, రిజర్వేషన్ల అమలుకన్నా యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలు పెంచేలా వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు.

అందరికీ రిజర్వేషన్లు కూడా కుదరదు..
రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్న అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్నా సాధ్యమయ్యే పరిస్థితి కాదని పవన్‌ తేల్చిచెప్పారు. ప్రత్యేకంగా తమ సొంత (కాపు) కులం కూడా రిజర్వేషన్ల కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తోందన్నారు. అందరికీ రిజర్వేషన్లు ఇవ్వాలన్నా కుదరదని.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసిందని పవన్‌ గుర్తుచేశారు. రిజర్వేషన్లు ఇవ్వడానికి సాధ్యంకానప్పుడు, ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించాలని ఆయన చెప్పారు.

జగన్‌ ఇచ్చిన వాగ్దానాలను  నెరవేర్చలేదు 
మరోవైపు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో పవన్‌ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. రాష్ట్రంలోని యువకుల గళాన్ని అసెంబ్లీలో బలంగా వినిపిస్తానన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు. మైనార్టీల ప్రాథమిక హక్కులకు తాను అండగా ఉంటానని.. కాపులకు రిజర్వేషన్లను అడుగుతున్నారని, న్యాయస్థానాల్లో ఉన్న అంశాలపై తాము మాట్లాడకూడదంటూ ఇంగ్లీష్‌ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూకు భిన్నంగా మాట్లాడారు. 

ఇక ఇక్కడ తాను పెంచి పెద్దచేసిన నాయకుడు తనపై విమర్శలు చేస్తూ తిటడం బాధ కలిగిస్తోందని పోతిన మహేష్‌ పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. అలాగే, వంగవీటి రాధా చట్టసభలకు వెళ్తానంటే తాను అండగా ఉంటానని పవన్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి, నాయకులు వంగవీటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Video Credits: NDTV

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement