టీఎస్‌కు బదులు ‘టీజీ’!  Government decision to change state code in vehicle registration number: Telangana | Sakshi
Sakshi News home page

టీఎస్‌కు బదులు ‘టీజీ’! 

Published Sun, Feb 4 2024 3:24 AM | Last Updated on Sun, Feb 4 2024 11:09 AM

Government decision to change state code in vehicle registration number: Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్‌లో తెలంగాణ రాష్ట్ర కోడ్‌ను తెలిపే ‘టీఎస్‌’కు బదులుగా ‘టీజీ’ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభు త్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఉద్యమకాలంలో తెలంగాణను సంక్షిప్తరూపంలో ‘టీజీ’గా పరిగణించేవారని.. ఈ క్రమంలోనే కోడ్‌ను ‘టీజీ’గా మార్చేందుకు కాంగ్రెస్‌ సర్కారు సిద్ధమైందని ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి. ఇందుకోసం రాష్ట్ర మోటారు వాహనాల రిజిస్ట్రేషన్‌ చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. దీనితోపాటు మరో 20 ప్రధాన అంశాలను కేబినెట్‌ చర్చించనున్నట్టు తెలిసింది. 

గ్రూప్‌–1 పోస్టులు పెంపు 
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మరో 64 గ్రూప్‌–1 పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీచేసే అంశంపై కేబినెట్‌ చర్చించనుంది. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ద్వారా 503 గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో.. ఈ అదనపు పోస్టుల భర్తీకి అనుబంధ నోటిఫికేషన్‌ జారీచేసే అవకాశాలు ఉన్నాయి. ఇక వివిధ శాఖలు/విభాగాల్లో పదవీ విరమణ తర్వాత కూడా కొనసాగుతున్న 1,049 మంది ప్రభుత్వ అధికారుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది. 

‘బడ్జెట్‌’ తేదీల ఖరారు 
శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభించే తేదీని కేబినెట్‌ ఖరారు చేయనుంది. సమావేశాల తొలిరోజున గవర్నర్‌ తమిళిసై చేయనున్న ప్రసంగాన్ని ఆమోదించనుంది. 8 నుంచి బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభించాలని ప్రభుత్వంయోచి స్తోంది. 9న బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జీఎస్టీ చట్ట సవరణ, పీఆర్‌ చట్ట సవరణ, సిటీ సివిల్‌ కోడ్‌ చట్ట సవరణ బిల్లులకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనుంది. ధరణిపై అధ్యయన కమిటీ సమరి్పంచిన మధ్యంతర నివేదికపై కూడా సమీక్షించి తదుపరి కార్యాచరణను ఖరారు చేయనుంది. రాష్ట్ర గవర్నర్‌ గతంలో నిలిపివేసిన బిల్లులను తిరిగి పరిశీలన కోసం పంపాలన్న అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. 

కులగణనపై చర్చ.. 
రాష్ట్రంలో చేపట్టనున్న కులగణనకు చట్టబద్ధత కల్పించేందుకు వీలుగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బడ్జెట్‌ కేటాయింపుల కోసం వివిధ శాఖల మంత్రులు చేసిన ప్రతిపాదనలను పరిశీలించనున్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో భాగమైన రూ.500కే గ్యాస్‌ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ హామీలను అమల్లోకి తెచ్చే అంశంపై చర్చించనున్నారు. ఈ రెండు పథకాలను ఎప్పుడు ప్రారంభించాలి, ఏ మేర ఆర్థిక భారం పడుతుందన్నది పరిశీలించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లపైనా చర్చించే అవకాశం ఉందని తెలిసింది. 

ఏ రాష్ట్రమో తెలిపే ‘కోడ్‌’ అది.. 
వాహనాల నంబర్‌ ప్లేట్, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్సీ)లలో వాహనం ఏ రాష్ట్రంలో రిజిస్టర్‌ అయిందో తెలియజేసేలా కోడ్‌ ఉంటుంది. తెలంగాణ ఏ ర్పాటై, బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌) ప్రభుత్వం ఏర్పాటు చేశాక.. వాహనాల నంబర్‌లో రాష్ట్ర కోడ్‌గా ‘టీఎస్‌’ అనే అక్షరాలను పొందుపర్చాలని నిర్ణయించింది. అప్పటి టీఆర్‌ఎస్‌ పార్టీ పేరును పోలినట్టుగా ‘టీఎస్‌’ అనే అక్షరాలను కోడ్‌గా ఖరారు చేశారంటూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు మండిపడ్డాయి. తాజాగా ‘టీఎస్‌’కు బదులు ‘టీజీ’ అనే స్టేట్‌ కోడ్‌ను వినియోగించాలని నిర్ణయానికి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement