మెదక్, న్యూస్‌లైన్: నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ యాజ మాన్య భవితవ్యంపై సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు మంత్రివర్గ ఉప సంఘం సమావేశమై ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటే ఎంత పరిహారం చెల్లించాలనే విషయంపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కాగా రైతుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి కలెక్టర్ల ద్వారా నివేదిక తెప్పించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత నెలలో ఫ్యాక్టరీ భవితవ్యంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రైవేట్ యాజమాన్యాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తరుణంలో కేబినెట్ సమావేశంలో చర్చించారు. ఈ మేరకు రైతుల అభిప్రాయం తెలుసుకొని ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అయితే నియోజకవర్గ పరిధిలోని మంభోజిపల్లి దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న 12 మండలాలకు చెందిన సుమారు 3వేల మంది రైతులు రెండుమార్లు ఈ విషయమై సమావేశమయ్యారు. మొదటిసారి కేవలం రైతుల సమక్షంలో రెండోసారి ఆర్డీఓ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు.
కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే నిర్ణయం తీసుకోవాలని రైతులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అయితే ఇందులో కొంతమంది పెద్ద రైతులు అధిక ధరలు రావాలంటే ప్రైవేటీకరణే బాగుంటుందని అభిప్రాయ పడగా, చిన్న సన్నకారు రైతులంతా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని కోరారు. ప్రస్తుత మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం మేరకు కలెక్టర్లు రైతులను అభిప్రాయాలు కోరితే తెలంగాణ ఏర్పడిన అనంతరమే తమ నిర్ణయం చెబుతామని రైతులంటున్నారు.
మందకొడిగా చెరకు క్రషింగ్
ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్ణయం విషయంలో స్పష్టత రాక పోవడంతో ఎన్డీఎస్‌ఎల్ యాజమాన్యం మొక్కుబడిగా క్రషింగ్ నిర్వహిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. మంభోజిపల్లి షుగర్ ఫ్యాక్టరీ సామర్థ్యం రోజుకు 2500 టన్నులు కాగా, ఈ ఏడు ఫ్యాక్టరీ ప్రారంభమై 30 రోజులు గడిచినా నేటికీ కేవలం 47వేల టన్నులు మాత్రమే క్రషింగ్ అయినట్లు తెలుస్తోంది. అలాగే 15 రోజుల్లో బిల్లులు చెల్లించాల్సిఉనప్పటికీ ఇప్పటి వరకు నయాపైసా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము రెండు, మూడు రోజులపాటు ఫ్యాక్టరీ పరిసరాల్లో పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు. తద్వారా చెరకు ఎండిపోయి తూకంలో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. తమకే అప్పగించాలనే ఉద్దేశంతో యాజమాన్యం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. అలాగే పర్మిట్లలో సైతం తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎన్డీఎస్‌ఎల్ ఏజీఎం కృష్ణారెడ్డి మాట్లాడుతూ యంత్రాలు సరిగా పనిచేయక పోవడం వల్లే ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు.
హౌస్ కమిటీ నివేదిక అమలయ్యేనా?
చంద్రబాబు హయాంలో కేవలం రూ.65.40 కోట్లకు మూడు భారీ చెక్కర ఫ్యాక్టరీలను ప్రైవేట్ యాజమాన్యాలకు కట్టబెట్టడంపై అప్పట్లో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి 31-08-2004 నాడు జె.రత్నాకర్‌రావు ఆధ్వర్యంలో 9మంది సభ్యులతో అసెంబ్లీ హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు రెండేళ్లపాటు వివరాలు సేకరించిన కమిటీ 31-08-2006న ఎన్డీఎస్‌ఎల్ ఫ్యాక్టరీలను ప్రభుత్వపరం చేసుకోవాలని నివేదిక సమర్పించినట్లు కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి తెలిపారు. అయితే ఒకవేళ ప్రభుత్వపరం చేసుకుంటే అప్పట్లో తీసుకున్న రూ.65.40 కోట్లు మాత్రమే పరిహారంగా ఇవ్వాలని శశిధర్‌రెడ్డి అభిప్రాయ పడ్డారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ప్యాక్టరీలను స్వాధీనం చేసుకోవాలన్నారు.
నిజాం షుగర్స్ భవితవ్యంపై నిర్ణయం?
Published Thu, Jan 9 2014 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM
Advertisement
Advertisement