సాక్షి, కరీంనగర్ : మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై విజిలెన్స్ విచారణ జరిపించాలన్న ప్రభుత్వ నిర్ణయం అప్పడు విధులు నిర్వహించిన బల్దియా అధికారుల వెన్నులో చలిపుట్టిస్తోంది. 2008కి ముం దు ఉన్న అక్రమ కట్టడాలను క్రమబద్ధం చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించగా ఇదే అదనుగా బల్దియా, టౌన్‌ప్లానింగ్ అధికారులు డబ్బులు దండుకున్నారన్న ఆరోపణలు వినిపించాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో క్రమద్ధీకరణ వ్యవహారంపై జరిగిన విచారణలో భారీగా అక్రమాలు జరిగినట్టు తేలింది.
మిగ తా కార్పొరేషన్ల పరిధిలో కూడా ఇదేవిధంగా అవినీతి జరిగి ఉంటుందని భావించిన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు సిద్ధమయినట్టు తెలిసింది. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వేలాదిగా అక్రమ నిర్మాణాలు జరిగాయి. భవన నిర్మాణాల కోసం వెళితే అధికారులు పెట్టే ఇబ్బందులు, కొర్రీలకు భయపడి అనుమతులు లేకుండానే నిర్మాణాలు పూర్తిచేసుకున్నారు. అక్రమ కట్టడాలను నియంత్రించాల్సిన ప్రణాళిక విభాగం అధికారులు ముడుపులు అందుకుని చూసీచూడనట్టు ఊరుకున్నారు. ముందస్తు అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా కట్టడాలు చేపట్టడం వల్ల బల్దియాల ఆదాయానికి గండిపడింది. బల్దియాలను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా 2008లో రాష్ట్రప్రభుత్వం అక్రమ భవన నిర్మాణాల క్రమబద్ధీకరణ పథకాన్ని (బీపీఎస్) ప్రవేశపెట్టింది. అక్రమంగా భవనాలు నిర్మించుకున్న యజమానులకు ఊరటకల్పించే ఈ స్కీం కింద కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 2,539 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 2009 సెప్టెంబర్ వరకు 1,604 దరఖాస్తులకు అమోదం తెలిపారు. సరైన డాక్యుమెంట్లు లేకపోవడం తదితర కారణాలతో 905 దరఖాస్తులను తిరస్కరించారు.
కమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారి నిర్మాణాలను పూర్తిగా పరిశీలించకుండానే ఆమోదం తెలిపినందుకు భవన యజమానుల నుంచి అధికారులు పెద్ద మొత్తాల్లో ముడుపులు అందుకున్నారని, నిబంధనల ఉల్లంఘనలకు తగ్గట్టుగా జరిమానాలు విధించలేదని అనుమానాలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్ధీకరణ జరగడం వల్ల బల్దియాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయి. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరపాలని, అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవడంతోపాటు క్రమబద్దీకరణలో జరిగిన అక్రమాలను కూడా సవరించాలని భావిస్తుంది. నేడో రేపో విజిలెన్స్ విచారణ ప్రారంభం కానుండడం అటు అధికారులను, ఇటు భవన యజమానులను ఆందోళనకు గురిచూస్తోంది.
అ‘క్రమబద్ధీకరణ’
Published Fri, Sep 27 2013 3:16 AM | Last Updated on Tue, Oct 16 2018 7:27 PM
Advertisement