పెద్దపల్లి, న్యూస్‌లైన్ : మావోయిస్టు పార్టీపై మరో ఏడాది పాటు నిషేధాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న మరో ఆరు సంఘాలపైనా నిషేధం పొడిగించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ర్ట ప్రభుత్వం గతేడాది పొడిగించిన నిషేధం ఉత్తర్వుల గడువు ఈ నెల 17తో ముగియనుంది. దీంతో కొత్త ఉత్తర్వులు ఈ నెల 18 నుంచి 2014 ఆగస్టు 17 వరకు అమలులో ఉంటాయి. రాష్ట్రంలోని పీపుల్స్‌వార్ పార్టీ 2004లో బీహార్ ఎంసీసీతో విలీనమై మావోయిస్టు పార్టీగా అవతరించింది.
అంతకుముందు నుంచే పీపుల్స్‌వార్ పార్టీని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. 1989లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మొదటిసారిగా నిషేధాన్ని విధించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి 1991లో నిషేధాన్ని సడలించారు. ఆ తర్వాత నక్సల్స్ కార్యకలాపాలు జోరందుకున్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. 1992లో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి తిరిగి పీపుల్స్‌వార్ పార్టీపై నిషేధం విధించారు. అప్పటి నుంచి నిషేధం 2004 వరకు విధింపు, సడలింపు కొనసాగింది. 2004లో అప్పటి ప్రభుత్వం పీపుల్స్‌వార్ పార్టీతో శాంతి చర్చలు జరిపింది.
ఓవైపు చర్చలు జరుగుతుండగా మరోవైపు పలుచోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెండో దఫా శాంతిచర్చలను విరమించుకుంది. అదే సంవత్సరం పీపుల్స్‌వార్ పార్టీ విలీనంతో మావోయిస్టు పార్టీగా అవతరించింది. దీంతో 2004 ఆగస్టు 8న కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీపై దేశవ్యాప్తంగా నిషేధాన్ని విధించింది. ప్రతి సంవత్సరం ఈ నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఒకప్పుడు మావోయిస్టు పార్టీ కార్యకలాపాలకు అడ్డాగా ఉన్న జిల్లాలో అనేక సంఘటనలు జరిగాయి. విప్లవోద్యమాల చరిత్రలో చెరగని ముద్ర వేసిన జిల్లా ప్రజల్లో మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం పొడిగించడం చర్చనీయాంశంగా మారింది.
మరో ఆరు సంఘాలపై..
మావోయిస్టు పార్టీతోపాటు మరో ఆరు అనుబంధ సంఘాలపై కూడా ఏడాది నిషేధం పొడిగించింది. మావోయిస్టు పార్టీతోపాటు సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస), విప్లవ కార్మిక సమాఖ్య(వికాస), ఆలిండియా రివల్యూషనరీ స్టూడెంట్ ఫెడరేషన్(ఏఐఆర్‌ఎస్‌ఎఫ్), రాడికల్ స్టూడెంట్ యూనియన్(ఆర్‌ఎస్‌యూ), రైతు కూలీ సంఘం(ఆర్‌సీఎస్), రాడికల్ యూత్ లీగ్(ఆర్‌వైఎల్) నిషేధం విధించిన సంఘాల జాబితాలో ఉన్నాయి. ఇవి చట్ట వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడుతున్నందున నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ఆ ప్రకటనలో పేర్కొంది. మావోయిస్టులతోపాటు అనుబంధ సంఘాలకు సహకరించిన వారిపైనా చట్టపరమైన, కఠిన శిక్షలుంటాయని హెచ్చరించింది.
మరో ఏడాది
Published Fri, Aug 9 2013 3:08 AM | Last Updated on Tue, Oct 16 2018 2:39 PM
Advertisement