
బంగారు తల్లీ.. మోసపోతున్నావా చెల్లీ!
- బంగారు తల్లికి బ్రేక్..ఆ స్థానంలో
- ‘మహాలక్ష్మి’ పథకం అమలుకు ప్రభుత్వ నిర్ణయం
- మూడేళ్లలో మూడుసార్లు పథకం పేర్లు, విధివిధానాలు మార్పు
- పథకం మార్చిన ప్రతిసారీ ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులు
- ‘సీమ’లో బాలికా సంరక్షణ పథకం పెండింగ్ దరఖాస్తులే 12,425
- బంగారు తల్లి దరఖాస్తులదీ అదే పరిస్థితి...
సాక్షి, చిత్తూరు: బంగారుతల్లి పథకం పేరు మారనుంది. ఆడబిడ్డలకు అండగా ఉండేం దుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రవేశపెట్టిన ‘బాలికా సంరక్షణ పథకాన్ని’ ‘బంగారుతల్లి’గా గత ఏడాది అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మార్పు చేశారు. దీంతో అప్పటి వరకూ అమలవుతున్న బాలికాసంరక్షణ పథకం అటకెక్కింది. అప్పటికే దరఖాస్తు చేసుకుని ఉన్న వారికి అన్యాయం జరిగింది. సరిగ్గా గత ఏడాది జూలై ఒకటిన ప్రారంభమైన బంగారుతల్లి పథకాన్ని ఏడాది గడవకముందే ‘చంద్రబాబు’ ప్రభుత్వం ఎత్తేసేం దుకు రంగం సిద్ధం చేసింది. ఆ స్థానంలో ‘మహాలక్ష్మి’ పేరుతో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత బుధవారం ప్రకటన కూడా చేశారు. దీంతో ‘బంగారుతల్లి’ లబ్ధిదారులు, దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంది.
భ్రూణ హత్యల నివారణ కోసం మొదలైన పథకం:
ఆడపిల్ల పుట్టడం భారమని భావించే కుటుంబాల్లో స్వాంతన కల్గించి, వారికి ఆర్థికంగా అండగా నిలిచి, తద్వారా భ్రూణ హత్యలను నివారించేందుకు 2005 ఏప్రిల్ 1న ‘బాలికాసంరక్షణ పథకాన్ని’ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 11వ తేదీ త ర్వాత ఒకరు లేదా ఇద్దరు ఆడపిల్లలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారు. ఈ పథకానికి అర్హులు. ఒక ఆడపిల్లకే ఆపరేషన్ చేయించుకుంటే లక్ష రూపాయలు, ఇద్దరికైతే చెరో 30వేల రూపాయలను ఈ పథకం ద్వారా అందిస్తారు.
ఈ బాండ్లకు పూచీ ఎవరో?
గత ఏడాది జూలై 1 నుంచి ‘బంగారుతల్లి పథకం’ అమలవుతోంది. దీంతో అప్పటివరకూ బాలికా సంరక్షణ పథకం కింద వచ్చిన దరఖాస్తులను కిరణ్ ప్రభుత్వం చెత్తబుట్టలో పడేసింది. 2013 మార్చి 31వరకూ రాయలసీమలో 12,425 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ 2010-11, 11-12లో దరఖాస్తు చేసుకున్నవి. నిబంధనల మేరకు వీటన్నిటికి దరఖాస్తు చేసుకున్న ఆర్థిక సంవత్సరంలోనే బాండ్లు అందించాలి. కానీ అలా జరగలేదు. గత ఏడాది మార్చి 31న బాలికాసంరక్షణ పథకాన్ని కిరణ్ ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటివరకూ బాండ్లు అందకుండా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా రద్దు చేయాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు వాటికి బాండ్లు ఇవ్వలేదు. ఇదేంటని అప్పట్లో ప్రశ్నిస్తే బర్త్ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్ సరిగాలేవని, కంప్యూటర్‌లో పేర్ల నమోదు తప్పుగా నమోదయ్యాయని కుంటిసాకులు చెప్పారు. దీంతో 12,425 మంది దరఖాస్తుదారులు తీవ్రంగా నష్టపోయారు. ఆపై 2013 మే 1 నుంచి పుట్టిన పిల్లలకు మాత్రమే ‘బంగారుతల్లి’ని వర్తింపజేశారు.
ఇప్పుడు ‘బంగారు తల్లి’ లబ్ధిదారులకు ఇక్కట్లు
2013 మే 1నుంచి పుట్టిన బిడ్డలకు ‘బంగారుతల్లి’ పథకం వర్తింపజేశారు. ఈ పథకం నిర్వహణను ఐసీడీఎస్, డీఆర్‌డీఏలకు సంయుక్తంగా అప్పగించారు. గత ఏడాది మే 1నుంచి జూన్ 23 వరకూ పుట్టిన ఆడబిడ్డల వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే బిడ్డతల్లికి తొలిదశలో 2,500 రూపాయలు చెల్లించారు. అయితే ఈ బాధ్యతను ఏఎన్‌ఎంలకు, జననాల సర్వే బాధ్యత అంగన్‌వాడీ కార్యకర్తలకు, బాలికల వివరాల నమోదు బాధ్యత వీఆర్వోలకు అప్పగించారు. దీంతో శాఖల మధ్య సమన్వయం లేక వచ్చిన ద రఖాస్తుల్లో 20-30 శాతం మందికి కూడా బాండ్లు అందలేదు. దాదాపు 70 శాతం దరఖాస్తులకు ఇంకా బాండ్లు అందించాల్సి ఉంది. రాయలసీమలో ‘బంగారుతల్లి’ ద్వారా 3500 దరఖాస్తులకు బాండ్లు అందించాల్సి ఉంది.
‘మహాలక్ష్మి’తో మరిన్ని చిక్కులు
‘బంగారుతల్లి’ ద్వారా బిడ్డ పుట్టినప్పటి నుంచి డిగ్రీ పట్టా పొందే వరకూ డబ్బులు తల్లి ఖాతాలో జమ చేస్తారు. మహాలక్ష్మి పథకం ప్రవేశపెడితే బాండ్లు పొందిన వారికి ఏ పథకం అమలవుతుంది? అసలు అమలవుతుందా? లేదా? అని లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ఎందుకంటే ‘బంగారుతల్లి’ ప్రవేశంతో ‘బాలికాసంరక్షణ’ బాండ్లు బుట్టదాఖలయ్యాయి. అదే పరిస్థితి ఇప్పుడు తలె త్తే ప్రమాదం ఉంది. పథకాల మార్పు వల్ల 2010 నుంచి లబ్ధిదారులకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. వీటికి ‘మహాలక్ష్మి’ కష్టాలు తోడవనున్నాయి.