Bangaru Talli Scheme
-
కల్యాణలక్ష్మికి ప్రాచుర్యమేది?
ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన బంగారు తల్లి పథకంలో భాగంగా అన్ని కులాల్లో ఉన్న పేద వర్గాలకు పెళ్లి చేసుకునే సమయంలో ప్రభుత్వం నుండి కొద్దిమేర ఆర్థిక సహాయం లభించేది. రాష్ట్రాల విభజనతో తెలంగాణలో కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం ఏర్పడి పాత పథకాలను రద్దు చేసి కొన్ని కులాలకే పరిమితమయ్యే కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. రూ.2,00,00 ఆదాయం లోపు ఉన్న పేద వర్గాలకు మైనార్టీ వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు రూ.51,116లు నజరానాగా అందించాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు కానీ, ఈ పథకానికి సరైన ఆదరణ లభించడంలేదు. వేల మంది దరఖాస్తు చేసుకున్నా సరైన సమయంలో వారికి అందడంలేదు. కొందరి ‘0’ బ్యాలెన్స్ ఖాతాలకు ఇవి పడటంలేదు. సేవింగ్ ఖాతాలున్న వారికే ఈ స్కీం వర్తిస్తుందని అధికారులు మెలికలు పెడుతున్నారు. బడ్జెట్లో ఈ పథకానికి డబ్బులు కేటాయించినా శాఖల నిర్వాహకులు, అధికారుల మధ్య సమన్వయం లేక ఈ పథకానికి కేటాయించిన డబ్బులు మురిగిపోతున్నాయి. ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి ఈ పథకానికి సరైన అధికారులను కేటాయించి, దరఖాస్తు చేసుకున్న వారికి సరైన సమయంలో డబ్బులు అందేలా ఈ పథకాన్ని అన్ని కులాల పేద వర్గాలకు విస్తరించేలా, ఈ పథకాన్ని అన్ని మండల, మున్సిపల్ కేంద్రాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. అప్పుడే ఈ పథకానికి సరైన అవకాశం ఇచ్చినట్లవుతుంది. - జైని రాజేశ్వర్‌గుప్త కాప్రా, హైదరాబాద్ -
‘బంగారు తల్లి’కి నిధులేవి?
సాక్షి, హైదరాబాద్: ఆడపిల్లల జీవితాలకు భద్రత కల్పించే ఉద్దేశంతో రూపొందించిన ‘బంగారు తల్లి’ పథకానికి బడ్జెట్ కరువైంది. తెలంగాణలో భ్రూణ హత్యలను నివారించడంతోపాటు ఆడపిల్లలను ప్రోత్సహించే నిమిత్తం గత ఏడాది మేలో అప్పటి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అంతటితో ఊరుకోకుండా గత ఏడాది జూన్ 19న బంగారు తల్లి పథకానికి ప్రత్యేకంగా సాధికారత చట్టాన్ని తీసుకొచ్చింది. పుట్టినప్పటి నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకునే వరకు వివిధ దశల్లో ఆడపిల్లలకు ఆర్థికంగా సాయం అందించడమే ఈ పథకం లక్ష్యం. అయితే రాష్ట్ర విభజన అనంతరం వచ్చి న కొత్త ప్రభుత్వం ఈ పథకానికి తాజా బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. దీంతో ఈ పథకం కింద ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎదురుచూపులు తప్పడం లేదు. చట్టంగా రూపుదిద్దుకున్న బంగారు తల్లి పథకం అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సంబంధిత అధికారుల్లోనూ స్పష్టత లేకపోవడంతో లబ్ధిదారులకు నిరాశ తప్పడం లేదు. బంగారు తల్లి పథకం కింద పేద కుటుంబంలో గర్భవతులకు కాన్పు అయ్యే వరకు నెలకు రూ. వెయ్యి చొప్పున, ఆడపిల్ల జన్మిస్తే వెంటనే 2500 రూపాయలను ప్రభుత్వం చె ల్లిస్తుంది. ఐదేళ్లు వచ్చేవరకు అంగన్వాడీ ద్వారా రూ. 1500 చొప్పున చెల్లిస్తారు. పాఠశాల్లో చేరిన రోజున రూ. వెయ్యి, ఐదో తరగతి వరకు ప్రతి సంవత్సరం రూ. 2 వేల చొప్పున, ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఏటా రూ. 2500, తర్వాత పది వరకు రూ. 3000, ఇంటర్మీడియట్ సమయంలో ఏటా రూ. 3500, డిగ్రీ చదువుకునేపుడు ప్రతి ఏటా రూ. 3000 అంది స్తుంది. 21 ఏళ్ల తర్వాత ఇంటర్‌తో చదువు ఆపిన బాలిక లకైతే రూ. 50 వేలు, డిగ్రీ పూర్తి చేసిన వారికి రూ. లక్ష రూపాయలను ప్రభుత్వం ఆర్థికసాయంగా అందజేస్తుంది. 2020 నాటికి 80 లక్షల మంది బాలికలకు, 18 లక్షల మంది కొత్తగా జన్మించిన పిల్లలకు సాయం అందించాలన్నది ఈ పథకం ప్రధాన లక్ష్యం. అయితే ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కే టాయించకపోవడంతో సుమారు లక్ష మంది బంగారు తల్లులకు ఆర్థికసాయం అందడం లేదు. ఇప్పటివరకు మొత్తం 1,68,055 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 72,869 మందికి మొదటి విడత సొమ్ము మాత్రమే అందింది. మిగతా చెల్లింపులన్నీ ఆగిపోయాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 70,021 దరఖాస్తులు రాగా, వీరికి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించలేదు. మరోవైపు పాతవారికే ఇంకా సాయం అందనందున, కొత్తగా దరఖాస్తులు స్వీకరించేందుకు సంబంధిత ప్రభుత్వ విభాగాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఫలితంగా ‘బంగారు తల్లి’ పథకంపై ఆడపిల్లల తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యే పరిస్థితి నెలకొంది. -
‘బంగారు తల్లి’పై దుమారం
* పథకం కొనసాగింపుపై స్పష్టత కోరిన ప్రతిపక్షం * ఇంకా దృష్టి పెట్టలేదని ఆర్థికమంత్రి సమాధానం.. కాంగ్రెస్ నిరసన * ‘కళ్యాణ లక్ష్మి’ కింద పెళ్లి రోజే రూ. 51 వేలు అందిస్తామన్న ఈటెల సాక్షి, హైదరాబాద్: మైనారిటీ తీరిన (18 ఏళ్లు నిండిన) ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతులకు కళ్యాణ లక్ష్మి పథకం వర్తిస్తుందని, డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చే కుల, ఆదాయ పరిమితి సర్టిఫికెట్ తో పెళ్లికి నెల రోజుల ముందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ పథకానికి రూ. 2 లక్షల ఆదాయ పరిమితి విధించామని, దరఖాస్తు చేసుకున్న వారికి పెళ్లి రోజే కట్నంగా రూ. 51 వేలు అందజేస్తామని చెప్పారు. అక్టోబర్ 2 నుంచే పథకాన్ని ప్రారంభించామని, ఇప్పటికే ప్రభుత్వానికి దరఖాస్తులు కూడా అందుతున్నాయని తెలిపారు. పథ కం కింద అర్హులైన వారు గుడిలో, చర్చిలో లేదా ఎక్కడపెళ్లి చేసుకున్నా పథకం వర్తిస్తుందన్నారు. అర్హత కలిగిన వధువు కులాంతర వివాహం చేసుకున్నా పథకం వర్తిస్తుందన్నారు. ప్రభుత్వం తరఫున సామూహికంగా వివాహాలు జరిపించే ఆలోచన ఉందన్నారు. మైనార్టీ జనాభాపై స్పష్టత వచ్చిన అనంతరం ఈ పథకాన్ని బీసీ, సంచార జాతులకు సైతం అమలు చేసే విషయమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి సహా ప్రజాప్రతినిధులందరూ పెళ్లి పందిట్లోకి వెళ్లి నేరుగా డబ్బును అందజేసేలా కార్యాచరణ ఉంటుందన్నారు. అంతకుముందు ఆడబిడ్డల సంక్షేమం కోసం కాంగ్రెస్ హయాం లో చేపట్టిన ‘బంగారుతల్లి’ పథకం కొనసాగింపుపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేసింది. బంగారు తల్లి పథకం గత ప్రభుత్వం తోనే పోయిందని ఒకమారు, ఆ పథకంపై ప్రభుత్వం దృష్టి సారించలేదంటూ ఇంకోమారు ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాధానంపై కాంగ్రెస్ నిరసన తెలియజేసింది. ఈ పథకంపై మరింత స్పష్టత ఇవ్వాలని, మార్గదర్శకాలను సరళీకృతం చేయాలని, కులాంతర వివాహాలకు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తారో తెలియజేయాలని ఆపార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. కళ్యాణలక్ష్మి పథకానికి తాము మద్దతిస్తున్నామని, అయితే బాలికల అభివృద్ధి కోసం తెచ్చిన బంగారుతల్లి మాటేమిటని కాంగ్రె స్ ఎమ్మెల్యే డీకే అరుణ ప్రశ్నించారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్షనేత జానారెడ్డి కోరా రు. కళ్యాణలక్ష్మి కన్నా బంగారు తల్లి మంచి పథకమని, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఎర్రబెల్లి దయాకర్‌రావు(టీడీపీ) డిమాండ్ చేశారు. దీనికి ఈటెల సమాధానమిస్తూ.. ‘బంగారు తల్లి పథకంపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. అది కొనసాగుతున్నట్లుగా ఉంది. అలా ఏమైనా ఉంటే దాన్ని మరింత మెరుగ్గా అమలు చేస్తాం’ అని చెప్పారు. మంత్రి సమాధానం అసంబద్ధంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించడంతో మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఈ అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికిప్పుడే సమాధానం చెప్పడమంటే సాధ్యం కాదని అన్నారు. దీనికి జానారెడ్డి స్పందిస్తూ.. ‘కళ్యాణలక్ష్మి పథ కం పెట్టి బంగారుతల్లి పథకాన్ని తొలగిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వనందుకు మా నిరసన తెలుపుతున్నాం. ఈఅంశాన్ని మరోరూపంలో ప్రస్తావి స్తాం’ అని చెప్పారు. కాంగ్రెస్ నిరసనపై మంత్రి హరీశ్‌రావు, ఈటెల తమ అభ్యంతరాన్ని తెలియజేశారు. -
బంగారు తల్లికి బెంగ
ఆడపిల్లంటే సమాజంలో ఇప్పటికీ చిన్నచూపే. నగరాలు, పట్టణాల్లో పరిస్థితి కొంత మారుతున్నా.. గ్రామాల్లో ఇప్పటికీ ఆడపిల్లను గుదిబండగా భావిస్తున్నారు. పెంచి, చదివించి, పెళ్లి చేయడం ఆర్థిక భారమన్న భావన తల్లిదండ్రుల్లో పాతుకుపోయింది. ఈ అపవాదును పోగొట్టి ఆడపిల్ల పెళ్లీడుకు వచ్చేనాటికి ఆర్థిక ఆలంబన కల్పించి.. ఆమెను బంగారు తల్లిగా మార్చేందుకు ఉద్దేశించిన బంగారు తల్లిపథకాన్ని కొత్త ప్రభుత్వం దాదాపు మూలన పడేసింది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో పథకం పేరు మార్చి కొనసాగిస్తామని ప్రకటించినా.. అదీ చేయకుండా.. ఇప్పటికే ఉన్న లబ్ధిదారులకు నిధులు మంజూరు చేయకుండా పథకాన్ని..దానిపై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులను డోలాయమానంలో పడేసింది. ఈ నేపథ్యంలో జిల్లా ఈ పథకం స్థితిగతులపై ‘సాక్షి’ ప్రొగ్రెస్ రిపోర్ట్.. వీరఘట్టం, కోటబొమ్మాళి: బంగారు తల్లి పథకం కొనసాగుతుందా లేదా అన్న బెంగ పేద తల్లిదండ్రులను వేధిస్తోంది. పేదవర్గాలకు చెందిన ఆడపిల్లలు పెళ్లీడుకు వచ్చేనాటికి ఆర్థిక ఆసరా కల్పించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం 2013 మే ఒకటో తేదీన అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆస్పత్రిలో కాన్పు అయిన వెంటనే దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారిని లబ్ధిదారులుగా గుర్తించి తొలివిడతగా పాప పేరిట బ్యాంకు ఖాతాల్లో రూ.2500 జమ చేస్తారు. అక్కడి నుంచి ప్రతి ఏటా విడతల వారీగా నగదు జమ చేస్తూ 21 ఏళ్లు వచ్చేనాటికి గరిష్టంగా రూ.2.16 లక్షలు అందజేస్తారు. పథకం ప్రారంభమై ఈ ఏడాది మే ఒకటో తేదీకి ఏడాది గడిచిపోయినా లబ్ధిదారుల ఖాతాలకు రెండో ఏడాది జమ చేయాల్సిన సొమ్ము విడుదల చేయలేదు. కొత్త దరఖాస్తుదారులనూ పట్టించుకోవడం లేదు. జిల్లాలోని 38 మండలాల్లో ఇప్పటివరకు 13,931 మంది ఈ పథకం కింద పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరిలో 659 మందిని అనర్హులుగా గుర్తించారు. మిగిలిన వారిలో 6637 మంది ఖాతాలకు రూ.2500 చొప్పున జమ చేశారు. ఇందులోనూ 5688 మందికే సర్టిఫికెట్లు(బాండ్లు) అందాయి. మిగతావారు బాండ్ల కోసం ఇప్పటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈలోగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మిగిలిన 6635 మంది దరఖాస్తుదారులకు పథకం మంజూరు నిలిచిపోయింది. మార్చి నుంచి నిధులు నిలిచిపోయాయి. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పథకం పేరును మా ఇంటి మహాలక్ష్మిగా మార్చి కొనసాగిస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఉ న్న లబ్ధిదారులకు 5 నెలలుగా నిధులు కూడా ఇవ్వలేదు. అధికారులను అడిగితే తమకు ఉత్తర్వు లు లేవంటున్నారు. ఇప్పటికైనా సర్కారు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఇదీ పథకం లక్ష్యం ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తు కల్పించేం దుకు ఈ పథకాన్ని నిర్దేశించారు. ఆడపిల్ల పుట్టిన వెంటనే తగిన ధ్రువపత్రాలతో పేదవర్గాల వారు దరఖాస్తు చేసుకుంటే అర్హతలను గుర్తించి వెంటనే ఆ పాప పేరిట బ్యాంకు ఖాతాలో రూ.2500 జమ చేస్తారు. టీకాలు అన్నీ సక్రమంగా వేయిస్తే రెండో ఏడాది వెయ్యి రూపాయలు జమ చేస్తారు. ఆ తర్వాత చదువు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని విడతల వారీగా నగదు జమ చేస్తూ ఆడపిల్లకు 21 ఏళ్లు.. అంటే పెళ్లి వయసు వచ్చేనాటికి గరిష్టంగా రూ.2.16 లక్షలు ఆ కుటుంబానికి అందించాలన్నది లక్ష్యం. అత్యధికంగా రణస్థలంలో.. పథకం మంజూరుకు దరఖాస్తు చేయడంలో రణస్థలం అగ్రస్థానంలో ఉంది. ఈ మండలం నుంచి 668 మంది దరఖాస్తు చేయగా.. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా గార(637), ఎచ్చెర్ల(570), రేగిడి(559), లావేరు(538), కోటబొమ్మాళి(519), వీరఘట్టం(507) మండలాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం తెల్లకార్డు కలిగిఉన్న పేదవర్గానికి చెందిన వారికి తొలి రెండు కాన్పుల్లో ఆడపిల్లలు పుడితే బంగారు తల్లి పథకం కింద లబ్ధి పొం దే అవకాశం ఉండటంతో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కొద్ది నెలల క్రితం వరకు ప్రజలు ఆసక్తి చూపేవారు. అయితే అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ పథకా న్ని పట్టించుకోకపోవడం.. కొన్ని నెలలుగా డబ్బులు కూడా జమ కాకపోవడంతో కొన్నాళ్లుగా రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి. నిధులు విడుదల కాలేదు ఎస్.తనూజారాణి, పీడీ, డీఆర్డీఏ జిల్లా వ్యాప్తంగా బంగారుతల్లి పథకం కోసం అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నాం. వెంటనే ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. అయితే పథకానికి ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. అందువల్ల ఇప్పటివరకు గుర్తించిన లబ్ధిదారులకు ఖాతాలకు సొమ్ము జమ చేయలేకపోతున్నాం. పథకం పేరును మా ఇంటి మహా లక్ష్మిగా మార్చుతున్నట్లు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ప్రభుత్వ నిర్ణ యం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. దరఖాస్తుకే బోలెడు తంతు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకోవడమే పెద్ద తంతు. ఆడపిల్ల పుట్టిన వెంటనే వైద్య సిబ్బంది ఇచ్చే కాన్పు ధ్రువపత్రం, ఆ తర్వాత జనన ధ్రువపత్రం తీసుకోవాలి. గ్రామైక్య సంఘం వద్ద మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాటితోపాటు తెల్ల రేషన్‌కార్డు, ఆధార్ కార్డు, మరికొన్ని పత్రాలు జతచేసి ఐకేపీ కార్యాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయడానికి రూ. 3 వేల వరకు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. ఆడపిల్ల పుడితే బంగారుతల్లి పథకం ద్వారా డబ్బులు వస్తాయన్నారు. ఎంతో ఆశతో దరఖాస్తు చేశాం. తీరా 5 నెలల తర్వాత లిస్టులో నాపేరు లేదన్నారు. నాలుగు నెలలు క్రితం మళ్లీ దరఖాస్తు చేశాను. అయినా ఇంతవరకు బాండ్ రాలేదు. -భోగాది భారతి, వీరఘట్టం పాప పుట్టిన వెంటనే బంగారుతల్లి పథకానికి దరఖాస్తు చేశాను. కానీ ఇంతదాకా ఒక్క రూపాయి కూడా బ్యాంకులో జమకాలేదు. అధికారులను అడిగితే అదిగో వచ్చేస్తాది .. ఇదిగో వచ్చేస్తాది అంటున్నారు. - కసింకోట సంతు, వీరఘట్టం గత సంవత్సరంలో జూన్‌లో పాప పుట్టింది. బంగారుతల్లికి దరఖాస్తు చేస్తే వెంటనే బ్యాంక్ ఖాతాలో రూ.2500 పడుతుందని అధికారులు చెప్పారు. ఏడాదైనా పైసా రాలేదు -మయిగాపు చంద్ర, వీరఘట్టం -
బాలారిష్టాల్లో ‘బంగారు తల్లి’
చేవెళ్ల రూరల్: బాలికలపై వివక్ష, భ్రూణ హత్యలను నివారించి బాలికాభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బంగారు తల్లి పథకం ఆది నుంచీ బాలారిష్టాలనే ఎదుర్కొంటోంది. గతంలో ఉన్న బాలికా శిశు సంరక్షణ పథకాన్ని మరిపించేలా 2013 జూలైలో చట్టబద్ధత కల్పిస్తూ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. 2013 మే నుంచి పుట్టిన ప్రతి ఆడబిడ్డకూ ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. పథకం ఏర్పాటులో ఆశయాలు గొప్పగానే ఉన్నా ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. వందలాది మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకుంటున్నా.. లబ్ధి పొందుతున్న వారు మాత్రం పదుల సంఖ్యలో ఉంటున్నారు. ఈ పథకంలో ఆడపిల్ల పుట్టిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూ.2500 వారి ఖాతాలో జమ చేస్తారు. ఆ తర్వాత విడతల వారీగా ప్రతి ఏటా ఆడపిల్ల చదువుకు నిధులు కేటాయించాలనేది దీని లక్ష్యం. మొత్తం రెండు లక్షల 16వేల రూపాయలు బంగారుతల్లి పథకం కింద లబ్ధి చేకూరుతుంది. మండలంలో మొత్తం 30 గ్రామ పంచాయతీల్లో ఎంతో మంది ఆడబిడ్డలు జన్మించారు. కాగా వారిలో ఇప్పటివరకు దాదాపు 438 మంది వరకు లబ్ధిదారులు బంగారుతల్లి పథకానికి దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో ఇప్పటి వరకు కేవలం 180 మందికి మాత్రమే పథకం మొదటి సంవత్సరం కింద నిధులను మంజూరు చేశారు. వీరికి రెండో విడత నిధులు మాత్రం ఇప్పటికీ ఊసేలేదు. మిగిలిన వారు దరఖాస్తులు చేసుకోగా.. ఆన్లైన్లో నమోదు చేసి ఏడాది గడిచినా బంగారు తల్లి పథకం భరోసా కల్పించటం లేదు. నిధులు లేమి కారణంతో ఏ ఒక్క లబ్ధిదారుకూ ప్రయోజనం చేకూరడంలేదు. ఆడపిల్లలను కన్నవారు బంగారు తల్లి పథకానికి దరఖాస్తులు చేసుకునేందుకు వెలుగు కార్యాలయానికి వస్తూనే ఉన్నారు. పథకం అమలు ద్వారా ఎంతో విశ్వాసంతో బంగారు తల్లుల భవిష్యత్‌పై భరోసా ఏర్పడుతుందని భావించిన తల్లిదండ్రులకు నిరాశే మిగులుతోంది. ఇదిలా ఉంటే.. నిధుల లేమి పేరుతో అర్హులైన దరఖాస్తుదారులకు చాలామందికి మొదటి విడత నిధులు అందకపోవడంతో పాటు మొదటి విడత ప్రయోజం పొందిన కొంతమందికి రెండో విడుత నిధుల మంజూరు ఆచూకే లేకుండా పోయింది. బంగారు తల్లి పథకం అమలుతో గతంలోని బాలికా సంరక్షణ పథకం కూడా లేకపోవటంతో పేద, మధ్యతరగతికి చెందిన ఆడపిల్లల తల్లిదండ్రులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని బంగారుతల్లి పథకం లబ్ధిదారులు కోరుతున్నారు. రిజిస్ట్రేషన్లు చేస్తూనే ఉన్నాం... బంగారు తల్లి పథకానికి సంబంధించిన దరఖాస్తులు వస్తున్నాయి. వాటిని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేస్తూనే ఉన్నాం. నిధుల విషయం ప్రభుత్వానికే తెలుసు. ఇప్పటివరకు 438 మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోగా.. వాటిలో 180 వరకు గ్రౌండింగ్ అయ్యాయి. నిధులు వచ్చిన వెంటనే లబ్ధిదారుల అకౌంట్లలో నేరుగా జమ చేస్తాం. - మంజులవాణి, ఏపీఎం, చేవెళ్ల -
బంగారుతల్లికి భరోసా ఏదీ?
►ఖాతాల్లో జమ కాని డ బ్బులు ►దరఖాస్తు చేసుకున్నా కొందరికే బాండ్లు ►ఆందోళనలో లబ్ధిదారులు.. మంచిర్యాల టౌన్ : ‘బంగారుతల్లి’కి భరోసా కరువైంది. ఆడపిల్లలపై వివక్షను రూపుమాపేందుకు ఆర్భాటంగా ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకం సక్రమంగా అమలు కావడం లేదు. లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. లబ్ధిదారులను మున్సిపాల్టీల వారీగా ఎంపిక చేయడంతోపాటు జిల్లాలోని మండలాలను ఆదిలాబాద్, ఉట్నూర్ డివిజన్లుగా విభజించారు. ఆదిలాబాద్ రూరల్ పరిధిలో 32 మండలాలు, ఉట్నూర్ పరిధిలో 20 మండలాలు చేర్చి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. జిల్లాలోని ఆదిలాబాద్, బెల్లంపల్లి, భైంసా, కాగజ్‌నగర్, మంచిర్యాల, మందమర్రి, నిర్మల్ మున్సిపాల్టీల పరిధిలో బంగారుతల్లి పథకం కోసం 2,355 మంది ఐకేపీ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. వీరందరినీ అర్హులుగా గుర్తించారు. గత ఏడాది జూలై నుంచి ఇప్పటివరకు అర్హుల్లో 761 మందికి మాత్రమే బాండ్లు అందాయి. వీరిలో సుమారు 400 మంది ఖాతాల్లోనే మొదటి దఫా నగదు జమ అయింది. మిగితా వారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. అయినా ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ పథకంలో పేరు నమోదు చేసుకుని ఏడాది గడుస్తున్నా 1,594 మందికి బాండ్లు అందకపోవడం గమనార్హం. 361మంది ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో పథకంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ రూరల్ పరిధిలోని మండలాల్లో 7,082 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 3,858 మంది లబ్ధిపొందారు. మిగితా వారు లబ్ధి కోసం ఎదురు చూస్తున్నారు. ఉట్నూర్ రూరల్ పరిధిలో 5,193 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,427 మందికి బాండ్లు అందాయి. 2,766 మందికి ఎదురుచూపులే మిగిలాయి. మంచిర్యాల పట్టణంలో 184 మంది దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ కాలేదు. దీంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఖాతాల్లో డబ్బు జమ చేయాలని కోరుతున్నారు. పథకం అమలు తీరు ఇలా.. జననీ సురక్ష యోజన, సుఖీభవ, రాజీవ్ విద్యాదీవెన వంటి పథకాలతో ఎలాంటి సంబంధం లేకుండా బంగారుతల్లి పథకాన్ని రూపొందించారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారికి నెల రోజుల వ్యవధిలో రూ.2,500 అందించాలి. బాలిక మొదటి పుట్టిన రోజు తర్వాత టీకాల ఖర్చుల కోసం రూ.వెయ్యి అందజేయాలి. మూడు నుంచి ఐదేళ్ల వరకు అంగన్వాడీ కేంద్రంలో చేరే వారికి ఏటా రూ.1,500 చొప్పున, ఆరు నుంచి పదేళ్ల వరకు ఏటా రూ.2,500, 14ఏళ్ల నుంచి 17ఏళ్ల వరకు ఏటా రూ.3,500, 18ఏళ్ల నుంచి 21ఏళ్ల వరకు ఏటా రూ.4వేలు అందిస్తారు. ఇలా 21ఏళ్లు నిండేసరికి ఒక్కొక్కరికి రూ.1.55లక్షలు ఆర్థికసాయం అందుతుంది. -
బంగారు తల్లీ.. మోసపోతున్నావా చెల్లీ!
- బంగారు తల్లికి బ్రేక్..ఆ స్థానంలో - ‘మహాలక్ష్మి’ పథకం అమలుకు ప్రభుత్వ నిర్ణయం - మూడేళ్లలో మూడుసార్లు పథకం పేర్లు, విధివిధానాలు మార్పు - పథకం మార్చిన ప్రతిసారీ ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులు - ‘సీమ’లో బాలికా సంరక్షణ పథకం పెండింగ్ దరఖాస్తులే 12,425 - బంగారు తల్లి దరఖాస్తులదీ అదే పరిస్థితి... సాక్షి, చిత్తూరు: బంగారుతల్లి పథకం పేరు మారనుంది. ఆడబిడ్డలకు అండగా ఉండేం దుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రవేశపెట్టిన ‘బాలికా సంరక్షణ పథకాన్ని’ ‘బంగారుతల్లి’గా గత ఏడాది అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మార్పు చేశారు. దీంతో అప్పటి వరకూ అమలవుతున్న బాలికాసంరక్షణ పథకం అటకెక్కింది. అప్పటికే దరఖాస్తు చేసుకుని ఉన్న వారికి అన్యాయం జరిగింది. సరిగ్గా గత ఏడాది జూలై ఒకటిన ప్రారంభమైన బంగారుతల్లి పథకాన్ని ఏడాది గడవకముందే ‘చంద్రబాబు’ ప్రభుత్వం ఎత్తేసేం దుకు రంగం సిద్ధం చేసింది. ఆ స్థానంలో ‘మహాలక్ష్మి’ పేరుతో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత బుధవారం ప్రకటన కూడా చేశారు. దీంతో ‘బంగారుతల్లి’ లబ్ధిదారులు, దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంది. భ్రూణ హత్యల నివారణ కోసం మొదలైన పథకం: ఆడపిల్ల పుట్టడం భారమని భావించే కుటుంబాల్లో స్వాంతన కల్గించి, వారికి ఆర్థికంగా అండగా నిలిచి, తద్వారా భ్రూణ హత్యలను నివారించేందుకు 2005 ఏప్రిల్ 1న ‘బాలికాసంరక్షణ పథకాన్ని’ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 11వ తేదీ త ర్వాత ఒకరు లేదా ఇద్దరు ఆడపిల్లలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారు. ఈ పథకానికి అర్హులు. ఒక ఆడపిల్లకే ఆపరేషన్ చేయించుకుంటే లక్ష రూపాయలు, ఇద్దరికైతే చెరో 30వేల రూపాయలను ఈ పథకం ద్వారా అందిస్తారు. ఈ బాండ్లకు పూచీ ఎవరో? గత ఏడాది జూలై 1 నుంచి ‘బంగారుతల్లి పథకం’ అమలవుతోంది. దీంతో అప్పటివరకూ బాలికా సంరక్షణ పథకం కింద వచ్చిన దరఖాస్తులను కిరణ్ ప్రభుత్వం చెత్తబుట్టలో పడేసింది. 2013 మార్చి 31వరకూ రాయలసీమలో 12,425 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ 2010-11, 11-12లో దరఖాస్తు చేసుకున్నవి. నిబంధనల మేరకు వీటన్నిటికి దరఖాస్తు చేసుకున్న ఆర్థిక సంవత్సరంలోనే బాండ్లు అందించాలి. కానీ అలా జరగలేదు. గత ఏడాది మార్చి 31న బాలికాసంరక్షణ పథకాన్ని కిరణ్ ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటివరకూ బాండ్లు అందకుండా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా రద్దు చేయాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు వాటికి బాండ్లు ఇవ్వలేదు. ఇదేంటని అప్పట్లో ప్రశ్నిస్తే బర్త్ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్ సరిగాలేవని, కంప్యూటర్లో పేర్ల నమోదు తప్పుగా నమోదయ్యాయని కుంటిసాకులు చెప్పారు. దీంతో 12,425 మంది దరఖాస్తుదారులు తీవ్రంగా నష్టపోయారు. ఆపై 2013 మే 1 నుంచి పుట్టిన పిల్లలకు మాత్రమే ‘బంగారుతల్లి’ని వర్తింపజేశారు. ఇప్పుడు ‘బంగారు తల్లి’ లబ్ధిదారులకు ఇక్కట్లు 2013 మే 1నుంచి పుట్టిన బిడ్డలకు ‘బంగారుతల్లి’ పథకం వర్తింపజేశారు. ఈ పథకం నిర్వహణను ఐసీడీఎస్, డీఆర్డీఏలకు సంయుక్తంగా అప్పగించారు. గత ఏడాది మే 1నుంచి జూన్ 23 వరకూ పుట్టిన ఆడబిడ్డల వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేశారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే బిడ్డతల్లికి తొలిదశలో 2,500 రూపాయలు చెల్లించారు. అయితే ఈ బాధ్యతను ఏఎన్ఎంలకు, జననాల సర్వే బాధ్యత అంగన్వాడీ కార్యకర్తలకు, బాలికల వివరాల నమోదు బాధ్యత వీఆర్వోలకు అప్పగించారు. దీంతో శాఖల మధ్య సమన్వయం లేక వచ్చిన ద రఖాస్తుల్లో 20-30 శాతం మందికి కూడా బాండ్లు అందలేదు. దాదాపు 70 శాతం దరఖాస్తులకు ఇంకా బాండ్లు అందించాల్సి ఉంది. రాయలసీమలో ‘బంగారుతల్లి’ ద్వారా 3500 దరఖాస్తులకు బాండ్లు అందించాల్సి ఉంది. ‘మహాలక్ష్మి’తో మరిన్ని చిక్కులు ‘బంగారుతల్లి’ ద్వారా బిడ్డ పుట్టినప్పటి నుంచి డిగ్రీ పట్టా పొందే వరకూ డబ్బులు తల్లి ఖాతాలో జమ చేస్తారు. మహాలక్ష్మి పథకం ప్రవేశపెడితే బాండ్లు పొందిన వారికి ఏ పథకం అమలవుతుంది? అసలు అమలవుతుందా? లేదా? అని లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ఎందుకంటే ‘బంగారుతల్లి’ ప్రవేశంతో ‘బాలికాసంరక్షణ’ బాండ్లు బుట్టదాఖలయ్యాయి. అదే పరిస్థితి ఇప్పుడు తలె త్తే ప్రమాదం ఉంది. పథకాల మార్పు వల్ల 2010 నుంచి లబ్ధిదారులకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. వీటికి ‘మహాలక్ష్మి’ కష్టాలు తోడవనున్నాయి. -
లక్ష్యం సాధించకపోతే వేతనం కట్
భద్రాచలం : గిరిజనుల కోసం అమలు చేసే పథకాల్లో లక్ష్యాలు సాధించని అధికారులు, ఉద్యోగుల వేతనాలు నిలిపివేస్తామని ఐటీడీఏ పీవో దివ్య హెచ్చరించారు. ఇందిరా క్రాంతి పథ ం ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాల పురోగతిపై మంగళవారం స్థానిక సమక్క - సారక్క ఫంక్షన్ హాల్లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పీవో మాట్లాడుతూ ట్రైకార్ యూనిట్లను వెంటనే గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వారికి రుణాలు అందేలా చూ డాల్సిన బాధ్యత ఐకేపీ సిబ్బందిపై ఉందని అన్నారు. ఏరియా కో ఆర్డినేటర్లు, ఏపీఎం, క్లస్టర్ కో ఆర్డినేటర్లు ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. మహిళా సంఘాల ఇబ్బందులను తెలుసుకునేందుకు నిర్ధేశించిన రో జుల్లో తప్పని సరిగా గ్రామస్థాయిలో సమావేశాలునిర్వహించాలన్నారు. ఈ సమావేశాల్లో చర్చించిన అంశాలను నమోదు చేసుకుని పరి ష్కారానికి శ్రద్ధ చూపాలన్నారు. రుణాలు ఇప్పించడంతో పాటు వాటిని సకాలంలో తిరిగి బ్యాంకులకు చెల్లించేలా వారిలో అవగాహన కల్పించాలన్నారు. రుణాల మంజూరులో మహి ళా సంఘాల వారు తెలిపే విషయాలను బ్యాం కు అధికారులతో చర్చించాలని పేర్కొన్నారు. రుణాలు మంజూరు, రికవరీ అంశాలపైనే ఉద్యోగులు పనితీరును బేరీజు వేస్తామన్నారు. లక్ష్య సాధనకు సంబంధించి నెలసరి నివేదికలను పరిశీలించి సాధించని ఉద్యోగులకు వేతనాలు నిలిపివేస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని 19 మండలాల్లో గిరిజనుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు మంజూరు చేసిన 711 యూనిట్లను వెంటనే అందజేయాలన్నారు. అర్హులైన వారికి వీటికి మంజూరు చేసి వారి పేర్లను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ‘బంగారుతల్లి’ వివరాలు సేకరించాలి.. బంగారు తల్లి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సేకరించాలని పీవో ఆదేశించారు. అర్హులైన వారికి తప్పని సరిగా బిడ్డ పుట్టిన 21 రోజుల్లోగా ఈ పథకం వర్తింపజేయాలన్నారు. బంగారు తల్లి పథకానికి అర్హులను నమోదు చేసుకోవడంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అమృత హస్తం పథకం అమలుకు ఐసీడీఎస్ అధికారులతో సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఇందుకోసం ఐకేపీ, ఐసీడీఎస్ శాఖల అధికారులు తరచూ సమావేశమై పథ కం సమర్థవంత ంగా అమలయ్యేలా చూడాలన్నారు. అర్హులైన వికలాంగులను పింఛన్ కోసం ఎంపిక చేయాలన్నారు. గిరిజన గ్రామాల్లో మహిళా సంఘాలకు సంబంధించిన భూ సమస్యలను పరిష్కరించేందుకు ఐకేపీ సిబ్బంది దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో ఇందిరాక్రాంతి పథం అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారిణి ఆర్ జయశ్రీ, స్త్రీనిధి ఏజీఎం వనిత, ఏపీఎం డైరీ లక్ష్మణ్‌రావు, బ్యాంకు లింకేజీ ఏపీఎం నాగార్జున, ఐబీ ఏపీఎం శ్రీగుణ, పీవోపీ ఏపీఎం అనూరాధ, ఎడ్యుకేషన్ ఏపీఎం శ్రీనివాస్, రామారావుతో పాటు 19 మండలాలకు చెందిన ఏరియా కో ఆర్డినేటర్లు, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు. -
బంగారు తల్లులకు 3 నెలల ఆధార్ గడువు
కోర్టులు నోటీసులిస్తున్నా మెట్టుదిగని ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: అటు సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టు అక్షింతలు వేస్తున్నా.. నోటీసులు జారీ చేస్తున్నా సంక్షేమ పథకాలకు ‘ఆధార్’ నిబంధనపై రాష్ట్ర ప్రభుత్వం బెట్టువీడట్లేదు. తాజాగా బంగారుతల్లికి ఆధార్ నిబంధనను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీచేసింది. ఈ పథకం కింద పేరు రిజిస్టర్ చేసుకు నేందుకు ‘బంగారుతల్లి’ తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుని ఆధార్ నెంబర్ ఇవ్వా ల్సిందేనని మంగళవారం సెర్ప్ అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ రిజిస్టర్ చేసుకునే దరఖాస్తుదారులు ఆధార్ నెంబర్‌ను నమోదు చేసేందుకు 3 నెలల గడువు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్‌పీటర్ జారీ చేసిన సవరణ ఉత్తర్వుల ప్రకారం.. ఆడపిల్ల జన్మించినట్లయితే ఆ వివరాలను ఆన్లైన్లో ఉండే ఫాం-2లో గ్రామ/వార్డు స్థాయి అధీకృత సిబ్బంది ద్వారా నమోదు చేయించాలి. ఇందుకు జనన, మరణ రిజిస్ట్రార్ చేత గ్రామపంచాయతీ లేదా వార్డు స్థాయిలో జారీ చేసే జనన ధ్రువీకరణ పత్రం, పుట్టిన పాపతోపాటు తల్లి లేదా సంరక్షకుని ఫోటోను ఇవ్వాలి. పుట్టిన పాప తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుని ఆధార్ నెంబర్, రేషన్‌కార్డు, బ్యాంకు అకౌంట్ కాపీల్ని సమర్పించాలి. దరఖాస్తును ఆన్లైన్లో పరిశీలించి ఆమోదించాలి. -
‘బంగారు తల్లుల’కు తిప్పలు
మంచాల, న్యూస్‌లైన్: బంగారుతల్లి పథకానికి ఎంపికైన మహిళలు రచ్చబండ కార్యక్రమంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మంచాల మండల కేంద్రంలో శుక్రవారం రచ్చబండ కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభం కావడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఉదయం 11.00 గంటలకే మంత్రి ప్రసాద్‌కుమార్ వస్తారని చెప్పడంతో మహిళలంతా గంట ముందుగానే ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. చిన్నపిల్లలను చంకన వేసుకుని 91మంది మహిళలు పడిగాపులు కాశారు. పిల్లలు ఆకలి బాధ తట్టుకోలేక ఏడుస్తున్నారని, ఏంచేయాలో తోచడం లేదని కొంతమంది అధికారులకు తమ ఇబ్బందులను తెలియజేశారు. మంత్రిగారు వచ్చేదాకా ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదని అధికారులు చెప్పడంతో ఏడుస్తున్న పిల్లలను సముదాయిస్తూ మహిళలు అలాగే కూర్చుండిపోయారు. మంత్రిగారు తీరిగ్గా మధ్యాహ్నం 1.30గంటలకు వచ్చారు. తర్వాత మరో రెండుగంటల సేపు ప్రసంగాలు అవీ కొనసాగాయి. ఈ మధ్యలో సీపీఎం నాయకులు కాసేపు ఆందోళన చేయడంతో గొడవ జరుగుతుందేమోనని భయపడ్డారు. సాయంత్రం 4 గంటల తర్వాత మహిళలకు బంగారుతల్లి పథకం మంజూరుపత్రాలు అందజేశారు. -
ఆడపిల్లల పై కొనసాగుతున్న వివక్ష
-
అదిగో.. ‘బంగారు తల్లి’
కందుకూరు అర్బన్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన ప్రజలకు ముక్తసరిగా సమాధానం చెబుతూ కార్యాలయాల్లో ఉన్న బోర్డులు చూడమంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకంలో పేరు నమోదు చేసుకోవాలనుకుంటున్న వారు మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్నారు. అక్కడ ఏసీ గదుల్లో కూర్చుని ఉన్న అధికారులు వెంటనే పేరు నమోదు చేసుకుంటారని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. కనీసం పథకం వివరాలైనా చెబుతారనుకుంటే అదీ పొరపాటే. బంగారు తల్లి పథకం గురించి తెలుసుకునేందుకు రాజేశ్వరి అనే మహిళ శనివారం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లింది. అక్కడున్న అధికారులను బంగారు తల్లి పథకం వివరాలు అడిగింది. కార్యాలయం బయట అద్దం బాక్స్‌లో ఉన్న పథకానికి సంబంధించిన ప్రభుత్వ ప్రకటన చూపుతూ అదిగో.. బంగారు తల్లి పథకం అక్కడుంది.. వెళ్లి చదువుకో.. అని ముక్తసరిగా చెప్పడంతో అవాక్కవడం రాజేశ్వరి వంతైంది. ఇది ఎక్కడో కాదు.. స్వయంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి సొంత నియోజకవర్గంలోనే జరగడం గమనార్హం. ఆడపిల్ల పుడితే భారమవుతుందని పురిటిలోనే ప్రాణాలు తీస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టంది. కందుకూరు మున్సిపల్ అధికారుల నిర్వాకంతో ఆ పథకం అభాసుపాలవుతోంది. పథకాన్ని 2013 మే ఒకటో తేదీ నుంచి అమలులోకి తెచ్చారు. అప్పటి నుంచి ఇద్దరు కుమార్తెలు పుట్టినా.. లేక ఒక కుమార్తె, కుమారుడు పుట్టినా బంగారు తల్లి పథకానికి అర్హులు. 18 సంవత్సరాల వరకు ఆడపిల్లలకు చదువు ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. మొదటి, రెండో ఏడాది పుట్టిన రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున ఇస్తారు. మూడో సంవత్సరం నుంచి ఐదో ఏడాది వరకు అంగన్వాడీల ద్యారా పుట్టిన రోజు జరుపుకునేందుకు రూ. 1500 చొప్పున ప్రభత్వం ఇస్తుంది. 6 నుంచి 10 సంవత్సరాలలోపు పిల్లలకు సంవత్సరానికి రెండు వేలు చొప్పున, 11 నుంచి 13 సంవత్సరాలలోపు పిల్లలకు రూ. 2500, 14 నుంచి 15 సంవత్సరాల పిల్లలకు రూ. 3500, 16 నుంచి 17 సంవత్సరాల పిల్లలకు సంవత్సరానికి రూ. 3500 చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. ఇంటర్మీడియెట్‌తో ఆడపిల్లలు చదువు మానితే రూ. 50 వేలు జమ చేస్తారు. 18 నుంచి 21 సంవత్సరం వచ్చే వరకు రూ. 4 వేలు చొప్పున పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. 21 సంవత్సరాల తర్వాత వివాహ ఖర్చులకు రూ. లక్ష ఇస్తారు. అంతటితో ఆ పథకం లక్ష్యం నెరవేరుతుంది. ప్రసవించిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన తేదీ, తల్లి ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లను మెప్మా కార్యాలయంలో నమోదు చేయించుకోవాలి. అలా నమోదు చేయించుకున్న వారికి వారం రోజులలోపు ప్రసవం ఖర్చుల కింద రూ. 2500 బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న పథకంపై మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి చెందిన కామేశ్వరి కందుకూరు ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకంలో పేరు నమోదు చేసుకునేందుకు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లగా దగ్గరలోని అద్దం బాక్స్‌లో ఉన్న ప్రభుత్వ ప్రకటన చూసుకోమని చెప్పడంతో ఆమె అవాక్కైంది. -
‘బంగారు తల్లి’కి బాలారిష్టాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘బంగారు తల్లి’కి కష్టమొచ్చింది. ఈ పథకం అర్హత కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బంగారుతల్లి పథకం కింద దరఖాస్తు చేసుకోవాలంటే జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. అయితే ఈ ధ్రువీకరణ పత్రం పొందడం ్ర„పహసనంగా మారింది. సాధారణంగా జనన ధ్రువీకరణ పత్రం పుట్టిన చోటే తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో ఎక్కువ జననాలు నగరంలోని ఆస్పత్రుల్లో జరగడంతో.. జనన ధ్రువీకరణ పత్రాలు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీసుకోవాల్సి వస్తోంది. అయితే జీహెచ్ఎంసీలో ధ్రువీకరణ పత్రం తీసుకునే ప్రక్రియలో తీవ్ర జాప్యం కావడంతో దరఖాస్తు దశలోనే గందరగోళం నెలకొంది. ఏడాది మే ఒకటో తేదీ తర్వాత పుట్టిన ఆడబిడ్డ బంగారుతల్లి పథకానికి అర్హురాలు. పాపతల్లిదండ్రులు తెల్లరేషన్‌కార్డు పరిధిలో ఉండాలి. అదేవిధంగా ఇద్దరు పిల్లలు మాత్రమే కలిగి ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలో ఇప్పటివరకు 4,800 మంది ఆడ బిడ్డలు జన్మించినట్లు ఐసీడీఎస్ అధికారులు ప్రాథమిక లెక్కలు చెబుతున్నాయి. అందులో కేవలం 1,963 దరఖాస్తులు మాత్రమే ఆన్లైన్లో వచ్చాయి. వీరిలో 693 మంది మాత్రమే పూర్తిస్థాయి ధ్రువీకరణ పత్రాలు సమర్పించి అర్హత సాధించారు. వీరికి డెలివరీ చార్జీల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున అందించారు. మిగిలిన వారి నుంచి జనన ధ్రువీకరణ తదితర సర్టిఫికెట్లు వచ్చిన తర్వాత అర్హత అంశాన్ని తేలుస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. జనన ధ్రువీకరణతోనే చిక్కులు జిల్లాలో పెద్ద ఆస్పత్రులు లేకపోవడంతో పేదలు నగరంలోని ఉస్మానియా, గాంధీలతోపాటు కొండాపూర్, వనస్థలిపురంలోని ప్రాంతీయ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. అదేవిధంగా జిల్లాలో పట్టణ మండలాల్లో ఎక్కువ జననాలు నమోదువుతున్నాయి. వీరికి జనన ధ్రువీకరణ పత్రాలన్నీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రావాల్సి ఉంటుంది. ఇందుకుగాను ముందుగా ‘మీసేవ’లో దరఖాస్తు చేసుకున్న తర్వాత.. క్షేత్ర పరిశీలన నిర్వహించిన అనంతరం ఈ ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. ప్రక్రియలో తీవ్ర జాప్యం జరగడంతో ‘బంగారు తల్లి’ నమోదు ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బంగారు తల్లి పథకం ప్రారంభ సమయంలో ఎంతో ఆర్భాటం చేసిన సర్కారు.. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడంపై పెద్దగా శ్రద్ధ చూపకపోవడంతో దరఖాస్తులు రావడం లేదు. -
‘బంగారుతల్లి’కి భరోసా ఏదీ?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో ‘బంగారు తల్లి’కి భరోసా దక్కడంలేదు. ఈ పథకం ఇంకా బాలారిష్టాలను అధిగమించడంలేదు. జనాభాలో బాలికల నిష్పత్తి పెంచడం, విద్య ద్వారా బాలికా సాధికారత సాధించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘బంగారుతల్లి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ యేడాది మే ఒకటో తేదీ నుంచి మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం అమల్లోకి వచ్చింది. దరఖాస్తు ప్రక్రియపై అవగాహన లేకపోవడంతో ప్రజలు అయోమయానికి లోనవుతున్నారు. బ్యాంకు, గ్రామైక్య సంఘం ఖాతాలు, ఆధార్ కార్డులు లేవంటూ దరఖాస్తులు ఆమోదించడం లేదు. మరోవైపు అన్ని అర్హతలున్న లబ్ధిదారుల ఖాతాలో నేటికీ నయాపైసా జమ కాలేదు. బంగారు తల్లి పథకంలో భాగంగా జిల్లాలో ఈ యేడాది మే ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు 2,775 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,502 మంది చిన్నారులు పథకంలో లబ్ధిపొందేందుకు అర్హులని ప్రాథమికంగా గుర్తించారు. అయితే బ్యాంకు ఖాతాలు, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేదంటూ చివరకు 1,094 మందిని అర్హులుగా తేల్చారు. పథకంలో లబ్ధిపొందేందుకు అర్హత సాధించిన బాలిక తల్లి ఖాతాలో మొదటి విడతలో రూ.2,500 చొప్పున జమ చేయాల్సి ఉంటుంది. మే ఒకటో తేదీ నుంచి పథకం అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఖాతాలో నయాపైసా జమ కాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గ్రామైక్య సంఘాలు, ఏపీఎం, డీపీఎం స్థాయిలో దరఖాస్తులను పరిశీలించి ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ) ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్) ద్వారా ‘బంగారు తల్లి’ అమలు కావాల్సి వుంది. అయితే లబ్ధిదారులను గుర్తించడంలో ప్రభుత్వ శాఖల నడుమ సమన్వయలోపం కనిపిస్తోంది. జిల్లాలో గర్భిణులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాలు, వీరిలో బంగారు తల్లికి అర్హులైన వారి వివరాలు సేకరించేందుకు ప్రత్యేక వ్యవస్థ లేదు. మండల సమాఖ్యలు, మున్సిపాలిటీల ద్వారా అందిన దరఖాస్తులను మాత్రమే డీఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్(ఏపీఎం)లు పరిశీలిస్తున్నారు. మార్గదర్శకాలపై అవగాహన ఏదీ? లబ్ధిదారుల గుర్తింపు, ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలపై గ్రామైక్య సంఘాలు, అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన లేమి స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లా కేంద్ర ఆసుపత్రి, ఏరియా, కమ్యూనిటీ ఆసుపత్రుల్లో లబ్ధిదారులను గుర్తించేం దుకు కొన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా ఓ ఉద్యోగిని నియమించారు. వీరు అందించే వివరాలను ఏపీఎంలు పరిశీలించి, లబ్ధిదారులను ఎంపిక చేసేలా ఏర్పాట్లు చేశారు. కాగా మరోవైపు లబ్ధిదారుల ఎంపికను ఆధార్ కార్డుతో అనుసంధానించడంతో చాలా దరఖాస్తులు ఆమోదానికి నోచుకోవడం లేదు. అందోలు మండలంలో 63 దరఖాస్తులు అందగా, ఒక్క లబ్ధిదారు పేరు కూడా ఖరారు కాలేదు. ‘మండల సమాఖ్యలు, మున్సిపాలిటీల ద్వారా బంగారుతల్లి పథకం కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. దౌల్తాబాద్, సదాశివపేట మండలంలో ఒకరిద్దరు ఖాతాల్లో నిధులు జమ అయినట్లు సమాచారం ఉంది. ఎంపిక చేసిన లబ్ధిదారులకు నిధులు మంజూరైనట్లు సమాచారం అందింది’ అని డీపీఎం రమ ‘సాక్షి’కి వెల్లడించారు. -
బంగారు తల్లి పథకంపై ముఖ్యమంత్రి సమీక్ష
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, గంటా శ్రీనివాసరావు, బాలరాజు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ఉల్లిపాయలు సహా కూరగాయల ధరల పెరుగుదలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో సమీక్ష నిర్వహించారు. ధరల తగ్గింపుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని సీఎం ఈ సందర్భంగా సీఎస్‌ను ఆదేశించారు. అలాగే సీమాంధ్రలో సకల జనుల సమ్మె, వరదలుపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.