సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో ‘బంగారు తల్లి’కి భరోసా దక్కడంలేదు. ఈ పథకం ఇంకా బాలారిష్టాలను అధిగమించడంలేదు. జనాభాలో బాలికల నిష్పత్తి పెంచడం, విద్య ద్వారా బాలికా సాధికారత సాధించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘బంగారుతల్లి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ యేడాది మే ఒకటో తేదీ నుంచి మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం అమల్లోకి వచ్చింది. దరఖాస్తు ప్రక్రియపై అవగాహన లేకపోవడంతో ప్రజలు అయోమయానికి లోనవుతున్నారు. బ్యాంకు, గ్రామైక్య సంఘం ఖాతాలు, ఆధార్ కార్డులు లేవంటూ దరఖాస్తులు ఆమోదించడం లేదు. మరోవైపు అన్ని అర్హతలున్న లబ్ధిదారుల ఖాతాలో నేటికీ నయాపైసా జమ కాలేదు. బంగారు తల్లి పథకంలో భాగంగా జిల్లాలో ఈ యేడాది మే ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు 2,775 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,502 మంది చిన్నారులు పథకంలో లబ్ధిపొందేందుకు అర్హులని ప్రాథమికంగా గుర్తించారు. అయితే బ్యాంకు ఖాతాలు, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేదంటూ చివరకు 1,094 మందిని అర్హులుగా తేల్చారు. పథకంలో లబ్ధిపొందేందుకు అర్హత సాధించిన బాలిక తల్లి ఖాతాలో మొదటి విడతలో రూ.2,500 చొప్పున జమ చేయాల్సి ఉంటుంది.
మే ఒకటో తేదీ నుంచి పథకం అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఖాతాలో నయాపైసా జమ కాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గ్రామైక్య సంఘాలు, ఏపీఎం, డీపీఎం స్థాయిలో దరఖాస్తులను పరిశీలించి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్) ద్వారా ‘బంగారు తల్లి’ అమలు కావాల్సి వుంది. అయితే లబ్ధిదారులను గుర్తించడంలో ప్రభుత్వ శాఖల నడుమ సమన్వయలోపం కనిపిస్తోంది. జిల్లాలో గర్భిణులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాలు, వీరిలో బంగారు తల్లికి అర్హులైన వారి వివరాలు సేకరించేందుకు ప్రత్యేక వ్యవస్థ లేదు. మండల సమాఖ్యలు, మున్సిపాలిటీల ద్వారా అందిన దరఖాస్తులను మాత్రమే డీఆర్‌డీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్(ఏపీఎం)లు పరిశీలిస్తున్నారు.
మార్గదర్శకాలపై అవగాహన ఏదీ?
లబ్ధిదారుల గుర్తింపు, ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలపై గ్రామైక్య సంఘాలు, అంగన్‌వాడీ కార్యకర్తలకు అవగాహన లేమి స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లా కేంద్ర ఆసుపత్రి, ఏరియా, కమ్యూనిటీ ఆసుపత్రుల్లో లబ్ధిదారులను గుర్తించేం దుకు కొన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా ఓ ఉద్యోగిని నియమించారు. వీరు అందించే వివరాలను ఏపీఎంలు పరిశీలించి, లబ్ధిదారులను ఎంపిక చేసేలా ఏర్పాట్లు చేశారు. కాగా మరోవైపు లబ్ధిదారుల ఎంపికను ఆధార్ కార్డుతో అనుసంధానించడంతో చాలా దరఖాస్తులు ఆమోదానికి నోచుకోవడం లేదు. అందోలు మండలంలో 63 దరఖాస్తులు అందగా, ఒక్క లబ్ధిదారు పేరు కూడా ఖరారు కాలేదు. ‘మండల సమాఖ్యలు, మున్సిపాలిటీల ద్వారా బంగారుతల్లి పథకం కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. దౌల్తాబాద్, సదాశివపేట మండలంలో ఒకరిద్దరు ఖాతాల్లో నిధులు జమ అయినట్లు సమాచారం ఉంది. ఎంపిక చేసిన లబ్ధిదారులకు నిధులు మంజూరైనట్లు సమాచారం అందింది’ అని డీపీఎం రమ ‘సాక్షి’కి వెల్లడించారు.
‘బంగారుతల్లి’కి భరోసా ఏదీ?
Published Sat, Sep 14 2013 12:18 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement